మహిళావరణం-4

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

31) సూర్యదేవర రాజ్యలక్ష్మి (1914-2010): 1930లలో స్వతంత్ర్యోద్యమం మొదలుకుని 1992లో సారా వ్యతిరేకపోరాటం దాకా అనేక ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నవారు. 1936లో హిందీ పాఠశాల స్థాపించి అన్ని కులాల స్త్రీలకి హిందీ బోధించడమే కాకుండా, జాతీయోద్యమంలో పాల్గొనడానికి, జైలుకి వెళ్ళడానికి వారిని ప్రోత్సహించారు. ఆంధ్ర రాష్ట్రోద్యమం సమయంలో “తెలుగుదేశం” అన్న పత్రిక కూడా నడిపారు.

32) జె. ఈశ్వరీ బాయి (1918-1991): అంబేద్కర్ ప్రభావంలో రాజకీయాలలోకి వచ్చి అనేక సాంఘిక సమస్యల గురించి, దళిత వర్గాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశారు.

33) జ్ఞానకుమారి హెడా (1918-2008): ఉత్తర ప్రదేశ్లో పుట్టిన జ్ఞాన కుమారి గారు చిన్న వయసు నుండే జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనేక పర్యాయాలు జైలుకు కూడా వెళ్ళారు. 1946 నుండీ 49 వరకూ స్టేట్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యులలో ఒకే ఒక మహిళగా ఉన్నారు. హైదరాబాదులోని కస్తూర్బా ట్రస్టును తీర్చి దిద్దారు. స్వతంత్ర్యానంతరం క్రియా శీలక రాజకీయాల నుండి తప్పుకుని సాంఘిక సంస్థల్లో పనిచేశారు. “హైదరాబాదులో సాంఘిక, రాజకీయ చైతన్యం పెరగడానికి పనిచేసిన తొలితరం మహిళ జ్ఞానకుమారి హెడా” అన్నారు పుస్తకంలో.

34) కొమురం సోంబాయి (1918-1994): “గొండోడు గడకకు గింజలు అడిగితే, ఆకాశంలో సూర్యుణ్ణి అడిగినంత నేరమా?” అని ప్రశ్నించిన సోంబాయి గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. నెల వయసున్న కొడుకుని నడుముకు బిగించి కట్టుకుని మరీ నిజాం సైనికులు గొండు శిబిరాలపై చేసిన యుద్ధంలో పాల్గొన్నారు. గిరిజన ప్రజల పోరాట స్పూర్థికి నిదర్శనంగా చెప్పుకునే సోంబాయి కొమురం భీం సతీమణి.

35) కె.సుగుణమణి (1919 – ): దుర్గాభాయి దేశ్‌ముఖ్ సహచరురాలిగా, సంఘ సేవిక గా ప్రసిద్ధులు. అనేక సాంఘిక సేవా సంస్థలలో పనిచేసారు. గిరిజనాభివృద్ధికి కూడా విశేష కృషి చేశారు. సుదీర్ఘ కాలం వివిధ పదవుల్లో ఆంధ్ర మహిళా సభలో వివిధ బాధ్యతలు నిర్వహించారు.

36) చిట్యాల ఐలమ్మ (1919-1985): తెలాంగాణ పోరాటంలో కీలక ఘట్టానికి నాంది పలికిన వ్యక్తిగా, చరిత్ర కథనాల్లో “చాకలి ఐలమ్మ” ప్రస్తావించబడ్డారు. తన పొలంలో పండిన పంటను దక్కించుకోవాలనే పట్టుదల పర్యవసనాలు ఐలమ్మ రాబోయే కాలంలో ఉద్యమంలో పూర్తిస్థాయిలో మునిగిపోయేలా చేశాయి. ఒక పోరాట చరిత్రలో అది చిన్న సంఘటనే అయినా, ఐలమ్మ ఆ విధంగా అందరికీ గుర్తు ఉండిపోయారు. (ఆర్.నారాయణమూర్తి తీసిన “వీర తెలంగాణ” చిత్రంలో ఐలమ్మ ఉదంతం ఉంది. ఈవిడపై ప్రీతి నిగం ప్రధాన పాత్రధారిణిగా ఒక సినిమా కూడా తీస్తున్నారు అని అప్పట్లో చదివాను.)

37) అనసూయాదేవి (1920-) : సాంగీతజ్ఞురాలు, గాయని. జానపద సంగీతానికి సభాగౌరవం తీసుకురావడానికి విశేష కృషి చేశారు. ఆకాశవాణి, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థల్లో పని చేశారు. జానపద సంగీతం గురించీ, గేయాల గురించీ పుస్తకాలు కూడా రాశారు. ఒక సినిమాకి సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఈవిడ గురించిన వికీ పేజీ ఇక్కడ. గత టపాల్లో ప్రస్తావించిన వింజమూరి వెంకటరత్నమ్మ గారి కూతురే ఈవిడ!

38) బ్రిజ్‌రాణి గౌడ్ (1920 – ) : నిజాం వ్యత్రికే పోరాటంలో పాల్గొన్న వీరవనితల్లో బ్రిజ్‌రాణి ఒకరు. కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసులకి దొరక్కుండా జాతీయ పతాకాలు ఎగురవేశారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక సాంఘిక కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై, మహిళా సంక్షేమంలో విశేష కృషి చేశారు.

39) కొండపల్లి కోటేశ్వరమ్మ (1920 – ) : కోటేశ్వరమ్మ గారు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చాలా రోజులు రహస్య జీవితం కూడా గడిపారు. “స్వతంత్ర భారతి” పత్రిక సైక్లోస్టయిల్ కాపీలు రహస్యంగా జనం మధ్యకు తీసుకురావడం నుంచి అజ్ఞాతంలో ఉన్న కామ్రెడ్ల బాగోగులు చూసుకోవడం దాకా ఉద్యమంలో ఎన్నో విధాలుగా పాల్గొన్నారు. పోరాటం ముగిశాక మహిళా సంఘంలో పని చేస్తూ, ఆంధ్ర మహిళా సభలో చదువుకుని, కథలూ కవితలూ కూడా వ్రాసారు. కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య వీరి భర్త.

40) గ్లాడిస్ లోబో (1921-) : బర్మా దేశస్థురాలైన లోబో రెండో ప్రపంచ యుద్ధ సమయంలోని పరిస్థితుల మధ్య కొన్నాళ్ళు ఇండియా వచ్చి తన వైద్య విద్య కొనసాగించవలసి వచ్చింది. ఆపై బర్మా వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉన్నాక, తిరిగి ఇండియా వచ్చి, గుంటూరులోని జీసస్ మేరీ జోసెఫ్ సొసైటీ వారి సెయింట్ జోసెఫ్స్ ఆసుపత్రిలో స్థిరపడ్డారు. అనేక మహిళా డాక్టర్లకు శిక్షణ ఇచ్చారు. వృత్తికే తన జీవితం అంకితం చేశారు. ఈ పుస్తకం వచ్చేనాటికి ఆవిడ ఇంకా అక్కడే పని చేస్తున్నారు.

**
ఇక తరువాయి భాగాలు వచ్చే టపాల్లో. అన్నట్లు, మరొక్కసారి గమనిక: పుస్తకం వచ్చి పదేళ్ళు దాటింది. కనుక, ఈ మరణాల సంవత్సరాలు గూగులమ్మ ఇచ్చిన పత్రికా వ్యాసాల సాయంతో రాసినవి. కొందరి వివరాలు మిస్ అయిన పక్షంలో ఇక్కడ ఒక వ్యాఖ్య వదలగలరు.

Advertisements
Published in: on July 4, 2012 at 6:00 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/04/mahilavaranam-4/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. ఈ మహావనితలను గుర్తు చేసినందుకు థాంక్స్. అయితే ఈ లిస్టులో పరిస్తితులు అనుకూలం వల్ల (ఉ. ఫలానా వారితో పెళ్లి అవడం వల్ల) అవకాశం వచ్చిన వారి సంఖ్య కాస్త ఎక్కువ. అలాగే రచయిత్రుల బయాస్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

    Nonetheless a great initiative.Thanks a lot for publishing the compilation of these three great women (who themselves should have been on this list)

    • ఈ పరిచయాలు బాగున్నాయి. వీళ్ళలో చాలామంది పేర్లు కూడా నేనెప్పుడూ విన్లేదు. అంటే వారు ప్రసిద్ధులు కారు అని కాదు. నా పరిజ్ఞానం అంతలో ఉందని.
      పై వ్యాఖ్యలో నాకు కాస్త ఆశ్చర్యంగా కనిపించింది రచయిత్రుల బయాస్ అన్నవిషయంలో. మహిళలగురించి రాసిన పుస్తకంలో మహిళగురించే కదా ఉంటుంది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: