కొత్త నేస్తాల కోసం, కాస్తాలస్యంగా…

నేను ఎలాంటి మనిషినో గత ఏడాది ఇదే సందర్భంలో రాసిన పోస్టులో తెలియజేశాను. అలాటి నా చుట్టూ ఎన్ని తులసిమొక్కలు అల్లుకున్నాయో కూడా అక్కడ వివరంగా చెప్పాను. అయితే, వీటిల్లో చాలా మట్టుకు స్నేహాలు మొదట్లో నేను మనుషుల్తో ఎంతో కొంత మంచిగా, మర్యాదగా ప్రవర్తించిన రోజుల నాటివే. గత మూణ్ణాలుగేళ్ళ కాలంలో నేను మరీ మెయిళ్ళకి స్పందించకుండా, పుట్టినరోజులు గుర్తున్నా విష్ చేయకుండా… ఇలా తయారయ్యాక ఏర్పడ్డ పరిచయాలే చాలా తక్కువ, స్నేహాల మాట అటుంచి. వీళ్ళలోనూ ధగధగా మెరిసి పోయే వజ్రాలు ఉన్నారనుకోండీ…నాకు దగ్గరగా వాళ్ళెలా ఉన్నారూ? అన్నదే చిదంబర రహస్యం నాకెప్పటికీ.

ఇంతకీ, గత ఏడాదిన్నరగా దేశానికవతల, భాష రాకుండా నెట్టుకొస్తున్నానా – ఇక్కడికి వచ్చినప్పుడు పరమ వీర ధృఢ నిశ్చయంతో వచ్చా – మనిషన్న వాడిని ఎవ్వరినీ నాకు దగ్గరగా రానివ్వనని. అయితే, కొంతమంది మహానుభావుల/రాళ్ళ వల్ల ఇప్పటికి కూడా నా జీవితంలో స్నేహ సుమాలు ఇంకా విరబూస్తూనే ఉన్నాయి. వాళ్ళ కోసం. వాళ్ళకోసం మాత్రమే ఈ టపా. దీన్ని చదవగలిగే వారు ఇద్దరే ఈ జాబితాలో. ఇద్దర్లో ఒక్కరికి ఈ బ్లాగు తెలియదు. కనుక, ఇది నాకు నేనే చెప్పుకుంటున్నట్లే…పేర్లు చెప్పకుండా మీ అందరికీ చెప్పుకుంటున్నట్లే! ఆ బ్లాగు చదివే ఒక్కరికీ నేను చెప్పనక్కర్లేదు ఎలాగో! వారికి నేనెప్పుడూ అలా బహిరంగంగా థాంక్సులు చెప్పుకోలేదు కానీ, ఇదిగో ఇప్పుడు చెప్పుకుంటున్నా!

నాకు ఆట్టే ఆధునిక జీవన శైలుల్లో పెద్దయ్యాక మంచి స్నేహాలు ఏర్పడతాయన్న అభిప్రాయం లేదు. అందునా, తెలుగు/మహా అంటే తమిళ జీవితంతో తప్ప ఇంకొక్క దానితో ఐడెంటిఫై చేసుకోలేని నాకు విదేశీయులతో మామూలు పలకరింపు స్నేహాలు దాటి ముందుకు వెళ్తుందన్న నమ్మకం కూడా ఉండేది కాదు. ఇప్పుడేదో జన్మజన్మల స్నేహాలు ఇంతలోపే ఏర్పడిపోయాయని కాదు కానీ, గత ఏడాదిన్నరగా…ముఖ్యంగా గత నెలన్నరగా మాత్రం – ఎన్నోసార్లు ఇక్కడి స్నేహితులకు మనసులోనే థాంక్సులు చెప్పుకున్నానో!

ఎందుకో – వీళ్ళందరూ నేను అంటీముట్టనట్లు వ్యవహరించినా కూడా నాతో ఇంత మంచిగా ఉంటారు, తల్చుకుంటేనే వింతగా ఉంటుంది!! ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది – ఇంత మంచోళ్ళే వీళ్ళందరూ, నేను తగిలానేంటి వీళ్ళకి? అని. పోనీ, రోజూ కలిసేవారైనా ఒకరకం (అంటే డిపార్ట్మెంటు వాళ్ళన్నమాట). కొందరు – మనమెప్పుడో కొన్నాళ్ళు కలిసి తిరిగిన వాళ్ళు – అంటే, మొదట్లో ఈ దేశమొచ్చిన కొత్తల్లో ఉన్న గది పక్క గదిలో ఉన్న వారో, జర్మన్ క్లాసులో కలిసిన వారో : ఇలాగన్నమాట. వీళ్ళు మరీనూ – నేను ఫేస్బుక్ గట్రాల్లో లేకపోయినా సరే, ఈమెయిల్స్ చేసి మరీ హలో చెబుతూ ఉంటారు. ఎప్పుడీ ఊరు వచ్చినా కలవడం మానరు. ఇక్కడే ఉన్నవారేమో ఎప్పుడైనా పక్కూళ్ళకి ట్రిప్పులు వేసినా పిలవడం మానరు. పుట్టినరోజు గుర్తు పెట్టుకుని, అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను అనేసి, గిఫ్ట్ కొని పెట్టి నేను రాగానే కలిసినప్పుడు ఇచ్చిందో స్నేహితురాలు. నేనెంత అవాక్కయ్యానో మాటల్లో చెప్పలేను. ఎప్పుడూ మరీ ఇంత ఏకపక్షంగా ఉంటోందే అని, ఎట్టకేలకి నేను కూడా నాకునేనుగా క్షేమసమాచారాలు అడగడం, ట్రిప్పుల గురించి అడగడం మొదలుపెట్టా ఇప్పుడు! అప్పుడప్పుడూ అన్నా “ఛా! మనం ఇలా ఉండకూడదు. కాస్త స్నేహంగా ఉండాలి” అనిపిస్తోందీ అంటే అది వాళ్ళ పుణ్యమే.

నా ప్రవర్తన ఎలా ఉన్నా కూడా అభిమానంగా పలకరిస్తారు మా డిపార్ట్మెంట్లో చాలామంది. వీళ్ళందరి వల్ల, నేనే నా పంతాలు వదిలేసి కొంచెం స్నేహంగా మారుతున్నా ఏమో అనిపిస్తుంది. అసలు హైలైట్ ఏమిటంటే, యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఉన్న కాలంలో ఇద్దరు హౌస్ కీపర్లు ఉండేవాళ్ళు – వాళ్ళకి వాళ్ళకి పడదు కానీ, ఇప్పటికీ నేను రోడ్డు మీద కనిపిస్తే ప్రతిసారీ ఆపి క్షేమసమాచారాలు అడుగుతారు – నాకు రాని జర్మన్లో నేను సమాధానం చెబుతా! ఈ ఊరొచ్చిన కొత్తల్లో ఒక బేకరికి వెళ్ళేదాన్ని. ఆవిడ కూడా ఎక్కడ కనబడ్డా ఆపి క్షేమసమాచారాలు అడుగుతుంది. వీళ్ళంతా అందరితోనూ అలాగే ఉండొచ్చు కానీ, నేను నాకు నేనుగా, ఏ ప్రోద్భలం లేకుండా ఎవరితోనూ అలా స్నేహంగా ఉండను కనుక, నాకు ఇదంతా ఎంతో ఆనందం కలిగిస్తుంది ప్రతిసారీ!

వీళ్ళందరి దురదృష్టం కొద్దీ నేను తగిలి ఉండొచ్చు కానీ, ఇన్ని రెట్ల అదృష్టం నాకు మరి! నేను ఊళ్ళో లేనప్పుడు ఇంట జొరబడి, మా ఇంటావిడ చేసిన కొన్ని దారుణ చర్యల వల్ల నెలన్నర క్రితం ఇండియా ట్రిప్పు నుంచి రాగానే నేను ఇల్లు ఖాళీ చేద్దామని నిశ్చయించుకున్నాను. ఈ సమయంలో మా కొలీగ్స్ చేసిన సాయాలు, అందించిన ఎమోషనల్ సపోర్ట్ మరువరానివి. ఇంతమంచోళ్ళ మధ్య నేనేమిటి – తులసీ వనంలో గంజాయి మొక్కలా! అనిపించింది.

ఇళ్ళు వెదుకుతున్న రోజుల్లో ఒకరోజు మహ జోరుగా వర్షం. అప్పుడే ఒక ఇంటికి వెళ్తే – చివరి రౌండు పరిశీలనకి ఇద్దరం మిగిలాం. ఆ ఇంటావిడ ఇద్దర్నీ చూసి, రెండో ఆవిణ్ణి చూపిస్తూ నాతో – “ఈ అమ్మాయి సింగిల్ పేరెంట్. తనకి ఇల్లు దొరకడం నీకంటే కొంచెం కష్టం. కనుక నేను తనకి ఇస్తాను. నీకు దొరికేస్తుందిలే ఎక్కడన్నా” అన్నది. నేను ఆసరికి మా ఇంటావిడతో గొడవలో ఉన్నా కనుక నాకు విరక్తి వచ్చేసి, వర్షంలో నాలుగు కి.మీ. కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోయా. అప్పూడే ఒక స్నేహితురాలికి ఫోన్ చేసి – “మీ ఇంటికి వస్తున్నా” అన్నా. తెలుగమ్మాయి కనుక సరిపోయింది కానీ, లేదంటే ఏ విదేశీ ఫ్రెండో అయ్యి ఉంటే బహుశా నన్ను తిట్టేవాళ్ళు ఏమో! 🙂 కానీ, ఆవేళ అక్కడికి వెళ్ళాక కాసేపట్లో ఎంత కాం డౌన్ అయ్యి, “ఆ కొన్ని రోజుల్లో దొరక్కపోదులే ఇంకో ఇల్లు…ఇంకా నెల టైం ఉందిగా నేను ఖాళీ చేస్తానన్న రోజుకి” అనుకోగలిగా. తనకెన్ని థాక్సులు చెప్పుకున్నానో! అయినా చాలదు.

రకరకాలుగా నన్నాదుకున్న మరొక్క స్నేహితురాలు ఉంది. ఒక విధంగా చూస్తే, అవన్నీ దైనందిన జీవితంలో కావాల్సిన విషయాల్లో చేసినా సాయాలే తప్ప మా వ్యక్తిగత జీవితాల మధ్య సంబంధం లేదు. కానీ, అదైనా చేయాల్సిన అవసరం తనకి లేదు. అందునా నేను ఎప్పుడూ బ్రతిమాలుకోలేదు. ఒకసారి అడిగితే చాలు – సాయం అందించేది. ఒక్కొక్కసారి ఎక్కడ నాకు తెలియక ఏదన్నా విషయంలో పొరపాటు చేస్తానేమో అని ముందునుంచే చెప్పి ఉంచేది (అంటే ఇప్పుడూ ఉంది లెండి!) – వీళ్ళంతా బేసికల్లీ మంచోళ్ళు కనుకా, ఇదంతా వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళకి మామూలుగా అనిపించవచ్చు కానీ, నేను కౄరమైన మనిషిని అని నాకు తెలుసు కనుక – “నా లాంటి మనిషికా వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు!” అన్న ఆశ్చర్యం నాకు ఎప్పటికీ ఉంటుంది. తను నన్ను స్నేహితురాలిగా చూస్తూండకపోవచ్చు, కేవలం కొలీగ్ గానే చూడవచ్చు – అది వేరే సంగతి. నేనైతే (నా సంగత్తెలుసుగా!) ఒక కొలీగ్ కి అన్నిసార్లు సాయం చేసి ఉండకపోవును, అంత అభిమానంగా మాట్లాడకపోవును!!

వాళ్ళ దృష్టిలో వాళ్ళు బహుశా నాకు సాయం చేసిన వాళ్ళు అనో, లేదా మామూలుగా అందరితో ఉన్నట్లే నాతోనూ స్నేహంగా ఉంటున్నట్లో అనుకుంటూ ఉండవచ్చు. అసలుకి నేను ఈ దేశం వదిలాక వాళ్ళకి నేను గుర్తు ఉండకపోవచ్చు కూడా. అది నాకనవసరం. కానీ, వీరందరూ లేకపోతే నా జీవితం మరోలా ఉండేది అనిపిస్తుంది. కనుక, నా దృష్టిలో వీళ్ళందరూ నా స్నేహితులే! ఈ మంచోళ్ళందరికీ ఒక సారి సారీ. వందసార్లు థాంక్సులు. నేనూ ఎప్పుడో మీలాగా స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్న అబద్దపు వాగ్దానం (ఎలాగో వీళ్ళకంతా తెలుగు రాదుగా. చదవరు!).

అంతా అయ్యాక, ఎప్పట్లాగానే – ఇలాగ అదృష్టానికి బహిరంగంగా మురిసిన నాటి పరిణామాల గురించి తల్చుకుని భయపడ్డా, “ఏడిసావ్లే, అరిగిపోయిన రికార్డులా మళ్ళీ మళ్ళీ అదే ముక్క అనుకుంటావేమిటీ? మూవ్ ఆన్!” అన్న అంతర్వాణి ఘోషను వింటూ….

Happy friendship day!

Advertisements
Published in: on August 7, 2012 at 7:24 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/07/kottanestalakosam/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. It is like a mixture 🙂

  2. .

  3. mIru lady Howard Roark annamaaTa. ilaamTi imkokaru naaku telusu 😀

    • :)) Lady Howard Roark – అంత గొప్ప పేర్లెందుకు లెండి! ఏదో, కొన్ని కారణాల వల్ల అలా ఉన్నా అంతే. రోర్క్ స్థాయిలో ఆలోచించడం నా వల్ల కాదు లెండి 😉

  4. క్రూరమైన మనిషి, గంజాయి మొక్క, ……ఏమిటోనండి మీ బాధ,హ.హ…. మొత్తం మీద మీరు మంచి ఫ్రెండు కాదు ఎవరికి, ఫ్రెండ్ షిప్ నేచర్ లేదు మీకు ,ఇదేనా మీరు చెప్పాలనుకుంది,…….. HAPPY FRIENDSHIP DAY.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: