గ్రీసులో క్రిస్మస్ సెలవులు-3

క్రిస్మస్ – ఉదయాన్నే ఐదూ-ఐదున్నర ప్రాంతంలో చర్చి గంటలతో మెలుకువ వచ్చింది. ఇవ్వాళ్టి మా ప్లాన్ – కైసరియానీ మొనాస్టరీకి వెళ్ళడం. నిజానికి ఈ మొనాస్టరీ గురించి పెద్దగా సమాచారం దొరకలేదు మాకు. కానీ, కొండమీద ఉందని, క్రిస్మస్ నాడు అక్కడికెళ్తే బాగుంటుందని అనుకుని బయలుదేరాము. మెట్రో స్టేషన్ కి వెళ్ళి డే పాస్ కొనుక్కుని, ఏ‌ ట్రెయిన్ ఎక్కాలి? ఎక్కడ మారాలి? వగైరాలు చూస్కున్నాము. టికెట్ కౌంటర్లో ఆవిడ – మీ వస్తువులు జాగ్రత్త, జేబుదొంగలుంటారు అని ఒక పక్క చెబుతూనే, “మీ బొట్టు చాలా బాగుంది” అని కితాబిచ్చింది నాకు 🙂

సరే, కైసెరియానీ మొనాస్టరీకి వెళ్ళడానికి Evangelismos అన్న స్టాపులో దిగాలన్నారు. అక్కడ నుంచి కథ మొదలైంది. అక్కడ దిగాక ఏం చేయాలి? అన్న దానికి పాపం అడిగిన అందరూ సాయం చేయాలని సిన్సియర్ గా ప్రయత్నించారు కానీ – ఒకదానికి ఒకటి పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ఇలా కాదని, దగ్గరలో కనబడ్డ ఒక బస్-స్టాప్ కి వచ్చాము. కైసెరియాని కి వెళ్ళే బస్సుల సంఖ్యలు అక్కడ లేవు. ఉన్న బస్సుల్లోనే ఎవన్నా వెళ్తాయేమో అని నేను కష్టపడి అక్షరాలు కూర్చి పదాలు నిర్మిస్తున్నా. ఇంతలో ముగ్గురొచ్చారు – అదే పనిగా చూస్తున్నారు. ఇక విధిలేక, కెసెరియానీకి వెళ్ళాలి అన్నాము. వాళ్ళు ఏదో అన్నారు – మాకర్థం కాలేదు. మీకు ఇంగ్లీషొచ్చా అని అడిగాము – రాదన్నారు. సరే, ఇక ఏం‌చేయాలా? అనుకుంటూండగా, మొక్కవోని దీక్షతో మాకు సాయం చేసి తీరాలి అని సంకల్పించారు వాళ్ళు. మూగసైగలతో 75 నంబర్ బస్ ఎక్కాలనో ఏదో చెప్పింది వాళ్ళలో ఒకామె. ఆ బస్సక్కడికి రాదని కూడా అర్థమైంది. లాస్టుకి ఒక టాక్సీ ఆవిడ కనిపిస్తే, అది మాట్లాడుకున్నాము. ఒక పది నిముషాల్లో మెలికలు తిరిగే రోడ్డులో తీసుకెళ్ళి ఎంట్రంస్ లో దిగబెట్టింది ఆవిడ. వెళ్తూ వెళ్తూ మీ పనైపోయాక టాక్సీ కి కాల్ చేయండి అన్నది. ఎందుకన్నదో నాకర్థం కాలేదు ఆ క్షణంలో.

మొనాస్టరీ ఉన్న ప్రదేశం అంతా అందంగా ఉంది. ఒకవైపున ప్రాచీన కట్టడాలు, ఒకవైపున చక్కగా నిర్వహించబడుతున్న బొటానికల్ గార్డెన్ -నాకు చాలా నచ్చింది. ఇంతకీ, మొనాస్టరీకి అది సెలవురోజట. కనుక బయట్నుంచే చూసి తరించాల్సి వచ్చింది. ఆమాత్రం చూస్కోకుండా రావడం మా తప్పే కానీ, ఆ వెబ్-పేజి గ్రీక్ లో ఉండేసరికి ఈ విషయం గమనించలేకపోయాము. అక్కడే కొండమీదకి హైక్ చేస్తూ, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన కట్టడాలని చూస్తూ, చాలా సేపు గడిపాము. పైన్నుంచి ఏథెన్స్ నగరం ఇలా ఉంది.
DSC00092
ఏమాటకామాటే, డిసెంబర్ అయినా, మంచి హైకింగ్ లొకేషన్ అది. కొంతమంది చిన్నపిల్లలతో వచ్చి గడ్డిమీద దుప్పట్లు పరుచుకుని సేదతీరుతున్నారు అంటే – అంత మంచి వాతావరణం ఉంది మరి!

ఇక్కడ కూడా పిల్లులూ అవీ చక్కగా ఫోజులిస్తున్నాయి మాకు –
DSC00104

DSC00107

కాసేపు తిరిగాక, మొదలైంది సందేహం – ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్ళాలి? అని. మళ్ళీ కొండదిగేసి కింద ఎంతసేపు వెదికినా బస్టాపేదీ కనబడలేదు. మేము చూసిన వాళ్ళంతా కూడా కార్లలో వచ్చిన వాళ్ళే. దానితో ఆ టాక్సీ డ్రైవర్ మాటల వెనుక మర్మం అర్థమైంది. అత్యుత్సాహంలో మరి మేము టాక్సీని పిలిచే నంబర్ ఏమిటో మర్చిపోయాం‌ కదా! ఏం చేయాలో?

సరే, సరదాగా మరో మూణ్ణాలుగు కి.మీ. నడిచి కిందకెళ్తే అక్కడేదైనా టాక్సీ దొరుకుతుందిలే – అనుకుని బయలుదేరాము, ఒకసారి మొనాస్టరీవైపు ఆఖరి వీక్షణాలు సారించి.

DSC00110

ఒక పది నిముషాలు నడిచాక – మనం నడుస్తున్నది కరెక్ట్ దారేనా? అన్న సందేహం ఓపక్కా. వర్షం పడబోతోందా? అన్న సందేహం ఓ పక్కా – అక్కడ చూస్తే తలదాచుకునే స్థలంఏదీ లేదు – అంతా అడవే. నేను సర్వకాల సర్వావస్థలయందూ సంచీలో రెయిన్ కోటు పెట్టుకు తిరుగుతాను – మాఊర్లో ఎప్పుడు వాన పడుతుందో ఎవ్వరికీ తెలీదు కనుక. అలాగని అందరూ అలా ఉండరు కదా. కనుక, వర్షంలో అలాగే నడవడం గురించి మాకు ఏకాభిప్రాయం రాలేదు. రోడ్లో పోతున్నా కార్లని ఆపి లిఫ్ట్ అడుగుదాం అని నిర్ణయించుకున్నాము. రెండు కార్లు పోయాయి – ఆగలేదు. నేను వాళ్ళని నానాతిట్లు తిట్టుకున్నా 🙂 మూడో కారు ఆగింది. ఆ సరికి వర్షం జోరుగానే‌ ఉంది. ఆగీ ఆగ్గానే ఒకాయన బైటకి దిగి – “ఎక్కండెక్కండి” అంటూ తలుపులు తీశాడు. లిఫ్ట్ ఇవ్వని వాళ్ళని తిట్టుకున్నానా? ఇప్పుడు నాకు వీళ్ళని చూడగానే “ఏమిటి అడగ్గానే లిఫ్ట్ ఇస్తున్నారు?” అని అనుమానం కలిగింది 😉

అయినా, మేమిద్దరం ఉన్నాం కదా అనేసి ఎక్కేశాము – లోపల ఇద్దరున్నారు. మేము ఇద్దరం. ఎక్కేసాక ఎక్కడికెళ్ళాలి? అని ఇంగ్లీషులో అడిగారు. ఇలాగ మొనాస్టరీకి వచ్చాము, ఇప్పుడు ఎలా కిందకెళ్ళాలో తెలీదు, ఫలానా Evangelismos వద్ద దింపండి అన్నాము. వాళ్ళు – “ఓహ్, మేము ఆ పక్కకి వెళ్ళట్లేదు.” అన్నారు. మళ్ళీ వాళ్ళే – “Don’t worry, we will drop you at Katehaki metro station” అన్నారు. సరేనన్నాము. ఆపైన, వాళ్ళలో ఒకతనికి ఇండియన్ స్నేహితురాలు ఉందట – అతను ఇండియా గురించి చెప్పుకుపోతున్నాడు. రెండో‌ మనిషికేమో మేము మొదటిసారి ఏథెన్స్ కి వచ్చి కూడా కెసిరియానీ గురించి తెలుసుకుని లోకల్స్ లేకుండా రావడం అబ్బురంగా ఉంది. “మీకీ ప్రాంతం గురించి అసలు ఎలా తెలిసింది? ఏథెంస్ లోనే కొత్త మనుషులకి దీని గురించి అంతగా తెలీదు. మీరు ఎలా వచ్చారు?” వంటి ప్రశ్నల పరంపర ఆ సైడు నుంచి.

అంత మాట్లాడుతున్నా, ఎంతకీ ఆ స్టేషను రాదు. ఇంక చూడాలీ – ప్రాణనాథుడికి మనుషుల మీద వల్లమాలిన నమ్మకం – అంత తేలిగ్గా నాకు వచ్చే తరహా అనుమానాలు రావు. కనుక వాళ్ళంతా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ, నాకు మాత్రం – “ఈదారిలో కాదు కదా మనం వచ్చింది? ఎందుకింత సేపు పోతున్నాం హైవే మీద? ఎక్కడికి?” తరహా అనుమానాలు మొదలైనాయి. కానీ, వాళ్ళు నిజంగానే మంచోళ్ళు. అన్న మాటప్రకారం Katehaki వద్ద దింపి, మెర్రీ క్రిస్మస్ చెప్పి వెళ్ళిపోయారు. వర్షం జోరుగానే పడుతోంది. ఒక పెద్ద బ్రిడ్జ్ దాటితే అవతలి వైపు స్టేషన్. కాసేపు ఆగి వానతగ్గాక బ్రిడ్జ్ దాటుతూండగా, చిన్నపిల్లాడ్ని నడిపిస్తున్న పెద్దాయన కనబడ్డాడు – నాకేమిటో ఆదృశ్యం అద్భుతంగా అనిపించింది.
DSC00115

ఆ విధంగా ఆ ప్రాంతం నుండి బయటపడి, ఏథెన్స్ నడిబొడ్డులోని Syntagma మెట్రో స్టేషంలో ట్రైన్ దిగాము. అక్కడ స్టేషన్ నుండి బైటకి రాగానే గ్రీస్ పార్లమెంటు భవనం కనబడ్డది‌. నేరుగా పాతనగరం వైపుకి దారితీశాము. దారిలో ఎక్కడికక్కడ నిమ్మకాయ సోడా అమ్మే బండ్లలాగ ఇక్కడ Salepi అన్న పానీయం అమ్ముతున్నారు. ఏదో ఒక తరహా ఆర్కిడ్ చెట్టు వేరుతో తయారు చేస్తారు అని చెప్పింది ఒక బండి ఆవిడ. తాగాము – బాగానే ఉంది. ఆ వాతావరణానికి వెచ్చగా, రుచిగా‌ ఉంది. ఓ ఐదు-పది నిముషాలు నడిచేసరికి రోడ్డుమధ్యలో ఒక పురాతన చర్చి కనబడ్డది. ఈసారి వెళ్ళలేదు కానీ, ఆదివారం ఇదే చర్చికి వచ్చాము – వాళ్ళ పొద్దుటి ప్రార్థనల సెషన్ చూడ్డానికి.
DSC00120

చర్చి బయట నారింజ పళ్ళు మట్టుకు నన్ను ఆకట్టుకున్నాయి. ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ కనబడ్డాయి మెట్రో ట్రైనులో తిరుగుతున్నప్పుడు కూడా. సరే, ఇక్కడ నుండి నడుచుకుంటూ Monastiraki ప్రాంతం చేరుకున్నాము. ఈ ప్రాంతాలలోనే అనేక ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. మనకి సుల్తాన్ బజార్లా ఈ ప్రాంతంలో కూడా అదీ ఇదీ అని లేకుండా అన్నీ అమ్మే దుకాణాల వరుసలు ఉన్నాయి. క్రిస్మస్ కనుక మూసేసారు కానీ, మేము సాంటోరినీ వెళ్ళొచ్చాక ఉండబోయేది ఈ ప్రాంతంలోనే కనుక తర్వాత చూద్దామనుకున్నాము. దారుల నిండా జనాలు, ఎక్కడపడితే అక్కడ అదికొను, ఇది కొను అంటూ‌ వెంటపడే వీథి వర్తకులు (జిప్సీలు/రోమానీ వాళ్ళు అనుకుంటాను వీళ్ళంతా), బిజీ బిజీగా ఉన్న రెస్టారెంట్లతో ఈ ప్రాంతం కిటకిటలాడుతోంది. ఊర్నిండా గ్రాఫిటీ కూడా – మెట్రో ట్రైన్ లు మొదలుకుని షాపుల గోడలదాకా. ఇక్కడి నుంచే ప్రఖ్యాతి చెందిన Acropolis కూడా దూరంగా కనబడుతోంది.

DSC00119

DSC00137

DSC00122

DSC00126

DSC00127

కాసేపు ఈప్రాంతాల్లోనే తిరిగి, ఎలాగో రెండ్రోజుల్లో మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటాం కదా అని తిరుగుముఖం పట్టాము. తిరిగి పోర్టు ప్రాంతంలోని మా హొటెల్ గదికి వెళ్ళడానికి మొనాస్తిరాకి స్టేషన్ లో మెట్రో ఎక్కాము. మెట్రో స్టేషంలు కూడా ఇక్కడ కొన్ని మినీ-మ్యూజియంలా ఉన్నాయి – స్టేషన్ ప్రాంతంలో తవ్వకాల్లో దొరికిన వాటిని అక్కడంతా పద్ధతిగా అమర్చారు.

ట్రెయిన్ లో ఓ పెద్దాయన ఉన్నాడు – ఆయనకి మేము దొరికాము. ఆయనకి భారతదేశం అంటే ఇష్టమట. “Mother India” చూశారా మీరు? నర్గీస్ ఎంత గొప్ప పాత్ర వేసింది? ఆమె ఎంత బాగుంటుంది! ఫలానా ఇంకోటి చూశారా? అదీ ఇదీ అని అడుగుతూనే ఉన్నాడు. Fritz Lang అన్న జర్మన్ దర్శకుడు ఇండియా కథలతో తీసిన “The Tiger of Eschnapur“, “The Indian Tomb” – సినిమాల గురించి అడిగాడు. మేము చూడలేదనేసరికి బాగా హర్టై, ఓ కాగితం మీద వాటి పేర్లు రాసిచ్చి, తప్పకుండా చూడండని మరీ మరీ చెప్పి దిగిపోయాడు 🙂

ఇవన్నీ అయ్యాక, చీకటి పడుతూండగా, Piraeus ప్రాంతానికి చేరుకున్నాక, హోటెల్ గది వద్ద కనబడ్డ చర్చిలోకి వెళ్ళాము – అక్కడ కొందరు పూజారులు దీక్షగా గ్రీకులో ఏదో చదువుతున్నారు. ఓ రెణ్ణిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాము.

DSC00139

మరుసటిరోజు ఉదయాన్నే ఏడింటికి సాంటోరినీ ద్వీపానికి వెళ్ళేందుకు ఫెర్రీ ఎక్కాలి. కనుక చెక్-ఔట్ గురించి కనుక్కుందామని వెళ్తే రిసెప్షనిస్టు – “మీ బొట్టు చాలా బాగుంది. Piercing ఆ?” అని అడగడం ఇవ్వాళ్టికి కొసమెరుపు! 🙂

(సశేషం)

Advertisements
Published in: on March 23, 2014 at 7:57 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/03/23/greecevacation-3/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. […] రెండవ, మూడవ, నాల్గవ […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: