గణాంకాన్వేషణ

అది Statistical Exploration అన్న దానికి నేను పెట్టుకున్న తెలుగు పేరు లెండి.

కొన్ని రోజుల క్రితం నాకు, నాకు తెలిసిన పెద్దాయన ఒకరికి మధ్య ఒక సంభాషణ జరిగింది. సారాంశం ఏమిటంటే – “పుస్తకం.నెట్ లో నాకు విశ్వనాథ రచనలు తప్ప ఏం కనబడ్డం లేదు. వెబ్సైటు చూడ్డం మానేద్దామనుకుంటున్నాను. అంత అభిమానం ఉంటే ఒక విశ్వనాథ వెబ్సైటు పెట్టుకొండి, మాబోంట్లను వదిలేయండి” అని.

అప్పుడు నేను – “పుస్తకం.నెట్ పాఠకుల వ్యాసాలతో నడిచే వెబ్సైటు. నేను గానీ ఇతర నిర్వహకులు కానీ మొత్తం కంటెంట్ సృష్టించము. వైవిధ్యం కావాలంటే అందరూ భిన్న రకాల పుస్తకాల గురించి రాస్తే తప్ప రాదు” అని చెప్పాను. ఆ తరువాత ఇంకాసేపు ఈ విషయం మీద చర్చించుకున్నాక ఆ సంభాషణ ముగిసింది. కానీ, ఆ వ్యాఖ్య నా మది తొలుస్తూనే ఉంది. కొంచెం సమయం చిక్కడంతో ఇవ్వాళ: గత కొన్ని నెలలుగా వారానికి మూణ్ణాలుగు వ్యాసాలు కనీసం ఉంటున్నాయి, ఇందులో విశ్వనాథ రచనల పైన వచ్చినవి ఎన్ని? అన్న సందేహం కలిగి గణాంకాలను చూశాను కాసేపు. నేను కనుక్కున సంగతులు ఇవి: (మరీ కాకిలెక్కలు కావు కానీ, అలాగని విశేష గణాంక పటిమ కూడా చూపలేదు)

ఇప్పటిదాకా 1485 పోస్టులు (2009 జనవరి ఒకటో తేదీ నుండి) వస్తే, అందులో 148 పోస్టులు 2014 జనవరి 1 నుండి వచ్చినవి. ఇది 27వ వారం ఈ ఏడాది లో. అంటే, దాదాపుగా వారానికి 5.5 టపాలు అనమాట. అందులో ప్రతి వారమూ ఒకటి వీక్షణం. నాకు గుర్తున్నంతవరకూ పూర్ణిమ ప్రతి వారమూ ఒక పుస్తకం గురించి పరిచయం రాసింది. ఇవి ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లో రాయబడ్డ పుస్తకాలు, అనువాదాలు. శ్రీశ్రీ అనంతం పై రాసినది ఒక్కటే తెలుగు పుస్తకం గురించి. భారత ఉపఖండపు, విదేశీ రచయితలు ఉన్నారు ఈ వ్యాసాల్లో ప్రస్తావించబడ్డ వారిలో. నేను గమనించినంతలో ఈ పరిచయాల్లో ప్రస్తావించబడ్డ రచయితలు రాసిన భాషలు: ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పోర్చుగీసు, హిబ్రూ, రష్యన్, స్వీడిష్, టర్కిష్, నార్వేజియన్, ఫ్రెంచి, చెక్ భాషలు (వివరాలకు పూర్ణిమ వ్యాసాలన్నీ ఈ లంకెలో చూడవచ్చు).

సరే, 148 లో ఒక 27 పూర్ణిమవి, ఒక 27 వీక్షణం వీ అయ్యాయా… విశ్వనాథ వారి గురించి వచ్చిన టపాలు 20. అందులో, శ్రీవల్లీ రాధిక గారు పురాణ వైర గ్రంథమాల గురించి వరుసగా 12 వారాలు రాసిన పరిచయాలు కూడా ఉన్నాయి. ఇక తక్కిన ఎనిమిదిలో ఆరు హేలీ రాసినవి, ఒకటి ఆంగ్లంలో సి.ఎస్.రావు గారు రాసిన Sri Viswanatha as a Short Story Writer వ్యాసం, మరొకటి యద్దనపూడి కామేశ్వరి గారి 2011 వ్యాసానికి పునర్ముద్రణ. సరే, మొత్తానికి 27 వారాలకి 20 వ్యాసాలు – అంటే వారానికి ఒక వ్యాసం కన్నా తక్కువ. ఇంకా డెబ్భై పై చిలుకు వ్యాసాలు, ప్రకటనలు వగైరాలున్నాయి.

సరే, కాస్త ఏవన్నా వైవిధ్యం ఉందేమో చూద్దాము అని ఖజానా పేజీ తెరిచి నెలవారీగా చూడ్డం మొదలుపెట్టాను. నేను చూసినంతలో నెలకి కొన్ని టపాల లంకెలు కింద జతచేస్తున్నాను. ఇవి మట్టుకే వైవిధ్య భరితమైనవని కాదు. అన్నీ లిస్టు చేయలేను కనుక, నెలలో వచ్చిన వ్యాసాల్లో వైవిధ్యం చూపడానికి నేను పక్షపాతాలు అవీ లేవనుకుంటూ ఎంపిక చేసినవి ఇవి:

జనవరి 2014:
* తిరుమల: రవీందర రెడ్డి ఛాయాచిత్ర సంకలనం గురించి జంపాల చౌదరి గారి వ్యాసం
* అంధా యుగ్ -ధరం వీర్ భారతి రాసిన హిందీ నాటకం గురించి పూర్ణిమ వ్యాసం
* Devil on the cross – కెన్యాకు చెందిన Ngũgĩ wa Thiong’o అన్న రచయిత గికుయు భాషలో రాసిన పుస్తకానికి ఆంగ్లానువాదం గురించి హేలీ వ్యాసం
* 2013 లో చదివిన పుస్తకాల జాబితాను పంచుకుంటూ ఐదుగురు వ్యక్తులు (ఇందులో ఒక స్కూల్లో చదువుకునే అమ్మాయి కూడా ఉంది) రాసిన వ్యాసాలు.

ఫిబ్రవరి 2014
* కవి, రచయిత గుల్జార్ రచనల గురించి – పూర్ణిమ, తృష్ణ, నాగిని గార్ల వ్యాసాలు
* The 11 pictures of time: The physics, philosophy and politics of time beliefs అన్న పుస్తకం గురించి హేలీ వ్యాసం
* జాక్ లండన్ ఆంగ్ల నవలలు “The call of the wild”, “White Fang” గురించి రానారె వ్యాసాలు

మార్చి 2014
* జీవీ కృష్ణారావు నవల కీలుబొమ్మలు గురించి ఆంగ్లంలో జీ.ఆర్.కె. మూర్తి వ్యాసం
* జగదీశ్ నాగవివేక్ పిచిక ఫొటో పోస్టులు
* అరిపిరాల సత్యప్రసాద్ కథల గురించి కొల్లూరి సోమశంకర్ వ్యాసం
* ఒక స్వీడిష్ సినిమా వెండితెర నవల పుస్తకం గురించి నేను రాసిన వ్యాసం (వైవిధ్యం ఉందని చూపడానికి ఇస్తున్న లంకె కానీ, సోత్కర్షకు కు కాదని గమనించగలరు)

ఏప్రిల్ 2014:
* రాణి శివశంకరశర్మ “గ్రహాంతర వాసి” పై హేలీ వ్యాసం (ఈ పుస్తకం మీద అంతర్జాలంలో అది ప్రచురించబడేనాటికైతే నాకే సమీక్షా కనబడలేదు)
* వోల్గా “రాజకియ కథలు” పై రాగమంజరి గారి వ్యాసం
* “కొల్లబోయిన పల్లె” కథాసంపుటి పై రవి గారి వ్యాసం
* Things fall apart అన్న ప్రముఖ నైజీరియన్ ఆంగ్ల నవల గురించి రానారె వ్యాసం

మే 2014:
* హెన్రిక్ ఇబ్సెన్ నార్వేజియన్ నాటకాల ఆంగ్లానువాదాల గురించి రెండు వ్యాసాలు
* ఇస్మత్ చుగ్తాయ్ రచన గురించి వ్యాసం
* డక్కలి జాంబ పురాణం గురించి వ్యాసం
* ఆంగ్ల, ఆంగ్లానువాదంలో వచ్చిన కొన్ని నవలల పరిచయాలు
(నవల, నాటకం, వ్యాసం, ఆత్మకథ – ఇక్కడే నాలుగు తరహాల పుస్తకాల ఉదాహరణలు ఉన్నాయి!)

జూన్ 2014:
సంఖ్యా పరంగా వ్యాసాలు తక్కిన నెలలతో పోలిస్తే తక్కువే అయినా, ఒక తెలుగు నవల, ఒక చెక్ నవలకు ఆంగ్లానువాదం, ఒక memoir ఇలా వ్యాసాలు వచ్చాయి (అదే, మూడు విశ్వనాథ వ్యాసాలు కాకుండా!)

అదనమాట. మొత్తానికి ఒకే వ్యక్తి రచనలపైన ఆరు నెలల్లో ఇరవై వ్యాసాలు రావడం అద్భుతమైన విషయం గా తోస్తుంది నాకు. ఏదో ప్రతి రెండు వ్యాసాలకి ఒకటి విశ్వనాథ వ్యాసం ఉంటే – ఇది విశ్వనాథ మోనోపొలీ అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఏడెనిమిది వ్యాసాలకి ఒక విశ్వనాథ వ్యాసం కనుక అంత ఖంగారు పడక్కర్లేదేమో అనిపిస్తోంది. అందునా, 2009 నుండి చూస్తే మొత్తం దాదాపు నలభై విశ్వనాథ వ్యాసాలుంటే, 1400 పై చిలుకు ఇతర వ్యాసాలున్నాయి – వెబ్సైటులో పాత వ్యాసాలు కూడా ఉన్నాయి కద చదువుకోడానికి!!😉

అలాగ, ఇతరుల సంగతేమో కాని, ఈ టపా రాసినందువల్ల నాకు పుస్తకం లో ఎన్ని మంచి వ్యాసాలొస్తున్నాయో, ఎంత వైవిధ్య భరితమైనవి ఉన్నాయో తల్చుకుని ఆనందించే అవకాశం కలిగింది.

అప్పుడప్పుడు –
1) పుస్తకంలో పూర్ణిమ, సౌమ్య తప్ప ఎవరూ రాయరు
2) పుస్తకంలో వ్యాఖ్యలు కూడా వాళ్ళే రాసుకుంటూ ఉంటారు
3) పుస్తకం విశ్వనాథ భజనమందిరం
4) (ఇంకాస్త ముందుకెళ్ళి) పుస్తకం వాళ్ళు మైనార్టీ కులాలను, మతాలను వేధిస్తారు
5) పుస్తకం వాళ్ళని ఎవళ్ళో ఏదో అన్నారని జైల్లో వేశారు
– ఇలాంటివి అంటూంటే, నేను గమనించని కొన్ని సంగతులు నాకు తెలుస్తూ ఉంటాయనమాట.

పుస్తకం చదువరులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు-ద్వేషులకు, అనుమానించేవారికి, అవమానించేవారికి -అందరికీ ధన్యవాదాలు.
సర్వేజనా సుఖినో భవంతు.

Published in: on July 5, 2014 at 12:01 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/07/05/pustakam-vsn/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. /* పుస్తకం చదువరులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు-ద్వేషులకు, అనుమానించేవారికి, అవమానించేవారికి -అందరికీ ధన్యవాదాలు.
    సర్వేజనా సుఖినో భవంతు. */

    :-))))

  2. పుస్తకం.నెట్, మబ్బు తునకలలో పెద్ద తునక నిశ్చయంగా విశ్వనాధ వారిదే అయితే ఏమిటంటా?

  3. క్లౌడ్ టాగ్ లో పెద్ద పీఠం హేలీదే !!keep it up Hallley


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: