“నా తెనుగు నాకెందుకు తెలియకపోవాలీ?”

శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ”తో కొనసాగుతూ ఉండగా, కనబడ్డ ఈ భాగం చూసి, ఒక పక్క ఆశ్చర్యం కలుగగా, మరొక్క పక్క నాకు కొంత ఊరట కూడా కలిగింది. ఊరట కలగడం ఎందుకో తరువాత చెబుతాను కానీ, ముందు ఇది చదవండి… తనకు తెనుగు మీద ఆసక్తి పుట్టడం గురించి నేపథ్యం చెబుతూ “నా తెనుగు నాకెందుకు తెలియకపోవాలీ?” అనుకున్న శ్రీపాద వారు చెప్పిన కథ ఇది:

***********
“సంస్కృత సాహిత్య గ్రంథాలు పూర్తిచేసుకునేదాకా నువ్వు తెనుగు ప్రబంధాలు ముట్టుకోవద్దు” అని దృఢంగా నిషేదించారు కూడా, వారు. ఒకమాటింటికి వచ్చినపుడీమాట చెప్పగా మా పెద్దన్నగారూ అదే అన్నారు. సరే, నాకు మేఘసందేశమూ, భారవిలో కొన్ని సర్గలూ పాఠం చెప్పిన దర్భా బైరాగిశాస్త్రి గారు – “చచ్చు తెనుగు, ఫోనిస్తూ” అనేవేశారు, నిరసనగా.
“సంస్కృత సాహిత్యం అంటనివాడే తెనుగుల్లో ప్రవేశిస్తాడు, మనకది తగదు” అనిన్నీ మందలించారాయన, తరువాత్తరువాత బహు పరిశీలనగా కనిపెడుతూ వచ్చాను, సంస్కృత సాహిత్యపరులందరిదీ ఇదే సిద్ధాంతం.

తెనుగు సాహిత్యపరులందరూ ఆదిలో తప్పనిసరిగా సంస్కృతంలో ప్రవేశించి వుండడమూ, అయితే వారి సంస్కృత పాండిత్యం సామాన్యం అయిపోయి తెనుగు ప్రావీణ్యమే అధికం కావడమూ బైరాగిశాస్త్రి గారి సిద్ధాంతానికి మూలమేమో నేను చెప్పలేను; కానీ, తెనుగులో వొక్క అక్షరమైనా తెలిసివుండకపోయినా, సీతారామశాస్త్రిగారి మాటే నాకప్పుడశనిపాతం లా తోచింది, బైరాగిశాస్త్రిగారి మాటతో నాకు ప్రాణాలే యెహించి పోయాయి. కానయితే, సంశ్కృతంలో నాకప్పటికి మంచి ప్రవేశమే కలుగుతోంది. రుచిన్నీ బాగా పుట్టివుంది. అది విడిచిపెట్టాలనీ లేదు. అయితే మాత్రం తెనుగు చచ్చుదా? తెనుగుభాష చచ్చుదయితే మరి తెనుగుజాతి? పైగా తెనుగువాడే ఇలా అనడమా? మహా కసి పుట్టేసింది నాకీమాటమీద.
***
(నా గోడు: ఇక్కడ నాకు వేయడం రాకపోయినా, నాదో పెద్ద ఈల. మహాశయా… నమోనమః)
****
“తెనుగులో మంచి పాండిత్యం సంపాదించా”లనుకున్నాను, వెంటనే నేను. పాండిత్యం సంపాదించడమే కాదు, గుడిగోపురంమీద యెందుకెందుకో కలలు కనడంలో గ్రంథాలు రచించాలనిన్నీ కలగన్నాను.

************
-ఇపుడు, నాకు ఊరట కలిగింది ఎందుకంటే – “ఈ కాలం వాళ్ళకి బొత్తిగా తెలుగు మాట్లాడ్డం చేతకాదు” అనో “తెలుగు రాయడం చేతకాదు” అనో, ఇలాగంతా అనేవాళ్ళ మాటల్ని విన్న ప్రతిసారీ “దానికి మేము కారణం కాదు” అని గొంతుచించుకు అరవాలి అనిపిస్తుంది నాకు….ఇకపై ఇక్కడికి పాయింట్ చేయొచ్చు – మేము కాదు దానికి ఆద్యులం అని 😉

మళ్ళీ విషయానికొస్తే, మరి కొద్ది పేజీల తరువాత మళ్ళీ; తెనుగు భారతం చదువుతున్న అనుభవాలు చెబుతూ-

*****************
మనుచరిత్రలాగా పాషాణపాకం కాకపోయినా, భారత భాష కూడా భిన్నమే అయింది నాకు. అందులోని ప్రయోగాలపరిచితాలు కావడంతో కుదరలేదు, మధ్యమధ్య అచ్చతెనుగు మాటలు. ఆ సంస్కృత మహాసముద్రంలో అవి జాతిరత్నాలుగానూ, నడకమాత్రం చూసుకుంటే బహురమ్యంగానూ ఉండేవి; కానీ పణుగులు. అయితే, వాటిలో అనేకాలు జాతికి సుపరిచితాలే, చదువుకున్నవాళ్ళకి మాత్రమే అపరిచితాలు. ఆ చదువుకున్నవాళ్ళలోనూ సర్కారుజిల్లాలవారికి మరీ అపరిచితాలు.

చదువుకున్నవాళ్ళంటే స్వయంకృషితో, లేక, గురుముఖతః తెనుగువాఙ్మయం చదివినవాళ్ళని కాదు నా అభిప్రాయం, ఇంగ్లీషో, సంస్కృతమో శిక్షాపూర్వకంగా చదివిన వాళ్ళు అని. ఎందుకు చెప్పానంటే? సనాతనుల దృష్టిలో, సంస్కృతం నేర్చిన వాళ్ళే చదువుకున్నవాళ్ళు. అధునాతనుల దృష్టిలో ఇంగ్లీషు నేర్చినవాళ్ళే చదువుకున్నవాళ్ళు. ఆ సనాతనులూ, అధునాతనులూ కూడా అచ్చంగా తెనుగువాళ్ళే మళ్ళీ, కానీ వారికుభయులకూ గూడా, తెనుగు తమ మాతృభాష అన్న అభిమానమూ లేదు, జ్ఞానమూ లేదు, మళ్ళీ మాట్టాడితే. ఇటీవల ఇంకో “తనులు” బయలుదేరారు “మమ్మేచూసుకో”మంటూ, హిందీ “మానసపుత్రులు”. వారికీ తెనుగు బతికివుండడమే పనికిరాదు.

కనక, వారినందరినీ మాతృదూరులుగా కట్టివేస్తే, ఇక మిగిలినవారు సామాన్యజనులు. వారికి మాత్రం బాగా తెలుసు ఆ శబ్దాలలో అనేకాలు. లక్షణంగా వాడుతూనే వుంటారు వారు, అవి తమ సంభాషణలలో.

******************
-అయ్యలారా, అమ్మలారా….అదండీ కథ. దెబ్బకి నాలో ఏ కాస్త అపరాధ భావం ఉన్నా కూడా, తొలగిపోయింది….శాస్త్రి గారి మీద మొదట్నుంచీ ఉన్న అమాయకపు ప్రేమా పెరిగిపోయింది. 😉

శాస్త్రి గారికి తెనుగు మీద ఆసక్తి ఎలా కలిగిందో, “నా తెనుగు భాష నేను తెలుసుకోవాలి” అన్న దీక్ష ఎలా మొదలయిందో – ఆ కథంతా చదువుతూ నామట్టుకు నేను ఆశ్చర్యంతో థ్రిల్లయిపోయానంటే నమ్మండి.

ఈ పుస్తకం మార్కెట్లో దొరకట్లేదని విన్నాను కానీ, శాస్త్రి గారి అనుభవాలు మాత్రం పరమ వీర ఆసక్తికరంగా ఉన్నాయి…దొరికితే తప్పకుండా చదవండి.

Advertisements
Published in: on March 26, 2012 at 7:35 pm  Comments (8)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/26/na-tenugu-sripada/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. naadO eela!!!!
  (lekhini isn’t working 😦 )

 2. ఇప్పటి వాళ్ళకు తెలుగుపై మమకారం లేదు, శ్రద్ధలేదు లాంటి వన్నీ ఆడలేక మద్దెలు ఓడన్న చందం. అనేవాళ్ళకో సాకు కావాలి, తిరిగి ఏం అనలేని మనల్ని అనేసి పోతారు. ఈ అనటాలు మన ముందు నుండి ఉన్నాయి, మన తర్వాతా ఉంటాయి. అందుకని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి, మనం ఎంచక్కా శ్రీపాద లాంటి చిక్కని, చక్కని తెలుగు సుబ్బరంగా ఆస్వాదించచ్చు.

  శ్రీపాదకు జై…. 🙂

 3. ఈ పుస్తకం ఇప్పుడే చేతబట్టారా?
  తెలుగు వాడైన ప్రతివాడూ పొద్దున్న లేస్తూనే శ్రీపాద పేరొకసారి స్మరించుకోవాలి. సాయంత్రం దీపాలు పెట్టాక ఆయన స్మృతికొక నమస్కారం చేసుకోవాలి.

 4. చాలా మంచి పుస్తకాన్ని గుర్తుచేసారు.కొన్నేళ్ల క్రితం ఈ పుస్తకం నాకు సగం రేటుకే హైదరాబాదు విశాలాంధ్ర పుస్తకాలయంలో దొరికిందంటే మనవాళ్ల భాషాభిమానం ఎంతటిదో చూడండి.నేనీ పుస్తకాన్ని చాలాసార్లే చదివాను. మన ఖర్మ మేమిటంటే తెలుగు రచయితల్లో చాలా మందికి ఈ పుస్తకాన్ని గురించి తెలీదు. కొత్తపాళీ గారితో ఏకీభవిస్తున్నాను.

 5. @Kottapali: అవునండీ. మార్కెట్లో దొరకట్లేదటగా….మా లైబ్రరీలో దొరికింది. మా ఇంట్లో ఎప్పటిదో పాత ముద్రణ ఒకటి మూడుభాగాలుగా ఉండేది..కానీ, పుస్తకం భాగలన్నీ ఒకసారీ దొరక్క, దొరికిన ఒక్కోభాగమూచిరిగిపోతుందేమో అన్న భయం కొద్దీ దాన్ని చదవలేదు. ఐఐఐటీ లైబ్రరీలో కూడా ఉండేది కానీ, అప్పట్లో మొదటి పేజీల్లో పుస్తకం గురించి జనం ఏమన్నారో మాత్రం చదివా అనమాట…ఇదీ ఆ పుస్తకానికి సంబంధించి నా చరిత్ర.

 6. మార్కెట్టులో దొరకపోవడమేమిటీ..సుబ్బరంగా దొరుకుతోంది. నేను ఈ మధ్యనే ఒక కాపీ కొన్నాను కూడాను.

  ఇది ఒక్కరోజులో చదివేసే పుస్తకం కాదు. రోజూ కొంచ కొంచం చదువుతూ తియ్య తియ్యగా ఆస్వాదించాల్సిన పుస్తకం. 🙂

 7. @ఆ.సౌమ్య: ఓ…దొరుకుతోందా! బెమ్మాండం! ఒక ఫ్రెండు తనకి దొరకట్లేదు అని చెప్పింది. అయితే, ఈ సంగతి అర్జెంటుగా తనకి చెప్పాలి. Thanks!

 8. అయ్యలారా, అమ్మలారా, యెవరూ కొట్టనంటే చెప్పేస్తాను. నిజంగా నేనూ యీ పుస్తకం చదవలేదు. నాకెక్కడా తటస్థపడలేదు మరి. నేనుండేది (అ)భాగ్యనగరంలో. ఎవరికైనా నాకు యిది మావూళ్ళో యెక్కడ దొరుకుతుందో తెలిస్తే చెప్పండి. బందులూ గట్రాలేని శుభదినం చూసుకొని తెచ్చుకుంటాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: