Kappalottiya Thamizhan (1961)

కప్పలోట్టియ తమిళన్” – (The Tamilian who launched the ship) – తమిళనాడుకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు వా.ఊ.చిదంబరం పిళ్ళై జీవితం ఆధారంగా తీసిన biopic. బి.ఆర్.పంతులు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్ వాఊచి (ఆయన్ని అలాగే పిలుస్తారట) గా నటించాడు (గణేశన్ నా ఫ్రెండు కాదు. ఊరికే డు.. అంటున్నా.. కొవ్వెక్కి అని కూడా కొందరు అనుకోవచ్చు. వాళ్ళందరికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఇంక సినిమా గురించి చెప్పేదెప్పుడు?)

వాఊచి గురించి: మొదట క్లుప్తంగా చెప్పాలంటే, వా.ఊ.చిదంబరం పిళ్ళై తమిళనాడుకి చెందిన రాజకీయ నాయకుడు. మన దేశంలో మొట్టమొదటి దేశీవాళీ షిప్పింగ్ సర్వీసు స్థాపించిన వాడు. బ్రిటీషు వారి ఓడలకి పోటీగా వీళ్ళ ఓడలు నడిచాయట అప్పట్లో. ఇది ఒక పక్క, స్వతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర ఓ పక్కా, న్యాయవాద వృత్తి ఓ పక్కా, కుటుంబ వ్యాపారం ఓ పక్కా – ఇలా సాగుతూ ఉండగా, బ్రిటీషు వారు రాజద్రోహ నేరం కింద నలభై ఏళ్ళ జైలు శిక్ష వేసి, పైగా ఆయన న్యాయవాద లైసెన్సు రద్దు చేశారు. అటు పిమ్మట, నాలుగైదేళ్ళకి ప్రభుత్వం మళ్ళీ అతని విడుదల చేసింది. ఈయన జైలు నుండి వచ్చేసరికి షిప్పింగ్ కంపెనీ ని ఎత్తేయడంతో ఈయనకి షాక్. విడుదల తరువాత కొంచెం కష్టాలు పడుతూ, జీవితం, రాజకీయాలలో పాత్ర కొనసాగించి, చివరి రోజుల్లో కొన్ని పుస్తకాలు కూడా రాశారు. (మరిన్ని వివరాలకి వికీ పేజీ చూడండి). ఈయన లోకమాన్య తిలక్, భారతీయార్ (సుబ్రహ్మణ్య భారతి), విప్లవ యోధుడు సుబ్రహ్మణ్య శివ వంటి వారికి సన్నిహితుడు.

సినిమా గురించి:
సినిమా పూర్తిగా ఈయన జీవితాన్ని మొత్తంగా చూపిందనలేము కానీ, ముఖ్య ఘట్టాలు చూపింది. సినిమా మొదట్లో మనకి వాఊచి సక్సెస్ఫుల్ లాయర్, న్యాయం పక్షాన నిలబడతాడని, కలిగిన కుటుంబం నుంచి వచ్చాడని, చాలా దేశభక్తి కలవాడని అర్థమవుతుంది. అతని కుటుంబజీవితం కొంతా, అతని స్నేహితులైన భారతీయార్, సుబ్రహ్మణ్య శివల జీవితాలు కొంతా (ఇందులో భారతి వ్యక్తిత్వం, అతని కుటుంబం గురించి మరింత వివరంగా ఉంటుంది), వాఊచి శిష్యుడు మాడసామి కథా (ఇదే ఎక్కువ అన్నింటికంటే) – వస్తాయి తరువాత. వాఊచి బ్రిటీషు వారికి పోటీగా ఓడల కంపెనీ నెలకొల్పడం, వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇతన్ని జైలుకి పంపడం జరిగాక – ఈ మధ్యకాలం లో మళ్ళీ మాడసామి పాత్ర డామినేట్ చేస్తుంది కథని. చాలా కొద్దిసేపు వాఊచి జైలు జీవితం కూడా చూపిస్తారు. కొన్నాళ్ళకి వాఊచి వెనక్కొచ్చి, శేష జీవితం మరీ అంత active politics లో లేకుండా, రచయితగా గడిపి, కాలం చేయడం – ఇదీ ఈ సినిమా కథ.

నన్ను బాగా ఆకట్టుకున్న దృశ్యాలు/పాత్రలు:

సుబ్రమణ్య శివ కి కుష్ఠు వ్యాధి సోకి, ఆపై అతను జైలు నుండి బయటపడ్డాక, జైలు నుండి విడుదలైన వాఊచి కోసం అతను ఎదురుచూస్తూంటే వాఊచి అతన్ని చటుక్కున గుర్తించడు (కుష్ఠు వల్ల రూపురేఖలు అంత మారిపోతాయి శివకి!) – .ఈ దృశ్యం, ఇక్కడి సంభాషణ చాలా కదిలించాయి. సుబ్రహ్మణ్య శివ పాత్ర వేసిన నటుడు (టి.కె.షణ్ముగం) కూడా ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. వికీలో సుబ్రమణ్య శివ గురించి చదివాక మనసులో ఒక ఇమేజి ఏర్పడ్డది. ఈయన చూట్టానికి, వినడానికి కూడా ఆయన లాగే అనిపించాడు 🙂

సుబ్రహ్మణ్య భారతి పాత్ర: సుబ్రహ్మణ్య భారతి కి, చెల్లమ్మ కీ మధ్య జరిగే ఒక సంభాషణ (పిల్లలకి వండడం కోసమని చెల్లమ్మ పక్కింటి నుండి అప్పిచ్చి తెచ్చిన బియ్యపు గింజల్ని భారతి కవితావేశంలో పక్షులకి వేసేయడం…వగైరా)… చిన్నప్పుడు కథలో చదివాను. ఈ సినిమాలో అది చూడ్డం బాగుంది. భారతి పాత్ర చిత్రీకరణ, వేషభాషలు, మాట-నడకా… అంతా భారతి బొమ్మ చూసి ఎలా ఊహించుకున్నానో అలాగే ఉంది. ఆ నటుడు (ఎస్.వి.సుబ్బయ్య) గొప్పగా సరిపోయాడు ఆ పాత్రకి! భారతి ఇంటి బయట అద్దె ఇవ్వలేదని ఇంటాయనా, వెచ్చాలకి డబ్బులని ఇంకొకకరు, పాల డబ్బులని ఒకరు…ఒక పక్క వీళ్ళంతా వచ్చి అడుగుతూ ఉండగా, ఆయన మాత్రం సరస్వతి దేవి విగ్రహం ముందు నిలబడి ఆవిడ తన ఎదుటే ఉన్నదా అన్నట్లు ఆవిడతో వాదనకి దిగడం- ఆ దృశ్యం భారతి వ్యక్తిత్వాన్ని సరిగ్గా పట్టుకుందనిపించింది. ఇక్కడ భారతి అంటే నా ఊహల్లోని భారతీయార్ మాత్రమే! నాకు ఆయన గురించి కానీ, ఆయన రచనల గురించి కానీ ఆట్టే తెలియదు. కానీ, ఫొటోలు చూసి ఒక విధంగా ఊహించుకున్నా!.

(ఇంతకీ, ప్రతీదీ ఈ ఊహించుకోవడమేమిటి మహప్రభో! అనుకోకండి. కొంతమందికి hyper imagination ఉంటుంది పాపం… ఎంత కష్టమనుకున్నారూ దానితో???)

భారతీయార్ జీవితమే కథాంశంగా సయాజీ షిండే భారతీయార్ గా ఒక తమిళ సినిమా వచ్చిందట. అది కూడా చూడాలి ఎప్పుడైనా దొరికితే. బాగుంటుందని చెప్పారు చూసిన వారు! (అన్నట్లు సినిమాలో వాఊచి ఇంట్లో భారతీయార్ పటం, భారతీయార్ ఇంట్లో వాఊచి పటం ఉంటాయి… భలే ఉండింది చూడ్డానికి.)

వాంచినాథన్ ఉదంతం కూడా ఆసక్తికరంగా అనిపించింది. ఆ సాహసుల జీవితాలను ఊహించుకుంటే ఒళ్ళు జలదరించింది. తమిళనాడు లోని తూతుకొడి (Tuticorin) సమీపంలోని మణియాచి స్టేషన్ కు ఇతని గుర్తుగా “వాంచీ మణియాచి” అని పేరు పెట్టారట. (వివరాలకి ఆ వికీ లంకె చూడండి)

విదేశీ కలెక్టర్ మిస్టర్ వించ్ గా ఎస్వీఆర్ కాసేపు కనబడ్డం ఈ సినిమాలో నాకు సర్ప్రైజ్ ఎలిమెంట్. భలే ఉన్నారు ఆ గెటప్లో.

కొడుకు పుట్టినరోజని వాఊచి భార్య ఆ పిల్లాడికి కొత్త దుస్తులు తొడిగితే – అది విదేశీ బట్ట అనేసి, ఆవేశంగా, పుట్టినరోజని కూడా పట్టించుకోకుండా దాన్ని చింపేసి తగలబెట్టేస్తాడు వాఊచి! సినిమాలో కెవ్వుమనుకున్న దృశ్యాల్లో ఇదీ ఒకటి.

ఒక పాటలో – విదేశీ వస్త్రాలని తగలబెడుతూ ఉండే బ్యాచిలో జెమినీ గణేశన్ ఒకడు. అతను అందరి నుండీ బట్టలు పోగు చేసుకుంటూ ఉండగా, జనంలో ఒకామె వస్తుంది. ఆమె బట్టల సంచీ తో ఉన్న సావిత్రి. ఆమె ఇతన్ని, ఇతని కళ్ళలోని తేజాన్ని చూసి మైమరిచిపోతూ ఉండగా, అతను తన ధోరణిలో తానొచ్చి ఆ బట్టలు మంటల్లో పడేసి ముందుకు సాగిపోతాడు. – నాకా దృశ్యం గొప్ప సింబాలిగ్గా అనిపించిందసలు. సావిత్రి కళ్ళలోని పారవశ్యం ఎంత నిజంగా అనిపించిందో.. అతగాడు అలా మనసు దోచేసి చక్కా పోవడం కూడా అంతే నిజంగా అనిపించింది మరి!! ఏమాటకామాటే, సావిత్రి కొన్ని దృశ్యాల్లో హాస్యం గొప్పగా ప్రదర్శించింది…అమాయకమైన మొహంతో!

శివాజీ ఎప్పట్లాగే గొప్పగా నటించాడు. ఈ సినిమాలో అతని మార్చు ఆవేశకావేశాలు ఎక్కువగా కనబడలేదు…పాత్రోచితంగా! జెమినీ వేసిన మాడసామి రోల్ ని పనిగట్టుకుని పొడిగించి, మళ్ళీ ఆయనకి జంట కోసం సావిత్రిని కణ్ణమ్మగా పెట్టి…వాళ్ళ ప్రేమకథని సృష్టించి, వాళ్ళకి పాటలు పెట్టి, బాగా కష్టపడ్డారు కథకులు :-). అలాగే, సినిమాలో వాఊచి కనబడ్డంత సేపు కనబడకపోయినా, భారతీయార్ ది కూడా ప్రధాన పాత్రే. ఇలాగ, ఈ సినిమా పేరుకి వాఊచి కథే కానీ, ఇందులో ఆయనంత పాత్ర ఈ తక్కిన వారందరికీ కూడా ఉంది. అందుకే కాబోలు, కనీసం వికీ లో రాసినంత వివరంగా కూడా వాఊచి కథ లేదీ సినిమాలో.

పాటలు వినసొంపుగా ఉన్నాయి. నన్ను అన్నింటికంటే బాగా ఆకట్టుకున్నవి – శివాజీగణేశన్ పిల్లలని ఆడిస్తూ పాడిన “ఓడి విళయాడు పాపా” అన్న పాట, వందేమాతరం పాట తరువాత భారతీయార్ ఇంట్రో పాట :-). (అన్నట్లు పాటలన్నీ భారతీయార్ రాసినవే అని రాగా.కాం లో గమనించాను)

మొత్తానికైతే, ఆసక్తికరమైన సినిమా. superlatives లోకి వెళ్ళని సంభాషణలు, పాత్రలకి అతికినట్లు సరిపోయిన నటులు-నటన, ఎక్కడా బోరు కొట్టించకుండా పకడ్బందీగా సాగిన కథనం – ఈ కారణాల వల్ల, ఏకాస్త బయోపిక్స్ మీద ఆసక్తి ఉన్నవారినైనా ఈ సినిమా చూడమనే చెబుతాను. మామూలుగా నవరసాలూ కావాలంటే మాత్రం కొంచెం కష్టం. అంత even distribution లేదు ఈ సినిమాలో!

సినిమా ఎక్కడ చూడవచ్చు? ఇక్కడ.
సబ్టైటిల్స్ ఉన్నాయా? – ఉన్నాయి.

Advertisements
Published in: on March 23, 2013 at 7:01 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/03/23/kappalottiya-thamizhan-1961/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. You have good patience.

  2. what language is this I’m interested in reading this

  3. “కొంతమందికి hyper imagination ఉంటుంది పాపం… ఎంత కష్టమనుకున్నారూ దానితో???” 😛


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: