తిరుమాళ్ పెరుమై (1968)

“ఏమైనా, ప్రతి సినిమా కళాఖండమైపోవాలి అంటే కుదరదు కదా!” సినిమా మొదలైన పది నిముషాల తరువాత నా మనోభావాలు ఇలా ఉన్నాయి.
“హే, ఇదేదో బానే ఉందే” – ఒక అరగంట తరువాత.
“బాగుందిలే, మధ్య మధ్యలో అనవసరపు పాత్రలున్నాయి కానీ…” – ఇంకో గంటకి…
-ఇలా నా మనోభావాల్ని నేనే రెండుసార్లు దెబ్బతీసుకున్నా ఈ సినిమా చూస్తూ చూస్తూ 😉

చెరో సినిమాలో శివుడు, మురుగన్ ప్రధాన పాత్రలు అయ్యారు. మధ్యలో సమస్త దేవతలూ సాక్షాత్కరించారు. మరి విష్ణువు సంగతేంటి? అందుకే ఇందులో విష్ణుభక్తుల ఫోకస్. 12 ఆళ్వార్లలోని ముగ్గురు (నలుగురు) ఆళ్వార్ల కథలు – మధ్యలో తెలుగువాళ్ళు తట్టుకోలేని మార్కు తమిళ నేటివిటీ తో ఈ కథల్ని కలిపితే ఈ సినిమా.

కథ-1: విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్), అతని పెంపుడు కూతురు గోదై/ఆండాళ్ కథ. విష్ణుచిత్తుడికి గోదై దొరకడం, అతను ఆమెని పెంచడం, ఆమె కృష్ణుడిపై వల్లమాలిన అభిమానం పెంచుకోవడం … పెద్దయ్యాక విష్ణువులో కలిసిపోవడం, విష్ణుచిత్తుడిని “పెరియాళ్వార్” గా పేరొందమని విష్ణువు ఆశీర్వదించడం – ఇందులో కథ.

కథ-2: తిరుమంగై మణ్ణన్/తిరుమంగై ఆళ్వార్ కథ : ఒక చిన్న సైజు రాజ్యానికి రాజైన తిరుమంగై మణ్ణన్ తన భార్య ప్రోద్బలంతో వైష్ణవుడై (అశోకుడి కథ గుర్తొచ్చింది నాకిక్కడ ఎందుకో గానీ!), విష్ణువుకి గుడి కట్టిద్దాం అనుకుంటాడు. ఈ ప్రయత్నంలోనే ఉన్నదంతా పోగొట్టుకుని, ఆఖరుకి దొంగతనాలు చేయడం మొదలుపెడతాడు! అలా, కొన్నాళ్ళకి ఒక భార్యా భర్తా వస్తారు… బోలెడు ఆభరణాలతో. ఈయన షరామామూలుగా వాళ్ళ ఆభరణాలు దోచేస్తాడు. అతగాడి మెట్టెలు మాత్రం రావు (ఆ కాలంలో మగవారికి మెట్టెలు ఉండేవిలాగుంది! దీని గురించి కందన్ కరుణైలో కూడా ఒక వివరణ ఉంది.)..లాస్టుకి తెలిసేది ఏమిటంటే, వాళ్ళు ఇతని పరిక్షించడానికి వచ్చిన విష్ణువు-లక్ష్ములని. తరువాత ఈయనే ఆళ్వార్ల మధ్య తిరుమంగై ఆళ్వార్ అయ్యాడు అన్నమాట.

కథ-3: తొండరడిప్పొడి ఆళ్వార్/విప్రనారాయణ కథ: విప్రనారాయణుడు కూడా ఓ విష్ణు భక్తుడు. విష్ణువుల్ లీలల్లో భాగంగా, ఒక నర్తకి తో ప్రేమలో పడతాడు…ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. మధ్యలో ఒకటీ అరా…విధి (విష్ణువు) చేతిలో కీలుబొమ్మలయిన విలన్ల ప్రమేయం తరువాత, “this is my divine game” అని విష్ణువు అందరికీ సాక్షాత్కరించి, విప్రణారాయణుని తొండరడిప్పొడి ఆళ్వార్ గా పేరొందమని దీవించడంతో ముగుస్తుందీ కథ.

-ఏమాటకామాటే చెప్పాలి, నాకు మూడు కథలూ చాలా నచ్చాయి. చాలా డ్రామా ఉంది … ఒక్కోటీ సెపరేట్ సినిమాగా కూడా తీసేందుకు కావాల్సినంత డ్రామా.

ఇంతకీ, అసలు సినిమాలో కంటెంట్ ఏంటి అన్నది కూడా తెల్సుకోకుండా, ఏదో, శివాజీ, నాగరాజన్ కాంబో అనేస్కుని మొదలుపెట్టేశా. విష్ణువు గా శివకుమార్ కనబడేసరికి “అబ్బా, మళ్ళీ వచ్చాడు” అనిపించినా కూడా, ఎక్కువసేపు క్లోజప్లో విష్ణువు గెటప్ లో కనబడ్డు కనుక, తట్టుకునేశా. అన్ని ముఖ్య పాత్రలూ శివాజీ వేసేశాక ఇంకా ఇతర పాత్రల గురించి ఏం చెప్తాము? 😉 ఆండాళ్ గా కె.ఆర్.విజయ, తిరుమంగై మణ్ణన్ భార్య కుముదవల్లిగా షావుకారు జానకి, మూడో కథలో నర్తకిగా పద్మిని నటించారు. వీళ్ళందరిలో, కె.ఆర్.విజయ శివాజీ పక్కన ఉన్న సీన్లలో కూడా నాకు (అంటే నేను శివాజీ అభిమాని అయిపోయా కదా. ఇంకోళ్ళు కనబడకూడదు కదా న్యాయంగా.. :p) ప్రముఖంగా కనబడగలిగిందంటే …గొప్పే!! షావుకారు జానకి కి ఆట్టే పాత్ర లేదు. పద్మిని ఆ పాత్రకి బాగా సరిపోయింది.

మళ్ళీ శివాజీ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి: శివాజీవి మూడు పాత్రలు. మూడింటిలో రెండు కొంత సాత్విక స్వభావం కలవి కనుక అక్కడ స్క్రీన్ వైబ్రేట్ కాలేదు. విష్ణుచిత్తుడి పాత్ర శివాజీని నేను ఇప్పటి దాకా చూసిన పాత్రల్తో పోలిస్తే ఇది వేరే రకం పాత్ర. అతను కూడా అలా లీనమయిపోయి, విష్ణుచిత్తుడే కాబోలు అనేలా చేశాడు కొన్ని దృశ్యాల్లో! ఆండాళ్ కు మెట్టినింట్లో (అదే, విష్ణువుతో) ఎలా నడుచుకోవాలో చెప్పే దృశ్యాల్లో ఎమోషన్ తో అయితే, నిజంగా కెవ్వు మని అరుచుకున్నా. రెండో కథలో శివాజీ మార్కు వీరోచిత, పొడవు డైలాగులూ, వికటాట్టహాసాలు, ఇతర అనితరసాధ్యమైన విన్యాసాలు ఉంటాయి – షరామామూలుగా. మళ్ళీ మూడోకథకి వచ్చేసరికి, మొత్తం మనిషే కొత్తగా కనబడ్డం మొదలుపెడతాడు. కొన్ని దృశ్యాల్లో మాత్రం శివాజిత్వం(అదే, నేనొక్కప్పుడు ఓ.ఏ. అనుకున్నది) కనిపిస్తుంది. ఏమైనా, గొప్ప నటుడు. ఒకే సినిమాలో కూడా బోలెడు వైవిధ్యం చూపాడు నటనలో!

ఈ సినిమాలో సెట్లు మామూలుగా అనిపించాయి ఆ తక్కిన మూడూ చూశాక (పైగా, విడియో క్వాలిటీ కూడా అంత గొప్పగాలేదు). పాటలు వినసొంపుగా ఉన్నాయి. డైలాగులు – నాకు అర్థమైనంతలో బాగున్నాయి… సబ్టైటిల్స్ లేవు కనుక, పాటల్లో, సంభాషణల్లో నేను ఏదో గొప్ప పదవిన్యాసాల వంటివి మిస్ అయ్యి ఉండొచ్చు. మరి ఆళ్వార్ల గ్రంథాల్లో తమిళ భాషని స్తుతించడం అన్నది లేదేమో, నాకు తెలియదు గానీ, ఈ సినిమాలో మాత్రం tamil, tamil chant ఆట్టే లేదు. అయితే, సినిమా ఆద్యంతం వాళ్ళు హాస్యం అనుకుని పెట్టిన సన్నివేశాలు మహా చిరాకు పుట్టించాయి. హాస్యాత్మకంగా లేవని కాదు కానీ, మరీ రొటీన్ గా ఉన్నాయి. ఈ రేంజిలో ఆళ్వార్ల కథలు అవీ అని మొదలుపెట్టినప్పుడు అలాంటి హాస్యం మరీ సినిమా తాలూకా spirit dilute చేస్తుందని నా అభిప్రాయం. అలాగే, నా మట్టుకు నాకు కథ కీ కథకీ మధ్యలో వ్యాఖ్యాన సమయంలో నటుల విన్యాసాలు చిరాకు పుట్టించాయి.

ఎక్కడ పడితే అక్కడ వందలకొద్దీ ఆం ఆద్మీ గుంపులు చేరినప్పుడు కూడా అలా దేవుళ్ళు భలే ప్రత్యక్షమయిపోయే వాళ్ళు కాబోలు ఆ కాలంలో!! చివ్వర్లోని దశావతారాల పాట బాగుంది. శివకుమార్ కూడా బాగున్నాడు ఈ పాటలో 🙂

ఈ సినిమా బాగుందా? బాగుంది. అంటే మామూలు పౌరాణిక సినిమా స్థాయిలో ఉంటుంది. అంటే, కథ నచ్చితే బాగుందన్నట్లు. కథలు నచ్చకపోతే “బాగానే” ఉందన్నట్లు. కానీ, చటుక్కున పోయి స్టేజెక్కి “ఇది చూడండహో!” అని టముకు వేసేలా ఉండదు. అంతే.

సినిమా చూడాలనుకునేవారు యూట్యూబులో మూడుభాగాల్లో – ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడండి. సబ్టైటిల్స్ లేవు!

Advertisements
Published in: on February 14, 2013 at 7:00 am  Comments (5)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/02/14/tirumal-perumai/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. చాలా బాగుంది మీ సమీక్ష.

  మాధురి.

  • Thanks Madhuri garu.

 2. టైటిల్ సాంగులో దశావతారాల పర్యంతం శివకుమార్ ని తట్టుకొని చూసిన మీకు జోహార్! :):P

 3. By the way its తిరుమాల్ పెరుమై

  • hi hi hi.. yes. that (writing with a ళ) was my native language influence you see. 😛

   సినిమా మొదట్లో కొన్ని విన్యాసాలు ఉంటాయి కదా… నగేస్ బృందానివి…దానితో పోలిస్తే శివకుమార్ ఎంతండీ? 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: