కొన్ని వారాలు బట్టి మా ఊరి థియేటర్లలో ఆడుతున్న “Das Schicksal ist ein mieser Verräter” అన్న సినిమా గురించి నాకు కుతూహలంగా ఉండింది. తరువాత ఒక స్నేహితురాలి పుణ్యమా అని అది “The Fault in our stars” కి జర్మన్ డబ్బింగ్ అని తెలిసింది. ఆ పేరు వినగానే ఏమిటో, వెంటనే ఆ సినిమా చూడాలనిపించింది – ఇలా అనిపించిందో లేదో, అలా కేవలం మూడే మూడు షోలకి ఆ సినిమా ఆంగ్ల మూలం మా ఊళ్ళో థియేటర్ కి వచ్చింది!
కథ విషయానికొస్తే, ఇది అదే పేరుగల ఒక నవల ఆధారంగా తీశారట. ఇద్దరు క్యాన్సర్ వ్యాధికి గురైన టీనేజర్ల మధ్య చిగురించిన స్నేహం, ప్రేమ, వారి రోగావస్థ – ఇవి ప్రధానాంశాలు. గీతాంజలి సినిమా తరహా కథ.
కథ విస్తారంగా తెలియాలనుకుంటే వికీ పేజీలో ఉంది.
ఇక, నాకు నచ్చిన అంశాలు:
౧. సినిమాలో కొన్ని సంభాషణలు బాగా రాశారు. కొన్ని తెలివిగా రాశారు అనిపించింది. అక్కడక్కడా ఉన్న హాస్యం కూడా బాగుంది.
౨. ఆ ప్రధాన పాత్రధారులు ఇద్దరూ బాగా చేశారు. వయసులో చిన్నవారే అయినా భారీ పాత్రలు బాగా నిభాయించారనిపించింది.
౩. సినిమాలో హీరోయిన్ అమ్మ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ సినిమాలో తల్లిదండ్రుల పాత్రలు హృద్యంగా చిత్రీకరించారని నాకు అనిపించింది. ఇటీవలే “The Weird Sisters” అన్న నవల చదువుతున్నప్పుడు ఒక వాక్యం రాస్తుంది రచయిత్రి: “How old were you when you first realized your parents were human? That they were not omnipotent, that what they said did not, in fact, go, they had dreams and feelings and scars? Or have you not realized that yet?” ఆ వాక్యాలు ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్లనే గుర్తు వచ్చాయి. సినిమాలో మా వెనక్కూర్చున్న టీనేజీ అమ్మాయిలలో ఒకరో ఇద్దరో ఒకటే సినిమాలో హీరో-హీరోయినుల కష్టం చూసి కన్నీరు కార్చినట్లు అనిపించింది శబ్దాలను బట్టి. నాగ్గానీ కన్నీళ్ళు కార్చేంత వరకూ వచ్చుంటే – ఆ తల్లిదండ్రుల పాత్రలని చూసినప్పుడే వచ్చుండేవి ఏమో!
౪. ఇక తల్లి పాత్ర తరువాత నాకు నచ్చినది -వీళ్ళు కలవాలనుకుని వెళ్ళే ఆ “The Imperial Affliction” అన్న పుస్తక రచయిత పాత్ర. ఆ పాత్రని ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారా? అనుకునేవాళ్ళకి – అదికథలోని పాత్ర. బాగా రాయబడ్డ పాత్ర అని నా అభిప్రాయం.
౫. నవలలో క్యాన్సర్ రోగులని చూపిన విధానం: నాకు సహజంగా అనిపించిందనే చెప్పాలి. నాకెవ్వరూ వ్యక్తిగతంగా తెలియదు కానీ – మామూలు రోగులైతే కొన్నిసార్లు ఆనందంగా, కొన్నిసార్లు విషాదంగా, కొన్నిసార్లు నొప్పి-బాధని అనుభవిస్తూ, కొన్నిసార్లు అధిగమిస్తూ – ఇలాగే ఉంటారని ఊహిస్తున్నాను. ఈ సినిమాలో పాత్రలు నాకు అలాగే అనిపించాయి.
ఇప్పుడిక నవల చదవాలి అని నిర్ణయించుకున్నాను. నవల మొదట్లో ఉన్న Author’s Noteలో ఇలా ఉంటుంది:
“Neither novels nor their readers benefit from attempts to divine whether any facts hide inside a story. Such efforts attack the very idea that made-up stories can matter, which is sort of the foundational assumption of our species. I appreciate your co-operation in this matter”
-అది నన్ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. కనుక, తదుపరి కార్యక్రమం – నవల చదవడమే.
Leave a Reply