రజనీకాంత్ నటించిన “శ్రీ రాఘవేంద్ర”

నాకొక రోజు ఉన్నట్లుండి రజనీకాంత్ నటించిన “శ్రీ రాఘవేంద్ర” సినిమా చూడాలనిపించింది. ఎందుకో మరి, అది మట్టుకు గుర్తులేదు. యూట్యూబులో దొరకడంతో తమిళంలో చూడ్డం మొదలుపెట్టాను. సినిమా మొదట్లో రజనీకాంత్ ఇచ్చిన ఉపన్యాసం వింటున్నప్పుడు తెలిసింది అది అతని నూరవ సినిమా అని. సినిమా బాగుంది. రాఘవేంద్ర స్వామి గురించి నాకేం తెలియదు కనుక చాలా ఆసక్తితో చూశాను చివరిదాకా. నన్ను ఆకట్టుకున్న కొన్ని అంశాల గురించి రాసుకోవాలనిపించింది. అవి ఇవి:

* రాఘవేంద్ర స్వామి చిన్నప్పుడు అతను, అతని గురువు “రామనామమొరు వేదమే” అని పాడుకుంటూ ఉండగా అతను పెద్దవాడై రజనీకాంత్ అవుతాడు. నాకా మాట “రామనామమొరు వేదనై” అని వినబడ్డది మొదట. అవాక్కయ్యా. తేరుకోడానికి ఒక రెండు సెకనులు పట్టింది – అప్పుడర్థమైంది అసలు వాళ్ళన్నది వేదమని😉 వేదన అన్నా నాకు ఆశ్చర్యంగా అనిపించదు లెండి – ఏ భక్తుడి కథలో సుఖాలెక్కువ ఉన్నాయి కనుక!! పాట చాలా నచ్చింది నాకు.

* ముఖ్యంగా రజనీకాంత్ గురించి చెప్పాలి. ఈయనపై నా అభిమానం గత కొన్నేళ్ళలో ఏర్పడ్డది. శివాజీ గణేశన్ కి మల్లే మొదట్లో నచ్చకపోయినా కాలక్రమేణా అభిమానించిన నటుడు. గొప్పగా చేశాడు ఈ సినిమాలో. అతని స్టయిల్ కి, అతని సినిమాలకీ చాలా భిన్నమైన వేషం ఇది. రాఘవేంద్రరావు టైపు దర్శకత్వం కూడా కాదు (అయినా కూడా ఆ లక్ష్మి-మనోరమ-ఇతర స్నేహితురాళ్ళ పాట నాకు చాలా అసందర్భంగా అనిపించింది, అది వేరే విషయం). అయినా నన్ను ఆకట్టుకున్నాడు. He is a star, in all aspects of the word! రాఘవేంద్రస్వామి చూడ్డానికి ఎలా ఉండేవారో పటంలో చూడ్డం మినహా నాకు తెలియకపోవడం వల్ల రజనీకాంత్ ఆహార్యంలో నాకాట్టే ఏమీ తేడా కనబడలేదు. ధన్యోస్మి. Ignorance is bliss, really!

* రాఘవేంద్రస్వామి గృహస్థాశ్రమంలో ఆయన భార్య సరస్వతిగా లక్ష్మి కొన్ని చోట్ల గొప్పగా నటించింది. సినిమా లో ఒక గంటా, పదిహేను నిముషాల తర్వాత వచ్చే దృశ్యంలో కుటుంబ పరిస్థితుల వల్ల ఇళ్ళలో పనిచేసేందుకు వెళుతుంది ఆమె. ఆ సమయంలో ఇతర బ్రాహ్మణ పెద్దలు వచ్చి ఆవిడ చేస్తున్న పనిని ఆక్షేపిస్తే ఆమె స్పందించిన తీరు – నా కళ్ళకి గొప్పగా కనబడ్డది.

* సరస్వతి దేవి కనబడి రాఘవేంద్రస్వామితో “కృతయుగంలో నీవు ప్రహ్లాదుడివి. మరో జన్మలో వ్యాసతీర్థుడివి, కలియుగంలో రాఘవేంద్రుడివి” అంటుంది. కెవ్వ్! అనిపించింది ఆ దృశ్యం నాకైతే. నాకు రాఘవేంద్రస్వామి గురించి ప్రచారంలో ఉన్న కథలేవీ తెలియవు కనుక!

* ఆయన సన్యాసం తీసుకున్నాడన్న బాధలో ఆయన భార్య బావిలోకి దూకి మరణిస్తుంది. ఆవిడ ఆత్మ ఆ తరువాత రాఘవేంద్రస్వామిని చూట్టానికి వస్తే ఆయన ఆమెని తొందరపడ్డావంటాడు. ఏమిటో – వాళ్ళకి గల ఆ పిల్లవాడు ఏమైనాడో! లోకకళ్యాణం కోసం కుటుంబాన్ని త్యాగం చేయాలనుకునేవాళ్ళు గొప్పోళ్ళు, సంసారిగా ఉండాలనుకుని జీవితం గురించి కలలు కనేవాళ్ళు మట్టుకు తొందరపడేవాళ్ళు…. అదనమాట. మామూలు మనుషులు, మామూలు మనస్తత్వాలను తక్కువ చేసి చూపడం ద్వారా హీరోలు ఎలివేట్ అవుతారు…. పౌరాణికమా? సాంఘికమా? అన్న తేడా లేదనుకుంటా ఈ ముక్కకి మట్టుకు🙂

* ఒకానొక సమయంలో సరస్వతి దేవి మానవరూపంలో రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తే ఆయన ఒక అగ్నిప్రమాదం నుండి ఆవిడని, ఆవిడ ఇంటిని కాపాడతాడు. ఆవిడ ఆయనకి ధన్యవాదాలు తెలిపితే, ఆయన “ఎందుకీ పరీక్ష?” అని అడుగుతాడు. “బిడ్డకి గోరు ముద్దలు తినిపించే తల్లి బిడ్డ చేత ఓ ముద్ద తినాలని ఆశించకూడదా? నేనూ అలా ఆశపడ్డాను.” అంటుంది ఆవిడ. అద్భుతంగా అనిపించింది నాకు ఆ దృశ్యం రాసిన తీరు.

* పాటలు అద్భుతంగా ఉన్నాయి. భక్తిభావం అలా పొంగి పొర్లుతోందంతే! (ఇళయరాజా సంగీతం. చాలా పాటలకి యేసుదాసు గానం)

మొత్తానికి సినిమాలో భక్తిభావం కన్నా కుటుంబ కథా చిత్రం భావం ఎక్కువగా కలిగింది నాకు. అయితే, అది నేను ఒక కంప్లైంట్ లాగా చెప్పడం లేదు. రాఘవేంద్రస్వామి జీవితం గురించి నాకు తెలియదు. ఈ సినిమాలో ఎంత నిజం ఉందో నాకు తెలీదు. అయితే, ఒక సినిమాగా ఆ కథలోని డ్రామా ఎలిమెంట్ వల్ల నాకు చాలా నచ్చింది సినిమా. అన్నట్లు ఈ టపాలో సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలని మాత్రమే ప్రస్తావించాను. ఇంకా సినిమాలో రాఘవేంద్ర స్వామి మహిమలు, ముఖ్యమైన భక్తుల ప్రొఫైల్స్ – ఇవన్నీ వస్తాయి. ఆయన మంత్రాలయం కి రావడం, సమాధి చెందడం వరకు కథ సాగుతుంది.

సినిమా చూడ్డంతో గతం గుర్తొచ్చింది. కర్నూలుకి దగ్గర కావడంతో మంత్రాలయానికి చిన్నప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళినట్లు గుర్తు, వివిధ వ్యక్తులతో. ఈసారి దేశం వెళ్ళినపుడు వీలు చూసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. భక్తి కారణాలకి కాదు సుమండీ! జీవన్ముక్తికి అంతకంటే కాదూ.. ఏదో కోల్పోయినవేవైనా దొరకబుచ్చుకుందామని కావొచ్చు. కోల్పోయినవేమిటో మట్టుకు ఇంకా తెలియదు.🙂

సినిమా తాలుకా తెలుగు అనువాదం కూడా యూట్యూబులో ఉంది. కానీ ప్రింటు అంత గొప్పగా లేదు. అందువల్ల నేను తమిళంలో చూశాను. సబ్-టైటిల్స్ లేవు తమిళ వర్షన్ కి.

Published in: on July 13, 2014 at 1:53 pm  Leave a Comment  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/07/13/sriraghavendra/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: