చెక్కుడు చీస్, రెండు చెక్కుళ్ళ ఆలూ (ప్రాగోగులు-4)

ఇవ్వాళ్టికి ప్రాగ్ చేరి ఎనిమిదో (ఆఖరు) రోజు. పనులన్నీ అయిపోయాయి కనుక, తీరిగ్గా కూర్చుని ఏం తిన్నా ఇక్కడ? అని ఆలోచించడం మొదలుపెట్టాను. రెండు రోజులుగా మాలో రికరింగ్ జోక్ ఏమిటంటే – చెక్ రెస్టారెంట్ కి వెళ్ళి వెజిటేరియన్ అంటే చాలు – పొటాటో ఫ్రైస్, ఫ్రైడ్ చీస్ … మన ముందు ఉంటాయి అని.

రాత్రి భోజనానికి ఎవరిష్టం వారిది కానీ, సాధారణంగా మధ్యాహ్నాలు వింటర్ స్కూల్లో అందరితో కలిసి అక్కడే తినాల్సి వస్తుంది (వెళ్ళే వాళ్ళు అప్పుడు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, కానీ, ఏదో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చని నేను వెళ్ళలేదు). అయితే, మొదటి రోజు – ఏదో పెట్టారు. అది బాగుండింది. నాకు చాలా రుచిగా కూడా అనిపించింది. బహుశా, వెజిటబుల్ రైస్ తరహాలో వండినందుకేమో. దానితో లంచ్ తర్వాత బయటకు వచ్చాక నన్ను అక్కడ చదువుకుంటున్న ఒకతను “వెజిటేరియన్ ఫుడ్ ఎలా ఉంది?” అని అడిగితే.. “వండర్ఫుల్. భలే ఉంది. నేను ఇంత రుచిగా ఉంటుందని ఊహించలేదు” అని చెప్పుకుపోతూ ఉంటే, ఆశ్చర్యంతో అతను “నిజమా! చెక్ వెజిటేరియన్ ఫుడ్ బాగుంది అని ఇదే వినడం. చూద్దాం ఈ వారం ముగిసేసరికి ఏమంటావో!” అన్నాడు. అర్రెర్రె! ఎంత దార్శనికుడు! అనిపిస్తోంది ఇప్పుడు అతన్ని తల్చుకుంటే :))

సరే, తరువాత నుండి మళ్ళీ శుక్రవారం దాకా … రోజూ ఫ్రైడ్ చీస్, పొటాటో ఫ్రైస్… రెంటిలో ఏదో ఒక్కటైనా (లేకపోతే రెండూ) తప్పనిసరి మా లంచ్ లో. అది తప్ప తినేదానికి ఏదీ ఉండదు అక్కడ. నాకేమో ఆ రెండింటిపై రోజూ ఆబగా తినేసేంత మమకారం లేదు. అన్నింటికంటే ఘోరం ఏమిటంటే, ఒకరోజు గ్రూప్ డిన్నర్ అనమాట. అది ముగిసిన తరువాత – అది నచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే – అక్కడ బీరూ, వైనూ ఏరులై పారింది కనుక, ఆ ఏరులో ఈతకొట్టిన వారూ, పంది మాంసాన్ని బాగా ఇష్టపడి తినేవారూనూ! మరి ఆ రెండు కోవల్లోకి చెందని నాలాంటి వాళ్ళకి (నేనూ, ఇంకో బ్రీటీష్ అమ్మాయీ) మా పరమాద్భుతమైన “ఫ్రైడ్ చీజ్, ఆలూ ఫ్రైస్” వండి వేయించి పెట్టారన్నమాట :)). ఆ విధంగా… నాకు కావాల్సింది మాత్రమే తీసుకుని, అది తిని…ఏదీ మిగిలించి పారేయని చరిత్ర గల నేను.. ఇలాగ రోజూ ఆలూ, చీస్ తినలేక ప్రాగ్లో పెట్టుకున్న తిండి వదిలేయడం నేర్చుకోవాల్సి వచ్చింది.

అయితే, ఇది చూసి ప్రాగ్ లో శాకాహారులకి దిక్కులేదు అనుకోనక్కర్లేదు. బోలెడు ఇతర ఆప్షన్లు ఉన్నాయి. కనీసం మేము ఉన్న ఏరియాలో బోలెడు రకరకాల ఇతర జాతీయ రెస్టారెంట్లు ఉన్నాయి… ఇస్కాన్ వారి ఇండియన్ కాక..నిజం ఇండియన్ వి కూడా ఉన్నాయి (నేను వెళ్ళలేదు కానీ, బాగుంటాయని చెప్పారు ఇక్కడ). మేము ఇలా రోజూ రాత్రుళ్ళు రోడ్డున పడేవాళ్ళం కనుక, ఒక్క గ్రూప్ డిన్నర్ అప్పుడు తక్క, మిగితా అన్ని రోజులూ పది నిముషాల నడకలో చక్కటి శాకాహారం దొరికేది (అంటే, సరిగ్గా మన టైపులో ఉండేవే కావాలి అంటే కష్టం కానీ, శాకాహారం అయితే చాలు అన్న పరిమితి మాత్రమే ఉంటే దొరికేస్తుంది అని భావము) వీటన్నింటికంటే నాకు తెగ నచ్చేసినవి – బేకరీలు/మినీ మార్కెట్లూ..వాటిలోని బ్రెడ్డు/బిస్కట్/కేక్ వెరైటీలు. నేను “ఫుడ్ టూరిజం” లో నేను మహా మురిసిపోయిన సందర్భాలూ వీట్ల్లో ఉన్నప్పుడే 🙂

ఇంక, చాలా చోట్ల సలాడ్లు కూడా ఉన్నట్లే ఉన్నాయి. ఒకరోజు ఒక వందేళ్ళ నాటి రెస్టారెంటుకు వెళ్ళాము. అక్కడికి ఒకప్పుడు ఐన్స్టీన్, కాఫ్కా వంటి వారు వచ్చేవారట (అయినా కూడా, అది మామూలు రెస్టారెంటు…చాలా మామూలు ధరలు. నాలుగు యూరోల్లో నేను ఎంచక్కా బ్రెడ్డు, వెజిటెబుల్ సలాడ్ తిని, ఆ చలికి హాట్ చాక్లెట్ కూడా సేవించేసా! మా ఊళ్ళో అయితే దాదాపు అసాధ్యం. ఇక ఇలా గొప్పోళ్ళు వచ్చారన్న పేరున్న రెస్టారెంటైతే మరీ అసాధ్యం!). అక్కడ శాకాహారులకి కొద్దో గొప్పో చాయిస్ ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన అంశం 🙂 అసలుకి నా సలహా ఏమిటంటే – ప్రాగ్ వెళ్ళే శాకాహారులూ, బహుపరాక్…. అనేంత దృశ్యం లేదు… ఎంచక్కా అన్నీ దొరుకుతాయి కాసేపు అటూ ఇటూ నడిస్తే. కానీ, పొరపాట్న కూడా చెక్ రెస్టారెంట్లకు వెళ్ళకండి. వెళ్ళిన ప్రతిచోట లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అనుకోడంలో తప్పు లేదు కానీ, లేని ఫుడ్డు ఎక్కణ్ణుంచి తింటాం చెప్పండీ?? 😛

చివరి రోజు (అంటే నిన్న) మొత్తం అయిపోయాక అందరూ ఎంచక్కా రాత్రి చెక్ రెస్టారెంటుకి వెళ్ళి గులాష్ (అదో రకం మాంసాహారం. బీఫ్/పోర్క్ ఏదో వాడతారు. నాకు వివరాలు తెలీవు) తింటూ బీర్ సేవిద్దాం అని తీర్మానించారు. నేను తిరగబడ్డా 😉 నా వల్ల కాదు ఆ చీజ్, పొటాటో తినడం. నేను ఇంకెక్కడికన్నా..ఏ సబ్వేకో, ఫలాఫెల్ షాపుకో పోతాను అన్నా… ఏ బేకరికో వెళ్ళినా ఆ చెక్ రెస్టారెంటులకంటే పావు ఖర్చుతో నచ్చింది తినొచ్చు…అనుకున్నా మనసులో! ఇంతలో, నా కొలీగ్ చైనీస్ అబ్బాయి కూడా తిరగబడి – నాకు చిరాగ్గా ఉంది ఈ సెంట్రల్ యూరోపియన్ ఫుడ్ తో…నేను చైనీస్ రెస్టారెంటుకి వెళ్ళి చూస్తా ఎలా ఉంటుందో! అన్నాడు. హమ్మయ్యా! అయాం నాట్ అలోన్… అనుకుని, టాటా చెప్పేసా. సరే, అలా వెళ్ళబోతూ ఉండగా, ఇతను అన్నాడు – “చైనీస్ రెస్టారెంట్లలో విజిటేరియన్ డిషెస్ రెండు మూడు ఎలాగో ఉంటాయి.. నీకు పర్లేదు అంటే నాతో పాటు రావచ్చు” అని. గతంలో వివిధ దేశాల్లో (అంటే- నార్వే, క్రొయేషియా మరియు డెన్మార్క్) నాకు శాకాహారం దొరకడంలో సాయం చేసాడు కనుక, ఇతన్ని నేను నమ్మాను 😉 అలా ఇద్దరం కలిసి ఒక చైనీస్ రెస్టారెంటుకు వెళ్ళాము. అప్పుడే కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.

ఆ రెస్టారెంటుకు వెళ్ళే దారిలో ఆ అబ్బాయిని – “అయితే, ఇంటి ఫుడ్ మీద దారి మళ్ళిందా?” అని అడిగాను. దానికి అతని జవాబులో నాకు బోలెడు జ్ఞానోదయం అయ్యింది. “లేదు. ఇలా ఊరికే రకరకాల మాంసాలు ఉత్తవి తినాలంటే విసుగ్గా ఉంది. చైనాలో కూడా రకరకాల మంసం తింటాం కానీ, వాటితో పాటు అన్నమో, నూడుల్సో ఇలా ఏదో ఒకటి ఉంటుంది.” అన్నాడు. నేను “ఓహో” అనెంతలోనే…”అసలు వీళ్ళకి వెజిటేరియన్ అంటే సలాడ్లు, చీస్ ఫ్రై మాత్రమే ఎందుకో నాకు అర్థం కాదు. చైనాలో అయితే వెజిటేరియన్ కి కూడా చాలా చాయిస్ ఉంటుంది” అన్నాడు. నేను అవాక్కయ్యాను. చైనాలో వెజిటేరియనా? అని. అదే అతన్ని అడిగేసాను. అతను వాళ్ళు ఉత్త కూరగాయలతో కూడా రకరకాలవి చేసుకుంటారనీ, కొన్ని బౌద్ధ ఆలయాలకి వెళ్తే, గుడ్డు లేని ఆహారం కూడా దొరుకుతుందనీ అన్నాడు. కెవ్వుమని కేకపెట్టింది మనసు. నాకు తెల్సిన ఒకరిద్దరు చైనా వెళ్ళినప్పుడు ఆహరం గురించి కంప్లైంట్ చేసినట్లే గుర్తు. అలాగంటే, జర్మనీ గురించి కూడా చేసారు అనుకోండీ… కనుక, బహుశా, సరిగ్గా మన టైపు ఆహారం కోసం చూసి నిరాశపడ్డారేమో అనిపించింది ఇది విన్నాక.

సరే, ఈ స్నేహితుడు నాకు కొన్నాళ్ళ బట్టీ తెలుసు, ఒకే డిపార్ట్మెంట్ లో పని చేస్తాం కనుక. అతను సాధారణంగా చైనీస్ రెస్టారెంటుకు వెళ్ళడు. అందుకని కుతూహలం కొద్దీ మళ్ళీ అడిగా.. నువ్వు వెళ్ళవు కదా. ఇవ్వాళ ఎందుకు వెళ్దాం అనుకున్నావు? అని. అతని జవాబు : “సాధారణంగా యూరోప్లో,అమెరికాలో కనబడే చైనీస్ రెస్టారెంట్లు చాలా మట్టుకు విన్ జౌ (Wenzhou) ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పెడతారు. ఈ రెస్టారెంటు “సిచ్వాన్” (Sichuan) వాళ్ళది (పేరును బట్టి చెప్పాడు అనుకుంటా). నేను ఈ ప్రాంతానికి దగ్గర్లో పెరిగాను కనుక, నాకు ఇక్కడి ఫుడ్ అంటే ఇష్టం.” అన్నాడు. విషయం ఏమిటంటే, ఇక్కడి ఆహారం చాలా “హాట్” గురూ టైపులో ఉంటుంది. ఈ కుర్రాడు అక్కడివాడే అయినా, బహూశా ఏళ్ళ తరబడి యూరోప్ లో ఉండి సుకుమారం అయిపోయాడో ఏమో… ఉప్ఫూ ఉప్ఫూ అనుకుంటూ, చెమట్లు కక్కుతూ, నేను నవ్వుతూ ఉంటే సిగ్గుపడుతూ తిన్నాడు :)) ఇండియాలోని చైనీస్ రెస్టారెంట్లలో సిచ్వాన్ స్టైల్ వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్ అని అమ్ముతారు కొన్ని చోట్ల..కొంచెం స్పైసీగా ఉండే ఫ్రైడ్ రైస్ అది. ఇదంతా అయిన చాలా సేపటికి నాకు బల్బు వెలిగింది – ఆ పేరెందుకు వచ్చిందో!

బహుశా ప్రాగ్ వార్తలు ఇక్కడితో సమాప్తం అనుకుంటాను 🙂

Advertisements
Published in: on February 19, 2012 at 9:36 am  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/19/chekkudu-cheese/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. శ్రావ్య గారూ,
    మీ అనుభవాలు చాలా బాగా రాశారు. యూరోపులో కొన్ని దేశాల్లో చికెన్ కూడా శాకాహారమే. మా రూములో ఒక ఇటాలియన్ మిత్రుడు ఉండేవాడు. భారతదేశములో శాకాహారం అంటే కేవలం మొక్కల నుండి వచ్చిన ఆహారమే (పాలు మినహాయించి) అని చెబితే ఆశ్చర్యపోయి కొన్ని రోజులు మా వంట దగ్గరుండి పరీక్షించాడు. మీలాగానే అస్సలు మాంసం ముట్టని అమ్మాయి ఉంటుంది మాతోపాటు. ఒక రోజు చికెన్ తెచ్చి ఆ పిల్లకిచ్చి పట్టుకోమన్నాడు అడిగితే ఇది శాకాహారమే కదా అన్నాడు. అప్పుడా అమ్మాయి మొహములో రంగులు చూడాలి! మేమంతా ఇప్పటికీ నవ్వుకుంటాం. అలాగే రెండు స్పూన్ల సాంబారు తాగి మంటో మంటో అనుకుంటూ మూడు గ్లాసుల నీళ్ళు తాగాడు! ఇక భారతీయ శాకాహారులకు అన్నపూర్ణవంటిది సబ్వే వారి వెజ్జీ పట్టీ…..

  2. What wonderful adventures in Prague :). And thanks for uncovering vegetarian options in China.

  3. @Achanga: నా పేరు సౌమ్య అండీ 🙂

  4. సౌమ్య గారూ మీ ప్రాగ్ అనుభవాలు మాతో పంచుకుని మమ్మల్ని కూడా ‘ప్రాగ్’ తీసుకెళ్ళిపోయారు.

  5. chaala rojula tharavatha nee blog chaduvthunna. Prathi post lo manchi sense of humour undhi. Asalu title choose chaala navvu vocchindi 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: