సరస్వతి శపథం – సినిమా

గత రెండున్నర నెలలుగా నేను బ్లాగును వదిలేయడం ఈ బ్లాగుకి ఒక రికార్డే కానీ, నాకేమిటో చీమకుట్టినట్లయినా లేదు. అసలుకి ఏదన్నా రాయాలి అన్న కోరిక్కూడా కలగకపోయేసరికి, సర్లెద్దూ, దీనికి ప్రాప్తం లేదు అనుకుని మర్చిపోయా. ఇంతలో ఒక సినిమా చూశా. అదేమో ఒకటే తెగ గుర్తొస్తోంది, ఇలా చివరికి నా చేత ఇన్నాళ్ళకి బ్లాగు రాయిస్తోంది. సినిమా పేరు – “సరస్వతి శపథం” 1966 నాటి తమిళ సినిమా. కథ-స్క్రీంప్లే-దర్శకత్వం: ఎ.పి.నాగరాజన్.

నాగరాజన్ సినిమాలు నేను చూసినవి రెండే (నవరాత్రి, తిరువిళయాడల్) అయినా – అతని సినిమాలంటే నాకు చాలా ఇష్టం అని నిర్ణయించేసుకున్నా ఈ రెంటితోనే!

ఈ సినిమా విషయానికొస్తే – ఇదొక ఆసక్తికరమైన mythological fiction. సరస్వతి (సావిత్రి), లక్ష్మి (దేవిక), పార్వతి (పద్మిని) – ముగ్గురి మధ్య జ్ఞానం, సంపద, వీరత్వం – వీటిల్లో ఏది గొప్ప? అన్న వాదన వస్తుంది (అవునండీ, నారదుడిగా వేసిన శివాజీ గణేశనే ఇదంతా మొదలుపెట్టింది!). సరస్వతి ప్రకారం జ్ఞానం గొప్ప; లక్ష్మి ప్రకారం ధనం; పార్వతి ప్రకారం వీరత్వం: వీళ్ళు ముగ్గురూ తమ వాదన సరియని నిరూపించడానికి – భూలోకంలోని ముగ్గురు వ్యక్తులపై తమ శక్తిని ప్రయోగిస్తారు. సరస్వతి – మూగవాడైన విద్యాపతి కి (శివాజీ గణేశనే మళ్ళీ!) మాటలు రప్పించడంతో పాటు అతన్ని గొప్ప పండితుడిని చేస్తుంది. ఒక దేశపు రాజు నిస్సంతుగా మరణించబోతూ, తన ఆస్థాన ఏనుగు ఎవరి మెళ్ళో దండేస్తే వాళ్ళే తరువాతి రాజంటాడు. లక్ష్మి భిక్షగత్తె అయిన సెల్వాంబికై (కె.ఆర్.విజయ) మెళ్ళో ఆ ఏనుగు దండేసేలా చేసి, ఆమెని మహారాణిని చేస్తుంది. పరమ పిరికివాడైన మాల్య (జెమినీ గణేశన్) ను పార్వతి అపర సాహసవంతుడిగా, వీరుడిగా మారుస్తుంది. దానితో, అతడు తన దేశానికి ప్రధాన సేనాపతి అవుతాడు – విచిత్రం ఏమిటంటే ముగ్గురు దేవతలూ తమ తమ వాదనలకు బలం చేకూర్చడానికి ఒకే దేశాన్ని ఎన్నుకుంటారు. దానితో, విద్యాపతి, సెల్వాంబికై, మాల్య లు ఒకరినొకరు కలిసి, వారి మధ్య నేను గొప్పంటే నేను గొప్పనే వాదోపవాదాలు, ఆవేశకావేశాలు, గొడవలు మొదలవుతాయి. వీటి అన్నిటి మధ్య చివరికి త్రిమూర్తులు, నారదుడు, త్రిమాతలు అందరూ చివర్లో తిరిగి రంగప్రవేశం చేసి సినిమాని సుఖాంతానికి తీసుకొస్తారు. క్లుప్తంగా ఇదీ కథ.

నాగరాజన్ స్టైల్లో – తమిళ్ పై విపరీతమైన అభిమానం, “రిచ్” గా కనబడే సెట్లూ, ఎడా పెడా వాద ప్రతివాదాలతో ఎడతెగని ప్రవాహంలా సాగే తూటాల్లాంటి డైలాగులూ, అద్భుతమైన కథనం – ఇవన్నీ ఈ సినిమాలో కూడా ప్రత్యేకంగా కనబడేవి, నాకు బాగా నచ్చినవీనూ. కొంచెం వివరంగా చెప్పాలంటే –

* అద్భుతమైన సెట్లు.: ముఖ్యంగా దేవలోకం – కైలాసం, వైకుంఠం రెంటినీ పరిచయం చేస్తున్న దృశ్యాలు అద్భుతంగా అనిపించాయి నాకైతే. (ఇదిగో, ఈ వెబ్సైటులో ఈ సినిమా గురించి ఒక వ్యాసం ఉంది. అక్కడ ఓపిగ్గా కిందకి స్క్రోల్ చేసి చూస్తే, కొన్ని సెట్స్ తాలూకా స్క్రీన్ షాట్స్ కనబడతాయి)

* అబ్బబ్బబ్బబ్బా… ఏమి ప్రవాహమో ఆ సంభాషణలది!! పద్యాల్లేవనే కానీ, ప్రతి డైలాగూ అంత పొడుగున్నట్లే దాదాపుగా! 😉 ఈ నటీనటులందరికీ కూడా గొప్ప ప్రావీణ్యం ఉందిలాగుంది ఈ విషయంలో. ఇలాగ డైలాగులు రాస్తే, ఊరికే చూసినంతనే మన ఇప్పటి నటులు మూర్ఛపోతారుగాబోలు! ఏనుగొచ్చి తనని తొక్కేయబోయే క్లైమాక్సు సీనులో కూడా విద్యాపతి ఒక రెండు పేజీలైనా ఉండే డైలాగు చెప్పి గానీ ఆగడు. ఏనుగూ అంతే. విద్యాపతి ఆపేదాకా చోద్యం చూస్తూ ఉంటుంది అక్కడే నిలబడి. ఆ కాలంలో జంతువులక్కూడా చాలా ఓపిక కాబోలు!

* శివాజీ గణేశన్ : నారదుడి పాత్రలో శివాజీ నా?? అనుకున్నా సినిమా మొదలయినప్పుడు. అతగాడి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకోలా ఉంటుంది కదా? అనిపించింది. కానీ, ఇంత చిలిపిదనంగల నారదుడిని నేనే సినిమాలోనూ చూడలేదు. సహజంగానే, ఒక స్టార్ వచ్చి నారదుడిగా వేసాడు కనుక, ఆ పాత్ర స్థాయి, నిడివి, అన్నీ పెరుగుతాయనుకోండి… అయినప్పటికీ, అక్కడ శివాజీని నారదుడు డామినేట్ చేశాడు. అదే, నారదుడిని శివాజీ డామినేట్ చేస్తున్నట్లు కనబడకుండా శివాజీయే డామినేట్ చేశాడన్నమాట. అంటే మనకి నారదుడు డామినేట్ చేస్తున్నట్లే కనబడుతుంది కదా! 😉 దేవతలు ముగ్గురినీ మీరు గొప్పంటే మీరు గొప్పని మోసేస్తున్నప్పుడు, ముగ్గురూ ఒకే చోట ఉన్నప్పుడు ఎవరు పలకరిస్తే వాళ్ళని మీరే గొప్పని చెప్పేటప్పుడు – శివాజీ హావభావాలు చూడాలి… ఇంకొకప్పుడైతే ఏమనుకునేదాన్నో కానీ, ఈ మధ్య తిరువిళయాడల్ తరువాత శివాజీ అభిమాని అయిపోయా కదా, గొప్పగా అనిపించింది. amazing actor!

ఇక విద్యాపతి గా అతని నటనా ప్రదర్శన మరో ఎత్తు. అసలీ రెండు పాత్రలకీ పోలికే లేదు. ఒకటి – అతి “చిలిపి” నారదుడి పాత్ర. ఇంకొకటి అతి “ఆత్మాభిమానం” గల కవి పాత్ర. ఈ రెండో పాత్రలో శివాజీ మార్కు నాటకీయత, అభినయకౌశలం ప్రదర్శించగల పాత్ర. పేజీలకి పేజీలు ఆపకుండా డైలాగులు చెప్పుకుంటూ, వీరావేశంతో ఊగిపోయే సీన్లూ ఉన్నాయి. ఇలాంటివి శివాజీ గణేశన్ కు కొట్టిన పిండని నా అభిప్రాయం. ఈ మార్కు నటనకే నేను ఇతగాడి అతి భరించలేము లే, అనేసి మొన్నమొన్నటి దాకా తప్పుకు తిరిగినది! కానీ, అతైనా, ఇంకోటైనా, తిరువిలయాడళ్ లో భిన్న పాత్రల్లో అతని నటన, ఈ సినిమాలో విద్యాపతిని, నారదుడినీ చూశాక – శివాజీ తప్పిస్తే ఇవన్నీ ఇంకోరు చేసినా ఇంత lively గా అనిపించవేమో అనుకుంటున్నా ఇప్పుడు! ఫ్రేము ఫ్రేముకీ కనబడకపోయినా ఇది శివాజీ సినిమా!

* బ్రహ్మ గా ప్రభాకర్ రెడ్డి, శివుడిగా హరనాథ్ లను చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాను (ఆ తరువాత వెనక్కెళ్ళి “సరదాగా కష్టపడి” అక్షరం అక్షరం పలుక్కుని టైటిల్స్ చదివితే, హరినాథ్ రాజా అని కనబడ్డది శివకుమార్ పేరు పక్కన. ఓహో, ఈయన పేరదా అనుకున్నా!!). ఇంతమంది తారలందరి తళుకుల మధ్యా నన్ను విష్ణువు (శివకుమార్) ఆకట్టుకోలేదు. పైగా అర్భకంగా అనిపించాడు! కాకపొతే అందరి ఆహార్యం, వేషభాషలూ పాత్రోచితంగా ఉన్నాయి. సావిత్రి, దేవిక, పద్మిని లు నిజంగా మెరిసిపోయారు. శివుడి నృత్యం ఉంటుందనుకున్నా. అందుకు బదులుగా ఈ సినిమాలో పార్వతి పద్మిని కనుక, పార్వతి నృత్యం ఉంటుంది 🙂 దేవిక/లక్ష్మి పేరుకు తగ్గట్లు భలే మిరుమిట్లు గొలిపింది. జెమినీ గణేశన్ కి అంత వీర లెవెల్లో రోల్ లేదు కానీ, ఉన్నంతసేపూ వీరుడిలా చూడ్డానికి బాగున్నాడు. కె.ఆర్.విజయ ని కె.ఆర్.విజయా? అని నమ్మడానికి చాలా సేపు పట్టింది. అంత చిన్నగా ఉందన్నమాట 🙂 ఆ పాత్రకి సరిగ్గా అతికినట్లు సరిపోయింది. నగేశ్-మనోరమలు పర్వాలేదు. అసలుకి ఈ కాస్ట్ ఎంపికలోనే ఈ సినిమా తాలూకా మూడోవంతు అందం ఉంది. ఒక వంతు విజువల్స్, మరో వంతు స్క్రీంప్లే అనమాట.

నేచురల్లీ, నేను సావిత్రి ఫ్యాన్ ని కూడా కనుక, ఆవిడ గురించి కొంచెం ఎక్కువ చెప్పుకుంటాను. సావిత్రి సరిగ్గా సరస్వతి అనగానే ఎలా ఊహించుకుంటానో అలాగే అనిపించింది నాకు. హుందాగా, నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తూనే, కోపం వచ్చిన దృశ్యాల్లో మాత్రం విపరీతమైన తీవ్రత ఉన్నట్లుగా ప్రవర్తిస్తుందన్నమాట. (సినిమా చూడ్డానికి సావిత్రి సరస్వతన్నది నా రెండో కారణం, నాగరాజన్ కాకుండా). సినిమా టైటిల్ చూసి కథ సావిత్రి చుట్టూ తిరుగుతుంది కాబోలని మొదలుపెట్టిన నాకు ఆ పరంగా సినిమా కాస్త నిరాశను మిగిల్చింది. ఏదో, త్రిమాత శపథం టైపు పేరు పెట్టాల్సింది. పైగా, వాళ్ళ శపథాలే కథని నడిపించినా కూడా, శివాజీ లేనిదే సినిమా లేదు (శివాజీగా, నారదుడిగా – రెండు రకాలుగానూ!). అయినా, సరస్వతి దేవి పాత్రను ప్రధాన పాత్రల్లో ఒకటిగా పెట్టిన సినిమాలు, ఆమె పద్మం బయటకొచ్చి నడయాడిన సినిమాలూ నేనేవీ చూడలేదు కనుక, సావిత్రిని అలా చూడ్డం నాకు చాలా నచ్చింది. సినిమా రెండో అర్థంలో, లక్ష్మి-పార్వతిలతో జరిగిన సంభాషణ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ సీక్వెన్స్ లలో ఒకటి. ఇక్కడ సావిత్రి నటన కూడా. (ఈ సీక్వెన్స్ ఇక్కడ చూడవచ్చు..మూడో నిముషం అయిపోయాక మొదలవుతుంది)

* పాటలన్నీ జనరంజకంగా ఉన్నాయి (catchy అని నా భావము). మొదట్లో సావిత్రి/సరస్వతి/పి.సుశీల పాడిన “గోమాతా…ఎంగళ్ కుల మాతా” పాట వినీ వినగానే ఇది నాకెప్పట్నుంచో తెలిసిన పాటేగా! అనిపించింది. మరి ఇది తెలుగులో కూడా ఉందో ఏమిటో, నాకర్థం కాలేదు. “ఉరువత్తె కాట్టిడుం కణ్ణాడీ”, జైల్లో సాగే “రాణి మహా రాణి“, నారదుడి “కల్వియా? సెల్వమా? వీరమా?” పాటలు నాకు చూడ్డానికి అన్నింటికంటే బాగా నచ్చాయి (అందుకే విడియో లంకెలు ఇస్తున్నా అనమాట!). విద్యాపతి కి మాటల్రాగానే సరస్వతి ని స్తుతి చేసే పాట, సెల్వాంబికై భిక్షాటన చేస్తూ పాడే పాట కూడా నాకు చాలా నచ్చాయి. (ఇక రాగాలో లిస్టింగ్ ప్రకారం మిగిలిపోయింది ఒకే పాట లెండి! అది ఇదే! పాటలో నాకు నచ్చలేదనడానికి ఏమీ లేదు. ఏదో, తక్కిన పాటలు బాగా ఆకట్టుకున్నాయంతే!)

* మనోరమ తమిళ్ మాట్లాడే పద్ధతి భలే వెరైటీగా ఉంటుంది. సినిమాలో కూడా దాన్ని గురించి వివిధ వ్యక్తులు జోకులేస్తారు. ఈ సినిమాలో నగేశ్-మనోరమల సంభాషణలు కొంచెం హాస్య కాలక్షేపం అనమాట. మనోరమ మాటలు వింటూంటే నాకు ఇక్కడ జర్మనీలో శ్రీలంక వాళ్ళు మాట్లాడే తమిళ్ గుర్తొచ్చింది ఎందుకో. మా అమ్మా వాళ్ళు మాట్లాడే తె-తమిళ్, సిటీల్లో మాట్లాడే తమిళ్ కాక, నేను కాస్తో కూస్తో నిజజీవితంలో విన్న తమిళ్ అదొక్కటే అయినందుకు అనుకుంటాను, నాకు సిలోను వాళ్ళ తమిళం కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది!!

* సబ్టైటిల్స్ లేకుంటే చాలా చోట్ల, ముఖ్యంగా పాటల్లో చాలా భావం నేను మిస్సయ్యే దాన్ని … నేను అర్థం చేస్కునే వేగానికంటే వేగంగా సాగాయి వాదోపవాదాలు. పైగా, భాష కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండింది నాకు. ఏమైనా, ఆ సబ్టైటిల్స్ కొన్ని క్షణాలు అటూ ఇటూగా వస్తాయి కనుక, బొత్తిగా అసలుకి భాషే తెలియని వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగవచ్చు.

..మొత్తానికి నా దృష్టిలో అద్భుతమైన సినిమా. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా, పౌరాణిక సినిమాలు చూసే ఆసక్తి ఉన్న వారు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. సినిమా చూడాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఇదిగో యూట్యూబు లంకె!! నాగరాజన్ పై నా అభిమానం రెట్టింపైంది. మరేవన్నా సినిమాలు కూడా వీలు వెంబడి చూడాలి!

Advertisements
Published in: on February 10, 2013 at 6:45 pm  Comments (11)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/02/10/saraswathisapatham/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. కేక రివ్యూ. ఇప్పుడు నాక్కూడా చూడాలనుంది.
  తమిళ సంభాషణల గురించి నా అబ్సర్వేషను – మనకి తెలుగు మాండలికాలు యాసలున్నట్టే, తమిళంలోనూ ఉన్నాయి. ఇట్లాంటి ఆత సినిమాల్లో హాస్య పాత్రలకి ఇటువంటి మాండలిక యాసలు పెట్టారేమో. మొత్తమ్మీద ముఖ్యపాత్రలన్నీ మన శిష్ట వ్యావహారికం లాంటి ఒక న్యూట్రల్ తమిళ్ మాట్లాడుతాయి. 90లలో మొదలైన న్యూ వేవ్ దర్శకులు సినిమా మొత్తానికి ఒకే యాస ఉపయోగించడం చేస్తున్నారు.

 2. రివ్యూ బాగుంది సౌమ్య గారు. నా చిన్నప్పుడు దీనిని తెలుగులో చూసాను. ఒక్క నారదుడి పాట తప్ప కథేం గుర్తు లేదు. రివ్యూ ద్వారా సినిమా అంతా గుర్తుచేసారు. అభినందనలు. తెలుగులో ఘంటసాల పాడిన పాటల లింకులు క్రింద ఇస్తున్నాను. విని ఆనందించండి.

  విద్యయా విత్తమా వీరమా:

  రాణి మహారాణి:

  • ధన్యవాదాలు కేకే గారూ! అయితే, సినిమా తెలుగులోకి డబ్ చేసారు అనమాట. “గోమాతా..” పాట కూడా ఇలాగే దొరుకుతుందేమో చూస్తాను 🙂 Thanks again for the information!

 3. […] ప్రధాన పాత్రలు అయ్యారు. మధ్యలో సమస్త దేవతలూ సాక్షాత్కరించారు. మరి విష్ణువు […]

 4. 1000 telugu free e books
  http://WWW.MOHANPUBLICATIONS.COM

 5. Nice review after a long lay off!
  I had seen the drama version of Sri APN’s saraswathi sapatham , in Madras, ahead of the movie , with very impressive sets and excellent entertaining viewing.

 6. 1000 telugu free e books
  http://WWW.MOHANPUBLICATIONS.COM

  • Sir, I get your point. Please don’t spam leaving the same unrelated-to-the-post kind of comment again and again.

 7. […] చిత్రం. మొదట దేవుళ్ళు (తిరువిళయాడల్, సరస్వతీ శపథం, కందన్ కరుణై) అయ్యాక భక్తుల వద్దకు […]

 8. kasta telugu cinimalanu kooda parichayam cheyyandi madum.

  • Sir, visit navatarangam.com, http://chitram.maalika.org/ – for talk on movies.. of any language. Meanwhile, I will surely write about a Telugu movie some other time, when I watch something that I feel compelled to write about.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: