Freiburg Trip, July 2011

(గత ఏడాది జులైలో మా ఊరికి దగ్గరలోని ఫ్రైబుర్గ్ నగరానికి వెళ్లాను స్నేహితులతో. అప్పట్లో రాసుకున్న వ్యాసం ఇది. ఒక స్నేహితుడు తన కేరళ పర్యటన గురించి ఒక పెద్ద ఉత్తరం పంపడంతో, ఇది గుర్తొచ్చి, ఇన్నాళ్టికి దీనికి మోక్షం లభిస్తోంది!)
***************
ఫ్రైబుర్గ్ (Freiburg im Breisgau) జర్మనీలోని బాడెన్-వూర్టెంబర్గ్ రాష్ట్రంలో ఒక నగరం. ఇక్కడి విశ్వవిద్యాలయం జర్మనీలోని అతి పాత విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఆ విషయం తప్పిస్తే, మరేదీ తెలీదు ఇక్కడికి వెళ్ళాలని అనుకునేదాకా. ఫ్రఖ్యాతి చెందిన “బ్లాక్ ఫారెస్ట్” కి పశ్చిమ సరిహద్దు ఈ ఊరు. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటి అని వెదికితే – ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం, బాగా పేరున్న ఒక పాత చర్చి, మంచి జీవన ప్రమాణాలూ వగైరా : అని చెప్పింది వికీపీడియా మాకు. మా ఊరి నుంచి ఒకరోజులో వెళ్ళి వచ్చేసేంత దూరమే కనుక, నలుగురం స్నేహితులం బయలుదేరాము. దారి పొడుగుతా అడవి-లోయల అందాలు కనువిందు చేస్తూ ఉంటే, రెండు మూడు ట్రైనులు మారుతూ చేసిన మా ప్రయాణంలో సగం సమయం “హే, సీ దిస్ సైడ్”, “నో, కం దిస్ సైడ్” అనుకుంటూ ఒకరికి కనిపిస్తున్న దృశ్యం మిగితా అందరికీ చూపించాలనుకుంటూ‌ సాగిపోయింది. ఈ కొద్ది నెలల్లో మొత్తం కలిపి తిరిగిన రూట్లు ఒక ఎత్తు. ఈ‌ట్రెయిన్ రూటు మాత్రం ఒక ఎత్తు!

ఫ్రైబుర్గ్ లో ట్రెయిన్ దిగగానే, టూరిస్ట్ సమాచారం వారి ఆఫీసు వెదుకుతూ బయలుదేరాము. ఆ దారిలో “కన్ఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్” అని చూసి ఆశ్చర్యపోయి ఇంకా తేరుకోకముందే, అక్కడొక మ్యూజియం కనిపించింది. ఏమిటా? అని లోపలికెళ్తే అది ఇక్కడి “కార్నివాల్ మ్యూజియం” అని తెలిసింది. రకరకాల బొమ్మల్తో చూడముచ్చటగా ఉంది కానీ, మేము అక్కడ ఉండేది ఐదున్నర గంటలే అన్న స్పౄహ మాకుంది కనుక, ముందుకు సాగిపోయాము. టూరిస్టు ఆఫీసులో ఒక మ్యాపు తీసుకుంటే, అందులో, ఆ ఆఫీసు వద్ద మొదలుపెట్టి, నడుస్తూ ఫ్రైబుర్గ్ లో ముఖ్యమైనవి చూస్కుని, మళ్ళీ అక్కడికే చేరే విధంగా తయారుచేసిన ఒక ప్లాన్ ఉంది. దానిని చూస్కుంటూ‌ తిరగడం మొదలుపెట్టాము. (ఇలాంటి ప్లానుల వల్ల ఇలాంటి ఊర్లు తిరగడానికి చాలా సౌలభ్యం ఉంది.).

