గ్రీసులో క్రిస్మస్ సెలవులు-1

“నాకు బోలెడు సెలవులున్నాయి. ఈసారి మెగా ఇండియా ట్రిప్ ప్లాన్ చేసి వాటిని వాడుకోవాలి.”
“నీకు బోలెడు సెలవులుంటే, నీ మెగా ఇండియా ట్రిప్ అయాక నేను సెలవు పెడతాను – ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాము”
“అదేమిటి, ఎంచక్కా స్వదేశంలో ఇంట్లో అందరితో కలిసి హాయిగా‌ ఎంజాయ్ చేస్తానంటే ట్రిప్ అంటావు?”
“నువ్వు నీ రిసర్చి పని మీద దేశాలు తిరగొచ్చు కానీ, మనిద్దరం కలిసి వెళ్దామంటే ఇలా‌ అంటావా?”
-ఆ చివరి డైలాగుతో ప్రాణనాథుడు సెంటిమెంటుతో కొట్టిన కారణంగా, వెకేషన్ అంటే స్టెకేషన్ అన్న నా ధృడాభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని తర్జనభర్జనల తరువాత – గ్రీస్ దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. క్రిస్మస్ కి రెండ్రోజుల ముందు వెళ్ళి, సంవత్సరాది నాడు జర్మనీకి తిరిగి రావాలన్నది మా ప్లాను. అనుకున్నట్లుగానే వెళ్ళి, హాయిగా తిరిగొచ్చాక – “మనిద్దరం కలిసి ఒక బ్లాగు పోస్టు రాయాలి” అనుకున్నాము.

పోయిన వారాంతంలో కాగితాలు అవీ సర్దుతూంటే గ్రీస్ లో ఉన్నప్పుడు ఏవో నోట్సు రాసుకున్న కాగితం కనబడ్డది. దానితో, “కలిసి బ్లాగు పోస్ట్” రాసే విషయం, నాలుగేళ్ళ క్రితం శ్రీలంక వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అనుకుని ఇప్పటిదాకా రాయలేదన్న విషయమూ గుర్తు వచ్చాయి. కనుక, ఇప్పటికైనా కొంచెం బుద్ధి గా నాకు గుర్తున్న సంగతులు బ్లాగులో రాసుకుందాం అని నిర్ణయించుకుని, మొదలుపెడుతున్నాను… (అన్నట్లు, అది నాకోసమే సుమా! ఐదేళ్ళ తరువాత చదువుకుని తరించడానికి! ఇంకెవరికైనా కూడా ఆసక్తికరంగా అనిపిస్తే, ధన్యవాదాలు!)

*****
మొదట ఏథెన్స్ – చుట్టుపక్కలి చిన్న చిన్న ద్వీపాల సందర్శనలో రెండ్రోజులు; తరువాత సాంటోరినీ ద్వీపంలో రెండ్రోజులు; ఆపైన మళ్ళీ‌ ఏథెన్స్ లో నాలుగైదురోజులు-ఇదీ మేము అనుకున్న ప్లాను. “డిసెంబర్లో గ్రీసా?” అని కొందరి ఆశ్చర్యం. “ఓహ్, ఏథెన్స్ అయితే పర్లేదులే, వర్షం పడకపోతే” అన్న భరోసా – ఇలా ఇక్కడి సన్నిహితుల సలహాలు సూచనల మధ్య ఏథెన్స్ విమానాశ్రయం చేరుకున్నాము. ఇదివరలో నేనోసారి గ్రీస్ వెళ్ళాను ఒక సమ్మర్ స్కూల్ నిమిత్తం. అయితే, వారం రోజులున్నా కూడా విచిత్రంగా ఆ పల్లెటూరు దాటకుండా, అక్కడే ఉన్న అరిస్టాటిల్ జన్మస్థలం తప్ప వేరేదీ చూడకుండా వెనక్కొచ్చాను. కనుక, పేరుకి గ్రీసులో వారం రోజులు నివసించిన అనుభవం ఉన్నా, నాకూ ఆ దేశం కొత్తే. విమానాశ్రయం నుండి మేము పిరయోస్ పోర్ట్ ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ ఉన్న బస్సు ఎక్కాము.

ఆ బస్ కి అదే చివరి స్టాప్ అని మాకు తెలియదు. బస్సు లో స్టాప్ పేరు డిస్ప్లే అవాల్సిన చోట – “stop” అని కనిపిస్తోంది అంతే. 🙂 బయటేమో చీకటి పడుతోంది – మాకు సరిగా కనబడ్డం లేదు ఏ‌స్టాపు వస్తోందో. ఇలా చాలాసేపు అయాక గమనించింది ఏమిటి? అంటే – బస్సులో డ్రైవరు, మేమిద్దరం, మరో ఇద్దరో-ముగ్గురో కుర్రవాళ్ళూ ఉన్నారంతే. ఒక పక్కన – ఆమధ్య నెట్లో చదివిన ఎయిర్ పోర్ట్ బస్ పిక్ పాకెట్ ముఠా వాళ్ళేమో వీళ్ళు? ఇప్పుడెలా? అన్న అనుమానం కలిగినా కూడా, వాళ్ళని అడిగాము – ఇలా పోర్టుకు వెళ్ళాలి, స్టాపు ఎప్పుడొస్తుంది? అని. అది చివరాఖరి స్టాపు. కూర్చోనుండండి – అంటూ దిగిపోయారు వాళ్ళు. స్టాపు వచ్చే వేళకి నేను వచ్చీ-రాని గ్రీకు అక్షరాలు పలుక్కుంటూ వీథుల్లో ఉన్న చిన్న చిన్న డైరెక్షంస్ అవీ చదివేసి చెప్పేస్తున్నా. నాకు అర్థమైపోయింది మేము దగ్గర్లో ఉన్నామని. లాస్టుకి పిరెయోస్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న బస్టాపు దగ్గర బస్సు ఆగింది – దిగి, అక్కడ దారి అడుగుతూ హోటెల్ వైపుకి వెళ్ళాము. జీబ్రా క్రాసింగ్ వద్ద క్రాస్ చేస్తూంటే మీదకొచ్చినంత పని చేసి దూసుకుపోయిన కారును చూసి అవాక్కయ్యా నేను – జర్మనీలో అలా ఎవ్వరూ చేయగా చూడలేదు కనుక. హోటెల్ కనుక్కోడం కొంచెం కష్టమైంది కానీ, కనుక్కోగానే ఆశ్చర్యం – దానికెదురుగ్గా ఒక ఇండియన్ స్టోరు!!

DSC00056

సరే, ఆ హోటెల్లోకెళ్ళి కొంచెం మొహం కడుక్కోడం అదీ అయ్యాక, షరా మామూలుగా ఆత్మారాముడి ఘోష మొదలైంది. “గ్రీస్ లో అస్సలు మనకి ప్రాబ్లెం ఉండదు. వెజిటేరియన్ ఫుడ్ చాలా తేలిగ్గా దొరుకుతుంది” అని అప్పటికే నేను ఊదరగొట్టేసినా కూడా, మనసులో అనుమానంగానే ఉండింది – ఇలా బిల్డప్ ఇస్తే ఎదురుదెబ్బ తగుల్తుందేమో అని. సరే, ఎక్కడా ఏం దొరక్కపోతే ఇండియన్ స్టోర్ ఉండనే ఉంది కదా! అనుకున్నా మనసులో. గత కొన్ని నెలలుగా నేను వీగన్ అవతారం ఎత్తడమూ, ఇండియాలో అందరూ కలిసి నన్ను మామూలు అవతారంలోకి మార్చడమూ – తిరిగి జర్మనీ వచ్చాక నేను శాకాహారిగా కొనసాగలేకా, ఇతర అనుమానాల వల్ల వీగన్ బ్రతకలేకా అవస్థ పడ్డమూ (అబ్బో! అదో చాటభారతం.) – ఇదంతా నడుస్తోంది కానీ, ఈ గ్రీస్ ట్రిప్ లో మాత్రం పాలు-చీజ్ వంటివి పేచీ పెట్టకుండా తిందాము అని నిర్ణయించుకున్నాను – వెకేషన్ అని సరదాగా గడిపేందుకు వెళ్ళి, సమయాన్నంతా ఆహారాన్వేషణలో గడపడం ఇష్టం లేక! విషయానికొస్తే, ఒక రోడ్-సైడ్ హోటెల్ లోకి వెళ్ళాము.

అక్కడా, ఆ హోటెలాయన బాగా ఖాళీగా ఉన్నాడు – కనుక ముచ్చట్లు పెట్టాడు. మేము గ్రీక్ సలాడ్, గెమిస్టా – ఇలా ఏదో బయట కూడా తరుచుగా దొరికేవి ఏవో ఆర్డర్ చేసాము. మెనూలో వివరాల బట్టి తెలుస్తూనే ఉన్నా, ఎందుకన్నా మంచిదని – “ఇది శాకాహారమేనా?” అని అడిగాము. ఆయన, “ofcourse, ofcourse” అనేసాక – “అయితే మీరు శాకాహారులా?” అన్నాడు. అవునన్నాము. “ఎన్నాళ్ళు?” అన్నాడు. సాధారణంగా “ఎందుకు” అని అడగడం విన్నా కానీ, “ఎన్నాళ్ళు?” అంటే వినడం ఇదే మొదటిసారి. కనుక అయోమయంగా చూశాను. తేరుకున్నాక “ప్రస్తుతానికి ఆపేసే ప్లాను ఏమీ లేదు” అంటే, “ఓహ్, నేను అయితే ఏడాదిలో ఆర్నెలలు శాకాహారిగా ఉంటాను” అన్నాడు. “ఎందుకు?” అని అడిగితే, “ఆరోగ్యం కోసం” అన్నాడు!‌ 🙂 “ఓహో, అయితే ఆర్నెల్లు మాత్రమే ఆరోగ్యం చూస్కుంటారా?” అని అడగబోయి, ఎందుకొచ్చిన గోలని ఊరుకున్నా.

ఇక ఆవేళ్టికి పెద్దగా ఏమీ చేయలేదు. కాసేపు పోర్ట్ ప్రాంతంలో నడిచి, రెండ్రోజుల తర్వాత మేము Santoriniకి ఏడు గంటలు ప్రయాణం చేసి వెళ్ళాల్సిన ఫెర్రీని చూసి – “ఓహో, ఈ గేట్ దగ్గరికి రావాలనమాట” అనుకుని, హోటెల్ గదికి వెళ్ళిపోయాము. రేప్పొద్దునే లేచి 3-Island Cruise కి వెళ్ళాలి. Hydra, Poros, Aegina ద్వీపాల పర్యటన -ఈ ఉపోద్ఘాతమంతా అయ్యాక, అసలు పర్యటన అక్కడినుంచే మొదలైంది అని చెప్పొచ్చు. అది వచ్చే‌ టపాలో.

Advertisements
Published in: on March 19, 2014 at 8:54 pm  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/03/19/greece2013/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. […] (మొదటి, రెండవ, మూడవ, నాల్గవ భాగాలు) […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: