గ్రీసులో క్రిస్మస్ సెలవులు-2

మూడు ద్వీపాల సందర్శనం
****

రెండోరోజున మాకు సింగిల్ పాయింట్ ఎజెండా – మూడు ద్వీపాల సుడిగాలి పర్యటన. దాన్నే టూర్ నిర్వహకులు ముచ్చటగా – 3 Island Cruise అని పిలుచుకుంటూంటారు. వాళ్ళు మొదట మా‌హోటెల్ ఉన్న ప్రాంతం నుండి మొదలౌతుందని చెప్పారు క్రూజ్. కానీ, రెండ్రోజుల ముందు లొకేషన్ మార్చేసి – “మీకోసం ఓ టాక్సీ బుక్ చేశాము, వాళ్ళేదో డబ్బులడుగుతారు, మా పేరు చెప్పుకుని ఇచ్చేయండి” అన్నారు. సరేలే, ఈమెయిళ్ళలో తప్ప కనబడని వాళ్ళతో ఇప్పుడు తగువెక్కడ పెట్టుకునేది? అనుకున్నాము.

ఏడింటికనుకుంటా టాక్సీ వస్తూందన్నారు. ఆ హోటెల్లో ఐదు నుంచే బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టేస్తారు! నాకు బాగా తెలిసిన కొందరు ఈ విషయం తెలిస్తే మిక్కిలి సంతోషిస్తారని నాకు తెలుసు. ఈసారికి మాత్రం నేను కూడా సంతోషించాను – మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాక ఏం దొరుకుతుందో ఏమో అని. ఏడు కల్లా రెడీ అయిపోయి కింద రిసెప్షంలో కూర్చుంటే – ఎంతకీ‌ ఆ టాక్సీ రాదు. పది నిముషాలైనాక కూడా పత్తా లేదు. ఆ టాక్సీ కంపెనీకి ఫోన్ చేస్తే – “వస్తుంది, మీరు హాయిగా రిలాక్స్ అవండి” అంటాడు, వాడికొచ్చిన ఇంగ్లీషులో. నాకేమో ఈ జర్మనీలో “టైం అంటే టైం” అన్న కాంసెప్ట్ అలవాటు అయిపోయి, “what the hell is all this?” అనిపిస్తోంది 🙂 దాదాపు ఏడున్నరకేమో, టాక్సీ డ్రైవర్ తాపీగా రిసెప్షనిస్ట్ వద్దకు వచ్చి మా గురించి ఎంక్వైరీ చేస్తూంటే మేము వెళ్ళి అతని ముందు నిలబడ్డాము. ఆయనా – ఎగాదిగా చూసి, అరగంట ఆలస్యంగా వచ్చినందుకు ఒక క్షమాపణ అయినా చెప్పకుండా – “పదండి పదండి…” అంటూ తొందరపెట్టాడు, అక్కడికి మేము ఆలస్యం చేస్తున్నట్లు! ఈయన అక్కడనుంచి ఒక ఐదు కి.మీ. దూరంలో ఉన్న ఒక హోటెల్ దగ్గర దింపాడు. అక్కడ మాకోసం ఒక బస్సు ఎదురుచూస్తోంది. ఆ బస్సులో మేము వెళ్ళే క్రూజ్ ఉన్న తీరానికి చేరుకున్నాము. ఆ నౌకాయానం పర్యాటకుల కోసమే రూపొందించిన కార్యక్రమం కనుక ఆ హంగామా‌ బాగానే ఉందక్కడ.

నౌక లోపలికి అడుగుపెట్టబోతూండగా గ్రీకు సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఒకామె, ఒకాయనా మమ్మల్ని ఆహ్వానించారు లోపలకి. దానికి ఫొటోలు తీసి ఆ‌తర్వాత అమ్ముతారు లెండి – అది నాకు తర్వాత అర్థమైంది. అది తెలియక మునుపు – “ఏమిటి ఇలా వచ్చిన అందరికీ ఓపిగ్గా కరచాలనం చేసి ఫొటోలు దిగుతున్నారా? ఎందుకు? పాపం శ్రమ కదా!” అనుకున్నా 😉 పర్యాటకుల్లో చాలా మటుకు జపాన్, చైనా, మరియు ఇతర తూర్పు దేశాల వాళ్ళు ఉన్నట్లు తోచింది. మెక్సికన్ టూరిస్టులు కూడా ఉన్నారు బాగానే. ఐరోపా టూరిస్టులు మట్టుకు తక్కువే కనిపించారు. బహుశా డిసెంబర్లో ఇక్కడికి ఆసియా ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా వస్తారు లాగుంది..అనుకున్నాము.

ప్రయాణం మొదలైంది. మొదట్లో అన్నీ రకరకాల పడవలూ, ఓడలూ కనబడ్డాయి. క్రమంగా అన్నీ దూరమైపోయి నీళ్ళు మాత్రం మిగిలాయి. ఆపైన చాలాసేపు సముద్రం, దూరంగా ఎక్కడో కొండలూ – అంతే. చాలా సేపు నేను ఇదంతా మహా అబ్బురంగా చూశాను కానీ, కాసేపటికి అనుమానం మొదలైంది – మనం ఎప్పటికైనా మళ్ళీ మామూలు నేలని చూస్తామా? అని 😉 ఎట్టకేలకి కాసేపు తరువాత, “హైడ్రా” ద్వీపం రాబోతోందని ప్రకటించారు. దూరం నుంచే ఆ ద్వీపం అద్భుతంగా కనబడ్డం మొదలైంది నా కళ్ళకి. దగ్గరికొచ్చే కొద్దీ నచ్చుతూ, కాసేపు అక్కడ తిరిగేసరికి, ఈసారి గ్రీస్ మళ్ళీ ఎప్పుడన్నా రాగలిగితే, తప్పకుండా ఇక్కడి కొచ్చి ఊరికే ఖాళీగా రెండ్రోజులుండాలి అనుకున్నాము ఇద్దరం.

DSC00034

రోడ్లు రద్దీగా లేవు కానీ, ఆ ప్రాంతమంతా మట్టుకు కోలాహలంగానే ఉంది.
DSC00022

ప్రత్యేకంగా ఆకట్టుకున్నవి – ఎక్కడ పడితే అక్కడ తచ్చాడుతున్న పిల్లులు, గాడిదలూనూ.
DSC00019

DSC00025

కాసేపు ఆ పోర్టు పరిసర ప్రాంతాల్లోనే నడుస్తూ గడిపాము. మధ్యలో అక్కడి పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి ఇండియాకి, జర్మనిలో నా అడ్రస్ కి పోస్ట్ కార్డులు పంపాము – ఇండియాకి జర్మనీకంటే పదిరోజులు ముందుగా చేరుకుంది కార్డు 🙂 🙂 పెద్దగా చూడవలసిన “ప్రదేశాలు” అంటూ ప్రత్యేకంగా లేవు ఇక్కడ – కానీ ఆ వాతావరణం మాత్రం కనీసం ఒక్క మూణ్ణాలుగు రోజులైనా బోరు కొట్టనివ్వదు అని అనిపించింది (పర్యాటకులకి! అక్కడుండే వాళ్ళకి కాదు). ఉన్న మ్యూజియం లో ఏవో రిపేర్లని మూసేసారు. కొంచెం కొండపైకి నడిచెళ్తే ఏవో విగ్రహాలు, యుద్ధకాలం నాటి వస్తుసామగ్రీ అవీ కనబడ్డాయి కానీ, ఎక్కడా ఆంగ్ల వివరణ లేదు కనుక ఏమీ తెలియలేదు (వికీలో ఉంది కొన్నిటి గురించి). అన్నట్లు, హైడ్రా ద్వీపంలో కార్లు, మోటర్ సైకిళ్ళు నిషిద్ధం. దానితో మరీ నిశబ్దంగా ఉండింది వాహన ధ్వనుల పరంగా 🙂

కాసేపలా నడిచి, ఆ క్రూజ్ షిప్ గాని వెళ్ళిపోయిందంటే ఆ రాత్రికక్కడే ఉండాల్సి వస్తుందేమో అని భయమేసి, ఇంక దానివైపుకి వెళ్ళాము 🙂 ఆ రెండో బొమ్మలో కనిపిస్తున్నదే మేము ప్రయాణం చేస్తున్న నౌక.
DSC00031

DSC00042

ఇక రెండో ద్వీపం పోరోస్. ఇక్కడ ఎక్కువ సమయం గడపలేదు. పైగా ఆ ఉన్న కాస్త సమయమూ దగ్గర్లోని గుట్ట ఎక్కి, అక్కడ నుండి మంచి వ్యూ ఉంటుందంటేనూ అక్కడికి నడిచెళ్ళేందుకు సరిపోయింది 🙂 ఈ ద్వీపం తొలిచూపులో నన్ను అంత ఆకట్టుకోలేకపోయింది. పైగా హైడ్రా మీద వాహనాలు అవీ బాగానే ఉన్నాయి. కానీ, ప్రాకృతిక అందాలకి లోటేమీ లేదు. మేము చుట్టుపక్కల చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పైకి ఎక్కేసరికి, చాలా ఆలస్యమైపోయింది. దిగేటప్పుడు పరిగెత్తకపోతే ఆ షిప్ వెళ్ళిపోతుందని కూడా అర్థమైపోయింది. దానితో, వెనక్కి వచ్చేటప్పుడు ఆట్టే ప్రయోగాలు చేయకుండా తిన్నగా వచ్చినదారినే వెనక్కి వెళ్ళాము 🙂

DSC00050

మళ్ళీ కాసేపు ప్రయాణం చేశాక Aegina ద్వీపం చేరుకున్నాము. ఈ మూడింటిలోకి ఇది పెద్ద ద్వీపం అనుకుంటాను. మేము అలా తీరంమీదకి రాగానే పక్కనే ఉన్న ఒక పెద్ద ఓడలోంచి తండోపతండాలుగా జనం బైటకొస్తున్నారు. జనం వస్తే వచ్చారు…కార్లు, మోటార్ బైకులూ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అసలు కార్లూ అవీ షిప్పులోంచి రావడమే నేనెప్పుడూ చూడలేదు కనుక విడ్డూరంగా చూస్తున్నా. ఎంతకీ ఆ ప్రవాహం ఆగదే!! వస్తూనే ఉన్నాయి. అప్పటిగ్గానీ నాకర్థం కాలేదు అది ఎంత పెద్దదో‌ 🙂

DSC00062

ఈ ద్వీపంలో ఒక ప్రముఖ Archaelogical site ఉంది కానీ, మేమక్కడికి చేరుకునేసరికి దాన్ని మూసేసారు!‌ నాలుగు కూడా అవలేదు అనుకుంటాను అప్పటికింకా. ఇంతలోపే మూసేస్తే టూరిస్టులు రానక్కర్లేదా? అనుకున్నాను కసిగా. కానీ, రోడ్డుమీద కనబడ్డ ఈచర్చి లోపలికి వెళ్ళాము – లోపల ఫొటోలు తీయలేదు కానీ, బాగుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రశాంతంగా ఉంది.

DSC00061

సముద్రం ఒడ్డులో కూడా తాజాగా సున్నమేసినట్లున్న ఈ చిన్ని చర్చి కనబడ్డది కానీ, బైట ఉన్న శునకరాజాన్ని చూశాక నేను అంత ఆసక్తి చూపలేదు అనమాట 😉
DSC00065

దగ్గర్లోనే కొన్ని ప్రముఖ ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి కానీ, మాకు కుదర్లేదు. ఈ ద్వీపంలో రైతులు పిస్తా పప్పులు పండించడంలో చాలా పేరు పొందిన వారట. ఎక్కడికక్కడ స్థానిక కొ-ఆపరేటివ్ వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి. తరువాత ఏథెన్స్ నగరంలో కూడా మార్కెట్లో చూశాను – famous pistachio from Aegina తరహా మార్కెటింగ్. షరా మామూలుగా కాసేపు అటూ ఇటూ నడిచి, “అబ్బే, ఈ ద్వీపం మరీ కమర్షియల్. మనకి హైడ్రా బెస్ట్” అని తీర్మానించుకుని తిరిగి ఏథెన్స్ తీరం చేరుకోడానికి బయలుదేరాము.

క్రూజ్ లో వాళ్ళు ప్రయాణికుల్ని ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక చరిత్ర గురించి కథలు, మ్యూజికల్ నైట్, అందరితోనూ గ్రీస్ సంప్రదాయ నృత్యం చేయించడం, విడిగా కూడా ఒక ప్రదర్శన ఇవ్వడం – ఇట్లాంటివి.

DSC00067

DSC00075

అదీ ఈ క్రూజ్ ట్రిప్ కథా కమామిషూ. ఈ organized tours తో సమస్య ఏమిటంటే, వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళడం గురించి పోరు పెడుతూంటారు. కానీ, ఆట్టే ఆ దేశంలో ప్రయాణం చేసే అనుభవం లేని వారికి బాగుంటుంది ఈ క్రూజ్. ముఖ్యంగా రోజస్తమానం అంతర్జాల సందర్శనానికో, ల్యాప్టాప్ కో అంకితమైపోయే వాళ్ళకైతే గొప్ప relaxing అనుభవం.

రాత్రి ఇదంతా అయ్యాక, రేపు క్రిస్మస్ వేళ ఏం చేయాలో ఎక్కడ తిరగాలో ప్లాన్ చేసుకుంటూ, హోటెల్ చేరుకున్నాము. మా ఊళ్ళో అయితే ఈవేళకి, అందునా పండుగ సమయంలో – మొత్తం మూసేస్తారు కానీ, ఇక్కడ చాలా షాపులు ఇంకా తెరిచే ఉండటం ఆశ్చర్యం కలిగించింది.

(సశేషం)

Advertisements
Published in: on March 22, 2014 at 8:29 am  Comments (3)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/03/22/greecevacation2/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Greeks are also laidback like Indians.Greece is considered to be a backward country in Europe.Germans are punctual and punctilious.

    • నిజానికి నాకు backward అనిపించలేదు లెండి. పౌరులకు కనీస వసతులు సమకూర్చడంలో ఏ దేశమైనా నాకు మనదేశంకంటే నయం లాగనే అనిపిస్తుంది – ఏం చేసేది?

  2. […] రెండవ, మూడవ, నాల్గవ […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: