Women Writing in India (Volume-1) – 1

ఇదివరలో “మహిళావరణం” పుస్తకం చదవడం మొదలుపెట్టి, అక్కడి నుండి “డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర” వైపుకి మళ్ళాను అని ఈ బ్లాగు చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ పుస్తకం ముగించే వేళకి సుసీ తారు, కె.లలిత ల సంపాదకత్వంలో వెలువడ్డ Women writing in India, 600 B.C. to the present అన్న పుస్తకం మా లైబ్రరీలో దొరికింది. ఆ పుస్తకం మొదలుపెట్టి, మరి కొందరు తెలుసుకోవలసిన మహిళల గురించి చదువుతున్నాను. ఇది రెండు భాగాల సంకలనం. ప్రస్తుతం మొదటి భాగం – 600 B.C. to the early 20th Century చదువుతున్నాను. ఇదివరకట్లాగే, ఒక్కోరి గురించీ నోట్సు రాసుకోవాలని నా ఆలోచన.

పుస్తకంలో మొత్తం పదకొండు భారతీయ భాషలకి చెందిన రచయిత్రుల గురించి చిన్న పరిచయాలూ, ఎంపిక చేసిన ఒకట్రెండు రచనలకు ఆంగ్లానువాదాలు ఉంటాయి. ఇవి కాక, మధ్య మధ్యలో సంపాదకులు రాసిన పరిశోధనా వ్యాసాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి రచయిత్రుల పరిచయాల గురించి మాత్రం చెప్పుకుంటాను… ఆ పరిశోధనా వ్యాసాలు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. రచనా శైలి బానే ఉంది కానీ – ఏది గ్రహించాలి, ఏది విసర్జించాలి (కొన్ని చోట్ల అసలు విషయాన్ని ఫెమినిస్టు దృక్కోణం డామినేట్ చేస్తున్నట్లు నాకు తోచింది) అన్నది తేల్చుకోవడంలో కొంచెం సమయం తీసుకుంటున్నందువల్ల, రచయిత్రుల గురించి మాత్రమే రాస్తున్నా ఇప్పటికి.

*****
Section – 1: Literature of the Ancient and Medieval Periods:

1. Therigatha (6th Century B.C.): theri అంటే బౌద్ధులలో మహిళా భిక్షువులు- బుద్ధుడి సమకాలికులు. వీళ్ళు పాడుకునే పాటలు అన్నీ అప్పట్నుంచే ఉన్నా ఆ తర్వాత ఎప్పుడో క్రీస్తు పూర్వం 80వ సంవత్సరంలో మొదటిసారి డాక్యుమెంట్ చేశారట. ఈ సంకలనాన్నే Therigatha అంటారు.

“The focus of each lyric in the Therigatha is an epiphanic experience in which the painful constrictions of secular life fall away and the torment of feelings subsides as the peace and freedom of nirvana are attained. Nesting within and shaping the moment is an autobiographical fragment, for as the poets testify to the transofrmative power of Buddhism and exult in their new life, they contrast it to the painful worlds they leave behind”

-అంటారు సంపాదకులు. ఇందులో ప్రస్తావించబడ్డ కవయిత్రులు – Mutta, Ubbiri, Sumangalamata, Mettika. వీరి గురించి ఎక్కువ వివరాలు లభ్యం కావడంలేదట. పాళీ భాష నుండి ఆంగ్లానువాదం చేసిన వారు: ఉమ చక్రవర్తి, కుంకుం రాయ్.

2. Sangam Poets (100 B.C. – 250 A.D.) : సంగం కాలం నాటి తమిళ కవిత్వం మనకి లభ్యమౌతున్న సెక్యులర్ కవిత్వంలో అతి ప్రాచీనమైన వాటిలో ఒకటి అంటారు. వివిధ కవులు రాసిన ఈ కవితల్లో కొందరు మహిళలు ఉన్నారు. ఈ కవితలు ప్రధానంగా రెండు రాకాలుగా ఉంటాయి – అకం, పరం. అకం కవితలు లోపలి ప్రపంచాన్ని గురించి, ప్రేమను గురించీ ఎక్కువగా ప్రస్తావిస్తే, పరం కవితలు బాహ్య ప్రపంచం గురించి ఉంటాయి. ఈ యుగం కవయిత్రులలో అవ్వయ్యార్ పేరు అందరికీ తెలిసినదే. తమిళ పాఠశాల విద్యలో కూడా అవ్వయ్యార్ కవితలు చదువుతారని విన్నాను. ఇక, ఇక్కడ కూడా ఈ రచయిత్రుల జీవితాల గురించి ఎక్కువ వివరం తెలిసినట్లు లేదు. ఇందులో ప్రస్తావించబడ్డ కవయిత్రులు – Venmanipputi, Velli Vitiyar, Auvaiyar, Kavar Pentu, Kakkaipatiniyar Naccellaiyar, Okkur Macattiyar.

3. Akka Mahadevi (12th Century): ప్రముఖ కన్నడ కవయిత్రి. ఏదో ఒక సందర్భంలో ఈవిడ పేరు అందరూ వినే ఉండవచ్చు. ఇళయరాజ అభిమానులైతే, తప్పకుండా ఆయన స్వరపరచిన అక్క మహాదేవి పాటలు కొన్ని కూడా వినే ఉంటారు. షిమోగా జిల్లాలోని ఉడుతడ ప్రాంతంలో జన్మించిన ఈవిడ చిన్న వయసులోనే వీర శైవ మత అనుయాయియై చెన్నమల్లికార్జునుడి పేర దాదాపు 350 పాటలు వ్రాసారు. ఇక్కడ వివరించిన దాన్ని బట్టీ, ఉదాహరణగా ఇచ్చిన సుసాన్ డేనియల్, ఎ.కె.రామానుజన్ ల ఆంగ్లానువాదాలను బట్టీ చూస్తే, ఆవిడ ఆ కాలానికి కొంచెం సంచలనాత్మకమైన వర్ణనలతో రాసినట్లు తోస్తోంది నాకు.

4. Sule Sunkavva (12th Century) : ఈవిడ కూడా కన్నడ కవయిత్రే. నిర్లజ్జేశ్వరా! అన్న మకుటంతో వ్రాసారట. ఈవిడ కూడా వీరశైవ మతానుయాయే. వృత్తి రిత్యా వ్యభిచారిగా ఉన్న వారిలో భక్తి ఉద్యమంలో పాల్గొన్న వారు అరుదని ఈవిడ గురించి వ్రాస్తూ సంపాదకులు అన్నారు. సుసాన్ డేనియల్ ఆంగ్లానువాద కవిత కూడా శివుడితో వ్యభిచార వృత్తి ధర్మం గురించి చెబుతున్నట్లే ఉంది. నాకెందుకో “శివదీక్షా పరురాలనురా” పాట గుర్తొచ్చింది.

5. Janabai (1298-1350): మరాఠీ భక్తి ఉద్యమంలో ఒక గుంపు అయిన వర్కరి జాతి కవయిత్రి. ప్రధానంగా వారి ఇష్ట దైవం అయిన విఠోభా ను తన దైనందిన జీవితంలో సహచరుడిగా ఊహిస్తూ కవిత్వం వ్రాసారట. విలాస్ సారంగ్ అంగ్లానువాదం చేసిన రెండు కవితలు ఈ పుస్తకంలో పొందుపరచారు.

6. Rami (1440): చాకలి వాళ్ళ కుటుంబంలో పుట్టిన రామి బెంగాల్ లో పని కోసం ఆ ఊరూ, ఈ ఊరూ తిరుగుతూ, ననూర్ అనే పల్లెటూరు చేరుకుని, అక్కడి గుడిలో దేవుడిపై పాటలు రాసి పాడ్డం మొదలుపెట్టిందట. ఇవి బెంగాలీ మహిళ రాసిన తొలి పద్యాలు అని సంపాదకుల అభిప్రాయం. ఈ సమయంలోనే అగ్రకులస్థుడైన బెంగాలీ కవి చండీదాస్ తో ఆమె పరిచయం ప్రేమ గా మారి, ఊళ్ళో వాళ్ళ తిరస్కారానికి గురయ్యారు ఇద్దరూ. ఆ తరువాత ఆయన మరొకావిడ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఫలితంగా ఆమె భర్త కోపానికి బలై మరణించాడు. రామి కవితల్లో ఆ వేదన, ప్రేమా రెండూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయని అంటారు. “Never once does she whine or plead; she demands from life a right that should be hers because of her great love” – ఈ ఒక్క వాక్యం రామి కవితా స్వరూపాన్ని వివరించినట్లు నాకు అనిపించింది. రామి రెండు కవితలకి మాలిని భట్టాచార్య, సుమంత బెనర్జీ చేసిన ఆంగ్లానువాదాలు ఈ పరిచయ వ్యాసంతో జతచేశారు.

7. Gangasati (12th-14th Century): గుజరాతీ భక్తి కవయిత్రి. చిన్నప్పట్నుంచే చాలా భక్తి భావన ఉన్నందువల్ల పెళ్ళయ్యాక భర్తను కూడా తన మార్గంలోకి మళ్ళించారు. ఆయన వైరాగ్యంలో సమాధిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాక, ఈవిడ నేనూ వస్తానంటే, ఆయన “కోడలికి కూడా భక్తి మార్గంలోకి వెళ్ళేందుకు కావలసిన శిక్షణ ఇచ్చి వెళ్ళు” అన్నారట. దానివల్ల ఆవిడ సత్యాన్వేషణ పథం గురించి కోడలికి వివరిస్తూ రూపొందించిన 40 భజనలు అలా జనాల నోళ్ళలో నాని క్రమంగా వ్రాత రూపం దాల్చాయి. నీతా రమైయా అనువాదం చేసిన ఒక భజన ఈ పుస్తకంలో ఉంది.

8. Ratanbai (12th-14th Century): ఈవిడ గురించి వివరాలేవీ తెలియవంట కానీ, తన కాలంలో బాగా పేరుపొందిన గుజరాతీ భక్తి కవయిత్రి. నీతా రమైయా అనువాదం చేసిన ఒక కవితలో తన spinning wheel తనకెలా ఆధారమైందో చెబుతారు.

9. Mirabai (1498-1565): ఈవిడ కృష్ణుడిపై రాసిన భజన్లు ఇప్పటికీ జనం నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. ఆవిడ భజన్లు గుజరాతీ, హిందీ రెండింటిలోనూ ఉన్నాయి. ఆవిడ కథతో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. నితా రమైయా గుజరాతీ నుండి చేసిన రెండు ఆంగ్లానువాదాలు; F.E.Keay, J.S.Hawley, M.Jeurgensmeyer హిందీ నుండి చేసిన రెండు ఆంగ్లానువాదాలు ఈ పరిచయంతో పొందుపరిచారు.

10. Atukuri Molla (Early 16th Century): తెలుగులో లభ్యమవుతున్న మహిళల రచనల్లో మొల్ల రాసిన రామాయణమే మొదటిదట. బి.వి.ఎల్.నారాయణరావు చేసిన అనువాదం నుండి కొన్ని పద్యాలు ఇక్కడ వ్యాసంతో జతచేశారు. మొల్ల గురించి నిడదవోలు మాలతి గారు వివరంగా రాసిన రెండు వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ.

*******
(మిగితా వారి గురించి రాబోయే టపాలలో)

Advertisements
Published in: on September 10, 2012 at 7:00 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/10/women-writing-in-india-volume-1-1/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. This is an awesome book. I have both volumes. BTW, I had the good fortune of working with K. Lalita for a couple of years.

  2. […] సిరీస్ లో మొదటి భాగం ఇక్కడ చూడవచ్చు) […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: