(మొదటి భాగం – ఇక్కడ)
******
ఆ విధంగా ఒకరోజు ప్రాగ్ సందర్శన చేసి, అర్థరాత్రి వియన్నాకి వెళ్ళే ట్రెయిన్ ఎక్కాము – ఇదే ట్రెయిను బెర్లిన్, ప్రాగ్, బ్రటిస్లావా, వియన్నా, బుడపెస్ట్ – ఇలా ఐదు దేశాల రాజధానులని టచ్ చేస్తుందట (అన్నీ ఒకరూట్ లో రావు. బెర్లిన్-ప్రాగ్-వియన్నా; బెర్లిన్-ప్రాగ్-బ్రటిస్లావా-బుడపెస్ట్ – ఇవి రెండు రూట్లు. మధ్యలో ఎక్కడో మేమున్న ట్రెయిన్ లోని కొన్ని కంపార్ట్మెంట్లను మరో ట్రెయినుకి జతచేశారు). పరిస్థితులు అనుకూలిస్తే, అలాంటి మెగాట్రెయిన్ ప్రయాణం ఒకటి చేయాలి జీవితంలో ఒక్కసారైనా!
ఉదయం ఆరున్నర ప్రాంతంలో వియన్నా చేరుకున్నాము. రాత్రి ఆ కంపార్ట్మెంటులో హీటర్ బదులు కూలర్ వేశారో ఏమిటో – చలికి వణికిపోయాము. అసలే వింటర్ ముగిసిపోతోంది కదా అని మేము పెద్దగా చలికి తట్టుకునే బట్టలు కూడా తెచ్చుకోలేదు. దీనితో వియన్నా చేరేసరికి బాగా అలిసిపోయాము, రాత్రి సరిగా నిద్రలేనందువల్ల. దానితో స్టేషంలోనే ఒక గంటసేపు కూర్చుని (ఫేస్బుక్ వంటివి కూడా తెరుచుకుని), ఫలహారం కానిచ్చి, అక్కడ స్టేషంలోని info desk తెరవగానే అక్కడికెళ్ళాము. ప్రాగ్ కి నేను ఇదివరలో వెళ్ళా కనుక, అంత sudden, unplanned ప్రయాణంలో కూడా చూడవలసిన ప్రదేశాలు కొన్ని చూడగలిగాము. మరి వియన్నాలో ఒక్కరోజులో ఏమి చూస్తాము? ఒక పూర్తిరోజు కూడా కాదు. సాయంత్రం ఐదింటికి మా తిరుగు ప్రయాణం. వెళ్ళి ఆ info desk వాడిని అడిగాము. అతను – ఒక మ్యాప్ ఇచ్చి, Schönbrunn Palaceకి వెళ్ళండి మొదట అని సలహా ఇచ్చాడు. సరే, అటు వెళ్ళొచ్చి సిటీ సెంటర్ చేరుకుని, అక్కడి చర్చిలు అవీ చూద్దాం అనుకున్నాము.
ఆదివారం కావడంతో నేను చూడాలనుకున్న రైతు బజార్ తెరవరు కనుక, ఇతరత్రా ప్లాను ఏమీ అనుకోలేదు. సరే, నడుద్దామా? డే టికెట్ తీసుకుని మెట్రోలో వెళ్దామా? అని మీమాంస మాకు. ఒక పక్కనేమో – ట్రెయినుల్లో తిరిగితే ఊరు కనబడదు అని. ఒక పక్కనేమో అసలు మనకి నిజంగా రోజంతా కి.మీ. లకి కి.మీ.లు నడిచే ఓపికుందా ఇవ్వాళ? అని. మళ్ళీ ఆ info desk అతన్నే అడిగితే, అతను “I would suggest you to take a train” అన్నాడు. సరే, డే టికెట్ కొనుక్కుని, మొదట Schönbrunn Palace కి బయలుదేరాము.
ఆ ప్యాలెస్ పరమ విలాసవంతంగా ఉన్నప్పటికీ, గత మూడేళ్ళలో ఇంతకంటే ఎక్కువ విలాసవంతంగా జనం డబ్బుల్తో రాజులూ, రాణులూ కట్టుకున్న భవంతులు చూసి ఉన్నందువల్ల నాకు అంత ప్రత్యేకంగా అనిపించలేదు. అయితే, ఈ రెండ్రోజుల్లోనూ ఈ రాజుల ఆస్థులు, దాని బహిరంగ ప్రదర్శనా చూశాక, కొన్నాళ్ళ క్రితమే మా ఊరికి దగ్గర్లోని Sigmaringen Castle కి కూడా వెళ్ళినందువల్లో ఏమో, నాకు ఈ భవంతులంటే విరక్తి పుట్టింది. అన్నింటిలోనూ అవే అంశాలు, అవే ప్రదర్శనలూ..అనిపించింది. పైపెచ్చు ఈ Schönbrunn లో ఒక ఆడియో గైడ్ ఇచ్చారు టికెట్ తో పాటు. వాళ్ళు పూర్తిగా గాసిప్ తరహా పర్యటన తయారు చేసినట్లు అనిపించింది. ఎక్కడికక్కడ ఫలానా రాణి కి ఫలానా రాజుతో వివాహం ఇష్టం లేదు. ఫలానా ఆమెకి ఫలానా అతనంటే వల్లమాలిన ప్రేమ….ఈ తరహాలోనే సాగిందంతా. దీనితో ఇకపై కొన్నాళ్ళైనా ఈ భవంతులు చూద్దామని ఎవరన్నా పిలిస్తే రానని చెబుదాం అనుకుంటూన్నాను.
ఈ భవంతి లో నాకు రెండు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి. నా సంచీని క్లోక్ రూం లో పెడుతూండగా, అక్కడి మనిషి ఎక్కడినుండి వచ్చారన్నాడు. నేను ఇండియా అన్నాను. ఇండియాలో ఎక్కడన్నాడు. నేను దక్షిణం నుండి వస్తున్నాను అన్నాను. “నేను నమ్మను. You don’t look like someone from South” అన్నాడు!! కెవ్వ్! అనుకున్నా మనసులో. నన్ను సౌత్ కాదు అన్న మొదటి మనిషి ఇతనే! సరే, పర్యటన పూర్తయ్యాక ఈ ప్రాంగణంలోనే ఒక కాఫీ షాపుకి వెళ్ళాము – షాపు యజమాని చూడబోతే భారతీయుడిలానే ఉన్నాడు – పలకరిద్దామనుకుని ఊరుకున్నాము. అతనూ ఊరుకున్నాడు. కాసేపటికి మేము మాట్లాడుకోవడం విని, “మీరు ఇండియా నుండి వచ్చారా?” అన్నాడు. అవునన్నాము. ఆయన బంగ్లాదేశ్ నుండి వచ్చాడట. “మీరు సౌత్ అమెరికా వాళ్ళేమో అనుకున్నా. అందుకనే మొదట పలకరించలేదు” అన్నాడు. ఇదింకో కెవ్వు! రెండేళ్ళ క్రితం ప్రాగ్ వెళ్ళినపుడు కూడా ఒకతను వచ్చి -“are you from Latin America?” అని ఎంక్వైరీ చేశాడు! (ఏమాటకామాటే, నేను ఒక కొలంబియన్ ని ఒకసారీ, ఒక బొలివియా దేశస్థురాలిని ఒకసారీ – భారతీయులు కాబోలు అనుకున్నాను).
ప్యాలస్ పర్యటన అయ్యాక, ఇక్కడి ప్రముఖ చర్చి అయిన St. Stephan’s Cathedral కు వెళ్ళాము. మెట్రో స్టేషంలో దిగి పైకి ఎక్కగానే, ఒక పేద్ద చర్చి సాక్షాత్కరించింది. బయటంతా కోలాహలం. చర్చి ఫాదర్ల తరహా వస్త్రధారణలో ఉన్న వాళ్ళు కొందరు – “సాయంత్రం ఒక కచేరీ ఉంది తప్పకుండా రండి” అంటూ కాగితాలు పంచుతున్న వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టేశారు! ఒక పక్కన రెండు కళ్ళనీ నింపేసేంత పెద్దగా ఎదుట ఆ చర్చి, ఒక పక్క ఎటు చూసినా ఈ ఎర్ర బట్టల్లో కచేరీ నిర్వాహకులు! ఒక క్షణం పాటు ఆశ్చర్యంలో నోటమాట రాలేదు. వీళ్ళని వదిలించుకుని చర్చిని తనివితీరా చూసి లోపలికి వెళ్ళాము.
నాకేమిటో, ఈ చర్చి భవనాలు మాత్రం ఇంకా బోరు కొట్టడం లేదు. ఆ బ్రహ్మాండమైన చర్చి భవనాలు ఎక్కడ చూసినా మూడు పనులు తప్పనిసరిగా చేయాలనిపిస్తాయి – వాటి ఎదురుగ్గా కాసేపు కూర్చుని నోరెళ్ళబెట్టుకుని చూడాలనిపిస్తుంది; లోపలికెళ్ళి అక్కడెంత బ్రహ్మాండంగా ఉందో చూడాలనిపిస్తుంది. పైకి ఎక్కనిచ్చే చోట్ల (నాకు కళ్ళు తిరిగినా) ఆ మెలికల మెట్లెక్కి పైకెక్కి నగరం చూడాలనిపిస్తుంది. ఈ చర్చిలో కూడా ఇవన్నీ చేశాము 🙂 ఇది నేను జర్మనీలో ఎక్కిన కొన్ని చర్చిలతో పోలిస్తే ఎత్తు తక్కువే (అంటే జనాన్ని పోనిచ్చే ఎత్తు). కానీ, పైన్నుంచి గొప్ప వ్యూ ఉంది. ఏమైనా ఇప్పటిదాకా అయితే Ulm చర్చి ని మించి నన్నేదీ ఆకట్టుకోలేదు ఈ వ్యూ విషయంలో మాత్రం.
చర్చి చాలా పెద్దది. కనుక ఒకసారి బయట కూడా ఒక రౌండు వేశాము దాని చుట్టూ – బయట కనబడుతున్న బొమ్మల్ని చూస్తూ. కాసేపు ఆ చుట్టుపక్కలే నడిచి (అది వియన్నా నగరం నడిబొడ్డులో ఉంది) ఇంతలో దగ్గర్లో ఉన్న పలు ఇండియన్ రెస్టారెంట్ లలో ఒక దాన్ని ఎంపిక చేసుకున్నాము మధ్యాహ్న భోజన పథకంలో. ఇక తప్పదు, వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఆ దోవలో పోతూండగా, ఒక విచిత్రమైన గడియారం కనబడ్డది (ఏమిటీ ప్రత్యేకత? అంటే ఈ విడియో చూడండి). చూడగానే ఆకట్టుకుంది – ఆ బొమ్మలేమిటి? ఎందుకలా ఉన్నాయి? అనుకుంటూ ఇండియన్ రెస్టారెంటుకు వెళ్ళి కాసేపు చుట్టుపక్కల తిరిగాక మళ్ళీ ఈ గడియారం వద్దకు వచ్చాము. నేనైతే ఓ పదినిముషాలు ఫుట్పాత్ మీద కూర్చుండిపోయా, ఆ గడియారంలో ఏమవుతోందో? అని (అప్పుడు నావయసు ఐదేళ్ళు అని అనుకున్నాను లెండి!). నిజానికి ఈ గడియారం గురించి మాకెవరూ చెప్పలేదు. ఏదో రోడ్లో వెళ్తూంటే కనబడ్డది అంతే. ఈ పైన ఇచ్చిన విడియో లంకె అవన్నీ తరువాత ఇంటికొచ్చి చూసుకున్నవి 🙂
అటూ ఇటూ వాకింగ్ చేస్తున్నప్పుడు అనుకున్నాము – బహుశా మెట్రో బదులు వాకింగ్ అనుకుని ఉంటే బాగా తిరిగేవాళ్ళమేమో అని. కానీ, మాకక్కడ ఉన్న సమయం కొంచెమే కనుక, మెట్రో ఒక విధంగా మంచిదేనేమో. ఇలాగే నడుస్తూంటే ఒక వీథిలో మరొక చర్చి కనబడ్డది. St Peters Church అంటారు దీన్ని. ఇది బయటనుంచి చుడ్డానికి నాకు సోఫియా నగరంలో చూసిన Alexander Nevsky Cathedral ను గుర్తు తెచ్చింది (సైజులో కాదు. రంగులో, బాహ్యరూపంలో!). లోపలికెళ్తే, బయటకెంత మామూలుగా ఉందో, లోపలంత ఆడంబరంగా ఉంది. అయితే, అందంగా ఉంది లోపల చర్చిని రూపొందించిన విధానం. ఈ చర్చి Opus Dei నిర్వహణలో ఉందన్న మాట వినగానే నాకు Dan Brown, అతని నవలా గుర్తువచ్చాయి.
సరే, ఇలా కొన్ని ప్రాంతాలు సందర్శించాక, వియన్నాలో బాగా ఖరీదైన వీథులుగా పేరుపడ్డ (ఏది ఖరీదు కాదు కనుక? అనిపించింది నాకైతే) కొన్ని వీథుల్లో విండో షాపింగ్ చేసి, టైం ఔతూండగా వియన్నా వెస్ట్ స్టేషన్ కి వెళ్ళడానికి మెట్రో ఎక్కాము. వియన్నా వెళ్ళే వాళ్ళకి తప్పక సూచించే వాటిలో – ఈ కాఫీ షాపుల్లో తీరిగ్గా కాలక్షేపం చేయడం ఒకటి- మాకు అంత వ్యవధి లేదు కనుక అది చేయలేకపోయాము. కానీ, దీర్ఘకాలం ఐరోపా దేశాల్లో నివసించాల్సి వస్తే తప్పక సందర్శించవలసిన ప్రదేశం వియన్నా అనిపించింది. మరొకసారెప్పుడన్నా విధివశాత్తూ ఇటు రాగలనేమో చూడాలి.
**
అదీ మా రెండు రాజధానుల సుడిగాలి పర్యటన కథ!
బాగుందండీ మీ వియన్నా యాత్ర. అయితే మీరు కొన్నిఅనుభవాలు మిస్ అయ్యారని నాకు అనిపిస్తుంది.
1. మ్యూనిక్ నుండి సాల్జుబర్గ్ ద్వారా వియన్నాకి రైలులో వెళితే ఆల్ప్ మంచుకొండలు దారంతా కనిపిస్తాయి (scenic rail route). మీరు ప్రాగ్ నుండి వెళ్ళడం & అందునా రాత్రి ప్రయాణం చేయడం వల్ల ఇది సాధ్యపడలేదు.
2. ఇతర ఐరోపా దేశాలకు భిన్నంగా వియన్నా కాఫీ షాపులు ప్రసిద్ది. పారిస్ కఫెలలో ఎక్కువమంది మద్యం సేవిస్తారు కానీ వియన్నా కాఫీ హౌసులలో అందరూ కాఫీయే తాగుతారు. ఇలాంటి వాటిలలో కాఫీ తాగుతూ 19వ శతాబ్దపు రచయితలు & మేధావులు తమ పని కానిచ్చారంటారు. It is believed that composers, writers & scientists often worked in coffee houses because of the peaceful environment & the fact these provided warmth that they could not afford at home.
3. Sacher torte
Jai gariki
Don’t you think its too much for one day trips? 🙂
మొదటి భాగంలో రాసినట్లు ఉన్న పదిరోజుల్లో నా స్నేహితురాలు ఇవి చూడ్డానికి ఆరాటపడింది. ఆ ౩) ఎలాగో ఇద్దరం చేసేవాళ్ళం కాదు – మాకిద్దరికీ అంత ఇష్టం లేదు స్వీట్ పదార్థాలు 🙂 ఖాళీ సమయం ఉంటే 2) చేయవచ్చు కానీ, కొద్ది గంటలే ఉన్నప్పుడు దానిలో ఒక రెండు గంటలు కాఫీ సేవిస్తూ కూర్చోలేము అనుకున్నాము మేము. మీరు చెప్పినవన్నీ నేను కూడా విని ఉన్నాను కానీ – మా ప్రయాణంలో మాకంత వ్యవధి లేదు. ఎక్కువ రోజులుంటే చేయాల్సినవి ఇవన్నీ. ఒక్కరోజు ఉండి పోయే టూరిస్టులకి కాదు – అని నా అభిప్రాయం. మ్యూనిక్ నుండి సాల్స్బర్గ్ కి ఇదివరలో వెళ్ళాను – రెండున్నరేళ్ళ క్రితం.
Yes, it was a good day trip. Vienna is a great city: please try to go back for a longer trip if possible.
నేను ఉద్యోగరీత్యా ఒక్కడినే ఎన్నో దేశాలు తిరిగాను. ఫ్యామిలీతో vacation వెళ్ళినప్పుడు మాత్రమె sight seeing చేస్తాను. ఒక్కడినే ఉన్నప్పుడు people watching లాంటి ఊసుబోకు (మరియు ఉచిత/తక్కువ ఖర్చు) వినోదాలలో సమయం గడుపుతాను. This is why I mentioned coffee haus etc.
మీరు మీ ప్రయాణ/పర్యాటక అనుభవాలు బాగా రాస్తారు. నాకు అంత ఓపిక లేకపోయింది. మీ టూరిజం తాలూకా టపాలన్నీ కొంత ఎడిట్ చేస్తే దాంతో ఒక మంచి పుస్తకం (e.g. A professional’s guide to great European cities) వస్తుందేమో ప్రయత్నించండి.
>>ఒక్కడినే ఉన్నప్పుడు people watching లాంటి ఊసుబోకు
-అవును, నేను కూడా అలాంటివే చేస్తూంటా… కానీ, పక్కనింకో మనిషి ఉంటే మట్టుకు అవతలి మనిషి తత్వాన్ని బట్టి అనమాట 🙂
>>మీరు మీ ప్రయాణ/పర్యాటక అనుభవాలు బాగా రాస్తారు.
-Thanks. ఈమధ్యన రాయడం మానేశాను కానీ, మొన్నటి సుడిగాలి పర్యటన మాత్రంమళ్ళీ రాసేందుకు పురికొల్పింది.
ఈమధ్యన రాయడం మానేశాను కానీ, —-?
I don’t know what you want to ask, Murali garu. What I meant was that I haven’t been writing about my travels on my blog much in the past year or so.