కందన్ కరుణై (1967)

అననగనగా ఒక ఎ.పి.నాగరాజన్. అనగనగా ఒక అభిమాని – నేను. అనగననగా ఒక బ్లాగు – ఇది. అనగనగా, నా అనుకోళ్ళతో సంబంధం లేకుండా, అనేకానేక భక్తుల గుండెల్లో కొలువుండే ఇలవేల్పు మురుగన్. అదే కథ.

సినిమా మొదట్లో, చూడాలా వద్దా? అనుకుంటూ నేను వేసుకున్న ఓకే, నాటోకే జాబితా ఇది:

ఓకే:
* నాగరాజన్
* పార్వతిగా సావిత్రి
* కె.బి.సుందరంబాళ్ పాటలున్నాయి… అవ్వయ్యారుగా ఆమే నటించింది కూడా.
* మురుగన్ కథా కమామిషూ తెలుసుకోవచ్చు. తెలుగు కథల్లో చూపరుగా!

నాట్ ఓకే:
* పెద్ద మురుగన్ గా శివకుమార్ (అతను పాపం బాగానే ఉన్నాడు కానీ, మరీ మెతగ్గా అనిపించాడు)
* శివుడిగా జెమినీ గణేశన్ (అబ్బే… శివుడిగా శివాజీ ఉండాలి!)
* శివాజీ గణేశన్ హీరో కాకపోవడం

4-3 లెక్కలో “ఒకే” గెలిచింది కనుక, సినిమా చూశానన్నమాట.

దానివల్ల అనుకోని బోనస్ లు:
* cute, cuter, cutest అనిపించేలా ఉన్న బాల మురుగన్ గా… నాలుగేళ్ళ శ్రీదేవి!
* కె.వి.మహాదేవన్ పాటలు.
* కొన్ని చక్కటి సంభాషణలు

ఇక, కొంచెం వివరాల్లోకి వెళ్తే –

అసలు ఫస్టు ఫస్టు మొదలవగానే ఒక పాటొస్తుంది. మీరు నిఖార్సైన తెలుగు నేటివిటీని తప్ప ఇంకేదీ ఒప్పుకోలేకపోతే, ఎలాగో ఇక్కడే కొట్టు కట్టేయడమో, వడదెబ్బకి విలవిల్లాడినట్లు కళ్ళు తిరిగి పడిపోవడమో జరుగుతుంది. (ఇదిగో, కావలిస్తే, ఇది చూశాక, తక్కిన సినిమా చూడాలో వద్దో నిర్ణయించుకోండి!)

* కథ: సూరపద్ముడనే రాక్షసుడు “నా శక్తి తప్ప నిన్నేదీ చంపలేదు” అన్న వరం పొందుతాడు శివుడి నుండి. దానితో విచ్చలవిడిగా దేవతలని హింసిస్తూ ఉంటాడు (ఇక్కడే ఒక మంచి పాట ఉంటుంది ఎస్.వరలక్ష్మి గళంలో!)…దేవతలందరూ శివుడి దగ్గరికెళ్ళి వేడుకుంటే, శివుడు తన నుండి మురుగన్ ని సృష్టిస్తాడు. మురుగన్ ని చూస్కునేందుకు ఆరుగురు కార్తిక కన్యలని సృష్టిస్తాడు. అక్కడ నుండి మురుగన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, అతని గురించి ప్రచారంలో ఉన్న కథల వెనుక కథలు (ఉదా…నెమలి ఆయన వాహనం ఎలా అయ్యింది? షణ్ముఖ-ఆర్ముగ-కార్తికేయన్ ..ఇలా రకరకాల పేర్లు ఎందుకంటారు? కార్తిక మాసం ఎందుకు మురుగన్ ప్రియ మాసం? మురుగన్ వాళ్ళ నాన్నకే ఓంకార తత్వం ఎందుకు, ఎలా చెప్పాడు? మురుగన్ అవ్వయ్యారు ను ఎలా పరీక్షించాడు? … ఇలాగ, బోలెడు కథలున్నట్లే అనిపిస్తోంది ఇప్పుడు రాస్తూంటే… కానీ, సినిమా చూస్తున్నంతసేపు సమయం తెలియలేదు…. అదీ కథ. ఇందులో మురుగన్ లీలలు లేవు. అవి కావాలంటే మాత్రం ఇంకేవో సినిమాలు చూసుకోవాలి. నాకు తెలీవు. కానీ, ఈ కథలు కూడా చాలా ఆసక్తికరమైనవి.

మురుగన్ బ్రహ్మ ని జైల్లో పెట్టడం నాకాట్టే నచ్చలేదు. చిరాకేసింది. కానీ, వాళ్ళూ వాళ్ళూ దేవుళ్ళు … వాళ్ళ వ్యవహారాలు వాళ్ళవి కనుకా; ఇంకొక్క మాట అంటే ఇప్పుడందరూ నన్ను చంపేస్తారు కనుకా, ఇంకాపేస్తున్నా ఆ ప్రస్తావన.

కథకు రామాయణంతో చాలా పోలికలున్నాయి. రామాయణాన్ని గుర్తు తెచ్చిన సన్నివేశాలు:

– శూర్పణఖ ముక్కు చెవులు కోసినట్లు ఇందులో, సూరపద్ముడి చెల్లి అళముఖి చెయ్యి నరుకుతారు.
– సూరపద్ముడికి అస్తమానం మంచి సలహాలు ఇస్తూ ఉంటే ఒక తమ్ముడు
– మురుగన్ దూతగా వచ్చిన వీరబాహు (శివాజీ గణేశన్) ను సూరపద్ముడు అవమానిస్తే అతగాడు అక్కడ సింహాసనం సృష్టించుకునే సీన్
– నేడుపోయి, రేపు రమ్ము అని మురుగన్ సూరపద్ముడికి యుద్ధరంగంలో చెప్పే సన్నివేశం
– అసలుకి మురుగన్ ని చూస్తేనే ఏమిటో రాముడు గుర్తొచ్చాడు నాకు చాలాసార్లు
… ఇలా ఇంకొన్ని ఉన్నాయి..రామాయణం తెగ గుర్తొచ్చే దృశ్యాలు.

మురుగన్ నమ్మిన బంటు వీరబాహుగా, విచిత్రమైన గెటప్లతో శివాజీ గణేశన్, అతని సహచరులు రంగప్రవేశం చేశాక, శివాజీ ఉన్నంతసేపూ స్క్రీను వైబ్రేషన్ మోడ్ లో ఉండింది, షరా మామూలుగా 🙂

సరే, అలా వివిధ సంఘటనలతో కథ సాగాక, చివ్వర్లో నక్కీరన్ తియ్యని తమిళ భాష కి మురిసిపోయి మురుగన్ ఆయనకి సాక్షాత్కరించి, ఒక పాట పాడించుకోవడంతో సినిమా ముగుస్తుంది (ఈ సన్నివేశాలు కేకోకేక!)

* ఎప్పట్లాగే విజువల్స్, పాటలు బాగున్నాయి. నటీనటుల ఆహార్యం పాత్రోచితంగా ఉంది. కాకపోతే, కథనమే – అంత పకడ్బందీగా లేదు. ఎక్కడా బోరు అయితే కొట్టదు కానీ, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఆకట్టుకోలేదు. ధారాళంగా సాగిపోయే డైలాగులు కూడా అంత విపరీతంగా లేవు, విచిత్రంగా. కానీ, ఉన్న డైలాగుల్లోనే మామూలుగా ఈ సినిమాల్లో కనబడాల్సిన విపరీతమైన తమిళాభిమానం ఇందులోనూ ఉంది (ఎందుకుండదూ?? అన్నింటికంటే ఎక్కువ ఇందులోనే ఉండాలి. మురుగన్ అసలుకే “తమిళ్ కడవుళ్”…God of Tamils కదా!!)

* సినిమా క్లైమాక్సు దృశ్యాల్లో – కవి నక్కీరన్ తమిళ భాషని వినేందుకు మురుగన్ ఒక వృద్ధుడి వేషంలో అతని దగ్గరికి వెళ్ళాక వాళ్ళిద్దరి మధ్యా జరిగే సంభాషణ నాకు ఈ సినిమా మొత్తంలో బాగా నచ్చిన సీక్వెన్స్ (2 గంటలా 12 నిముషాల వద్ద మొదలవుతుంది, ఆఖరుదాకా సాగుతుంది). అలాగే, మురుగన్ శివుడికి ఓంకార సారాన్ని చెప్పబోయే దృశ్యంలో శివుడు అతని ముందు శిష్యుడిలా కూర్చున్న దృశ్యం అద్భుతం! మురుగూన్-అవ్వయ్యార్ల మధ్య సంభాషణ కూడా నాకు చాలా నచ్చింది.

* మురుగన్ ధర్మపత్నులుగా – కె.ఆర్.విజయ, జయలలిత – చాలా బాగున్నారు. జిగేల్ జిగేల్ అని మెరిసారు కూడా. కానీ, వాళ్ళకి అక్కడ చేసేందుకు ఆట్టే ఏమీ లేదు…మురుగన్ కోసమో, మురుగన్ తో కలిసో పాటలు పాడుకోవడం తప్ప. సావిత్రి ని ఊరికే వేస్టు చేశారు. కనబడ్డ కాసేపూ నాకు ఎప్పట్లాగే చాలా నచ్చింది. కిరీటం మాత్రం పరమ వెరైటీగా ఉంది. తిరువిలయాడళ్ లో లాగా గ్రీన్ పార్వతి లేదు ఇందులో…మామూలుగానే ఉంది 🙂 కె.బి.సుందరంబాళ్ ని తిరువిలయాడల్ లో చూసినప్పుడే అవ్వయ్యారు ఇలాగే ఉంటుందనిపించింది. ఈ సినిమాలో కూడా అదే గెటప్. కాకుంటే ఇందులో కొంచెం వయసు తక్కువగా చూపినట్లు అనిపించింది. శివకుమార్ మురుగన్ గా చూడ్డానికి బాగున్నాడు. spirit of muruga ఏదన్నా ఉంటే, అది బాగానే పట్టుకున్నాడు. కానీ, నాకు ఆ హీరో భావన కలుగలేదు. జెమినీ గణేశన్ శివుడిగా బాగానే కుదిరాడు – పైగా, అతను కళ్ళింత చేసి చూస్తే నాకు చాలా ఇష్టం కూడా. కానీ, నా మట్టుకు నాకు శివాజీ లాంటి అయస్కాంత శక్తి వీళ్ళిద్దరిలోనూ లేదు అనిపించింది! చిన్నప్పటి మురుగన్ గా (అంటే, తండ్రికే తత్వబోధ చేసినప్పటి మురుగన్…మరీ అతి బాల మురుగన్ కాదు) చేసినబ్బాయో అమ్మాయో కూడా బాగా చేశారు. ఈ హేమాహేమీల మధ్య జంకూ, గొంకూ లేకుండా భలే మాట్లాడాడు. నగేశ్-మనోరమల జంట ఈ సినిమాలోనూ ఉంది కానీ, నన్నాట్టే ఆకర్షించలేదు వీళ్ళ హాస్యం.

మరి నేను శ్రీదేవిక్కూడా అభిమానిని కదా, ఆమె గురించి ఎక్కువ చెప్పుకుంటా ఈసారి. ఒక పది నిముషాలేమో కనిపిస్తుంది అతి-బాల మురుగన్ గా. అక్కడే ఒక పాట కూడా. (ఇదిగో, ఇదే ఆ పాట. ఎంత ముద్దుగా ఉన్నాడో/ఉందో కదా మురుగన్/శ్రీదేవి!) అసలుకి అది శ్రీదేవి అని వికీ పేజీలో చూశాక “ఒహో” అనుకోవడమే కానీ, నాకైతే ఏం పోలికలు కనబడలేదు. నేను చూసిన సినిమాల్లో వేసేసరికి శ్రీదేవి ఇంకాస్త పెద్ద అయింది కనుక నేను గుర్తించలేదేమో ఇందులో! అది వేరే విషయం 🙂 .. అలా, మొత్తానికి, పువ్వు పుట్టగానే పరిమళించింది అనిపిస్తుంది ఈ సినిమాలో శ్రీదేవిని చూస్తే.

శివాజీ గణేశన్ బంగారు బూట్లు బాగున్నాయి కానీ, అతనిలోని నటుడికి పెద్దగా స్కోప్ లేదిక్కడ :(. అక్కడికీ ఛాన్స్ దొరికిన చోట్ల వదులుకోలేదు. ఏమైనా, ఇద్దరు యువతుల మధ్య గొడవల్ని చోద్యం చూస్తూ నవ్వుకున్నా, దూతగా వెళ్ళి హెచ్చరికలు చేసినా, మురుగన్ పెళ్ళికి మధ్యవర్తిత్వం నడిపినా, చివరికి విచిత్రమైన విగ్గులేసినా, మొత్తం పటాలంతో సహా బంగారు బూట్లు …ఇంత పొడుగువి వేసినా… ఎప్పట్లాగే మాటల్తో వీరంగం చేసినా – శివాజీ శివాజీనే! సినిమా మొత్తంలో పెద్ద పెద్ద డైలాగులున్నవి కొన్నే. అవన్నీ శివాజీవే! సినిమా మొత్తం మీద తాను కనబడ్డంత సేపు మురుగన్ కంటే ఎక్కువగా మన కళ్ళు వెళ్ళేవి కూడా శివాజీపైకే! 🙂

* గొప్పగా ఉన్నాయి పాటలన్నీ. “క్యాచీ” గా అనిపించలేదు కానీ, వింటూన్నంత సేపూ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు అనిపించింది 🙂 “తిరుప్పర కుండ్రత్తిల్” పాట విన్నాక, “నారీనారీ నడుమ మురారి” సినిమాలో “ఇరువురుభామల..” పాటకి ఇదే మొదటి వర్షన్ అని అర్థమైంది 🙂 నాకు ఇలాంటి సాహిత్యాన్ని అర్థం చేసుకునేంత గొప్ప తమిళ్ రాదు కానీ … subtitles అనువాదంలో కూడా సాహిత్యం చాలా అద్భుతంగా అనిపించింది దాదాపు పాటలన్నింటిలోనూ.

సరే, మొత్తానికి…సినిమా బాగుంది కానీ, వావ్ ఫీలింగ్ లేదు. తిరువిళయాడళ్ స్థాయిలో కాకపోయినా, సరస్వతీ శపథం లో కూడా ఒక విధమైన charm ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా చేసేది అదే. అది ఇందులో లేదు. బహుశా అందుకు శివాజీ గణేశన్ హీరో కాకపోవడం ఒక కారణం అయ్యుండొచ్చు. తక్కిన వారెవ్వరూ శివాజీ అంత lively గా లేరు ఈ సినిమాలో!

యూట్యూబులో ఆంగ్ల సబ్ టైటిల్స్ తో సహా చూడ్డానికి లంకె ఇదిగో.

ఓపిగ్గా బొమ్మలూ గట్రా కూడా పెట్టి మరీ రాసిన మరొకరి అభిప్రాయాలు ఈ వెబ్సైటులో చూడవచ్చు.

Advertisements
Published in: on February 12, 2013 at 8:10 am  Comments (6)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/02/12/kandan-karunai/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. కేక!

 2. ఏమిటండి వరస బెట్టి ‘అరవమన్న’ వారి సినిమాల మీద అదీను ‘పాట’ చిత్ర్రాల మోజులో పడ్డారు !
  రాబోయేది ఏమిటి ? ‘తిరువిళయాడలా? లేకుంటే, తిరుమలై కుమరి యా ?!

  చీర్స్
  జిలేబి.

 3. అసలు కథమొదలైందే తిరువిళయాడల్ వద్ద 🙂
  (http://navatarangam.com/2012/08/thiruvilayadal/).
  నెక్స్టు…. ఇంకా ఏమనుకోలేదు 🙂 ఇంకా మూడు,నాలుగున్నాయి నేను చూడాలనుకుంటున్న నాగరాజన్ సినిమాలు. ఏది దొరికితే అది 🙂

 4. […] సినిమాలో శివుడు, మురుగన్ ప్రధాన పాత్రలు అయ్యారు. మధ్యలో సమస్త […]

 5. ఓహో! వెట్రివేల్ వీరవేల్ పాట ఈ సినిమా లోదా!! పాట భలే ఉంటుంది 😉

 6. […] దేవుళ్ళు (తిరువిళయాడల్, సరస్వతీ శపథం, కందన్ కరుణై) అయ్యాక భక్తుల వద్దకు వచ్చాను. ఇందులో […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: