నాకు తెలిసిన ఒకమ్మాయి ఆన్సైట్ పనిమీద జర్మనీ వచ్చింది. ఉన్న పదిహేనూ ఇరవైరోజుల్లో ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనుకుంటూంటే, ప్రాగ్-వియన్నా రెండు నగరాలు వాళ్ళూరికి దగ్గరని అలా వెళ్ళాలనుకున్నాం. “ఒక వారాంతంలో రెండు మహానగరాలు చూస్తారా?” అని రకరకాల స్థాయుల్లో కోప్పడి హితవు చెప్పారు నా ఇతర స్నేహితులు/రాళ్ళు. ఎవరేమన్నా సరే, ఉన్నది ఒక వారాంతమే నా ఫ్రెండుకి. అందువల్ల, మరీ అంతా చూసేయకపోయినా చెరో రోజు గడిపి ఏది వీలైతే అది చేద్దాం అనడంతో, అర్జెంటుగా టిక్కెట్లు బుక్ చేసేస్కుని బయలుదేరాము.
శనివారం ఉదయాన్నే బయలుదేరి ప్రాగ్ చేరుకున్నాము. ఇదివరలో నేను రెండేళ్ళ క్రితం వెళ్ళి ఉన్నాను కానీ, అప్పుడు విమాన ప్రయాణం. ఈసారి ట్రెయిన్ ప్రయాణం. జర్మనీ సరిహద్దు దాటి చెక్ రిపబ్లిక్ మొదలైనాక కిటికీ ఆవలి ప్రపంచంలో లిపి మాత్రమే కాక ఇతర తేడాలు కూడా కనబడ్డాయి. మాకు చెక్ లో ఆల్రెడీ చెట్టూ చేమా మంచి dark green లోకి మారిపోయినట్లు అనిపించాయి. ఇంకా జర్మనీలో ఉన్నంతసేపు అంత దట్టంగా అనిపించలేదు. పైగా, చెక్ లో కనబడ్డ ఇళ్ళు, బిల్డింగులూ జర్మనీలోలా మరీ యూనిఫారం వేసుకున్నట్లు కాక, కొత్తా, పాతా, రంగులున్నవీ, వెలిసిపోయినవీ, ఇలా రకరకాలుగా కనబడ్డాయి 🙂
ప్రాగ్ స్టేషనులో ట్రైన్ దిగాక, ఈ ఊళ్ళో నడుద్దాం, పబ్లిక్ ట్రాంస్పోర్ట్ కూడా వద్దు అని తీర్మానించుకున్నాము. ఒక్క ఐదు నిముషాలు నడిచి, synagogue ఉన్న వీథిలోకి వచ్చాము. చూద్దాం కదా అనుకుంటే, ఏప్రిల్ దాకా మూసేస్తారట వాళ్ళు! ఇవి కూడా మూసేస్తారా? అనుకున్నాము. ఇదివరలో నేను ఫిబ్రవరిలో ఎముకలు కొరికే చలిలో వచ్చినా, అప్పట్లో చాలా చోట్ల తీసే ఉన్నారు (అప్పుడు దీన్ని చూడలేదు). సరేలే, ఇది కాకపోతే ఇంకోటి, అని ముందుకు సాగాము. రోడ్డుమీద నడుస్తూంటే, విచ్చలవిడిగా స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్ కొట్లు కనిపిస్తూ ఉండగా మధ్యలో ఒక కెఫే కాఫీడే కనబడ్డది! సీసీడీ వాళ్ళు ఇంత వ్యాపిస్తున్నారని ఊహించలా!
సరే, మేము అలా నడుచుకుంటూ మధ్యలో చెక్ పోస్టు వారి వద్దకెళ్ళి ఇండియాకి పోస్టు కార్డులు పంపి వచ్చాక, కాసేపు రోడ్లు సర్వే చేశాము. Národní ప్రాంతానికి వచ్చాక, ఆ గుంపులు గుంపుల జనాలను చూసి నేను కాస్త అవాక్కయ్యాను. ఇదివరలో నేనొచ్చింది మంచి చలికాలంలో కనుక ఆట్టే టూరిస్టులు లేరు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ..రెస్టారెంట్లు, షాపులు అన్నీ కిటకిటలాడుతున్నాయి 🙂
దేశ రాజధాని, అంతమంది టూరిస్టులున్న ప్రాగ్ లో ఎక్కడ చూసినా డైరెక్షన్స్ చెక్ భాషలోనే ఉండడం కొంచెం ఆశ్చర్యమే నాకు – మొదటిసారి వచ్చినపుడు కూడా ఇదే అనుకున్నాను. Astronomical clock వద్దకు వెళ్ళాలని మాప్లాను. కానీ, నాకెంతకీ ఎట్నుండి వెళ్ళాలో అర్థం కాలేదు. మ్యాప్ చూసి వెళ్తూంటే ఎక్కడా క్లాక్ గుర్తు లేదు రోడ్డుమీద చూపే బోర్డుల్లో. చాలాసేపటికి కాని నాకు తట్టలేదు – ఒక ప్రదేశానికి వాళ్ళు చూపిస్తున్న బొమ్మ – ఆ క్లాక్ దే అని. 🙂 మొత్తానికి అక్కడికి వెళ్ళి, కాసేపు సిటీ సెంటర్ లో ప్రదేశాలు చూసుకుని, చార్లెస్ బ్రిడ్జ్ మీదుగా ప్రాగ్ రాచరికానికి గుర్తు, ప్రస్తుతం రాష్ట్రపతి అధికారిక నివాసం అయిన Prague Castle దగ్గరకు వెళ్ళి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాసేపు చుట్టి, సాయంత్రం చీకటి పడుతూండగా మళ్ళీ కిందకి నడుచుకుంటూ సిటీ సెంటర్లోకి వచ్చేశాము.
ఏమాటకామాటే – నాకు ఈ castle బయట ఉన్న విగ్రహాలను చూస్తే ఈసారి కూడా టిన్టిన్ అడ్వెంచర్ కథ ఒకటి గుర్తొచ్చింది. మొదటిసారి ఈ ముఖద్వారం చూసినప్పుడు ఆ హింసాత్మక దృశ్యం ఎక్కడో చూశాననుకున్నా. తర్వాత తట్టింది అది ఒక టిన్టిన్ కథలో కూడా కనబడే బొమ్మ అని (పేరు గుర్తురావడంలేదు. King Ottokar’s Sceptre అయుండొచ్చు). మొదటిసారికి ఇంకా చూడలేదు కానీ, ఇప్పుడు మాత్రం ప్రాగ్ ని తల్చుకుంటే మా హీరో, ఒక కొయ్య హీరోయిన్ కలిసి నటించిన సినిమా Rockstar కూడా గుర్తొస్తుంది 🙂
మధ్యలో, మధ్యాహ్నం నా ఫ్రెండుకి ఇండియన్ రెస్టారెంటుకి వెళ్ళాలి అనిపించింది. సరే, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కొన్ని చూశా కనుక, నేను తీసుకెళ్తా అని చెప్పి ఒక వీథిలోకి తీసుకెళ్ళా. వీథంతా వెదికినా నాకు తెలిసిన రెస్టారెంటు కనబడలేదు. నేను అవాక్కయ్యా…అలా ఎలా మర్చిపోయా? రెండేళ్ళే కదా అయింది? అని. ఒకాయన్ని అడిగితే, ఇంకెకడో ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఉందని గుర్తులు చెప్పాడు కానీ, ఆ వీథిలో ఏదీ లేదన్నాడు. సాయంత్రం అక్కడి యూనివర్సిటీలో నాకు తెలిసిన ఫ్రెండుని కలిసినప్పుడు కానీ అర్థం కాలేదు నాకు – నాకు తెలిసిన రెస్టారెంటును మూసేసారని! మొత్తానికి ఈ ఫ్రెండు పుణ్యమా అని మొత్తానికి ఒక మంచి ఇండియన్ రెస్టారెంటుకి రాత్రి వెళ్ళాము. మా ఊళ్ళో లాగ “జై జగదీశ హరే” పాట రకరకాల దేవుళ్ళ పేర్లు మార్చి వేసి వేసి చంపక, పాత హిందీ సినిమా పాటలేసేసరికి హాయిగా అనిపించింది. ఆ తరువాత, దాన్ని తల్చుకుంటూ మళ్ళీ కాసేపు నడిచి, స్టేషన్ కి చేరుకున్నాము. మా ట్రెయిను అర్థరాత్రి పన్నెండింటికి. అప్పటిదాకా ఆ స్టేషన్ లో తిరుగుతూ కాలక్షేపం చేసాము. మాలాగే చాలామంది ఇలాగే ఫ్రెండ్సు కలిసి వచ్చిన వాళ్ళూ అలా కనబడ్డారు ఇలా స్టేషన్ పర్యటన చేసుకుంటూ 🙂 స్టేషంలో రష్యన్ రైల్వేస్ వారి ప్రకటన ఒకటి నన్ను చాలా ఆకర్షించింది.
వాళ్ళు ప్రాగ్ నుండి మాస్కో నగరానికి ఒక ట్రెయిన్ వేశారంట! దానిలో మళ్ళీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకీ, పుట్టినరోజు జరుపుకుంటున్నవాళ్ళకీ అంటూ రకరకాల కేటగిరీల్లో డిస్కౌంటు! భలే ఉండింది ప్రకటన. నాకు చిన్నప్పట్నుంచీ మాస్కో చూడాలని కోరిక. ఆ దేశం కూడా ఈ దేశాల్లా చిన్న చిన్న గుంపుల్లో వెళ్ళే కొత్తవాళ్ళకి సేఫ్,ఫ్రెండ్లీ అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి ట్రై చేసి ఉందును. కానీ నాకు ఆ విషయంలో అనుమానమే. నా రష్యన్ స్నేహితురాలిని అడగాలి. సరే, మొత్తానికైతే, ఈ చాంద్రాయణం అంతా అయ్యాక వియన్నా వెళ్ళే ట్రెయిన్ ఎక్కాము.
రెండేళ్ళ క్రితం ఇక్కడ దాదాపు పది రోజులు ఉన్నప్పుడు ఆ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతకు వణికినా, నాకు ప్రాగ్ చాలా నచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా రాగలిగితే బాగుండు అనుకున్నాను. అనుకోకుండా మళ్ళీ వచ్చాను – నాకీసారి కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో? అనే ఉంది కానీ, ఈ పీక్ సీజన్ టూరిస్టు రద్దీ తట్టుకోడం మట్టుకు కష్టమే! కానీ, ఎప్పుడెళ్ళినా, నడకని మించిన ఉత్తమమైన మార్గంలేదు సెంటర్లోని ముఖ్య ప్రదేశాలు చూడ్డానికి. చాలా సేపు నడవాల్సి వస్తుంది. అలసట తప్పదు కానీ, మెట్రోలు అవీ ఎక్కితే దోవలో కనబడే ఆసక్తికరమైన అప్డేట్స్ (అంటే, సీసీడీ ప్రాగ్ లో పెట్టారు, వంటి అమూల్యమైన విషయాలు అనమాట!) మిస్ అవుతాం అని నా అభిప్రాయం.
(సశేషం)
[…] భాగం – ఇక్కడ) ****** ఆ విధంగా ఒకరోజు ప్రాగ్ సందర్శన […]