“సాహిత్య ప్రియులకు కావలసింది రసం”

శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” రెండో భాగం మొదలుపెట్టాను. వారి సంగీతాభిలాషా, తెలుగునాట సంగీతానికి లభించే ఆదరణ గురించి అభిప్రాయాలూ… పద్య-గద్య భాషల గురించీ… ఇలా అన్నీ చదువుకుంటూ, ఆయన గురించి కొత్త సంగతులు తెలుసుకుంటూ ముందుకు సాగుతూండగా, వ్యావహారికం లో రాయడం గురించి ఆయన అభిప్రాయాలు చదివి, దాన్ని పంచుకోవాలనిపించి – ఈ టపా.

మొదటి డిస్క్లైమెర్: ఇది శ్రీపాద వారి కథ. నా కథ, నా కుటుంబం కథా కాదు.
రెండవ డిస్క్లైమెర్: అక్కడికి నేను గ్రాంథికంలో రాసిన పూర్వకవుల్నీ దులపడానికి కాదు ఇవి రాస్తున్నది (వాళ్ళందరినీ అనడానికి నేను అసలు అవేవీ చదవలేదు కద!). ఆ కాలంలో కూడా ఈ తరహాలో ఆలోచనలు ఉండేవి అని తెలుసుకోవడం వల్ల కలిగిన ఆశ్చర్యం వల్ల.
-ఈ రెండూ రాయడం అవసరం పడింది కనుకనే రాయాల్సి వస్తోంది.
**********************
సాహిత్య ప్రియులకు కావలసింది రసం. రసం అన్నది వాక్య నిర్మాణంలో పొటమరిస్తుంది గాని శబ్దరూపాల్లోనూ, క్రియారూపాల్లోనూ కాదు మరి. వ్యావహారికంలో అయితే రచన నీరసం అవుతుందనుకోవడమూ, గ్రాంథికం అయితే చాలు, రసమహితం అయిపోతుందనుకోడమూ అవివేకానికి రెండు నిదర్శనాలు. గ్రాంథికమే వ్యాకరణయుక్తం అయివుంటుందనీ, వ్యావహారికం వ్యాకరణదూరం అనీ అనుకోడం అవివేకానికి మూడో నిదర్శనం. అసలు వ్యాకరణం అన్నది వొక్క శబ్దరూపాల్లో మాత్రమేనా వుంటుంది? సంధి వ్యాకరణసంబంధం కాదూ? కర్తకర్మక్రియలు వ్యాకరణసంబంధాలు కావూ? ఆకాంక్షా, అన్వయమూ వ్యాకరణసంబంధాలు కావూ? కారకాలు వ్యాకరణసంబంధాలు కావూ? సమాసాలు, అవ్యయాలూ, ధాతువులూ, ప్రయోగాలూ వ్యాకరణబంధాలు కావూ? వ్యావహారిక రచనల నీసడించేవారికి నిజంగా అవి అర్థంకాకుండానే వున్నాయా? ప్రయోగ మూలం కదా వ్యాకరణం.
……..
……..
వ్యాకరణం అంటే యేమిటో యెరగని – వ్యాకరణం అంటూ వొకటుందనికూడా యెరగని పామరుడయినా అంటున్నాడా పోనీ?
ఒక్క శబ్దరూపాల్లో తప్ప – ధాతురూపాల్లోనూ తప్ప, గ్రాంథికవాదులు తమవని చెప్పుకుంటున్న శబ్దచింతామణీ, ప్రౌఢ వ్యాకరణమూ, బాల వ్యాకరణమూ యే గ్రాంథికవాది వ్యావహారిక వాదికంటే బాగా అనుసరిస్తున్నాడూ? ఇడియంసు అంటారే యింగ్లీషులో, అవీ పలుకుబళ్ళూ మా రచనల్లోకంటే యే గ్రాంథికవాది రచనల్లో సరిగ్గా ఉంటున్నాయీ?
….

వ్యావహారిక రచనలు చదివినప్పుడు మీకు రసానుభూతి కలగడం లేదూ?
పోనీ, గ్రాంథికం అయిన ప్రతి రచనలోనూ మీకది సిద్ధిస్తోందా?
…..
…..
రచన వ్యావహారికమయినా, గ్రాంథికమయినా మహాకావ్యం అవునో కాదో అది ప్రగమనశీలమైన కాలం చెబుతుంది, ఆ కాలం అధిగమించలేని పండితుడు కాదు.

**********************
-ఇలా సాగింది. నిజానికి, ఈ పుస్తకంలో నన్ను ఆకట్టుకుంటున్న పుటలు తరుచుగానే కనిపిస్తున్నాయి. కాకపోతే, అన్నీ ఎక్కడ టైపు చేస్తాం అని ఆగుతున్నానంతే 😉 శ్రీపాద వారి కథలు చదివి ఆనందించడమే కానీ, వారి ఆలోచనాధోరణి గురించి నాకు ముందు తెలీదు. కథల్లో కొంచెం తెలిసినా, ఇప్పుడు చదువుతున్న దానితో పోలిస్తే అది స్వల్పం. చదువుతూ పోగా, ఆయనపై ఇంకా అభిమానం కలుగుతోంది.

(నాకు సందేహం ఏమంటే – ఈయన ఇదంతా రాసినప్పుడు వివాదాస్పదం కాలేదా? అని. బహుశా ఇప్పట్లా రాసేవాళ్ళకి, చదివేవాళ్ళకీ మధ్య అభిప్రాయాల మార్పు చేర్పులకి అప్పట్లో సౌలభ్యం లేకపోవడం వల్ల అప్పట్లో వివాదాలు వేరే రకంగా ఉండేవా? – అని.)

Advertisements
Published in: on March 28, 2012 at 7:26 am  Comments (11)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/28/vyavaharikam-sripada/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. మొదటి భాగంలో సంస్కృతము తెలుగు గొడవ, రెండవభాగంలో గ్రాంథికము, వ్యావహారికము గొడవ అన్న మాట. 🙂

  మూడో గొడవ కూడా ఉందండి. వ్యావహారికం పేరిట రెండు మూడు జిల్లాల వారు వాడే భాషను గ్లామరైజ్ చేసి మిగిలిన ప్రాంతాల వాళ్ళ భాషను చులకన చేసిన గొడవ అది. దాన్ని గురించి రాళ్ళపల్లి వారు, కాళోజీ ఇత్యాదులు చెప్పారు.

 2. @Ravi: ఓహ్… అయితే, దొరికినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా చదవాలి. థాంక్స్.

 3. “అనుభవాలూ జ్ఞాపకాలూను” కొత్త ఎడిషన్ వచ్చిందా? నేను చదివింది పాత లైబ్రరీ పుస్తకం. వస్తే కొనుక్కుందామని.

  • @Meher: తెలియదండీ. నేనూ ౧౯౯౯ ఎడిషన్ లైబ్రరీలో నుండి అద్దెకు తెచ్చి చదువుతున్నా. ఒక స్నేహితురాలు చెప్పిన సమాచారం ప్రకారం త్వరలో కొత్త ఎడిషన్ వస్తుందంట.

 4. శ్రీపాద వారూ హిందీ గొడవ గురించి కూడా రాస్తారే ఒకచోట! 🙂

  • క్లుప్తంగా కొన్ని ప్రస్తావనలు వచ్చాయి హిందీ గురించి, హిందుస్తానీ సంగీతం గురించీ. వివరంగా ఈ టైపులో పేజీలకి పేజీలు  ఇంకా కనబడలేదు 😉 వస్తాయేమో త్వరలో.

 5. సౌమ్యగారూ,
  మీకు నమస్కారమ్. శ్రీ పాదవారి అనుభవాలు జ్ఞాపకాలూ ఎన్ని సార్లు చదివేనో చెప్పలేను. మరో సారి చదువుకుంటా. నెనరుంచండి.

  • శర్మ గారికి: మీకు కూడా నెనరులు. 🙂

 6. మిత్రులకి,
  శ్రీపాద వారి అనుభవాలు-జ్ఞాపకాలూను రెండు సంపుటాలు పుస్తకం ఒకటిగా ఈ కింది అడ్రసులో దొరుకుతుంది ప్రయత్నం చేయండి.
  విశాలాంధ్రపబ్లిషింగ్ హవుస్,
  విజ్ఞాన్ భవన్ 4-1-435 బేంక్ స్ట్రీట్
  హైదరాబాద్-500001
  వెల 180/-

 7. “రచన వ్యావహారికమయినా, గ్రాంథికమయినా మహాకావ్యం అవునో కాదో అది ప్రగమనశీలమైన కాలం చెబుతుంది, ఆ కాలం అధిగమించలేని పండితుడు కాదు.”
  – బాగా చెప్పారు. (శ్రీపాద వారేలే, నువ్వు చెప్పావనలేదు 🙂 నీ డిస్క్లైమెర్లూ, అందుకు కారణమైన కొన్ని అయోమయాలూ, బహుశా అందులో బహుశా అందులో నాదీ కొంత ఉందేమోనన్న అనుమానమూ, అవన్నీ గుర్తుకు వచ్చి సరదాగా నా “డిస్క్లైమర్” కూడా చేర్చానన్న మాట. 🙂 )
  బావుంది. వీలైనంత వ్రాస్తూ ఉండు. పుస్తకం నాకు అందుబాటులో రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది ఇప్పటి వరకూ ఇక్కడ కనిపించిన వివరాలు చూస్తుంటే. అందాకా ఇలా కాస్తన్నా ముచ్చట తీరుతుంది. (కోరిక పెరుగుతుంది, కొని చదవాలని) online దొరికే అవకాశమే లేదా, అమెరికాలో ఉన్న వారికి?

 8. వ్యాకరణం మనకే కాదు,అన్ని భాషలకీ ఉంది.మనం వ్రాసే భాష నిర్దుష్టం గా ఉండటానికే వ్యాకరణసూత్రాలు.మనం గ్రాంథికభాషలో వ్రాసినప్పుడు వ్యాకరణాన్ని పాటించాలి.పత్రికల్లో ఇప్పుడు వ్రాస్తున్న భాషకి కూడా కొన్ని సూత్రాలు పాటిస్తున్నారు కదా.కథలు రాసినప్పుడు ఒక భాషాపద్ధతి,శాస్త్రీయవిషయాలు రాసినప్పుడు ఒక భాషా పద్ధతిని పాటించాలి కదా.
  ఇక రెండో విషయం -రసం గురించి – కవిత్వం లో రసం ,శిల్పము ప్రధానం.కథల్లో ,నవలల్లో వస్తువు,కథనం ముఖ్యం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: