ఈ వారాంతం Dreyer సొంతం ..

ఇటీవలి రెండు మూడేళ్ళలో – నేను ఓపిగ్గా, ఆసక్తిగా పుస్తకాలు చదవడం తగ్గిపోయింది, బహుశా పీ.హెచ్.డీ. ఒత్తిడివల్లననుకుంటాను. ఉన్న కాస్త చదువులో నన్ను కట్టిపడేసి చదివించిన రచయితలు ముగ్గురు (Bergman, Strindberg, Ibsen); ఎంతో కొంత తన సినిమాల ద్వారా నన్ను ప్రభావితం చేసిన ఒక దర్శకుడు (Bergman) – అంతా స్కాండినేవియన్ సంతతే కనుక, నాకు ఆ దేశాల సాహిత్యం, సినిమా ప్రపంచాల మీద కుతూహలం పెరిగింది. ఈ నేపథ్యంలో కోర్స్ ఎరా వెబ్సైటులో Scandinavian Film and Television అన్న కోర్సు గురించి చూసి, అందులో ఒక వారం మొత్తం Bergman గురించే ఉంటుందని గమనించేసరికి – ప్రస్తుత పని వొత్తిడిలో కొనసాగడం కష్టమని తెలిసీ పుటుక్కుమని చేరిపోయాను.

రెండువారాలైనాయి, చక్కటి కోర్సు. రెండో‌ వారం లో తొలినాటి స్కాండినేవియన్ చిత్రపరిశ్రమ గురించి పరిచయం చేస్తూ, డేనిష్ దర్శకుడు Carl Theodor Dreyer గురించి, అతని సినిమాల గురించీ చాలా ప్రస్తావించారు. ఆ లెకర్ల నోట్సు లో భాగంగానే ఆయన తీసిన కొన్ని సినిమాల వికీ లంకెలు కూడా ఇచ్చారు. శుక్రవారం రాత్రి దాకా ఒక పేపర్ సబ్మిషన్ తాలూకా శ్రమదానం చేశాక, వారాంతం ఇంక తాపీగా‌ కాలక్షేపం చేద్దాం అనుకుంటూ – ఒక సినిమా మొదలుపెట్టాను. ఆ తరువాత మరొకటి – చివర్న మరొకటి – అలా సాగింది నా వారాంతం. అలా, డ్రెయర్ నా వారాంతాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూడు సినిమాల గురించి సంక్షిప్తంగా పరిచయం చేయాలనుకుని రాస్తున్న టపా ఇది – మొదటిది, చివరిది మూకీ చిత్రాలు. మధ్యలోది టాకీ.

The President (1919):
ఈ సినిమా కథ 19వ శతాబ్దంలో నడుస్తుంది. ఆస్ట్రియన్ రచయిత Karl Emil Franzos రాసిన Der President అన్న నవల ఆధారంగా తీశారు. ఈ సినిమా కథ గురించి, నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, Carl Th.Dreyer వెబ్సైటులోని పేజీ చూడండి.

సినిమా పేరుకి మూకీ కానీ, inter-titles మరీ ఎక్కువగా ఉన్నట్లు తోచి – దాదాపు టాకీలాగనే అనిపించింది నాకైతే. అందునా విడియో నాణ్యత అంత గొప్పగా లేనందువల్ల కొన్ని చోట్ల వాటిలో ఏం రాయబడ్డాయో సరిగా కనబడలేదు కూడానూ. అయితే, ఈ విషయాలు పక్కన పెడితే సినిమా బోరు కొట్టించకుండా సాగింది. అలాగే, ఇదివరలో సత్యజిత్ రాయ్ వ్యాసాల్లో అనుకుంటాను, చదివాను-సినిమాల్లోకి శబ్దం వచ్చాక జాతీయముద్ర అంటూ ఒకటి ఏర్పడ్డం మొదలైందని. నిశబ్ద చిత్రాల జాతీయముద్రని ఈ చిత్రంలో చూసి తెలుసుకున్నాను :-). ముఖ్యంగా ఒక పెళ్ళి దృశ్యం – మామూలుగా సినిమాల్లో చూసే చర్చి పెళ్ళిళ్ళకంటే‌ భిన్నంగా అనిపించింది. బహుశా డెన్మార్కులో ఇలా జరిగేవేమో అనుకున్నాను. ఇప్పటి పద్ధతులకి సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్లే లెక్క. అలాగే, నాకైతే కథ కొంచెం సాధారణంగా అనిపించింది కానీ – ఆ‌కాలానికి అలా ఫ్లాష్ బ్యాకులు వాడ్డం, మానసిక సంఘర్షణలను చూపడం ఇవన్నీ Dreyer కి ముందు పెద్దగా‌ లేవట. పైగా ఇది అతని తొలి చిత్రం!

ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ మాతృక (డేనిష్ భాషలో), ఇతరత్రా ఆసక్తికరమైన వివరాలు – అన్నీ డేనిష్ ఫిల్మ్ ఇంస్టిట్యూట్ వారు డ్రెయర్ పేరిట నెలకొల్పిన వెబ్సైటులో ఈ సినిమాకి సంబంధించిన పేజీలో చూడవచ్చు. (అన్నట్లీ విధమైన comprehensive webpages మన సినిమాలకి ఏ‌ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా నిర్వహిస్తోందా?)

Ordet (The Word) – 1955
ఈ మూడు చిత్రాల్లో నన్ను అమితంగా ఆకట్టుకున్న చిత్రం ఇది. క్రైస్తవ మతం, విశ్వాసాల నేపథ్యంలో సాగుతుంది కథ. మొదటి దృశ్యం నుండే కట్టిపడేసింది నన్ను. కథ, కథనం, నటీనటులు, వాతావరణం – అన్నీ సహజంగా అనిపించడం ఒక కారణమైతే, బాగా ప్రభావవంతమైన సంభాషణలు ఉండడం మరొక కారణం. ఈ సినిమాని Dreyer తీసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ సినిమాని గురించి, ఇది నాపైన చూపిన ప్రభావం గురించి, విడిగా రాద్దాం‌ అనుకుంటున్నాను. కనుక, ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాను. రెండు గంటల సినిమా – యూట్యూబులో ఆంగ్ల ఉపశీర్షికలతో లభ్యమవుతోంది. మంచి సినిమా మీద ఆసక్తిగలవారు తప్పకుండా చూడాల్సిన చిత్రం. నేను ఇప్పటివరకూ చూసిన “గొప్ప” సినిమాల జాబితాలో దీన్నీ చేర్చుకున్నాను (గొప్పంటే నాకు గొప్ప అనిపించినవి మాత్రమే సుమా!). ఈసినిమా గురించిన వివరాలు, సంబంధిత విమర్శక వ్యాసాలు ఇలాంటివన్నీ డ్రెయర్ జాలగూటిలో చూడవచ్చు.

The Passion of Joan of Arc (1928):
ఈ సినిమా ఫ్రెంచి దేశపు వీరనారి Joan of Arc గురించి. మొత్తం జీవితం గురించి కాదు కానీ, The Trial of Joan of Arc అని పేరు పొందిన సంఘటన గురించి. ఈ సినిమా చూసే ముందు నన్ను అమితంగా ఆకట్టుకున్నది ప్రస్తుతం మనం చూడగలుగుతున్న వర్షన్ సినిమా తీసిన ఎన్నో ఏళ్ళ తరువాత అనుకోకుండా ఒక mental asylum లో కనుగొనబడిన వైనం. సినిమా చూట్టం మొదలుపెట్టాక ఆశ్చర్యపరచిన ఒక అంశం – ఇది నిఖార్సైన నిశబ్ద చిత్రం (అంటే‌ నేపథ్య సంగీతం కూడా లేదు!!). 1928లో రిలీజైన చిత్రంలో నేపథ్య‌ సంగీతం ఉంది కానీ, ఇప్పుడెందుకు లేదు?అంటే- అసలు ఆ‌సినిమా వెనుక, తరువాతి కథే ఓ పెద్ద సినిమా కథలా ఉంది!! వివరాలకి సినిమా గురించిన వికీపేజీ చూడండి.

సరే, నేపథ్య సంగీతం కూడా లేకుండా, pindrop silence లో ఈ సినిమాని గంటన్నరపాటు చూడగలనా? అనిపించినా – ఏకధాటిగా కాకపోయినా విరామాల మధ్య చూడగలిగాను- సౌండు లేకుండానే ఈ సినిమా అంత strong గా ఉందంటే … ఇంక డైలాగులు, సంగీతం అవీ కూడా జతచేస్తే ఎంత గొప్పగా ఉండేదో అనిపించింది. Intertitles లేకపోతే ఏం‌జరుగుతోందో తెలిసేది కాదన్నమాట పక్కన పెడితే, నటీనటులని మరీ క్లోజప్స్ లో చూపినందువల్లో ఏమో కానీ – విలనుల మీద అసహ్యంతో కూడిన భయమూ, Joan of Arc మీద ఒక పక్క జాలీ, మరో పక్క హీరోయిన్ వర్షిప్ భావనా కలిగాయి. ఆ నటి Renée Jeanne Falconetti సినిమా మొత్తం ఏడుస్తూనే ఉంటుంది కానీ, కొన్ని దృశ్యాల్లో ఆమె నటన చూస్తే నోటమాట రాలేదు. కొంచెం ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా. నేను కొన్ని గంటల సమయం తీసుకుని బ్రేకులు తీసుకుంటూ చూశాను – అంత క్లోజప్లో ఆ భయంకర నిశబ్దాన్ని అంగీకరించలేక!). కానీ, ఆ‌ ఓపిక్కి తగ్గ reward ఉంటుంది సినిమా చూసే అనుభవంలో!‌ 🙂 ఈసినిమా గురించి డ్రెయర్ వెబ్సైటు పేజీ ఇక్కడ. అన్నట్లు చెప్పడం మరిచా – హీరోయిన్ ని చూస్తే కాజోల్ గుర్తువచ్చింది నాకు 😉 ఎందుకనడక్కూడదు.

మొత్తానికి ఒక్కటి మాత్రం అనిపించింది – చెప్పడమేమో శబ్ద చిత్రాలొచ్చాక డ్రెయర్ ఎక్కువ సినిమాలు తీయలేదు అన్నారు కానీ, అసలుకీయన చిత్రాలన్నీ శబ్దంతోనే బాగుంటాయేమో అని. నాకు అర్థమైనంతలో ఆర్థిక కారణాల వల్ల ఈయన దాదాపు దశాబ్దం పాటు సినిమాలేవీ తీయలేదు. శబ్దం వచ్చాక ఎక్కువ సినిమాలు తీసుంటే ఇంకొన్ని గొప్పసినిమాలు వచ్చేవేమో అనిపించింది.

The President ని వదిలేస్తే, ఈ‌తక్కిన రెండు సినిమాలను మళ్ళీ చూడాలనుంది. Ordet తప్పకుండా చూస్తాను కానీ, ఓపిగ్గా ఈ Passion of Joan of Arc మళ్ళీ ఎపుడైనా చూడగలనా? అన్నది మాత్రం అనుమానమే!! 🙂

ఈ సినిమాలు వెదుకుతున్న క్రమంలో The parson’s widow, Vampyr, Day of wrath – వంటి ఆసక్తికరమైన సినిమాల గురించి తెలిసింది. ఎప్పుడో‌ ఇవీ చూడాలి, Dreyer అంతగా కుతూహలం కలిగించాడు మరి నాకు అతని సినిమాలపై!

Advertisements
Published in: on February 18, 2014 at 9:14 am  Leave a Comment  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/02/18/dreyer-weekend/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: