అగతియార్ (అనబడు అగస్త్య ముని కథ – 1972)

ఈ తమిళ పౌరాణికాలు మొదలయ్యిన మొదటి వారంలో యూట్యూబు వారు కుడిపక్కన చూపించే జాబితాలో ఈ సినిమా కనబడ్డది. వావ్! అగస్త్యుడి మీద ప్రత్యేకంగా సినిమానా? ఎందుకలాగ ఈ తమిళులు సినిమా తీశారు? అనుకుని వికీ చదివితే అర్థమైంది – అగస్త్యుడిని తమిళ సాహిత్యానికి ఆదిపురుషుడని భావిస్తారని, తమిళ భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం రాశాడని ప్రతీతనీ!

ఈసరికి ఈ బ్లాగు చదువరులు ఊహించే ఉంటారు – ఇది ఎ.పి.నాగరాజన్ చిత్రమని 🙂 అయితే, ఇందులో శివాజీ గణేశన్ లేడు 😦 నిజానికి ఇందులో నాకు తెలిసిన నటులు చాలా తక్కువ. అగస్త్యుడిగా వేసినది సిర్కాళి గోవిందరాజన్ అన్న సంగీత విద్వాంసుడు. ఈయన ఫొటో ఒక్కటి మాత్రం మా (స్వర్గీయ) తాతయ్య తాలూకా ఫొటోల్లో చూశాను కనుక, అలాంటి మనిషొకాయన ఉన్నాడని తెలుసు. మరి ఏ ధైర్యం పెట్టుకు చూస్తాము సినిమాని? అని ఒక పక్క వాయిదా వేసినా, మనసు పీకడం మొదలుపెట్టింది. అగస్త్యుడి పైన సినిమా అన్న కుతూహలం కూడా లేదా? అని 🙂 అవ్విధముగా, ఈ సినిమా చూసి …ఆనందించాను.

సినిమా ప్రధానంగా తమిళ నాట అగస్త్యుడి గురించి ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా తీశారు. మొదట కథలేమిటో చెప్పాలి … అటు పిమ్మట నాకేమనిపించిందో చెబుతా. ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించే ఈ కథలే ఈ సినిమా. అవి తీసేస్తే అక్కడేం లేదన్నమాట. నా ప్రకారం మొత్తం పది ముఖ్య కథలు –

కథ 1: అగస్త్యుడు భూమిని balance చేయడం కోసం దక్షిణ దిశగా వచ్చిన కథ.
శివ పార్వతుల వివాహ సందర్భంగా సకల మానవేతరులూ హిమాలయ పర్వతాలను చేరేసరికి, భూమి ఆవైపుకి వంగిపోవడం మొదలుపెట్టిందట. దానితో అందరూ ఖంగారు పడగా, శివుడు అగస్త్యుడిని పిలిపించి దక్షిణ దిశలో వెళ్ళి భూమిని బలంచె చేయమని చెప్పాడు. మరి నేనూ మీ పెళ్ళి చూడొద్దా? అంటే, నువ్వెప్పుడు తల్చుకుంటే అప్పుడు మేమిద్దరం ప్రత్యక్షమౌతాం అని నచ్చజెప్పి పంపించాడన్నమాట శివుడు. ఆ విధంగా పొట్టి వాడైనా మహా గట్టివాడైన అగస్త్యుడు దక్షిణానికి మరలాడు. ఇక్కడే అగస్త్యుడికీ నారదుడికీ (T.R.Mahalingam) ఒక విధమైన స్పర్థ మొదలవుతుంది. దాదాపు సినిమా ముగిసేదాకా కొనసాగుతుంది.

ఒక (వినసొంపైన) పాట తరువాత శివపార్వతుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. తదుపరి ఒక ఆసక్తికరమైన సంఘటన. నీతి: పుట్టింటి గురించి పొగడ్డం ఆదర్శ గృహిణి కాదు అని అగస్త్యుడు పార్వతికి గృహిణి ధర్మం గురించి చెబుతాడు. ఈ విషయమై ఇదే ముక్క శివుడిక్కూడా వర్తిస్తుందని నా అభిప్రాయం కానీ, దానితో సంబంధంలేకుండా, ఈ సన్నివేశం తీసిన విధానం నాకు బాగా నచ్చింది.

ఆ తరువాత తల్లిదండ్రుల సేవ ని మించినదేదీ లేదు అన్న మెసేజ్ తో ఒక పాట – ఆ పాడిన పిల్లవాడు, అతని కుటుంబంతో అగస్త్యుడి మాటామంతీ నాకర్థమైనంతలో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడే గంగా, యమున, సరస్వతి – పాపాలన్నీ తమకి చుట్టుకున్నాయని అగస్త్యుడి వద్దకి వస్తే, ఈ పిల్లవాడి వద్దకు వెళ్ళమని సూచిస్తాడు. వాళ్ళూ వెళ్ళి అతనితో మాట్లాడగానే వాళ్ళు మళ్ళీ మెరుపులు మెరుపుల బట్టల్లోకి, నగల్లోకి మారిపోతారు… ఈ దృశ్యం కూడా నాకు నచ్చింది. (ఇంతలో నారదుడొచ్చి ఇంకో పాట పాడేస్తాడు …అలా పాడుటూ ఎంచక్కా మెట్లు దిగుతూ భూమికొచ్చేస్తాడు, భలే!)

కథ 2: వింధ్య పర్వతం గర్వమణచిన కథ… కొద్ది మార్పులతో.
మాములుగా ప్రచారంలో ఉన్న కథ: నారదుడు అగ్గి అంటించడంతో వింధ్య పర్వతం గర్వంతో విర్రవీగి పెరిగిపోతూ ఉంటే, అగస్త్యుడు తన కుటుంబంతో సహా దక్షిణానికి మరలుతున్నప్పుడు వింధ్య పర్వతం నమస్కారం చెప్పడానికి వంగితే, అగస్త్యుడు నేను మళ్ళీ తిరిగొచ్చేదాకా ఆ హైటు తగ్గించుకుని ఉంటే నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని అడిగి, ఒప్పించి, చివరికి దక్షిణానే స్థిరపడిపోయి, వింధ్య పర్వతాన్ని ఆ విధంగా కంట్రోల్ చేసాడని.

ఈ సినిమాలో కథ ఏమిటంటే – ఇక్కడా నారదుడే ఇంకో కారణానికి అగ్గిరాజేస్తాడు కానీ, అగస్త్యుడు తన కోపంతో శపించి మరీ వింధ్యుడిని భయపెట్టేసి అదుపులో ఉంచుతాడు అనమాట. 🙂 అలాగే, సినిమాలో అగస్త్యుడి కుటుంబం అంటూ ఎవరూ ఉండరు. సంభాషణ మాత్రం బాగా సరదాగా ఉంది ఇక్కడ.

కథ 3: కావేరి నది గర్వమణచడం
కావేరి మీద ఫోకస్ చేస్తూ ఐదు తమిళ నదులూ (కావేరి/పొణ్ణి, భవాని, వైగై, పొరుణై, పెణ్ణై) చెంగు చెంగుమని ఆనందంగా పాడుకుంటూ డాన్సు చేసుకుంటూ ఉండగా, దూరంగా అగస్త్యుడు రావడం కనిపిస్తుంది. కావేరి గర్వం కొద్దీ అగస్త్యుడితో అవమానకరంగా మాట్లాడి చాలెంజ్ చేస్తే, ఆయనకి కోపమొచ్చి, కావేరి ని మొత్తం తన కమండలంలోకి వంపేస్కుని చక్కాపోతాడు. అది చూసి మిగితా నదులు నారదుణ్ణి మొరపెట్టుకుంటే, నారదుడు వినాయకుడికి చెప్పుకుంటాడు. వినాయకుడు కాకిరూపంలో వచ్చి అగస్త్యుడి కమండలాన్ని కిందకి తోసేస్తాడు..దానితో గలగలా పారుతూ పొణ్ణి మళ్ళీ జీవిస్తుంది …ఈ కొత్త నదికి అగస్త్యుడు కావేరి అని పేరు పెడతాడు.(ఇది జరిగిన ప్రాంతమే తలకావేరి అంటారు…) తరువాత అగస్త్యుడికి, వినాయకుడికి మధ్య జరిగే సంభాషణ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి అగస్త్యుడు ఒక పాటతో కావేరిని ఆశీర్వదించి ముందుకు సాగుతాడు.

కథ 4: వాతాపి జీర్ణం : వాతాపి, ఇల్వాలుడు ఇద్దరు రాక్షసులు దారినపోయే రుషులని చాలా తెలివిగా గుటకాయ స్వాహా చేస్తూ ఉంటారు. అగస్త్యుడు తెలివిగా పండు రూపంలోని వాతాపిని తినేసి జీర్ణం చేసుకునేసి వీళ్ళిద్దరిని శిక్షించడం ఇక్కడ కథ. వాళ్ళిదరిగా వేసినవాళ్ళెవరో కానీ, భలే కామెడీ గా ఉన్నారు. వాతాపి జీర్ణం కావడం చూపిస్తారూ…కెవ్వు!

కథ 5: అగత్తియం
ఇలా రకరకాల లోకోద్ధారణ చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా, మధ్యలో శివపార్వతులు దర్శనమిస్తారు. శీవుడు అగస్త్యుడిని తమిళానికి వ్యాకరణం రాయమనీ, త్ద్వారా తమిళ సంస్కృతికి తొలి గ్రంథాన్ని ఇవ్వమనీ అడుగుతాడు. అగస్త్యుడు ఒప్పుకుని, దాని ఆవిష్కరణ శివుడి సమక్షంలో జరగాలి అంటాడు. మరి తమిళ దేవుడు మురుగన్ కదా! ఆ పాయింటు పట్టుకుని ఇదంతా చాటుగా విన్న నారదుడు అటు వెళ్ళి మురుగన్ (అనబడు చక్కగా ఉన్న శ్రీదేవి) తో ఒక పాట పాడి మరీ చెబుతాడు ఈ ముక్క. అలా ఈ ఆరంగేట్రం ఆపేసి అగస్త్యుడి మీద రివెంజి తీసుకోవచ్చని ఈయన ఆలోచన కానీ, మురుగన్ దీనికి లొంగకపోగా అగస్త్యుడిని పరీక్షించి మెచ్చుకుంటాడు అక్కడికెళ్ళి 🙂
(ఈ భాగంలో సంభాషణలు నాకు కొంచెం కష్టమైంది కానీ, సారాంశం ఇదీ! శ్రీదేవి కేకలు పుట్టించింది ఆ హేమాహేమీలు అందరినీ మించి..ఈ దృశ్యంలో.)

కథ 6: నారదుడితో ఎవరు ఉత్తమ భక్తుడు? అన్న చర్చ
ఆ తరువాత అగస్త్యుడు, నారదుడు కలిసి పాట పాడుకుంటూ – ప్రపంచంలో ఎవరు గొప్ప భక్తుడు? అన్న చర్చలోకి వస్తారు. రోజులో అనేకానేక పనుల మధ్య కూడా వీలైనప్పుడు దైవధ్యానం చేసే వారు నిజమైన భక్తులని చెప్పడం నీతి అనమాట ఇక్కడ. మాస్ కాలక్షేపం కోసమో, దేనికోసమో కానీ, ఇక్కడి కథ చాలా విపరీతంగా సాగదీసినట్లు అనిపించింది నాకు.

కథ 7: రావణుడితో వీణావాద్యంలో పోటీ
పై కథలో అగస్త్యుడితో వాదనలో ఓడిపోయిన నారదుడు వెళ్ళి రావణుడి దగ్గరికెళ్ళి నెమ్మదిగా అతనికి అగస్త్యుడితో వాదన పెట్టుకునే విధంగా నిప్పు రాజేస్తాడు. దానితో, వీళ్ళిద్దరి మధ్యా ఇప్పుడు వీణావాద్యంలో పోటీ జరుగుతుంది. అక్కడున్న ఒక కొండ ఎవరి వీణావాద్యానికి కరిగితే వాళ్ళు గెలిచినట్లు అట!! మొత్తానికి చివర్లో తన ఓటమి అంగీకరిస్తాడు రావణుడు. (ఇది వినడంకంటే విడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ఇదిగో లంకె). పైగా, మీరున్న చోటుని నేనేం చేయను అని కూడా హామీ ఇస్తాడు. అగస్త్యుడేమో ఆ కొండకి పొదిగై మళై అని పేరు పెట్టి అక్కడ స్థిరపడతాడు. (తమిళుల విశ్వాసం ప్రకారం అగస్త్యుడు ఇంకా అక్కడెక్కడో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు!)

కథ 8: ఊర్వశి కి ఇచ్చిన శాపం
తరువాత, దేవతల ఆహ్వానం మేరకు ఇంద్రలోకానికి వెళతాడు అగస్త్యుడు. అక్కడ ఊర్వశి ఒక పక్క డాన్సు చేస్తూ, మరో పక్క జయంతుడివైపు చూస్తూండటంతో చిరాకేసిన అగస్త్యుడు వాళ్ళని భూలోకంలో పుట్టమని శపిస్తాడు. ఊర్వశి మానవరూపంలో పుట్టిన వంశంలోనే మాధవి అన్న నర్తకి జన్మిస్తుందని, తమిళ క్లాసిక్ శిలప్పదిగారం రచనలో ముఖ్య పాత్ర వహిస్తుందని జోస్యం చెబుతాడు.

కథ 9: తొల్కాప్పియన్…ఇతర శిష్యుల రాక… తొల్కాప్పియం రచన.
మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చేసిన అగస్త్యుడికి కొంతమంది శిష్యులు ఏర్పడతారు. అందులో తొల్కాప్పియన్ ఒకడు. అతను తరువాత తొల్కాప్పియం పేరుతో తమిళ వ్యాకరణం రాయడం మొదలుపెడతాడు. ఒకపక్క అగస్త్యుడు రాస్తూండగా శిష్యుడై ఉండి, గురువుతో పోటీ ఏమిటి? అని వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఇప్పుడేదో జరిగిపోతుందని నారదుడు ఊహించినప్పటికీ, అగస్త్యుడు ఉదార హృదయంతో అతన్ని, ఆ గ్రంథాన్నీ ఆశీర్వదిస్తాడు.

కథ 10: మురుగన్ అనాథ అనడం
అందర్నీ ఆశీర్వదించి షరా మామూలుగా సంచారం చేస్తూ ఉండగా, చివ్వర్లో మురుగన్ పశువుల కాపరి వేషంలో వచ్చి మాటల సందర్భంలో నువ్వు అనాథవి అనడంతో ఇంతటి అగస్త్యుడూ భోరున ఏడవడం మొదలుపెట్టేస్తాడు! అప్పుడు శివుడు-పార్వతి వచ్చి మేమే నీ అమ్మా-నాన్నా అని చెప్పి అతన్ని ఓదారుస్తారు. తరువాత వినాయకుడు, మళ్ళీ మురుగన్ కూడా వస్తారు. వినాయకుడు – అమ్మా, నాన్న, ఇద్దరు సోదరులు ఉన్న పెద్దింటి బిడ్డవి నువ్వు …అనాథవి కావు అని చెప్పి అగస్త్యుడిని సంతోషింపజేస్తాడు. తరువాత నారదుడు, అగస్త్యుడు కలిసి తమిళ భాషని, శివుడి ఫ్యామిలీని పొగుడుతూ, వినసొంపుగా ఉన్న ఓ పాట పాడటంతో కథ ముగుస్తుంది.

గోవిందరాజన్ గారు భలే సరిపోయారు అగస్త్య ముని పాత్రకి. భలే ఉన్నారు చూసేందుకు. అగస్త్యుడు ఇంత balanced గా ఉంటాడని అనుకోలా! అవును మరి, ప్రపంచాన్ని balance చేసిన మనిషి కదా! ఇందులో అగస్త్యుడిని – కోపిష్టి అయినా కూడా అది విచక్షణ పోగొట్టకుండా కంట్రోల్ ఉన్న మనిషిలా, మంచి ఎవరు చెప్పినా విని వారిని ఎక్కువ-తక్కువ భేదం లేకుండా గౌరవించే మనిషిలా, అలాగే – ఉదార హృదయంతో తన competitors తో స్నేహంగా ఉండే మనిషిలాగానూ చూపారు. ఈ విధమైన complex పాత్ర చిత్రణకు గోవిందరాజన్ ప్రాణం పోశారని అనిపించింది.

సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా, సినిమా మొదట్లో వచ్చే కైలాసం సెట్ నాకు అద్భుతం అనిపించింది. ఇదిగో…ఇలా ఉందది.
Screenshot from 2013-02-24 19:51:15
-ఆ ముఖ ద్వారం తమిళ ఓంకారం రూపంలో ఉంది. నాకు శివుడి ఇంటికి ప్రవేశం ఓంకారం లోపల నుండి..అన్న ఆలోచన గొప్పగా అనిపించింది.

అలాగే, మరీ ఇంతలా కాకపోయినా, ఇలాంటివి మరికొన్ని సెట్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో, మురుగన్ (ముద్దుగా మాట్లాడుతున్న శ్రీదేవి!) ఇంటి సెట్ ఒకటి. అది ఇదిగో:
Screenshot from 2013-02-24 21:01:19

విడ్డూరంగా అనిపించినవి:
1) సినిమాలో అసలుకి లోపాముద్ర పాత్రే లేదు!
2) కావేరి నదిని అగస్త్యుడి కమండలం నుండి వినాయకుడు బయటకి రప్పించాక గలగలా పారుతున్న నీటిని చూపిస్తారు. అవెందుకు బురద నీళ్ళలా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి? అన్నది నాకర్థం కాలేదు.

మొత్తానికి: అగస్త్యుడి గురించి ప్రచారంలో ఉన్న కథలని చాలా ఆసక్తి కరంగా తెరకెక్కించారు. పాటలూ అవీ కూడా వినసొంపుగా ఉన్నాయి (సంగీతం: కున్నకుడి వైద్యనాథన్ ట!). సెట్స్ చూడ్డానికి అందంగా ఉన్నాయి. సినిమా చూడాలన్న ఆసక్తి ఉన్న వారు యూట్యూబులో ఇక్కడ చూడండి. షరా మామూలుగా సబ్టైటిల్స్ లేవు. ప్రింటు మరీ అంత గొప్పగా ఏం లేదు. కానీ, తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదికూడా!

కొసమెరుపు: Agastya in Tamil Land అని ఒక పుస్తకం చదివా ఈ సినిమా చూశాక (అంత లోతుగా అధ్యయనం చేయలేదు. పైపైన చదివా). ఈ కథలన్నీ కల్లలెలాగవుతాయో ఆధారాలతో సహా చూపిస్తారు అందులో 😉

Advertisements
Published in: on March 4, 2013 at 8:00 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/03/04/agathiyar/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. శ్రీదేవి కేకలు పుట్టించింది… ఇదీ.. నాకు నచ్చిన పాయింట్ 🙂

  2. >>> కావేరి నదిని అగస్త్యుడి కమండలం నుండి వినాయకుడు బయటకి రప్పించాక గలగలా పారుతున్న నీటిని చూపిస్తారు. అవెందుకు బురద నీళ్ళలా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి? అన్నది నాకర్థం కాలేదు.

    మద్రాసు లో నదులు అలాగే ఉంటాయి. 🙂 ఇది కూడా తెలియదా అండీ మీకు? 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: