(30వ భాగం ఇక్కడ)
***
జీవితం, కాలం, మరణం, ప్రేమా – నలుగురూ ఒక నాలుగు రోడ్ల కూడలిలో కలిసి వాళ్ళవాళ్ళ చేతుల్లో ఉన్న శక్తి వల్ల వాళ్ళు మనుషుల జీవితాల్తో ఎలా ఆడుకుంటున్నారో చర్చించుకుంటూ – ట్రేడ్ సీక్రెట్లు పంచుకుంటూ ఉండగా, నేను, నిశి కూడలిలోని విగ్రహంలోపల ఉన్న రహస్య గదిలో కూర్చుని వినడం మొదలుపెట్టాము. అది జరిగి ఏడాదైంది. ఇన్నాళ్ళైనా ఆనాడు అంతా కలిసి నన్ను మోసం చేసిన వైనం ఇంకా కళ్ళకు కట్టినట్లు ఉంది.
నేనేదో మనుషుల పాలిటి సాడిస్టులైన వీళ్ళ రహస్యాలన్నీ వినేసి గుర్తు పెట్టేసుకుని ఈ పీడకలలాంటి సగం నిజం లాంటి అబద్దపు అనుభవం నుండి బయటపడ్డాక యావత్ మానవకోటికి జ్ఞానోదయం గావించి ఆ తరువాత ఏదో ఒక -మయి అమ్మ గా స్థిరపడిపోదామనుకున్నాను. దాని వల్ల నా తోటి మానవులకి ఏదన్నా చేసానన్న తృప్తి, నాకు జీవన భృతి – రెండూ కలుగుతాయని ఆశించాను. ప్రస్తుతపు అస్తిత్వ విచికిత్సలను దాటుకుని తరువాతి స్థాయిలో కొత్త సమస్యలను కౌగిలించుకోవచ్చనీ, మాస్లో పిరమిడ్ లో ఓ మెట్టు ఎగబాకవచ్చనీ… ఇలా ఎన్నో కలలు కన్నాను. అయితే, అక్కడ జరిగినది ఇంకొకటి. అవమానభారంతో ఇన్నాళ్ళు పెదవి విప్పలేదు కానీ, ఆలోచించగా, వీళ్ళకి జాలీ, దయా వంటివి ఉంటాయని నమ్మే నా లాంటి అమాయకులకి ఒక గుణపాఠం అవుతుందని ఈ అనుభవాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాను.
ఆవేళ వాళ్ళేం మాట్లాడుకున్నారో, అక్కడేం జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు స్టేటస్ రిపోర్ట్ అయిపోయి ట్రేడ్ సీక్రెట్ ఎక్స్చేంగ్ ప్రోగ్రాం మొదలుపెట్టే వేళకి నా మది గతి తప్పడం మొదలైంది. కొన్ని క్షణాలలోనే బ్లాక్ అవుట్. నేను కాసేపటికి తల పట్టుకు లేచేసరికి నేనేదో చెట్టుకింద ఉన్నాను. నా పక్కనే నిశి కూర్చుని మొక్కజొన్న కంకి మీద ఉన్న గింజలని గిల్లుతూ ఎదురుగ్గా ఉన్న కొండవైపుకు చూస్తూ ఉంది. నేను లేస్తూ ఉండగా చేతులూ కాళ్ళు నొప్పెట్టి సన్నగా మూలిగాను. ఆ అలికిడి విని నా వైపుకి తిరిగింది. నిశి బట్టలన్నీ దుమ్ము పట్టి ఉన్నాయి. చేతులు గీసుకుపోయి ఉన్నాయి. నేను నిశి ని ఏదో అడగబోయి నా బట్టలు కూడా అలాగే ఉన్నాయని, నేనూ దెబ్బలతో ఉన్నానని గమనించాను.
నేను నోరు విప్పి “ఏం జరిగింది?” అనేలోగా నిశే నోరు విప్పింది – “ఏదో, కాలం కనికరించబట్టి బ్రతికి బట్టకట్టాము” అంది “కాలం” అన్న పదాన్ని వత్తి పలికి, కొండ పైని శూన్యం వైపుకి తలతిప్పుతూ. అప్పుడే గమనించాను – మా వెనుక సముద్రం ఉందని. “మనం అసలు ఎక్కడున్నాము? ఏం జరిగింది?” అన్నాను నాలుగు దిక్కులా కలయజూస్తూ. దిఙ్మండలములో పేద్ద కొండా, సముద్రము తప్ప ఏం కనబడ్డం లేదు. మేము కొండ పాదాల వద్ద, సముద్రుడి దయమీద ఆధారపడి ఉన్నామని అర్థమైంది.
“మధ్యమధ్యలో ఆపి నసపెట్టకుండా ఉంటానంటే చెబుతాను. నోర్మూసుకుని విను.”
“సరే, కానీ …” అని నిట్టూర్చాను.
“”నిన్న మనం దాక్కున్న విగ్రహం బద్దలైంది. దానితో మనం ఎగిరి బయటకు పడ్డాము. బద్దలైన శబ్దానికే నీకు తెలివి తప్పింది. మరణం మనల్ని చూసి ఉత్సాహంతో ముందుకు రాబోతూ ఉండగా జీవితం అడ్డుపడ్డాడు. ప్రేమ కాలం వైపుకు చూసి సైగ చేయగా, కా.పు. మనిద్దరినీ కాపాడాడు. నాకేమో ఆ ప్రమాదంలో కొంచెం దెబ్బలు తగిలాయి. నీకు దెబ్బలూ తగిలాయి, తెలివీ తప్పింది. దానితో, కా.పు. మనల్ని తన బండి మీద ఎక్కించుకున్నాడు – ఇంటి దగ్గర దిగబెడతానని…”
“ఇల్లా? ఎవరిల్లు?? ఎవరికుంది ఇల్లు?” అన్నాన్నేను ఆశ్చర్యంగా. వీళ్ళకంతా ఇళ్ళూ, సంసారాలు ఉంటాయన్న ఆలోచనే ఎప్పుడూ రాలేదు నాకు.
“వెధవ ప్రశ్నలు వేయొద్దని చెప్పానా? ఇదా మనకి ముఖ్యం ఇపుడు?
“సారీ…. కానివ్వు. తర్వాతేమైంది?”
“బాగా వివరంగా చెప్పాలంటే అవ్వదు – లవర్స్ అన్నాక లక్ష ప్రైవేటు సంభాషణలుంటాయి. నీకు స్పృహ లేదు కనుక మేము బైక్ మీద దూసుకెళ్తూ ముచ్చటించుకున్నాము.”
“నాకు స్పృహ ఉంటే మట్టుకు మీరాగుతారా ఏమిటి?” అనుకున్నాను నేను గతంలో చూసిన సీన్లు గుర్తు తెచ్చుకుంటూ. పైకి అంటే ఎక్కడ కథ ఆపేస్తుందో అని పెదవి విప్పలేదు.
“ముచ్చట్లలో మాటా మాటా వచ్చింది. నాక్కోపం వచ్చి కిందకి దూకేశా…”
“దూకేశావా?????” అన్నాన్నేను… షాక్ ని అణుచుకోలేక.
“ఆ..అందుకే ఈ దెబ్బలూ, దుమ్మూ మనిద్దరికి”
“వాట్….నువు దూకడం కాక నన్నూ లాగేశావా?”
“ఈ నిశి నేస్తాలని కష్టకాలంలో ఒంటరిగా వదిలిపెట్టదు.” – గంభీరంగా అన్నది.
“నీ మొహం కాదూ??” అని అరిచాను నేను.
“కాలంతో కొట్టుకుపోకుండా నిన్ను కాపాడాను. ఊరికే అరవకు.” అనింది ఎటో చూస్తూ.
“నన్నో, కా.పు. నో అనుమానించి నన్ను కూడా తనతో లాగేసిందా?” అని సందేహం కలిగింది కానీ, పైకి అనే సాహసం చేయలేకపోయాను. నాకు ఈతరాదు. పక్కనే సముద్రం ఉంది మరి. అంత వేగంగా దూసుకుపోతున్న బైకు నుండి దూకిన మనిషి ఇంకో మనిషిని సముద్రంలోకి తోయడానికి ఆలోచిస్తుందా ఏమిటి?
నేనేమీ మాట్లాడకపోవడంతో మళ్ళీ తనే – “అలా దూకాక పడ్డం పడ్డం ఈ కొండ కిందకి పడ్డాము. ఆకలేసి కా.పు. బ్యాగు నుండి నొక్కేసిన మొక్కజొన్న తింటున్నా” ఏదో అదో పెద్ద విషయం కాదన్నంత తాపీగా అన్నది.
“అసలా విగ్రహం ఎందుకు బద్దలైంది?” ఇంకా తదేకంగా కొండపైకే చూస్తున్న నిశిని అడిగాను.
“బద్దలు కొట్టారు”
“ఎవరు? ఎలా?”
“జీవితం మనకి కాలం చెల్లించాలని కంకణం కట్టాడు. కా.పు వైపుకి జాలిగా చూసి ప్రేమ తల తిప్పుకున్నాడు. మరణం జేబులోంచి బాంబులు తీసి విగ్రహం మొహాన కొట్టాడు” – మళ్ళీ ఎక్కడో ఏ ఇరాక్ లోనో, ఇస్టోనియాలోనో ఎవరికో జరిగిన కథ అన్నట్లు చెప్పింది నిశి.
“ఇదంతా నేను విగ్రహంలోపల స్క్రీన్ లోంచి చూశాను” అన్నది మళ్ళీ తనే.
“అసలు వాళ్ళకెందుకు ఆ బుద్ధి పుట్టింది?”
“ఆ సృష్టి రహస్యాలు నీకు తెలియడం వాళ్ళకి ఇష్టం లేదు.”
“అసలు మనం ఇక్కడ ఉన్నట్లు వాళ్ళకి తెలియదు కదా?”
“తెలుసు కదా…” అని నిశి తలవంచుకుంది.
“ఎలా?”
“నేనే ఎస్సెమ్మెస్ చేశాను జీవితానికి” -నిశి ఆర్య-2 లో ఆర్య కి అమ్మమ్మ అని అర్థమైంది నాకు.
“నువ్వా? నీకేమైనా పిచ్చా? నా సంగతి సరే, నీక్కూడా ప్రమాదమే కదా!”
“మా రహస్యాలు మాలోనే ఉండడం కోసం నేను సమిధనవ్వాలనుకున్నాను.”
ఈవిడొక జిహాదీ మరి! అనుకుంటూ “మరెందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళావసలు?” అని అడిగాను.
“ముందు నిన్ను మాలో కలుపుకుందామనే తీసుకెళ్ళా కానీ, మనసు మార్చుకున్నా తరువాత”
“మరి వాళ్ళు విగ్రహం బద్దలు కొట్టాలనుకోడం ఇదంతా నాకెందుకు తెలియలేదు?”
“అప్పటికే నీ తలపైన కొట్టి నీ స్పృహ పోగొట్టాను”
“ఆహ, ఎంత గొప్ప స్నేహం!” అన్నాను. అంతకంటే ఏమనగలను ఇదంతా విన్నాక?
“మొత్తానికైతే అందరూ కలిసి నాతో ఆడుకున్నారనమాట. నువ్వైతే నయవంచన చేసేందుకు కూడా వెనుకాడలేదు” అని కసిగా మనసులో అనుకున్నాను, పైకి అనే ధైర్యం లేక. చెప్పా కదా – నాకీత రాదు.
నిశి ఏం మాట్లాడలేదు.
అలా కొండవైపుకి చూస్తూ ఉంది.
“ఏమిటి అస్తమానం కొండపైకి చూస్తున్నావు? ఏముందక్కడ?”
“కా.పు. వస్తాడేమో నని…” నసిగింది నిశి.
“అంత మిస్సవుతూంటే ఎందుకు దూకేశావు?” నిశి తలదించుకుంది.
“అయినా, విగ్రహం బద్దలు కొట్టి మనల్ని లేపేద్దాం అనుకున్నాక మళ్ళీ ఎందుకు రక్షించారు?” మళ్ళీ అడిగాను.
“కా.పు. మనసులో …” అని నిశి ఏదో చెప్పబోతూండగా ఆమె మొబైల్ తళుక్కుమనింది.
(సశేషం)
***
(ఈసారి ఏడాది తరువాత మళ్ళీ ఇది కొనసాగించడానికి ప్రేరణ – స్వీడిష్ రచయిత Jonas Jonasson రాసిన నవలలు.)
[…] భాగం ఇక్కడ) ******* ఎండ కాస్తుండడంతో కళ్ళు బైర్లు […]