తిరువరుట్చెల్వర్ (1967)

తిరువరుట్చెల్వర్ (Thiruvarutchelvar) కూడా ఏ.పి.నాగరాజన్ తీసిన, శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర ధరించిన, తమిళ పౌరాణిక చిత్రం. మొదట దేవుళ్ళు (తిరువిళయాడల్, సరస్వతీ శపథం, కందన్ కరుణై) అయ్యాక భక్తుల వద్దకు వచ్చాను. ఇందులో భాగంగా “తిరుమాళ్ పెరుమై” లో ఆళ్వార్ల కథలు చూశాను. ఇప్పుడీ సినిమా శివ భక్తులైన నాయనార్ల కథల్లో కొన్నింటిని ఎంచుకుని అల్లిన కథ. సినిమా చూసే ముందైతే మట్టుకు నాకీ సంగతి తెలియదు. ట్రైలర్ లాగా కాసేపు ఓ దృశ్యం చూసి, శివాజి రకరకాల పాత్రల్లో తన నటనా పటిమను చూపిస్తాడని అర్థమై చూడ్డం మొదలుపెట్టేసా అన్నమాట 🙂

కథ ఏమిటంటే – రాజైన శివాజీ గణేశన్….అద్భుతంగా డాన్సు చేస్తున్న పద్మిని ని (ఆ డాన్సుకు జత చేయబడ్డ కే.వి.మహదేవన్, పి.సుశీలల కాంబోని) చూసి పరవశించిపోయి, తనకు మట్టుకే సాధ్యమైన తీరులో ఠీవిగా నడుస్తూ వచ్చి ఆమె పట్ల తన ఆకర్షణని తెలియజేస్తాడు. ఆమె కర్తవ్య బోధతో, “ఛా, ఏమిట్నేను ఇలా చేసాను” అనుకుని, దైవ చింతనపైకి మనస్సు మళ్ళి, మళ్ళీ అజ్ఞానంలో “దేవుడెక్కడ ఉన్నాడు? ఏ దిక్కులో నివసిస్తాడు? ఏం చేస్తూ ఉంటాడు” అని అడుగుతాడు రాజగురువైన (స్వామీజీ లా ఉన్న) నాగయ్య ని. మరీ ఇలాంటి ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానాలు ఏం ఇవ్వగలం? అని దిగాలుగా కూర్చున్న నాగయ్యని చూసి ఆయన మనవరాలు కుట్టి పద్మిని “తాతా, నేను చూస్కుంటా కదా!” అని భరోసా ఇచ్చి … సభకి వెళ్ళి, శివాజీ అంత శివాజీ ముందు జంకూ, గొంకూ లేకుండా అద్భుతంగా మాట్లాడి, అతనికి జవాబులు చెబుతుంది. దానితో, ఈసారి నిజంగా కళ్ళు తెరుచుకున్న రాజుకి రాజగురువు పెరియపురాణం ఇచ్చి, అందులోని నాయనార్ భక్తుల కథలు చదివి తరించమని చెబుతాడు.

అక్కడ మొదలవుతాయి వరుస కథలు. మరి, తెలుగు కథల్లో ఇవి కనబడవు కనుక, నాబోటి అమాయకులు ఇంకొందరు ఉంటారు కనుక, క్లుప్తంగా ఒక్కో కథా చెప్పి ముందుకు సాగుతాను …అనగా స్పాయిలర్లు కలవని భావము.

పైన జరిగిన సంఘటన తరువాత సీను చోళ రాజు కొలువుకి మారుతుంది. అక్కడ సెక్కియార్ (శివాజీ గణేశన్) అన్న కవి నాయనార్ల కథలతో పెరియపురాణం గ్రంథం రాస్తూంటాడు. ఈక్రమంలో తన రాజసభలో ముగ్గురు (నలుగురు) నాయనార్ల కథలు చెబుతాడు. సినిమా అలా కొనసాగుతుంది.

మొదటి కథ: తిరుకురిప్పు తొండర్ (శివాజీ గణేశన్) అన్న నాయనార్ కథ. వృత్తిరిత్యా చాకలి అయిన ఈయన రోజూ ఒక శివభక్తుడి బట్టలని ఉతకడం ద్వారా వారికి సేవ చేయడం తన జీవన విధానంలో భాగంగా పెట్టుకుంటాడు. ఇందులో భాగంగా, శివుడు ఈయన్ని పరీక్షించడానికి ఒక శివ భక్తుడి రూపంలో వస్తాడు (జెమినీ గణేశన్). ఆయన తాలూకా పైపంచె ని ఉతికి ఇస్తానని ఈయన అడుగుతాడు. ఆయన, నాకున్నది ఇదొక్కటే, జాగ్రత్త అని ఇస్తాడు. మనం ఊహించుకున్నట్లే, ఆ పంచె చిరిగిపోతుంది ఈ ప్రక్రియలో. కాసేపు ఇరుపక్షాల మధ్యా కొంచెం సంభాషణ అయ్యాక, శివుడు సాక్షాత్కరించి తిరుకురిప్పు తొండర్ ని కరుణిస్తాడు.

తరువాతి కథ: సుందరార్ అనబడే నాయనార్ కథ ఇది. సుందరార్ (శివాజీ గణేశన్) పెళ్ళి చేస్కోబోతుండగా (కె.ఆర్.విజయ ను) మధ్యలో ఒక గడ్డపాయన (ఆ వేషంలో జెమినీ గణేశన్) వచ్చి అతని తీస్కెళ్ళి పోవడం…తరువాత సుందరార్ పాట పాడ్డం వరకూ ఉంది. తిరువిలయాడల్ లో “నేనెవర్నో తెలీదా?” అనేసి, తనకే సొంతమైన టీజింగ్ నవ్వు విసిరి గుళ్ళోకి శివాజీ రూపంలోని శివుడు మాయమైపోయే సన్నివేశం (శివుడు రూపంలోని శివాజీ కూడా) ఉంది. “ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్రా?” అని అని తానే ఇంతేసి కన్నులతో శివాజీనే అడిగి మాయమైపోయిన జెమినీని చూస్తే ఆ దృశ్యం గుర్తొచ్చింది.

మూడోకథ: తిరునవుక్కరసర్ (శివాజీ గణేశన్) అన్న నాయనార్ కథ. ఎనభైఏళ్ళ తిరునవుక్కరసర్ “అప్పర్” గా ప్రసిద్ధుడు (దీనికి గల కథ, ఈ పేరును తెచ్చిన సంబందార్ అన్న మరొక “బాల” నాయనార్ కథా – సినిమాలో చూడొచ్చు, లేదంటే వికీలో కూడా చదువుకోవచ్చు). శివాజీ గణేశన్ పూర్తిగా అప్పర్లా మారిపోతాడన్నమాట ఇక్కడ. 🙂 … ఈ భాగంలో నాకు అన్నింటికంటే నచ్చినది క్లైమాక్సు దృశ్యం. అప్పర్ కైలాసానికి వెళ్ళి శివ పార్వతుల నృత్యాన్ని కనులారా చూసే దృశ్యం గొప్ప పరవశం కలిగించే దృశ్యమని నా అభిప్రాయం.

పాటలు చాలా బాగున్నాయి. మొదట్లో పద్మిని డాన్సు ఉన్న పాట, చివర్లో శివపార్వతుల డాన్సు – రెండు చూడ్డానికి చాలా బాగున్నాయి. మధ్యలో చాకలి వాళ్ళ పాట భావం మొత్తంగా అర్థం కాలేదు కానీ, వినసొంపుగా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఈ సినిమాలో తిరుమాళ్ పెరుమై తరహాలో అనవసరంగా జొప్పించారు అనిపించిన సన్నివేశాలు చాలా తక్కువ.

సావిత్రి చాలా కొద్దిసేపు కనిపిస్తుంది. కనుక, నాకేమో వ్యాఖ్యల్లేవు ఆవిడ గురించి! ఆర్.ముత్తురామన్ ఆ గెటప్లో చాలా బాగున్నాడు నాకు చూడ్డానికి. జెమినీ గణేశన్ కూడా బాగున్నాడు.

మరి శివాజీ గణేశన్ సినిమాలో భక్తుడైనా కూడా నాకిక్కడ తెరవేల్పు కదా. కనుక, ఆయన గురించే ఎక్కువ తల్చుకుంటాను. అప్పర్ అనబడు తిరునవుక్కరసర్ పాత్రలో ఎనభై ఏళ్ళవాడి గెటప్ లో శివాజీని చూసి వర్ణించడానికి మాటల్లేవు. అది శివాజీ మార్కు నటన. నచ్చిన వాళ్ళవి కెవ్వు మార్కు కేకలు. నచ్చని వాళ్ళవి హాహాకారాలు. ఇదే సినిమాలో అంతక్రితమే సుందరార్, సినిమా మొదట్లోని రాజు, సెక్కియార్ పాత్రల్లో రకరకాల “ఠీవి” కనబడే గెటప్పులలో చూశాక, ఇలా చూసి తరించేసరికి మైండు బ్లాకై పోయింది. పూర్తిగా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఇంకో మనిషిలా ఉన్నాడు! ఇన్ని పాత్రలేసినా, ఒకదానితో ఒకటి పోల్చలేనంత వైవిధ్యం శివాజీ నటనలో! ఒక్క శివాజీ కోసమే నేనీ సినిమా మళ్ళీ మళ్ళీ చూడగలను అనిపించింది.

కొన్ని సందేహాలు:
1) దేవుళ్ళంతా తమిళ భక్తుల భాషకోసం ఎందుకంత పడిచస్తారు ఈ సినిమాల్లో? తెలుగు సినిమాల్లో దేవుళ్ళెందుకు తెలుగు కవుల భాషలోని తియ్యదనాన్ని పొగడరు? దేవుళ్ళకి భాషా పక్షపాతం ఎందుకుండాలి యువరానర్?
2) దేవుళ్ళని వదిలేసి, ఇలా కథలు కథలుగా భక్తుల కథలు వచ్చిన తెలుగు సినిమాలు ఉన్నాయా? (భక్త తుకారాం, రామదాసు..ఇలా సింగిల్ భక్తుల మీద ఫోకస్ చేసినవి కాకుండా!)
3) ఒక నన్నయ్య గురించో, ఒక తిక్కన గురించో, ఒక ఎర్రన గురించో – ఫిక్షన్ ఏదీ లేదా..దానితో సినిమాలెందుకు తీయరు? (విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు వంటిది కాదు. నోరి నరసింహశాస్త్రి రాసిన “కవి సార్వభౌముడు” వంటిది).

– ఈ కథలు ఆట్టే ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు కొంతమందికి. కానీ, “దేవుడు భక్తుల్ని పరీక్షిస్తాడు, వాళ్ళు ఆ పరీక్షలకి తట్టుకుని నిలబడతారు. ఏ దేవుడన్నదాన్ని బట్టి ఆయన లేదా ఆమె తుదకు భక్తుల్ని కరుణిస్తారు” అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇన్ని విభిన్నమైన కథలు ఉండడం అంత అనాసక్తి కలిగించే విషయమే కాదు నా మట్టుకు నాకు. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా నా దృష్టిలో. అలాగే, ఈ కథలన్నీ చాలా ఆసక్తికరంగా తెరకెక్కించినందుకు కూడా!

అయితే, మొదలైన చోటికి మళ్ళీ వెనక్కి వచ్చుంటే ఇంకా ఆసక్తికరంగా ఉండేది ..అని మాత్రం అనిపించింది నాకు. కథ, కథలో కథ. కథలో కథలో కథ. ఇలా సాగాక… మళ్ళీ లాజిక్ ప్రకారం…వెనక్కి మరలుతూ, మొదటి కథలోకి రావాలి కదా! 🙂

ఈ సినిమాపై అంతర్జాలంలో కనబడ్డ ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

మొత్తం పదిహేడు వీడియోలతో ఈ సినిమా యూట్యూబులో లభ్యం. సబ్టైటిల్స్ లేవు.

Advertisements
Published in: on February 25, 2013 at 7:00 am  Comments (15)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/02/25/thiruvarutchelvar/trackback/

RSS feed for comments on this post.

15 CommentsLeave a comment

 1. మీరిలానే చూస్తూ పోతే ఏదో ఒకరోజు జుట్టు ముడేసి (మగ వాళ్లయితే గడ్డాలు మీసాలు పెంచేసి అనే వాళ్ళం) నారచీరలు ధరించి శివుడిని అన్వేషిస్తూ కాలం గడిపే ప్రమాదం ఉంది. 🙂

  • :))

 2. @ “దేవుడెక్కడ ఉన్నాడు? ఏ దిక్కులో నివసిస్తాడు? ఏం చేస్తూ ఉంటాడు – నాక్కూడా ఇదే సందేహంగా ఉంది. ఏం చేస్తూంటాడని కాదు, ఇప్పుడేం చేస్తున్నాడనీ, హీహీ.

 3. మీ ప్రశ్నలకి నా జవాబులు 🙂 :

  1. ఎందుకంటే, దేవుళ్ళతో కూడా మనం మన భాషలో కాకుండా వాళ్ళ భాషలోనే మాట్లాడతాం కాబట్టి.

  2. లేవు. ఎందుకంటే మనకలా సీరియల్ భక్తులు లేరు కాబట్టి!

  3. ఎందుకు తీయరు. కవిత్రయం గురించి కాదు కాని శ్రీనాథ కవిసార్వభౌముడు సినిమా ఉంది కదా. అంతకుముందు, తెనాలిరామకృష్ణుడు, కవయిత్రి మొల్ల, భక్త పోతన. బహుశా వీటిల్లో శివాజీ గణేషన్ లేడు కాబట్టి మీ కళ్ళకి ఆనలేదనుకుంటా. 🙂

  • 3. గురించి: అంటే నవలల ఆధారిత సినిమాలు లేవా అని..అనమాట. శ్రీనాథుడి మీద సినిమా కి టైటిల్స్ పడే దగ్గర నోరి వారి నవల పేర్లు వేస్తారు… పోతన… సినిమాకి అలా ఏం వేసినట్లు గుర్తు లేదు మరి 🙂 మిగితా రెండూ చూసి చాణ్ణాళ్ళైంది కనుక, వాళ్ళ గురించి కూడా జీవిథ కథల సాహిత్యం ఏమన్నా ఉందో లేదో, ఆ సినిమాలకి అవి వాడుకున్నారో లేదో నాకు తెలీదు 🙂

   అఫ్కోర్స్, శివాజీ లేకపోతే ఇవన్నీ ఇకపై ఆనవు అన్నది వేరే సంగతి. తెనాలి రామకృష్ణుడి కథ తమిళంలో శివాజీతోనే తీశారనుకుంటాను. అది చూస్తా అపుడు :p

  • //తెనాలి రామకృష్ణుడి కథ తమిళంలో శివాజీతోనే తీశారనుకుంటాను.//
   ఐతే సౌమ్య గారూ ఇంతాచేసి కృష్ణదేవరాయలు ‘‘దేశభాషలందు తమిళ లెస్స’’ అనీ, తెనాలి రామకృష్ణుడు తమిళంలో పుస్తకాలు రాసినట్టూ చూపించలేదు కదా.

  • Pavan garu: haha, గుర్తులేదండి …అది ఎప్పుడో చిన్నప్పుడు చూశా.

 4. “తెలుగు సినిమాల్లో దేవుళ్ళెందుకు తెలుగు కవుల భాషలోని తియ్యదనాన్ని పొగడరు?”
  అన్నమయ్య సినిమాలో అన్నమయ్య వృద్ధుడైపోయాక ఇంక శెలవిప్పించమని స్వామిని అడిగినప్పుడు – వేంకటేశ్వరునితో “నీ పాటల తియ్యదనానికి అలవాటు పడిపోయానే, నువ్వు పాడకపోతే ఎట్లా” అని అర్ధం వచ్చే డయలాగొకటి ఉంది. కేవలం ఆ డయలాగుకోసం ఆ సినిమాలో జరిగిన మిగిలిన ఘాతుకాలన్నిటినీ క్షమించెయ్యవచ్చు.

 5. మనవాళ్ళకి మన భాషలో పాడిన భక్తులకంటే వేరే భాషల్లో పాడిన భక్తులంటేనే భక్తి ఎక్కువ – విప్రనారాయణ, పాండురంగ మహాత్యం, భక్తతుకారాం, భక్త జయదేవ, చక్రధారి .. so on. కానీ మరి నాగయ్య గారు తీసిన పోతన, త్యాగయ్య సినిమాల్లో రాముడు వచ్చి, ఆహా ఎంత తియ్యని భాష, ఎంత తియ్యని కవిత్వం అని ఉండొచ్చు. అనలేదెందుకో. రాముడు కఠినుడు అనడానికి ఇదే నిదర్శనం! 🙂

  • పోతన సినిమాలో… ఆయన ఒక పద్యం సగం పూర్తి చేసి వెళ్టే రాముడొచ్చి పూర్తి చేసేస్తాడు కదా… అదే కఠినుడైన రాముడు సింబాలిక్ గా పోతన భాషకి ఇచ్చే మెచ్చుకోలు కాబోలు! 😉
   నాకూ నేనీ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ అన్నమయ్య సీనే గుర్తొచ్చింది 🙂

 6. >>ఒక నన్నయ్య గురించో, ఒక తిక్కన గురించో, ఒక ఎర్రన గురించో – ఫిక్షన్ ఏదీ లేదా..దానితో సినిమాలెందుకు తీయరు?

  సరిగ్గా ఇలాంటి ప్రశ్నే చాలా ఏళ్ళ కిందట ఒక పెద్దాయనకి వచ్చి, మరో పెద్దాయన్ని అడిగారట! దానికాయన ఏం సమాధానం చెప్పారో ఇక్కడ వినండి:

  • లింకు ఎందుకో ముందు కామెంట్లో రాలేదు:

  • Not sure why the link is not coming up in the comment!

   #http://www.youtube.com/watch?feature=endscreen&v=HMZOzynJYyo&NR=1#

 7. I got the link Kameswara rao garu… but I dont know why its not being shown in ur previous comments!
  Here it is: https://www.youtube.com/watch?v=HMZOzynJYyo

 8. ముందు దేవుణ్ణి నమ్మక, తర్వాత నమ్మి, ఆపైన ఆయన పెట్టిన పరీక్షలకు తట్టుకుని నిలిచినవారు మహాభక్తులైతే. మిమ్మల్నీ మ.భ.సౌమ్య అనే అనాల్సివుంటుంది. ఎందుకంటే, ‘‘ఓఏ’’ అనుకున్న నటనే అభిమానించారంటే గిర్రున తిరిగిపోదా సీన్. డ్రమటైజేషన్ కూడా ఇంక అక్కర్లేదు.
  అది పక్కనపెడితే, మా గురువు గారు ఒకసారి ‘‘శివుడు మాటాడినది ఈ తెలుగు భాష
  భవుడు భాషించినది మన గడ్డ యాస
  అమ్మంగదేవితో కమ్మంగ భాషించి
  అక్కమహాదేవి చిక్కతెనుగుకు పలికి
  నన్నయ్య నేమయ్య అనుచు సంబోధించి
  తెలుగులో మెలిగాడు త్రైలింగుడై శివుడు

  వేయిస్తంభాలయపు నటమంటపమ్ములో
  పండితారాధ్యునితొ పసయైన బాణిలో
  మాటకలిపుంటాడు తెలుగువాడై భవుడు’’ వగైరాగా సాగే కవిత వినిపించినప్పుడు బోలెడు ఆశ్చర్యపోయాను. శివుడు తెలుగు మాట్టాడడమేంటండీ అని. అప్పుడు నా వయసు ఓ 20 వుంటుంది. అంటే అదీ మన తెలుగు సినిమాలు చేసే ఎడ్యుకేషన్. శివుడు తెలుగు మాట్లాడాడంటేనే నేను షాక్ అయిపోతే, ఇక పొగడ్డం చేస్తే తట్టుకోగలమా?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: