“ఇతోభ్రష్ట స్తతో భ్రష్టః”

రెండు రోజులు కుదర్లేదు కానీ, మళ్ళీ నిన్న చదవడం కొనసాగించాను శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ”. ఇంకా రెండో భాగంలోనే ఉన్నాను. ఇందులో చాలా మట్టుకు కవిత్వం గురించి, కవుల గురించీ, రచయితగా తమ జీవితం గురించీ, తిరుపతి వెంకటకవులతో వెంకటరామకృష్న కవులకి గల వైరం… దానిలో ఈయన చేరడం.. ఆ అనుభవాలూ గట్రా చదివాను ఇప్పటిదాకా. మధ్యలో స్కూల్లో చదువుకున్న అవధాన పాఠం కూడా కనబడ్డంతో కొంచెం నొస్టాల్జియా కూడా కలిగింది.

(పక్క దారి: స్కూల్లో “మూడు చేపల కథ” రాసిందెవరూ? అంటే నేను ఇంటిపేరు గుర్తురాక “సుబ్రహ్మణ్య శాస్త్రి” అని రాసాను. టీచర్ తప్పు మార్కు పెడితే, మా అమ్మకి చూపించి కరెక్టే కదా అన్నాను. మా అమ్మేమో – “నువ్వు శ్రీపాద అని రాసి వదిలేసినా కరెక్ట్ అయ్యేది కానీ, సుబ్రహ్మణ్య శాస్త్రి అని రాసి మార్కు రావాలని ఆశించకు.” అని చెప్పడం కూడా గుర్తొచ్చింది.)

విషయానికొస్తే, ఇప్పుడు ఇంగ్లీషు భాష ప్రభావం వద్దకి వచ్చారు. యాభై-అరవై ఏళ్ళ క్రితమెప్పుడోనే ఆయన ఇదంతా రాసారు కనుక, ఇప్పుడు కూడా తప్పు నా తరానిది కాదు అనే తోస్తోంది నాకు 😉

******************************
మన విద్వాంసుల యెడల మాహానుభావులన్న ఆదర గౌరవ భావాలున్నవారు అప్పటి మన యింగ్లీషు విద్యాధికులున్ను. ఎంచేతనంటే?

వైదీకులయినా, నియోగులయినా ఆ లౌక్యుల తండ్రులూ, ఆ యింగ్లీషు విద్యాధికుల తండ్రులూ మన విద్యలు నేర్చిన వారూ-కనీసం-సంప్రదాయపరులున్నూ. బ్రాహ్మణ “ఇతరు”లున్నూ స్వధర్మ పరిజ్ఞాతలూ, స్వధర్మపరులున్నూ అప్పుడు. వార్షికాలూ, వృత్తులూ, యీనాములూ, చివరికగ్రహారాలూ ఇచ్చి మన విద్యలనూ విద్వాంసులనూ పోషించిన వారందరూ బ్రాహ్మణ “ఇతరు”లే ప్రాయకంగా అప్పుడు, చరిత్ర చూసుకుంటే. మన అప్పటి ప్రభువులు విద్యలను వ్యాపింపజేశారు గాని అమ్ముకోలేదు మరి. వారున్నూ వారే తమ బిడ్డల నింగ్లీషులో ప్రవేశపెట్టినారప్పుడు. ఉద్యోగాలకోసమే వారా పనిచేశారు; గాని మన ధర్మం విడిచిపెట్టుకోడానికీ, ఇంగ్లీషు విద్యలే విద్యలనీ కాదు.

వారికభిజాత్యం యెక్కువ. తరతరాలుగా – యుగయుగాలుగా తమకు వెలుగుతోపిస్తున్న మన విద్యలను కాదనడానికి వారికి “అంతరాత్మలు” కలుషిఆలు కాలేదు. “నాకు ఒక విశిష్ట ధర్మం లేకపోతేగా?” అనుకున్నవారు, వారు. “ఇంగ్లీషువారిలో మాత్రం మతవిద్యలు నేర్చిన స్వధర్మపరులకు సంఘంలో ప్రత్యేకత లేదూ మరీ?” అన్న వివేకం వుండినవారు వారు. అప్పటికలాగ ఆత్మగౌరవం వుండిన అలాంటి సంఘంలో మెలుగుతూ వుండినవారు కావడంవల్ల ఆ యింగ్లీషులో ప్రవేశించినవారున్నూ మన విద్యలకూ, మన సంప్రదాయాలకూ, మన ధర్మానికీ దూరం కాలేదు. పాఠశాలల్లో యింగ్లీషు విద్యలూ నేర్చుకున్నారు, ఇళ్ళల్లో వర్ణాశ్రమాచారధర్మాలూ పాటించుకున్నారు, లక్షణంగా వారు. ఆ “యింగ్లీషువారి” కొడుకులూ నయమే కొంత.
……
ఆ కొడుకుల కొడుకులూ మనుమలూనూ ఇప్పటివారు. వారిని చూసి అదే నాగరకత అనుకుని గుడ్డిగా దానికి దాసులయినవారున్నూ యిప్పటివారు. సంప్రదాయం విచ్ఛిన్నమయిపోయింది, వీరు బయలుదేరాటప్పటికి. మన విద్యలూ, మన ధర్మాలూ అజ్ఞానవిలసితాలయి పోయాయి వీరికి. పోనీ అంటే, ఆ యింగ్లీషు విద్యలంటాయే గాని ఆ సంస్కారం అబ్బలేదు, నికరమైనది వీరికి. ఆ యింగ్లీషు సంప్రదాయమున్నూ అంటలేదు, జాతీయమైనది. అంటలేదంటే అసాధ్యం అయి కాదు, ఎబ్బెట్టయి.

ఆ యింగ్లీషు చదువులను తామనుకరింపగలిగారే గాని, తమ స్త్రీలను ఆ యింగ్లీషు స్త్రీల ననుకరింపచెయ్యలేకపోయారు వీరు మరి. మాట్టాడితే అరిస్తాటిలూ, సోక్రటీసూ, డార్వినూ – ఇత్యాదులు స్ఫురిస్తారు వీరికి. పోనీ, వారి మాటమీద నడుస్తారా? అది చేతకాదు మళ్ళీ. ఏమంటే? మన దర్శనాలంటే అసంతృప్తీ, క్రిష్టియన్ దర్శనం అంటే అపనమ్మకమూనూ వీరికి.

“ఇతోభ్రష్ట స్తతో భ్రష్టః”
ఇది పనికిరాదు – అది పనిచెయ్యదు.

జ్ఞానం – సంస్కారం – దృక్పథం – సాధన – ప్రాప్యం అన్నీ తమతోనే ప్రారంభం వీరికి.
……
దయనీయమైన స్థితి వీరిది.
వింతెందుకూ?
ఇంగ్లీషువారు మన యూనివర్సిటీల్లో, తమచేతికింద గుమాస్తాగిరీ నిర్వహించగలవారు తయారుకావడానికి చాలిన విద్యాప్రమాణం మాత్రమే ప్రవేశపెట్టగా, అదే సర్వమూ అనుకున్న వీరి భవితవ్యం మరో విధంగా యెందుకుంటుందీ? వెనకటి మన “యింగ్లీషు” వారిలాంటి త్రిశంకువులు కారు. కనకనే మన విద్యలంటే వారికలాంటి ప్రమాణ బుద్ధి. మన విద్వాంసులంటేనూ అలాంటి ఆదరగౌరవాలు.
***********************

– అదీ సంగతి ఇప్పటికి. ఇది రాసి కనీసం ఒక యాభై ఏళ్ళన్నా అయి ఉండాలి. అప్పటికే అభిప్రాయాలు అలా ఉన్నాయంటే, తెలుగంటే చిన్నచూపు రకరకాల రూపాల్లో ఆలా మన రక్తంలో ఇంకుతూ వచ్చింది కాబోలు అనిపించింది.

ఇంతకీ, ఈయనొక్కరే మనిషి, ఈయనవి ఒక్కటే అభిప్రాయాలు అని కాదు ఇక్కడ. ఆ కాలంలో కూడా ఈ అభిప్రాయాలు ఉన్నాయి అని తెల్సుకోవడం వల్ల పుట్టీన ఆశ్చర్యం కొద్దీ బ్లాగుతున్నా అంతే.

Advertisements
Published in: on March 31, 2012 at 9:38 am  Comments (1)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/31/itobrashta-sripada/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. ఇంగ్లీషువారు మన యూనివర్సిటీల్లో, తమచేతికింద గుమాస్తాగిరీ నిర్వహించగలవారు తయారుకావడానికి చాలిన విద్యాప్రమాణం మాత్రమే ప్రవేశపెట్టగా, అదే సర్వమూ అనుకున్న వీరి భవితవ్యం మరో విధంగా యెందుకుంటుందీ?

    You think our schools and universities are any different today? 😉


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: