దాదాపుగా వారం పట్టినట్లుంది నాకు స్పృహలోకి రావడానికి!
గుండెల్లో గోదారి సినిమా వచ్చినప్పటినుంచి, సహజంగానే, అభిమానిని కనుక, ఎలాగుందో? ఎటులనుందో? అన్న ఆరాటం ఉండింది కానీ, ఒక్కోరూ ఒక్కోలా చెప్పడంతో ఏం చేయాలో తోచింది కాదు. అటు పిమ్మట, ఇక్కడ ఎలాగో చూడలేమన్నది వేరే సంగతి. తుదకు మొన్నీమధ్యే నా స్నేహితురాలు, మంచమ్మాయికి పైకి కనబడని అభిమాని అయిన ఒకావిడ పుణ్యమా అని, ఈ సినిమా చూడగలిగాను. సినిమా కథ గట్రా అందరికీ తెలిసే ఉంటుంది, కొత్తది కనుక. క్లుప్తంగా చెప్పాలంటే నాకు సినిమా నచ్చింది. ఎందుకు?
1. ఇప్పుడొస్తున్న సినిమాల్తో పోలిస్తే, వేరుగా ఉంది. ఇటీవలి కాలంలో కథ అనేది ఒకటుంటుందని అనిపించిన సినిమాలు తక్కువ. పంచి డైలాగుల మీద ఫోకస్ లేకుండా, సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టకుండా కూడా – తుదికంటా చూడనిచ్చిన సినిమాలూ నేను చూడలేదు ఈ మధ్యలో. అక్కడక్కడా ఆలోచింపజేసే దృశ్యాలూ, చక్కటి సంఘటనలూ నన్ను ఆకట్టుకున్నాయి.
2. మంచమ్మాయి చాలా హోం వర్క్ చేసింది ఈ పాత్ర గురించి. ఆ కష్టం ఒక్కోచోట తేటతెల్లంగా కనబడ్డది కూడా! అయితే, మొత్తానికి విజయవంతం అయ్యిందా లేదా? అన్న సంగతి పక్కన పెడితే – ఆ హోం వర్కే పెద్ద విశేషం. మంచమ్మాయిని సినిమాలో చిత్ర డామినేట్ చేయడానికి ప్రయత్నించడమే మంచమ్మాయి సాధించిన పెద్ద విజయం నటిగా.
3. అలాగే, హీరో ల పక్కన కొంచెం వయసెక్కువగా కనబడుతుందని నాతో సహా కొందరం అభిప్రాయ పడ్డాము..కానీ, దానికి ఫేస్బుక్ లో మంచి పంచ్ పడింది … ఒక స్నేహితురాలి గోడమీద తన స్నేహితురాలు రాసిన వ్యాఖ్య – వయసైపోయిన హీరోలు కుర్ర హీరోయిన్లతో చేయగా లేనిది, మంచమ్మాయి రివర్స్ ట్రెండ్ సెట్ చేస్తే కామెంట్ చేయడం ఏమిటని. నిజమే కదా!! అనుకున్నాన్నేను. మా మంచమ్మాయి ట్రెండ్ సెట్టర్. యుగస్త్రీ. ఒక్క పదేళ్ళు ముందు రంగంలోకి దిగుంటేనా!! ఆమె వెబ్-పేజి లో రాసినవన్నీ నిజాలయిఉండేవి!
4. పాటల్లోనూ, సినిమాలోని మాటల్లోనూ – ప్రాంతీయ పదజాలం భలే ఇమిడిపోయింది. అలాగే, ఆ బెస్తవారి పాటలో, కోళ్ళ పందేల పాటలో చేపలు, కోళ్ళ గురించిన పేర్లు : ఇవన్నీ చక్కగా కుదిరాయి. ఇంత తెలుగు, ఇంత మాత్రం ప్రయత్నం చేసి మాట్లాడే నటులు ఎన్ని సినిమాల్లో ఉన్నారు? నేను ఇటీవల చూసిన సినిమాల్లో ఇలా అనుకున్న ఆఖరు సినిమా గంగపుత్రులు. అయితే, ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇలా చక్కటి ప్రాంతీయ భాష (ముఖ్యంగా అన్నపూర్ణ గొంతులో, among other characters) చివరిసారిగా విన్నది ఎప్పుడో నాకు గుర్తులేదు. ఇంక, ఫలానా చోట యాస కరెక్టు కాదు… ఫలానా పదం ఇక్కడిది కాదు.. ఇలాంటివి నాకు రాముడి మొహం రంగులోని బ్లూ కలర్లో ఒక మూడు శాతం గ్రీన్ ఉంది అన్నట్లు అనిపిస్తాయి. నేను సినిమా చూడ్డం మీద దృష్టి పెడతాను కనుక, అంత micro analysis చేయాలన్న తాపత్రేయం ఉండదు నాకు. Ignorance is bliss, at times :p
5. హీరోలిద్దరు చాలా బాగా చేశారు. అన్నపూర్ణ కనబడ్డంత సేపు మాత్రం నాకైతే వేరెవ్వరూ కనబడలేదు. తక్కిన నటులందరూ కూడా వాళ్ళ పాత్రలకి బాగా నప్పారు.
6. యుగస్త్రీ దగ్గర డబ్బుందన్న విషయం తెలుస్తూనే ఉంది. నిర్మాతలన్నాక, ఏ సినిమా అయినా తీయొచ్చు – వాళ్ళ ఆర్థిక స్వతంత్రం వాళ్ళది. కానీ, మంచమ్మాయి ఈ సినిమానే తీయాలనుకోవడం గొప్ప విషయం – అందుకు ఆమెని అభినందించాల్సిందే. అభిమానుల మనోభావాలు ఆనందతాండవం చేయవూ ఈ ముక్క తల్చుకుని??
7. ఇక పాటలు, నేపథ్య సంగీతం: నాకు చాలా నచ్చాయి. కానీ, నాకు ఇష్టమైన “మావయ్య వస్తాడంటా” పాత పాటను ఇక్కడ ఐటెం సాంగు కింద వాడడమే నచ్చలేదు. అసలుకే నాకు పరమ అలర్జీ ఐటెం సాంగులంటే… దానికి తోడు మళ్ళీ ముమైత్ ఖాన్ అంటే అసలిష్టం లేదు. దీని వల్ల, అదొక్కటి నచ్చలేదు కానీ, మిగితా పాటలు నచ్చాయి.
8. సినిమా visually చాలా బాగుంది. అందంగా తీశారు. అలాగే, ఆ వరద భీభత్సం తాలూకా దృశ్యాలు కూడా బాగున్నాయి.
– మొత్తానికి, అడ్డమైన ప్రతి సినిమానీ ఆ వెధవ డాన్సులనీ, ఆ వెధవ తెలుగునీ భరించి హిట్లు చేసేస్కునే తెలుగు ప్రేక్షకుల్లో ఒకరిగా ఆలోచిస్తే, వాటితో పోలిస్తే ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవలసిన సినిమా. కానీ, అలాగని, ఇప్పుడు దీనికి అవార్డులిచ్చేయాలి … రేప్పొద్దున్నే అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసేసి వాళ్ళ టీవీల్లో వేయాలి… వీలైతే ఆస్కార్ కి పంపాలి… ఇలా అంతా చెప్పేంత దృశ్యం లేదు. తెలుగేతరులని పిల్చి … “ఇది మా సినిమా, చూడండి” అనేంత స్థాయిలో లేదు. కానీ, తెలుగువారిని మాత్రం తప్పకుండా చూడమని చెబుతాను.
ఇంతకీ మా నాయకి ఈ కథ ఎందుకు ఎంచుకుందో కానీ, ఇలా ప్రయోగాత్మకంగా మరిన్ని సినిమాలు తీయాలని అభిమానిగా కోరుకుంటున్నాను.
సమీక్ష బాగుంది. థియేటర్ కి వెళ్ళి చూసే అలవాటు లేని మా వంటివాళ్ళకి ,క్లుప్తంగా,కథ,నటీనటులు,దర్శకత్వం వంటి వివరాలు ఇచ్చివుంటే ఇంకా బాగుండేది.ఇంకా ఇలాంటి sensible and different cinemas తెలుగులో రావాలని కోరుకుందాము.
Good review! 🙂
మంచు లక్ష్మికి యుగస్త్రి అని పేరు పెట్టింది అబిమానంతొనా?
అవునండి.
>మొత్తానికి, అడ్డమైన ప్రతి సినిమానీ ఆ వెధవ డాన్సులనీ, ఆ వెధవ తెలుగునీ భరించి హిట్లు చేసేస్కునే తెలుగు ప్రేక్షకుల్లో ఒకరిగా ఆలోచిస్తే, వాటితో పోలిస్తే ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవలసిన సినిమా.<
చాలా కరెక్ట్ గా చెప్పారండీ.. రివ్యూ బాగుంది.
నిజంగా, నిజమైన తెలుగు కథతో రూపొందించిన సినిమా ఇది. అందుకే… మంచమ్మాయి సహా సినీలోపాలు ఎన్ని ఉన్నా… ఈ సినిమా ఒక విలువనీ, ఆత్మనీ (మరీ పెద్ద పదం ఐపోయిందా?) సంతరించుకుంది. బివిఎస్ రామారావుగారి గోదావరి కథల్లోంచి పట్టుకున్నారనుకుంటా ఈ కథని.
మంచమ్మాయిని యుగస్త్రీని చేసిన మీ స్నేహితురాలికీ, ఆ స్నేహితురాలి స్నేహితురాలికీ కూడా ఈ రివ్యూ చాలా నచ్చేసిందంట! 🙂
“అలాగని, ఇప్పుడు దీనికి అవార్డులిచ్చేయాలి … రేప్పొద్దున్నే అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసేసి వాళ్ళ టీవీల్లో వేయాలి… వీలైతే ఆస్కార్ కి పంపాలి… ఇలా అంతా చెప్పేంత దృశ్యం లేదు. తెలుగేతరులని పిల్చి … “ఇది మా సినిమా, చూడండి” అనేంత స్థాయిలో లేదు. కానీ, తెలుగువారిని మాత్రం తప్పకుండా చూడమని చెబుతాను.”
టోటల్లీ అగ్రీ!