మొదట ఇక్కడి రాత్‌హౌస్ (టౌన్ హాలు) నుంచి మొదలుపెట్టాము. ఇక్కడ కొత్త-టవున్ హాలు, పాత టవున్ హాలూ పక్క పక్కనే ఉన్నాయి. ఇదివరలో వెళ్ళిన జర్మన్ నగరాల్లో ఇలా రెండు, అదీ పక్క పక్కనే చూసిన దాఖలాల్లేవు నాకు. అక్కడే ఒక పాత చర్చి కూడానూ. అక్కడి నుంచి మున్స్టర్ ప్లాట్జ్ అనే కూడలికి వెళ్ళేదారిలో చాలా మట్టుకు పాత భవనాలు ఉన్నాయి. కొన్నింటిపైనైతే 1430, 1460 ఇలా సంవత్సరాల పేర్లు కూడా చెక్కి ఉన్నాయి. అయితే, అన్నీ అధునికీకరించారు అనుకుంటాను. అది ఇక్కడి బజారు వీథిలా ఉంది. ఆ సందడి దాటుకుని “మున్స్టర్ ప్లాట్జ్” చేరుకున్నాము. ఇక్కడ ఎప్పుడో 1200 లో కట్టిన పెద్ద క్రైస్తవ దేవాలయం ఉంది. దాని ప్రాంగణంలోనే మాకొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

మేము వెళ్ళిన రోజు అక్కడ – ఫ్రైబుర్గ్ సైన్స్ పండుగ జరుగుతోంది. అది కాక ఆ చర్చి ఉన్న కూడలిలో సంత జరుగుతోంది. ఒకవైపు సైన్సు సంత, ఒక వైపు బ్రతుకు సంత… మరో పక్క, వేదికపై పాటలు పాడుతున్న గాయకులు, రకరకాల వాయిద్యాలతో సంగీత కళాకారుల బృందం. – ఇలా ఆ ప్రాంతంలో జీవకళ ఉట్టిపడుతూ ఉండింది. చర్చి చాలా పెద్దది. లోపల నుంచి మెలికలు తిరిగే మెట్లెక్కుతూ పై దాకా వెళ్తే, నగరం మొత్తం కనిపిస్తుంది. నేను మొత్తం ఎక్కలేదు కానీ, ఎక్కిన మేర నుండి, కింద చీమల్లా కనిపిస్తున్న మనుషుల్ని, వాళ్ళ పక్కన ఆజానుబాహువుల్లా నిలబడ్డ భవనాల్నీ మాత్రం చూశాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ చుట్టుపక్కల దాడులు జరిగి, చాలా భవనాలు దెబ్బతిన్నా కూడా తట్టుకుని నిలబడ్డదంట ఈ చర్చి. అసలు లోపలి నిర్మాణం కూడా, ఏ చరిత్రా తెలియకపోయినా, క్రైస్తవ నిర్మాణాల గురించి అవగాహన లేకపోయినా, అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. అంత బాగుంది.

సైన్సు పండుగ – ఆ ప్రాంతంలోనే నాలుగైదు టెంట్లలో, విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ శాఖలవారు స్టాల్స్ పెట్టి నిర్వహించారు. నాకు స్కూలు రోజుల్లో జరిగే జిల్లా-రాష్ట్ర స్థాయి సైన్సు ఫేర్లు గుర్తొచ్చాయి. ఏటా నా పాత యూనివర్సిటీలో అక్కడ ఆ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల ఫలితాలను ప్రదర్శిస్తూ నిర్వహించే కార్యక్రమం కూడా గుర్తు వచ్చింది. బయటకి వస్తే, అక్కడ జనాల ఉత్సాహం సంగతి ఎలాగో చెప్పనక్కర్లేదు. అంతా కోలాహలంగా ఉండింది. సైన్సు పండుగతో కూడా తక్కిన వాటిని ఇలా కలిపేసి సరదాగా చేసుకుంటారని ఇప్పుడే తెలిసింది.

ఈ కూడలిలోనే ఒక పాత “కాఫ్‌హౌస్” కూడా ఉంది. అక్కడ పదహారో శతాబ్దం కాలం నుండీ వ్యాపార, వాణిజ్య లావాదేవీలెన్నో జరిగేవట. అలాగే, పక్కనే మరో భవనం -వైన్ తయారీకి కొని వందల ఏళ్ళుగా పేరొందినదట. ఇలా, ప్రతి భవనానికీ, ఏదో ఒక చరిత్ర రాసి పెట్టారిక్కడ. (కావాలని అనుకోకపోయినా, నెల్లూరులో అనుకోకుండా, తిక్కన గారి ఇల్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కనబడ్డం గుర్తొచ్చింది. వీళ్ళు చూస్తే, మామూలు వాటికి కూడా చారిత్రక విలువ తెప్పిస్తున్నారిక్కడ!!) ఇక్కడినుండి, పాతకాలం నాటి నగర ముఖ ద్వారాల్లో ఒకటైన “ష్వాబెన్ టోర్” చూట్టానికి బయలుదేరాము. దారిలో, మొదట ఇండియన్ షాప్ అని ఒకటి కనబడేసరికి ఉత్సాహపడి చూస్తే, అది ఉత్తర అమెరికాకు చెందిన నేటివ్ ఇండియన్లకు సంబంధించినదని అర్థమైంది. కానీ, రెండడుగులు వేశామో లేదో, “మహాత్మా గాంధీ” అని ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. రెస్టారెంటుకు గాంధీ అన్న పేరు ఏమిటో! అనుకున్నాను. పేరు పెట్టుకున్నా ఒకరకం కానీ, బయట తగిలించి ఉన్న మెనూ చూసాను. బీరు, వైన్ విస్కీ ఇత్యాది సమస్త పానీయాలనూ మహాత్ముడి పేరుతో అమ్మడం మాత్రం కాస్త విడ్డూరంగా అనిపించింది (జై మాతా వైన్స్ అన్నట్లు!).

ఇక్కడ నుంచి ష్వేబెన్ టోర్ చేరే వీథులు ఎన్నో వందల ఏళ్ళ నాటి నుంచీ ఉన్నవట. అక్కడ “ష్వేబెన్ టోర్” (Schwaben Tor) అన్న ఒకప్పటి ముఖ ద్వారం చేరుకున్నాక, “జుం రోటెన్ బేరెన్” అని ఒక హోటెల్ కనబడ్డది. బోలెడు హోటెళ్ళలో అదొకటి అనుకోవడానికి లేదు. దానికో పెద్ద చరిత్ర ఉంది. అది ఏడొందల సంవత్సరాల నాటిదట. జర్మనీ దేశంలో అన్నింటికంటే పాత హోటెలట! ఇలాంటి విషయాలు కూడా ఎలా సేకరించి, పర్యాటకులకు తెలిసేలా చేస్తారో కదా! అని ఆశ్చర్యపోయాను.


అక్కడినుంచి మా తదుపరి మజిలీ నగరానికి ఒకప్పుడున్న మరో ముఖద్వారం – మార్టిన్స్ టోర్ చూడ్డం. దారిలో పాతకాలంలో ఒక్కప్పటి చర్మకారుల, జాలరి వాళ్ళ ఇళ్ళు ఉండే ప్రాంతాల మీదుగా నడుస్తూ, ఒకప్పటి మార్టిన్స్ టోర్ వద్దకు చేరుకున్నాము. అక్కడ నుంచి రెణ్ణిమిషాలు నడవగానే, యూనివర్సిటీ భవనాలు కనిపించాయి. ఇక్కడ విశ్వవిద్యాలయం 1457లో స్థాపించారు. అలాగే మ్యాపు చెప్పింది వింటూ, ఈ వీథుల గుండా వెళ్ళి, ఒకప్పటి సినగాగ్ కూడలి చేరుకుని, అక్కడ ఇక్కడి “సిటీ థియేటర్” అనబడు నాటక ప్రదర్శనా శాలను చూసి (అన్నట్లు ఆ భవనం పై, “హార్ట్ ఆఫ్ ది సిటీ” అని చెక్కి ఉంది), మ్యాపులో చెప్పిన “ష్వార్జెస్ క్లోస్టర్” (అంటే బ్లాక్ మొనాస్టరీ అని అర్థమట) ని వెదుకుతూ బయలుదెరాము. విచిత్రం ఏమిటంటే, అసలు ఎక్కడా దానికి సంబంధించిన గుర్తులు లేవు. మ్యాపు చూస్తే, మేము వచ్చిన దారి సరైనదే అంటుంది.

చివరకు అర్థం కాక, దారిలో వెళ్తున్న అమ్మాయిలను అడిగాము. వాళ్ళు మ్యాపును రకరకాలుగా తిప్పి చూసి, పేరు నాలుగైదు సార్లు చదివాక… చివరకి వాళ్ళల్లో ఒకామె “అయాం సారీ. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము కానీ, నిజంగా ఇదెప్పుడూ వినలేదు. క్షమించండి” అన్నది. సరేలే, దీనిసంగతి వదిలేద్దాం అనుకుని, అవతల వైపు కనిపిస్తున్న “కొలంబీ పార్కు- భవనం” వైపుకి తిరిగాము. ఇంతలో, అదిగో, అటుపక్క చిన్న గల్లీలో ఏమన్నా ఉండొచ్చు, చూద్దాం అని మాలో ఒకరు అంటేనూ, మళ్ళీ రోడ్డు దాటి, ఈ బ్లాక్ మొనాస్టరీ వేటలో ఒక పది నిముషాలు తిరిగి, నడుస్తూ ఉంటే “కంఫ్యూజియస్ ఇన్స్టిట్యూట్” భవనం వెనుక భాగం కనిపించింది. మధ్యాహ్నం ఎక్కడ నుంచైతే మొదలుపెట్టామో, దానికి సమాంతరంగా ఉన్న వీథిలో నడుస్తున్నాము అని అర్థమైంది. ఇంతలో, మళ్ళీ మెయిన్ రోడ్డుకి (ఎక్కడైతే ఆ అమ్మాయిలను దారి అడిగామో అక్కడికి) వచ్చేస్తాం అనగా, యధాలాపంగా తల తిప్పితే, “ఉర్సులినెన్ క్లోస్టర్” అన్న పేరు ఉన్న భవనం. ఇంతసేపూ వెదుకుతున్న బ్లాక్ మొనాస్టరీ కి మరో పేరది! దాని కథాకమామిషూ ఏమిటన్నది ఇంకా అర్థం కాలేదు నాకసలు!!

ఆ సరికి, మా ఐదున్నర గంటలూ దాదాపుగా అయిపోయాయి. ఇంకాసేపట్లో ట్రెయినెక్కాలి. దానితో, నా స్నేహ బృందం కొలంబీ తోటలో తిరుగుతూ ఉంటే, నేను ప్రస్తుతం ఆ ఊర్లో ఉన్న నా కాలేజీ రోజుల నాటి స్నేహితురాలిని రైల్వే స్టేషన్ లో కలిసాను.

మొత్తానికి ఊరు పెద్దదే అయ్యుండొచ్చు కానీ, పర్యాటక ఆకర్షణలన్నీ రైల్వే స్టేషన్ చుట్టుపక్కలే ఉండటంతో, ఉన్న సమయం తక్కువైనా బానే తిరిగినట్లు లెక్క. ఊరు చాలా సందడిగా ఉంది. ఎక్కడికక్కడ కనిపించే పిల్లకాలువలూ, కూడళ్ళలో కనిపించే అందమైన విగ్రహాలూ (రెండూ మా ఊర్లో పెద్దగా లేవు!) నాకు నచ్చాయి. ఊళ్ళో‌ మంచి మ్యూజియంలు చాలానే ఉన్నాయి కానీ, ఐదున్నర గంటల్లో అన్నీ చూసేయాలి అనుకోవడం అత్యాశ కదా. అలాగా ముగిసింది మా ప్రయాణం.

వింతగా కనిపిస్తున్న ఈ విగ్రహంతో ఈ టపా ముగిస్తున్నాను 🙂

Advertisements
Published in: on February 27, 2012 at 10:16 pm  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/27/freiburg-trip-july-2011/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. I think Gandhi is a common name for Indian restaurants in Europe. Most of them serve liquor & meat. I even saw beef on the menu at a Gandhi in Amsterdam. I felt like leaving a comment in their guestbook but did not do so to avoid unnecessary attention.

  2. కావాలని అనుకోకపోయినా, నెల్లూరులో అనుకోకుండా, తిక్కన గారి ఇల్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కనబడ్డం గుర్తొచ్చింది….
    భలేవారు మీరు. మీకు మరీ అత్యాస. ఈ దేశంలో ఉంటేగింటే రాజకీయనాయకుల విగ్రహాలూ, వాళ్లపేర్లతోనే ప్రాజెక్టులూ, జిల్లాలపేర్లూ, పార్కులూ, భవనాలూ, వీధులూ ఉండాలి తప్ప, ఎవ్వడో కౌన్ కిస్కాహై గాళ్ళు కవులూ, కళాకారులూ, శాస్త్రజ్ఞులూ అంటారేమిటి? అలాంటివేమైనా ఉంటే అది ప్రజలు చూసుకోవాలి. డబ్బులడక్కండిగాని, ఆవిష్కరణలేవైనా ఉంటే చెప్పండి, ఆలస్యంగానైనా వాళ్ళు వేంచేస్తారు.

  3. చిన్న ఊరు గురించి పెద్ద సంగతులు విశదంగా (పెద్దగా) బాగా చెప్పారు. ధన్యవాదాలు.

  4. […] ఆలోచించినా ఏమీ తేల్చలేకపోయాను. Freiburg వెళ్ళినప్పుడు ఎక్కలేక చతికిలబడ్డ సంగతి గుర్తొచ్చి […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: