“తెనుగులో కవిత్వం చేయ్యగూడదు”

శ్రీపాద వారి స్వీయానుభవాలతో కొనసాగుతున్నాను. మరొక్కసారి తెనుగు ఎందుకు చదవకూడదు? అన్న వాదం కనబడి…. ఉండబట్టలేక… మళ్ళీ బ్లాగు రాస్తున్నాను. ఇదే సమయంలో జీవించిన ఇంకెవరిదన్నా స్వీయానుభవాలు ఎక్కడన్నా దొరికే పక్షంలో తెలుపగలరు. ఇలాంటి వ్యతిరేకతను దాటుకొచ్చి తెలుగులో అన్ని కథలు రాసారంటే శ్రీపాద వారికి దండాలు.

*******
అయితే, వల్లూరి నిషేదమూ, వేట్లపాలెం నిషేదమూ సంస్కృత సాహిత్యాభ్యాసం నిరాఘాటంగా సాగిపోవడానికి మాత్రమే, మొత్తానికి.
మా నాయనగారి నిషేదం మాత్రం అలాంటిది కాదు. కులక్రమంగా వస్తున్న వైదిక విద్యలకు కొంతయినా అది అంతరాయం కలిగిస్తుందన్న అనుమానం దానిక్కొంత కారణమే, వొప్పుకుంటాను. కాని, ప్రధాన కారణం “తెనుగులో కవిత్వం చెయ్యగూడదు” అని.
అది “అప్రతిష్ఠాకరం” అని. “పతనమున్ను” అని. మా వాళ్ళ దృష్టిలో-
తెనుగు వొక సభ్య భాష కాదు.
తెనుగులో సాహిత్య కృషి చేయడం అంటే అకార్యకారణం.
తెనుగులో గ్రంథరచన చెయ్యడం అంటే, మరి భట్రాజే అయిపోడం.
ఈ విషయమై మా నాయనగారికి గట్టి నమ్మకమే వుండేది. వారికి మా చిన్నన్నగారు తోడుపడ్డారు. వారే కాదు, వైదిక విద్యలు నేర్చిన బ్రాహ్మలెవరయినా ఇదే మచ్చు, సాధారణంగా.
ఇంగ్లీషు కూడా వొక భాషే, వారి దృష్టిలో, తెనుగు మాత్రం కాదు. సంస్కృతమే భాష, ముఖ్యంగా. అది చదివితేనే గౌరవం.
….
….
….
పైపెచ్చు వైదిక విద్యలు కొంచెం నేర్చి, కొద్దో గొప్పో సంస్కృతమున్నూ అభ్యసించి వుండిన నేను తెనుగులో రచన చెయ్యడం కులం చెడ్డమే.
…..
….
….
పరాయతం వల్లించమని వారి ఆజ్ఞ; కాని పుస్తకం కింద పడేసి నేను పద్యాలు కట్టడం. పద్యం పూర్తి కాగానే, చక్రవర్తి పదవి అబ్బినట్టు ఆనందం పట్టలేక, మా వాళ్ళమాట మరచిపోయి, ఉత్సాహం కొద్దీ గట్టిగా చదివేవాణ్ణి విరుపులు చూసుకుంటూ, నేను. అది మా వాళ్ళకి వినబడేది. తాము భ్రాంతిపడ్డారే గాని, నేను కవిత్వం మానలేదని దాంతో వాళ్ళకి తెలిసిపోయేది. మళ్ళీ మండిపడేవారు. మళ్ళీ తిట్టిపోసేవారు. మళ్ళీ కొట్టినంత పని చేసేవారు. వైదికవిద్యల ఘనతా, కుటుంబ విశిష్టతా మళ్ళీమళ్ళీ యేకరువు పెట్టేవారు.
“కాదూ కూడదంటే, ఆ కవిత్వం సంస్కృతంలోనే దేవుళ్ళాడరాదా?” అంటూ రుంజుకునేవారు.

***************
-అదీ సంగతి! ఇప్పటికి నాకు ఇప్పుడు “తెలుగు చచ్చిపోబోతోంది” అనీ, “ఈ తరానికి భాషాభిమానం లేదు” అని…లబోదిబోమనడంలో ఉన్న ఒకటోరకం హాస్యం కళ్ళకి కట్టినట్లు కనబడుతున్నది! (వైదిక కుటుంబాల అభిప్రాయాలే ఆఖరా? అనకండీ…అందుకే అడిగింది…ఆ కాలంలో రాయబడ్డ మరేవన్నా స్వీయానుభవాలుంటే చెప్పండి, అవీ చదువుతానూ అని.)

శ్రీపాద గారు తెలుగు చదవడం కోసం, తెలుగు పుస్తకాల కోసం ఎంత ఆరాటపడ్డారో చదువుతూ ఉంటే అబ్బురంగా అనిపించింది. పుస్తకం మొదటి భాగం మాత్రమే పూర్తి చేసా ఇప్పటిదాకా. కానీ, రెండో, మూడో భాగాలు కూడా రికమెండ్ చేసేస్తున్నా 😉

Advertisements
Published in: on March 27, 2012 at 4:00 pm  Comments (18)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/27/tenugulo-sripada/trackback/

RSS feed for comments on this post.

18 CommentsLeave a comment

 1. మరి నన్నయ దగ్గరినుంచి,తిరుపతి వెంకట కవుల దాకా అసంఖ్యాకులైన కవులు తెలుగులో కవిత్వం ఎలా వ్రాసారు?వారిలో అత్యధికులు సంప్రదాయ కుటుంబాలవారు,వేదాలు,శాస్త్రాలు,చదివి జపహొమ తత్పరులే కదా.నాకు తెలిసినంత వరకు తెలుగులో కవిత్వం చదవడం ,రాయడానికి ఎవరి నుంచి ,సంస్కృత పండితుల నుంచి కూడా ఏమీ అభ్యంతరాలు ఉండేవి కావు. బహుశా మీ కుటుంబం మరీ చాదస్తమైనదేమో ,may be it is an exception.

  • @Lalitha : “ఇప్పటికి నాకు ఇప్పుడు “తెలుగు చచ్చిపోబోతోంది” -అంటే, అలా లబోదిబోమనేవాళ్ళ గురించి అంటున్నా…. నా గురించి కాదు 😉
   @రమణారావు గారు: “బహుశా మీ కుటుంబం మరీ చాదస్తమైనదేమో” – మధ్యన నా కుటుంబం ఎందుకొచ్చింది ఇక్కడ? నేను రాసిందంతా శ్రీపాద వారి అనుభవాల సంగతి. మీ అనుమానాలు అవీ ఆయన్ని ఎలా అడుగుతారో మరి…నాకు తెలియదు. అన్నట్లు, నాకు వైదికుల ఇళ్ళలో ఎలా ఉంటుందో కూడా ఎలాంటి అవగాహనా లేదు సుమండీ!

  • //నన్నయ దగ్గరినుంచి,తిరుపతి వెంకట కవుల దాకా అసంఖ్యాకులైన కవులు తెలుగులో కవిత్వం ఎలా వ్రాసారు? అత్యధికులు సంప్రదాయ కుటుంబాలవారు,వేదాలు,శాస్త్రాలు,చదివి జపహొమ తత్పరులే కదా.//
   అన్నారు కదా రమణరావుగారు. ఐతే ఇక్కడో భేదముంది జపహోమ తత్పరులకందరికీ జపహోమాదులు కులవృత్తులు కాలేదు(బ్రాహ్మణులే ఐనా). తిక్కన మహామంత్రి. శ్రీనాథుడు విద్యాధికారి. ఎర్రన మంత్రికుమారుడు, రాజోద్యోగి. పోతన వ్యవసాయదారుడు. ఇక పెద్దన, తిమ్మన, రామకృష్ణుడు మొదలైనవారు కవితావృత్తినే స్వీకరించారు. వారందరూ కొంచెం అటూ ఇటూగా గ్రామోద్యోగం నుంచి అంచెలంచెలుగా అమాత్యపదవి వరకూ నిర్వహిస్తున్న ఆంధ్ర నియోగి బ్రాహ్మణ కుటుంబాల వారు. ముఖ్యంగా తిక్కన వంటివారు మహమహా రాచకార్యాలు చేస్తూ ఈ కవిత్వాన్ని ప్రవృత్తిగా నిర్వహించారు. కృష్ణరాయలు వంటి రాజకవులు, భట్టుమూర్తి మొదలుగాగల ఇతర కులస్తులు అప్రస్తుతం కనుక బ్రాహ్మణ కవుల్నే తీసుకుంటే ఇట్లాంటి నేపథ్యం కానివారెవరూ అంటే మీరు చెప్పిన నన్నయ, తిరుపతి వేంకట కవులూను.(ఆ తర్వాత కాలంలో ఎందరో వైదిక వృత్తి చేసే కుటుంబాలనుంచి వచ్చిన తెలుగు కవులు ఉన్నా నాకు తెలిసినంతలో వారందరికీ తిరుపతి వేంకట కవులే ఆద్యుల్లా కనిపిస్తారు). చెళ్లపిళ్ల వారి కాశీయాత్ర, కథలు-గాథల్లో ఎన్నోచోట్ల వారి తొలినాళ్లలో గురువుగారు “ఇతను కవండీ” అని పరిచయం చేసినా, మరీ ముఖ్యంగా “తెనుగు కవితలల్లుతాడు” అని పరిచయం చేసినా ఎంత అవమానంగా ఉండేదో చెప్తారు గమనించండి. నేను పైన లిస్టిచ్చిన ఆ లౌకిక వృత్తుల కుటుంబాల కవులు తెలుగు కవులమన్ని రొమ్ము విరుచుకున్నదే తప్ప వెనుకంజ వేసింది లేదు. ఎవరూ వారిని తెలుగు కవిత్వం కూడదని నిషేధించిన దాఖలాలూ చాటువుల్లో, ప్రస్తావనల్లోగానీ ఎక్కడా దాఖలాలు కనిపించవు. ఇక వైదిక వృత్తుల వారు అలా నిషేధించడానికీ కారణాలు సుబ్రహ్మణ్యశాస్త్రిగారే చెప్తారు “అనుభవాలూ జ్ఞాపకాలూను”లో చదవండి.

 2. “ఇప్పటికి నాకు ఇప్పుడు “తెలుగు చచ్చిపోబోతోంది” అనీ, “ఈ తరానికి భాషాభిమానం లేదు” అని…లబోదిబోమనడంలో ఉన్న ఒకటోరకం హాస్యం కళ్ళకి కట్టినట్లు కనబడుతున్నది!”
  ఏం చెప్పావు సౌమ్యా 🙂 (నీకు తెలుగు రాకపోవడమేంటి చెప్మా?)
  ఇటువంటి విషయం మాత్రం నాకు ఇప్పుడే తెలిసింది (అంటే నీ ముందు టపా ద్వారా). నిజంగా.
  ఇక పుస్తకం కొనడానికి కూడా దొరుకుతోందన్నారు కాబట్టి కొని తీరాల్సిందే. ప్రవాసంలో ఉన్న వాళ్ళు ఎలా కొనవచ్చో వివరాలు ఏమైనా ఎవరైనా చెప్పగలరా?
  నా ఉద్దేశ్యంలో భాష నేర్పించండం, అలవాటు చెయ్యడం కంటే ఎక్కువ ఎట్లాగైతేనేం నేర్చేసుకుని ఎట్లాగైతేనేం మంచి సాహిత్యానికి అలవాటుపడిపోయిన తర్వాత ఆస్వాదించదగ్గ సాహిత్యమే ఎక్కువ (అందుబాటులో) ఉండడం వల్ల నాలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకు నేర్పించడం విషయంలో కష్టం కలుగుతోందని చెప్పాలి. చందమామ అనే బాల సాహిత్య ప్రక్రియ ముందు నాకు ఇంతవరకూ తెలిసిన మిగిలినవన్నీ చిన్న చిన్న చుక్కలే. అదైనా చందమామ పెద్దవాళ్ళని కూడా ఆకట్టుకోవడం వల్లే అది పిల్లలకు చేరింది అని నా గట్టి నమ్మకం. తెలుగులో పిల్లల కోసం ప్రత్యేకం అంటే ఈ క్రింది రకాలు చూశాను. ఒకటి అసలు నాణ్యత లేకపోయినా “ఆముదం చెట్టే మహా వృక్షమైన” తీరున అమ్ముడుపోయే పుస్తకాలు, ఇతర వినోద సాధనాలు. ఇంకో రకం “అనువాదాలు.” ఇవీ బానే అమ్ముడు పోతాయి. ఇక మూడో రకం, మంచి నాణ్యతతో నేరుగా తెలుగులో పిల్లల కోసం వారికి తగ్గట్టు తయారు చెయ్యబ్నడినవి – దాదాపుగా లేవనే చెప్పాలి. ఉంటే తెలిసిన వారు పరిచయం చేసి పుణ్యం కట్టుకోవాలి.

 3. శ్రీపాదవారి మీద మీ అభిమానాన్ని ప్రశంసిస్తూ… వాటిలో పాలు పంచుకుంటూనే… మధ్యమధ్యలో మీ ఊరటలు చూసి ఉండబట్టలేకపోయి… (అప్పటికీ మొదటి పోస్టు చూసి ఊరుకున్నా, మరికాసేటప్పటికే రెండో పోస్టు కూడా చూసి దురదాపుకోలేక…)

  దైవభాషగా భావించే సంస్కృతంతో పోలిస్తే తెలుగుది రెండో స్థాయి అన్న భావన నాటి పండిత కుటుంబాల్లో ఉండేదన్న మాట నిజమే అయినా… తెలుగు మాట్లాడ్డమో, రాయడమో చేతకాని సమయం కాదది. వ్యావహారిక భాషగా ఇళ్ళల్లో ఉన్నది తెలుగే. సాహిత్యం విషయంలో సంస్కృతానిదే అగ్రస్థానమైనా తెలుగు తక్కువేమీ లేదు. సంస్కృతంలో పదం కట్టలేని వాడే సామాన్యంగా తెలుగులో పద్యం చెబుతాడన్న చిన్నచూపు. (ఇవన్నీ మీరు ఉటంకించిన అంశాల్లోనూ ఉన్నాయి, పరికిస్తే) వాటిని బట్టే అర్ధం అవుతోంది కదా తెలుగు వాడుక, తెలుగులో రచనలూ అప్పటికే ఉన్నాయని…! స్థాయీ గౌరవాల విషయంలో తేడాలుంటే ఉండొచ్చునేమో కానీ నాటి సంస్కృత పండితులకు సైతం తెలుగు బాగానే వచ్చు. ఇక జన సామాన్యం సంగతి సరేసరి.

  నైదర్ ఇంగ్లీష్ నార్ టెల్గూ అనే ఈనాటి ఆంగ్ల మానస పుత్రులకూ…, తెలుగు పద్యాన్ని దాటి సంస్కృతంలో శ్లోకం కడితేనే కవి అని భావించిన నాటి సంస్కృతాభిమానులకూ తేడా ఏమీ లేదనుకుంటున్నారా? ఇప్పుడు తెలుగు చదవడం, రాయడం చేతకాని తరాలు తయారవడానికి ఆంగ్ల ఆధారిత విద్యా విధానం ప్రబలడమే ప్రధాన కారణం కదా… భాషతో పాటు భావాలూ ఆంగ్లీకృతం కావడం మౌలిక కారణం కదా…! “దానికి కారణం మేము కాదు” అని గొంతు చించుకు అరిచే ముందు, ఎస్కేపిస్టు ధోరణి వదిలేసి, మరోసారి ఆలోచించండి. అపరాధ భావాన్ని తొలగించుకోడానికి తప్పుడుచోట తప్పులు నెట్టేయకండి.

  ఆనాటి సంస్కృతాభిమానంలో తెలుగును జనజీవితం నుంచి మాయం చేసే “కుట్ర” లేదు. ఈనాడు తెలుగు చచ్చిపోతుండడం వెనుకా, ఈ తరానికి భాషాభిమానం లేకపోతుండడం వెనుకా తెల్లోడి బిస బాస కుట్ర ఉంది. ఆ మౌలిక భేదాన్ని గుర్తిస్తే ఒకటో రకం హాస్యం కాదు విషాదం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది.

  రొమేషూ బొంగాలీ పిచ్చినీ, మరొకడి హిందీ ఉన్మాదాన్నీ హాస్యపు ముడిసరుకు చేసిన శ్రీపాద తెలుగు వైదీకి ఆచారాలని తప్పుపట్టకుండానే నడిపిన కథలు మీరు చదివే ఉంటారు. అందుకే… మన తరాల చేతకాని తనాలకు మన పూర్వీకులదే తప్పు అని నెట్టేయడం భావ్యం కాదేమో ఆలోచించండి. “శుభికే శిర ఆరోహ”.

 4. @Phaneendra garu: పూర్వీకులదే తప్పు అని కాదు నేనన్నది. కారణాలు ఏవైనా, మొదట్నుంచీ ఈ చిన్న చూపు ఉంది – అని నేను అన్నది. ఈ విషయం మీకు అర్థం కాలేదు అని మాత్రం అర్థమైంది.

 5. నా అభిమాన రచయిత శ్రీపాదవారిని తలుచుకుని నన్ను పులకరింపచేశారు. నెనరుంచండి.

 6. శ్రీపాద వారి ఇంట్లో సంస్కృతం మీద మోజు ఉండి ఉంటే, ఆంధ్రదేశమంతటా అలానే ఉండి ఉండేదని మనం చెప్పలేం. ఇలాంటి అనుభవాల ద్వారా చరిత్రను పాక్షికంగా మాత్రమే అంచనా వేయవచ్చుననుకుంటున్నాను.

 7. @Ravi garu: అదేనండీ నాకు వచ్చిన అనుమానం… ఆయనకి తెల్సిన వైదీక కుటుంబాల్లో అలా ఉండేదని రాసారు, వైదికేతర బ్రాహ్మణ కుటుంబాల్లో సంస్కృతాభిమానం ఈ స్థాయిలో లేదు అన్నట్లే రాసారు. వీళ్ళు కాకుండా మామూలు ప్రజానికం సంగతి ఏమిటి? అని…ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పాల్సిన విషయం.

 8. మీరన్న చిన్నచూపు సంగతి నాకు అర్ధమయిందండీ. అది కాదు అని చెప్పడమే నా భావం. సరే… ఇంటర్‌ప్రిటేషన్ ఈజ్ ఫ్రీ… 🙂

  • ఏవోనండీ, “చచ్చు తెనుగు పోనిస్తూ” అంటే నాకు చిన్నచూపుగానే కనబడ్డది మరి. వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో అందరూ మాట్లాడుకునేది తెలుగే కానీ, దాని గురించి కూడా శ్రీపాద వారు రాసారు – “మంచి నీరు” అనరంట ఈ బాపతు వాళ్ళు…”మంచి తీర్థం” అంటారంట (మరి ఇప్పట్లో వాటర్ అంటారేమో తెలుగంటే చిన్న చూపు ఉన్నవాళ్ళు..). ఇలా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు…కొన్ని పదాలకి బదులు సంస్కృతీకరించిన పదాలు వాడడం గురించి… శ్రీపాద వారు మట్టుకు అది చిన్నచూపనే అభిప్రాయపడ్డారు…అది నాకూ పాకింది. 🙂

 9. సంస్కృతంతో పోలిస్తే తెలుగుకి రెండో స్థానం ఇవ్వడంపైనే శ్రీపాద పోరాడినది. స్త్రీ స్వేచ్చ కోసం చలం ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్ లాంటిదే… సంస్కృత సమర్థకులూ, గ్రాంథిక భాషావాదులపై శ్రీపాద దాడి. మీకు తిలక్ అమృతం కురిసిన రాత్రిలో రాజమండ్రీ పాటలు గుర్తుండే ఉంటాయి… అక్కడింకా కళామతల్లి మడి కట్టుకుని పాత చింతకాయ పచ్చడి వడ్డిస్తోంది అంటాడు…. అలాంటి తన నాటి పరిస్థితులపై శ్రీపాద విరుచుకుపడ్డాడు. గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగంలకు బలంగా మద్దతిచ్చాడు. ఆ క్రమంలో తన వాదనను బలోపేతం చేసుకోడానికి కఠినంగా వ్యవహరించాడాయన. కానీ పూర్తిగా సంస్కృతాన్ని నిరసించిన వాడు కాదు, అందుకే తన కథల్లో కొన్నింటికి ఆ భాషలో పేర్లూ పెట్టాడు.

  నేనంటున్నది ఈనాటి అవకరాలకు బీజాలు ఆనాటి నుంచే ఉన్నాయి అని భావించవద్దని మాత్రమే. ఆ రెంటి మధ్యా ఉన్న తేడాని గమనించమనే సూచన.

  నేనూ శ్రీపాద వీరాభిమానినే. ఎంతయినా మా రాజమండ్రి గోదాట్లో మునిగితేలిన వాడేగా. అదే సమయంలో ఆయన దృక్కోణపు పరిమితుల గురించి ఎప్పుడో ఎక్కడో కొద్దిగా చదివా. అంత మాత్రాన ఆయనంటే అభిమానం పోతుందా.

  మీ డిస్‌క్లెయిమర్‌లకు నా మాటలు కారణమైతే క్షంతవ్యుణ్ణి. ఎందుకంటే నా ఉద్దేశం వాదన కాదు, విద్యా విషయిక చర్చ మాత్రమే. ఏమయినా పరుష పదాలు ప్రయోగిస్తే మన్నించండి. ఈ అంశంపై ఇక నోరు మెదపను. ధన్యవాదాలు.

  • ఫణీంద్ర గారికి: మీరింత చెప్పాక కూడా నేను మీ ఆలోచనతో ఏకీభవించలేకపోతున్నాను. స్వభాషా గౌరవం తెలుగువారికి ఎప్పుడూ తక్కువే ఉన్నట్లు తోస్తున్నది నాకింకా. సరే, ఈ విషయంలో నేను అంత తేలిగ్గా మారను అనుకుని వదిలేద్దామిక.

   ఇక, డిస్క్లెయిమర్ కి మీ మాటలు కారణం కాదు అని నేను అబద్దం చెప్పను. మీరు వాడిన పదజాలం పరుషంగా అనిపించింది నాకు. ఆట్టే ఏ విషయంలోనూ వాదాలకి దిగడానికి అవసరమైన ఓపికా, తెలివిడీ రెండూ లేవు కనుక, ముందే డిస్క్లెయిమర్ ఇవ్వడం మంచిది అనుకున్నాను. దృక్కోణపు పరిమితులు – అవి ఎవరికి ఉండవండీ! అంతమాత్రాన మనం ఫ్యాన్సులం ఫ్యాన్సు కాకుండా పోతామా! 😉

 10. సౌమ్యా, ఇక్కడ బాల సాహిత్యం గురించి ఏదో మాట్లాడేసానా, ఎప్పట్లానే. ఇప్పుడేమో ఈ మాటలు చదివానన్నమాట, “చూస్తేనే తెలిసిపోయే “ఆవునకు నాలుగు కాళ్ళు” అనే విషయమే చదవాలో, బాల రామాయణమే చదవాలో పిల్లలు?” :)))
  ఐతే నేను నా మాటలు పూర్తిగా వెనక్కి తీసుకోవట్లేదింకా. ఎందుకంటే చిన్నప్పుడు అర్థం అవ్వక్కర్లేకుండానే, శ్లోకాలూ, పద్యాలూ నేర్పించాలి అనే అభిప్రాయం మొదట్లో కొంచెం అనుమానంతో ఉండి రాను రానూ నమ్మకంగా బలపడుతోంది నాకు. వాళ్ళకి అవంటూ వస్తే పెద్దయ్యాక తెలుసుకుంటారు, ఆస్వాదిస్తారు అని. కానీ బాల సాహిత్యం స్థానం బాల సాహిత్యానికుంది అని కూడా నమ్ముతాను. సర్లే ఇది వేదిక కాదు నా అభిప్రాయాలన్నీ చెప్పడానికి. ఆ మాటలు చదివితే నవ్వొచ్చి చెప్పుకోవాలనిపించింది. అంతే (ఇప్పటికి).

  • శ్రీపాద వారు కూడా అర్థం అవ్వకపోయినా, కొన్నింటిని నేర్పడాన్ని సమర్థించారండీ. చిన్నప్పుడు తెలిసేది కాదు కానీ, నాక్కూడా అది మంచి ఆలోచనే అనిపిస్తోంది ఇప్పుడు. బాల సాహిత్యం కూడా అవసరమే అని నా అభిప్రాయం. రెండూ ఉండాలన్నమాట 🙂

 11. మొత్తం మీద అందరిదీ ఒకే అభిప్రాయమైనా చర్చ జరిగిందనుకొంటున్నాను.పండితవర్గాల్లో తెలుగుబాగా వచ్చినా సంస్కృతం మీద అభిమానము,తెలుగు మీద చిన్నచూపు అప్పట్లో ఉండేదని ఒప్పుకొంటాను.మొదట్లో సంస్కృతం, తర్వాత ఉర్దూ ,ప్రస్తుతం ఇంగ్లీష్ తెలుగుమీద అధిపత్యం చూపాయన్నది నిజమే.ఇంతవరకు అన్నీ తట్టుకొని తెలుగు నిలబడగల్గింది.ఇకమీద కూడా అలాగే నిలబెట్టుకోడానికి ప్రయత్నిద్దాము.ఇక్కడ ఒక విషయం చెప్పాలి.ఇంగ్లాండు,రష్యాలలో కొన్ని శతాబ్దాలపాటు ఫ్రెంచ్ రాజభాషగా (court language) ఉండేది.15వ శతాబ్దందాకా బైబిలు లాటిన్ నుంచి ఇంగ్లిష్ లోకి తర్జుమా కాలేదు.

 12. తెలుగుభాష ఏనాడూ రెండో ప్రాధాన్యత గలదేనని నేటి తెలుగుభాషోద్యమ వాదులు బాధపడిపోవడం ఎలా ఉన్నా ఇవన్నీ పాక్షిక సత్యాలు.
  రెండో ప్రాధాన్యత సంగతి అటుంచితే శ్రీపాద వారింట్లో తెలుగు అసలు సభ్య భాషే కాదంటారు ఆయన.
  మరో వైపు తెలుగు కవిత్వానికి కనకాభిషేకాలూ, గండపెండేరాలతో సత్కారాలూ, గజారోహణాలూ పొందుతున్న కాలమూ అదే.
  మరో ప్రాంతంలో తెలుగు వారు ఘోషిస్తున్నా శాసన, శాస్త్ర వ్యవహారాలు మొదలుకొని ప్రాథమిక బోధనతో సహా అంతటా ఉర్దూయే బలవంతంగా రుద్దుతున్న కాలమూ అదే.
  తెలుగు పట్ల నాటి కాలంలోని దృక్పథం చెళ్లపిళ్ల, శ్రీపాద ఇత్యాదుల తొలినాటి అనుభవాల్లో ఒకలా. బూదరాజు రాధాకృష్ణ ప్రభృతుల అనుభవాల్లో మరోలా. దాశరథి సోదరులు, తిరుమల రామచంద్ర వగైరాల అనుభవాల్లో మరోలా కనిపిస్తాయి. జాషువా, తాపీ వంటి బ్రాహ్మణేతరుల దృక్పథమూ పరిశీలించదగ్గదే.(ఇవన్నీ నేను ఇక్కడ విశ్లేషించలేను. వ్యాఖ్య నిడివికి ఆ అంశం ఒదగదు). అన్నీ కలిపితేనే ఓ పాక్షిక సత్యమైనా ఆవిష్కారం కాగలదు. బహుశా ప్రాంతాలే కాక కులాలు, ఉపకులాలు, కులవృత్తి భేదాలూ కూడా నాటి సాంఘిక జీవనంలో విపరీతమైన వైవిధ్యం తీసుకువచ్చినందువల్ల కావచ్చు.
  సంస్కృతం ఏనాడూ తెలుగుభాషను కాలరాసే ప్రయత్నం చేయలేదనీ, తెలుగు సంస్కృతాలు పరస్పర పోషకాల్లా సాగాయనీ నా అభిప్రాయం. తెలుగు పట్ల చిన్న చూపు కేవలం వారి కులవిద్యల భాషైన సంస్కృతాన్ని మరింత గట్టి చేసుకునేందుకే, అదీ ఓ ఉపకులంలోనే(వైదుకులు) ఏర్పడ్డది. ఉద్యోగాలు కులవృత్తిగా గల బ్రాహ్మణశాఖ వారైన నియోగులు తెలుగును నెత్తిన పెట్టుకుని పూజలు చేసిన స్థితీ ఉన్నది కదా.(అది వారి కులవృత్తికి అవసరమని కావచ్చు). ఈ వర్గంలోనూ ఉన్నత విద్య, పాండిత్యమూ ఉన్నవారు ఎక్కువగానే ఉండేవారు. అలాంటి రెండో బలమైన వర్గమో, మరోటో నేడు తెలుగును కొమ్ముకాసే పనిలో ఏమీ లేదు. ఆ అవసరమూ ఎవరికీ లేదు. అదీ నేటి దుస్థితి.
  తెలుగుపై నాడు ఏదో కొన్ని ఉపకులాల్లో చిన్నచూపున్నా, తెలుగులో కవిత్వం రాయడం ఓ ఫాన్సీలా భావించిన కాలమూ అదేనన్న స్ఫురణ మరవద్దని మనవి.

 13. ఆ రోజుల్లో కొన్ని వైదిక కుటుంబాలలో సంస్కృతానికి పెద్దపీట వేసి తెలుగులో కవనం అల్లడాన్నిచిన్నచూపుచూడటం నిజమే కావచ్చు! లేకపోతే సత్యసంధతకు మరో పేరైన శ్రిపాదవారు తమ ఆత్మకథలో అలా ఎందుకు వ్రాస్తారు?అప్పుడేకాదు ఇప్పుడు కూడా తెలుగు భాష తెలుగువాళ్ళ తెలివిలేనితనం ఎమ్మెల్యే క్వార్టర్స్ ధోవతికుచ్చిళ్ళ ముందు జీరాడటంవల్ల గుడ్లు తెలవేస్తుంది!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: