ఒక డాక్టర్ గారి మరణం

(ఇది ఎప్పుడో‌ రెండు రెండున్నర నెలల క్రితం రాసి పోస్టు చేయని టపా. ఇపుడు పోస్టు చేయాలనిపించిందన్నమాట.)

********
Cinemas of India వెబ్సైటు గురించి తెలిశాక, గత నెలా-రెణ్ణెళ్ళ కాలంలో ఒక నాలుగైదు సినిమాలు చూసి ఉంటాను అందులో. దాదాపుగా చూసినవన్నీ నచ్చాయి. ఆట్టే నచ్చనివి కూడా రొట్ట కొట్టుడు సినిమాల మీద కొన్ని రెట్లు నయంగా తోచాయి. ఈమధ్య మళ్ళీ తొంగి చూసి, యధాలాపంగా “Ek Doctor ki Maut” అన్న చిత్రం చూడ్డం మొదలుపెట్టాను. అంతే – ఆ సినిమా గురించి ఆ తరువాత రాత్రై పడుకునేదాక – ఎవళ్ళు ఆంలైన్ కనిపిస్తే వాళ్ళకి, ఎవళ్ళతో ఫోన్ లో మాట్లాడితే వాళ్ళకి చెప్పాను 🙂 ఏ కాస్తైనా సినిమా పైన ఆసక్తి ఉన్న వారు, సైన్సు విద్యార్థులైతే మరీ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఇంతలా ఫీలైపోతున్నా కనుకే, ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ‌ బ్లాగు టపా రాస్తున్నా.

కథను వివరించే ముందు ఒక నేపథ్యం చెప్పాలి. Subhash Mukhopadhyay అని ఒక డాక్టర్ గారు ఉండేవారు ఒకప్పుడు. భారతదేశంలో In-vitro fertilization (IVF) పద్ధతి ద్వారా పుట్టిన మొదటి బిడ్డ ఈయన చలవే. ప్రపంచంలో మొదటి IVF-baby కి, ఈ పాపకి రెండు నెలలే తేడా వయసులో. అంటే, దాదాపుగా, IVF-పితామహుడు అనదగ్గ వ్యక్తి. మరి ఇంతకీ, ఆయనకి దాని వల్ల ఒరిగినది ఏమిటి? ప్రభుత్వం నుండి harassment, తోటి పరిశోధకుల నుండి అనుమానాలు, అవమానాలు. ఈయన ఒకపక్క ఇక్కడ జనాలని కన్విన్స్ చేసేలోపు అక్కడ బయట దేశంలో ఇదే పరిశోధన చేసిన ఇంకోళ్ళకి పేరు వచ్చింది. తర్వాత చాలా కాలానికి 2010లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది (అప్పుడే ఈయన గురించి మొదటిసారి విన్నాను నేను). మరి సుభాష్ గారో? – ఈ వేధింపులు అవీ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు 1981లో!

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే – ఈ సినిమా ఆయన జీవితం ఆధారంగా తీశారు. ఆయన జీవిత కథ కాదు. ఆయన జీవితం ఆధారంగా రాసిన కథని సినిమాగా తీశారు. ఎవరు? తపన్ సిన్హా.

కథ: డాక్టర్ దీపాంకర్ రాయ్ (పంకజ్ కపూర్) ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూనే, ఇంట్లో సొంత పరిశోధనాశాల పెట్టుకుని కుష్టురోగం గురించి పరిశోధనలు చేస్తూ ఉంటాడు. పదేళ్ళు అలా చేశాక, మొత్తానికి కుష్టురోగానికి vaccine కనిపెడతాడు. దీనికీ, స్త్రీలలో infertility కి కూడా ఏదో సంబంధం ఉందనీ, కానీ, అది నిశ్చయంగా తెలియడానికి ఇంకా సమయం పడుతుంది అనుకుంటాడు. అతని స్నేహితుడైన యువ జర్నలిస్టు (ఇర్ఫాన్ ఖాన్ ఎంత చిన్నగా ఉన్నాడో!!) అత్యుత్సాహంతో దాని గురించి పత్రికలో రాస్తాడు. ఇక టీవీల్లో ప్రచారం ఇవన్నీ చూసి అసలు సంగతి వదిలేసి – గైనకాలజిస్టులు కొందరు – “నువ్వు మా ఏరియాలోకి ఎందుకు దూరుతున్నావు? నీకేం తెలుసు?” అని దాడికి దిగుతారు. ఇదీ, ప్రొఫెషనల్ జెలసీ, దీపాంకర్ short temper వల్ల కలిగిన శతృత్వాలు – వెరసి అతన్ని తన పరిశోధనలూ చేయనివ్వక, ఇప్పటిదాకా చేసిన వాటి గురించి పేపర్స్ సిద్ధం చేయనివ్వక, సతాయిస్తారు. అతని భార్య (షబానా అజ్మీ), ఒకళ్ళిద్దరు స్నేహితులూ తప్ప ఎవ్వరూ అతనికి చేయూతనందించరు. ఇక, ఈ తతంగంలో మొత్తానికి ఏమైంది? దీపాంకర్ భవిష్యత్తు ఏమైంది? అన్నది కథ.

నటీనటులందరూ అద్భుతంగా ఉన్నా కూడా, షబానా నాకు అందరిలోకి విపరీతంగా నచ్చింది. ఒకపక్కన తనని పట్టించుకోకుండా రోజస్తమానం పరిశోధనలంటూ ఇంటి నిండా ఎలకల్నీ వాటిని పెట్టుకుని అర్థరాత్రుళ్ళూ‌ అపరాత్రుళ్ళూ పని చేసుకుంటూ‌ ఉంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కి గురైయేదీ ఆమే. అదే మనిషి, అందరూ వేధిస్తున్న సమయంలో తన భర్తకి ఎంత సపోర్టుగా నిలబడుతుందో – షబానా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అసలు సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాల్లో – ఈ భార్యా భర్తల మధ్య ఉన్న బాంధవ్యాన్ని చిత్రీకరించిన విధానం, అక్కడ నటీనటులిద్దరూ చూపిన intensity – ముఖ్యమైనవి.

సినిమాలో నాకు నచ్చిన కొన్ని దృశ్యాలు, ఆసక్తికరమైన చర్చలు:

ఒక దృశ్యంలో… ఆవిడ వంట చేస్తూంటుంది. ఆయన ఏదో‌ పరిశోధన చేస్తూంటాడు. ఉన్నట్లుండి వచ్చి, స్టవ్ మీద ఉన్నది తీసేసి, దాన్ని తీసుకుని, తన వద్ద టెస్ట్ ట్యూబ్ లో ఉన్న ద్రవాన్ని వేడి చేయడానికి పట్టుకెళ్ళి పోతాడు!!!‌:-) (చూసి తీరాలి ఆ దృశ్యం). ఆమె అవాక్కై చూస్తూండిపోతుంది. కొన్ని గంటల తర్వాత రాత్రిపూట వచ్చి ఆకలంటాడు. ఆమె – బ్రెడ్డు, అరటిపండు పెడుతుంది. ఆయన – ఇదేం తిండి? అంటే, ఆమె – నువ్వు స్టవ్ పట్టుకెళ్ళిపోతే నేను వంట ఎలా వండాలి? అంటుంది. దానికి ఆయన – ఇంకో స్టవ్ కొనుక్కొచ్చి వండలేవా? అంటాడు :)‌ 🙂

అమూల్య (ఇర్ఫాన్ ఖాన్) పీహెచ్డీ చదివి ఎందుకు జర్నలిజం వైపుకి మళ్ళాడో డాక్టర్ దీపాంకర్ కి వివరించే దృశ్యం లో జరిగిన చర్చ నాకు ఆసక్తికరంగా అనిపించింది. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే ఉన్న స్నేహితులు ఉన్నందువల్ల కాబోలు, మనసుకి దగ్గరగా వచ్చింది.

డాక్టర్ దీపాంకర్ గురువు డాక్టర్ కుందు ఈ‌సినిమాలో అందరికంటే ప్రాక్టికల మనిషి అనిపించాడు నాకు. దీపాంకర్ రిజల్ట్స్ ను తొందరగా పబ్లిష్ చేయడం మీద దృష్టి పెట్టమనీ, పత్రికల వాళ్ళతోనూ, సభలూ సమావేశాలకి వెళ్ళడం లోనూ సమయం వృథా చేయొద్దనీ పలుసార్లు వారిస్తాడు ఆయన తన శిష్యుడిని. నిజంగా ఆ పరిస్థితుల్లో skeptics నోరు మూయించడానికి బహుశా డాక్టర్ కుందు అన్నట్లు ముందు ఆ పేపర్లేవో రాసి అంతర్జాతీయ ఆమోదం పొంది..(రచ్చ గెలిస్తే ఇంట గెలవడం తేలికవుతుంది కొన్నిసార్లు!!) ఆ పైన పత్రికలూ, అసూయాపరులైన తోటివారూ-ఇవన్నీ చూసుకోవాల్సింది అనిపించింది.

దీపాంకర్ మీద వేసిన ఎంక్వైరీ ప్యానెల్ చర్చలు – సుభాష్ ముఖోపాధ్యాయ నిజజీవితంలో జరిగిన సంఘటన గురించి (వికీలో చదివాను) గుర్తుతెచ్చి, మనసు వికలమైపోయింది కొన్ని క్షణాలు. సినిమాలో నిజజీవితంలో సుభాష్ లాగ కథానాయకుడు ఆత్మహత్య చేసుకోడు కానీ, దాదాపుగా disillusionment లో అతనిలోని పరిశోధకుడు ఆత్మహత్య చేసుకున్నంత పని అవుతుంది. ఆయన ఈ దేశంలో తనకి లభించిన “గౌరవాన్ని” తట్టుకోలేని పరిస్థితుల్లో, విదేశీ ల్యాబ్ వారొకరు తమతో కలిసి పనిచేయమని పంపిన ఆహ్వానాన్ని అంగీకరించడంతో ముగుస్తుంది సినిమా. ముగింపు మరీ యదార్థమంత దారుణంగా లేకపోయినా, నిజానికి ఇదీ దారుణమే.

“అందరూ అలా వెళ్ళిపోతే ఎలా?” అని కొన్ని దృశ్యాల క్రితం అతని భార్య వేసిన ప్రశ్న మనల్ని వెంటాడక మానదు.

ఇంకా రాసుకుంటూ‌ పోవచ్చు కానీ, నా దృష్టిలో ఇది ఏదన్నా కొంచెం sensible cinema చూడాలి అనుకునేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా. అనేక ప్రశ్నలు రేకెత్తించింది నాలో – ఇంకా సమాధానాలు దొరకలేదు. రెండు నెలల తరువాత ఇప్పటికీ ఈ సినిమాలోని దృశ్యాలు ఉటంకించుకుంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి నాకు – ఫోనులలో, చాట్లలో.

సినిమా చూడాలనుకునేవారు ఇక్కడ చూడవచ్చు.

ఈ సినిమా చూడగానే నాకు సత్యజిత్ రాయ్ తీసిన గణశత్రు సినిమా గుర్తువచ్చింది. అందులోనూ ఒక సైంటిస్ట్ జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న ఒక అంశానికి వ్యతిరేకంగా శాస్త్రీయ ఆధారాలతో పోరాడాలనుకుంటే ఏమైంది? ఎలా నెగ్గుకొచ్చాడు? చివరికేమైంది? అన్నదే కథాంశం. ఈ రెండు సినిమాలూ పరస్పరం సంబంధం లేనివే అయినా, రెంటికీ మూల కథలు వేరైనా, కొన్ని విధాలుగా చాలా సంబంధం ఉంది. గణశత్రు కి మూలం నార్వేకి చెందిన ప్రముఖ నాటక రచయిత Henrik Ibsen రాసిన “Enemy of the people” నాటకం. అది కూడా అంతర్జాలంలో ఉచితంగా చదవడానికి లభ్యం.

Advertisements
Published in: on January 26, 2014 at 10:30 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/01/26/ekdoctorkimauth/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. చాలా బావుంది మీ సమీక్ష. నాకూ చాలా నచ్చిందీ సినిమా. నేనూ రాశాను ఈ సినిమా గురించి మీరు నవతరంగంలో రాయొచ్చు కదా ఇవన్నీ!

  2. వెంకట్ గారికి: రాస్తానండీ‌ త్వరలోనే… ఈమధ్య నేను ఒక పేరా అసలు విషయం రాస్తే, దానికి రెండు పేరాలు ఆత్మఘోష రాస్తున్నానేమో అనిపిస్తోంది. అందుకని ఏం‌రాయడం లేదు ఎక్కడా. రెండు నెల్ల తరువాత ఇప్పుడే మళ్ళీ బ్లాగులోనైనా ఏదైనా రాస్తున్నా‌ 🙂

  3. ఏడాది క్రితం అనుకుంటా… నేనూ ఈ సినిమాను చూశానండీ. ఏక్ డాక్టర్ కి మౌత్! సినిమా కథా, కథనం అన్నీ టచింగ్ గా ఉంటాయి. సినిమా చూట్టం అయిపోయాక కూడా, ఒక పట్టాన వదలవు విషాద జ్ఞాపకాలు. నిజంగా అద్భుతమైన సినిమా. ఒక సీనులో, సముద్ర దగ్గర కూచొని, దీపాంకర్-షబానా మధ్య సాగే సంభాషణ చాలా డీప్ గా ఉంటుంది. ఆకాశంలోని తారల్ని తదేకంగా చూస్తూ…. మనిషి కనిపెట్టాల్సినవి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని సాగుతుందది. సముద్రంలోని కెరటాల్లాగా… ప్రకృతిలోని రహస్యాలన్నీ తమ గుట్టు విప్పమని అదేపనిగా చైతన్యం కల్గిన మానవ మెదడుతో మొరపెట్టుకుంటున్నట్టుగా సాగుతుందా సంభాషణ. హైలీ ఫిలసాఫికల్ అండ్ ఎమోషనల్ డిస్కషన్. ఈ సినిమాలాగా… సామాజిక ఇతివృత్తాల్ని కథాంశంగా తీసుకుని వాస్తవికంగా, కళాత్మకంగా సినిమాలు తీయగలిగితే చాలా బావుంటుందనిపిస్తుంది. మీరు మంచి సినిమాని పరిచయం చేశారు 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: