ప్రాగోగులు-3

ఇవ్వాళ నా తిరుగుళ్ళలో చాలా భాగం ప్రాగ్ కోట ప్రాంగణాల లోనే గడిచింది. బయట నుంచి చూస్తే అదొక మినీ నగరంలా అనిపించింది. లోపలికెళ్ళాక, నిజమే నని అర్థమైంది. కోట, చర్చి(లు), జైళ్ళు, మధ్యలో మామూలు జనాభా ఇళ్ళూ… ఇలా అన్నీ ఉన్నాయి. వీటికి తోడు ఎముకలు కొరికే చలి కూడా :). అలా వణుకుతూనే మళ్ళీ పాత-నగరం వీథుల్లో తిరిగాను అనుకోండి, అది వేరే విషయం.

ఈ కోట ప్రాంగణంలో ప్రత్యేకం గుర్తుండిపోయినవి –

1) ఈ రాజుల యుద్ధకాంక్షల గుర్తులు
2) ఖైదీల జైళ్ళు
3) కాఫ్కా నివసించిన ఇల్లు
4) బయట నుంచి చూస్తే అద్భుతంగా అనిపించినా, లోపల మామూలుగా ఉన్న రాజ భవనమూ (ప్యారిస్ లోని వర్సై ప్యాలెస్ తాలూకా జనం డబ్బుల్తో భోగాల్లో మునిగే ప్రక్రియ చూశాక తక్కిన అన్నీ సింపుల్ గా అనిపిస్తున్నాయో ఏమిటో మరి నాకు…)
5) ఆ ఎత్తు నుండి కనబడే ఊరు దృశ్యాలూ

అడుగు పెట్టీ పెట్టగానే, గేటు దగ్గరే హింస మొదలు. ఆ గేటు పైన ఉన్న రెండు బొమ్మల్నీ చూడండి…ఎలా చంపుకుంటున్నారో! x-(

లోపలి రాజుల ప్యాలెస్ బైట నుంచి చూడ్డానికి, ఇలా, నాకు మా గొప్పగా అనిపించింది.

కాసేపు అక్కడక్కడ తిరిగి, ఎదురుగ్గా ఉన్న చర్చిలోకి తొంగి చూసి వచ్చాక, “గోల్డెన్ లేన్” అన్న భాగానికి వెళ్ళాను. ఇది ఒకప్పుడు ఈ కోట గోడలకి ఆనుకుని కట్టుకున్న చిన్న చిన్న ఈళ్ళ వీథి. మొదట స్వర్ణకారులు, ఆపై రాజభవనంలో పని చేసే ఇతర పనుల వారూ ఉన్నా, ఒక సమయంలో రాజుగారు ఆల్కెమిస్టులను కూడా ఇక్కడ ఉంచాడట. అందుకని “గోల్డెన్ లేన్” అన్న పేరట. ఇంతకీ, ఆధునిక యుగంలో కాఫ్కా ఒక రెండేళ్ళు ఇందులో ఒక ఇంట్లో అద్దెకి ఉన్నాడట! ఇంకా కొంతమంది చెక్ ప్రముఖులు కూడా ఇక్కడ వివిధ సమయాల్లో జీవించారట. కాఫ్కా ఉన్న ఇల్లు ఇప్పుడు సావనీర్ షాపుగా మారిపోయింది.

ఈ వీథిలోనే ఒక చోట పైన అంతస్థులో యుద్ధాల్లో వాడిన కత్తులు, కిరీటాలూ, రకరకాల ఆర్మర్లూ అన్నీ ఉన్నాయి. అబ్బో! ఇవన్నీ వేస్కుని ఎలా యుద్ధాలు చేసేవాళ్ళో! అనుకున్నా.

ఇది దాటుకుని వచ్చాక, “దాలిబోర్ టవర్” అన్న బురుజు లాంటి దాని దగ్గరికి వచ్చా. లోపలికి వెళ్ళే ముందు అదేమిటో నాకు తెలీదు. కానీ, నిజానికి అది ఒక భయంకరమైన జైలు. దుర్యోధనుడు శకుని వాళ్ళ ఫ్యామిలీని ఒక డంజన్లో పడేసి రోజూ వంద మెతుకులు పడేసేవాడని సినిమాల్లో చూపిస్తారే… అదంతా విని, ఆ వీళ్ళు మరీలే…అలాంటి డంజన్లలోకి ఎలా పడేస్తారు మనుషుల్ని ఎంతైనా? అనుకునేదాన్ని. ఇక్కడ అలాంటీది నిజంగానే ఉంది! అలాగే, ఈ బందీలను బందించే సెళ్ళు కూడా వివిధ రకాలవి ఉన్నాయి. ఉదాహరణకి ఇదొకటి.

ఇక్కడ మొదట్లో రాజకుటుంబీకుల్లో తప్పు చేసిన వారిని బందించేవారట. దీని పేరు దలిబోర్ అన్న ఒక యోధుడి పేరు మీద పెట్టారట. అతడు రాజకుటుంబీకుడే అయినా, ఏదో రాజుకి వ్యతిరేకులని సమర్థించినందుకో దేనికో ఈ జైల్లో పడేసారంట. ఒక కథ ప్రకారం ఇక్కడి ఒంటరితనంలో కాలక్షేపం కోసం అతగాడు ఫిడేలు నేర్చుకుని, దానిపై విషాద గీతాలు అద్భుతంగా వాయించడం మొదలుపెట్టాడంట. దాని గురించి విన్న ప్రాగ్ ప్రజలు వచ్చి ఆ జైలు చుట్టూ చేరి అతని పాటలు వినేవాళ్ళట. ఇంతకీ, చివర్లో ఇతన్ని కొన్నాళ్ళ తరువాత ఉరితీసారంట. ఇలాగ జైల్లో ఫిడేలు నేర్చుకోవడం గురించి చెక్ భాషలో ఒక సామెత కూడా ఉందట – “Necessity taught Dalibor how to fiddle” అని. అయితే, ఇది కాకుండా అసలు కథ ఇంకోటి ఉంది. ఆ కాలంలో “ఫిడేలు” అని ఒక టార్చర్ ఇన్స్ట్రుమెంట్ కి మారుపేరు ఉండేదంట. దానికి మనిషిని తగిలించి “శ్రుతి” చేస్తే, ఎలాంటీ వాడైనా తను వాయులీనం కాకుండా ఉండాలంటే, నేరాలు ఒప్పేసుకోవాల్సిందేనట. దాని నమూనా కూడా ఒకటి అక్కడ కనబడ్డది కానీ, ఫోటోలు తీయలేదు. అక్కడి బోర్డుపై ఇది ఉంది:

“The fiddle was a nickname for an instrument of torture, a sort of rack on which the convicted man was “streched” till, “out of necessity” (under pressure, in suffering), the victim began to “fiddle” (change his tune, confess)

ఇప్పుడు అర్థమవుతోంది నిన్న Museum of medieval torture instruments” ఎందుకు కనబడ్డదో!! అయ్యా, అదీ కథ!

ఒక విధమైన హారర్ తో బయటకు వచ్చా, ఆ శిక్షా విధానాలూ, జైళ్ళూ చూశాక. అంతా అయ్యాక, షరా మామూలుగా – “ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం?” అని మళ్ళీ నిట్టూర్చుకున్నా, శ్రీశ్రీ ని తలుచుకుంటూ. వర్సై పేలెస్ చూసినప్పుడు యుద్ధ కాంక్షని గురించి అనుకుంటూ ఈ కవిత తల్చుకుంటే, ఇక్కడ ఆ జైళ్ళను చూసి జడుసుకుని తల్చుకున్నా. ఏవిటో, ఈ యుద్ధాలూ, హింసానూ! అబ్బే, మనుషులేం మారినట్లు లేరు ఇన్నాళ్ళైనా. మెదళ్ళూ, మెథళ్ళూ మాత్రం మారాయి అంతే. 😉 (అందుకే వత్తులు గట్రా సరిగ్గా పలుక్కోవాలి. సినిమాల్లో పాడినా, టీవీలో యాంకరింగ్ చేసినా, మామూలుగా మాట్లాడుకున్నా!)

అక్కడనుంచి బయటపడగానే, మంచులో ప్రాగ్ నగరం ఇలా కనబడ్డది 🙂 నన్ను శాంతింపజేయడానికి అనమాట 🙂

ఎంచక్కా బయటికొచ్చి, కిందకి దిగేసి, “చార్లెస్ బ్రిడ్జ్” దాటుతూ వెనక్కి తిరిగితే, ఈ ప్రాంగణమంతా జనానికీ, జీవితానికి నేపథ్యంలా..ఇలా.. కనబడ్డది..

అదీ సంగతి ఇవ్వాళ్టికి. అన్నట్లు, ఇక్కడ ఆదివారం అయినా సూపర్ మార్కెట్లు తీసే ఉన్నాయి. ఈ పది నెలల్లో ఎప్పుడూ ఆదివారాలు సూపర్ మార్కెట్ తెరిచిన ప్రాంతం చూడలేదు నేను ఇప్పటిదాకా 🙂 రేపట్నుంచి పాఠాలు మొదలు కనుక, బహుశా నా ప్రోగ్గోల కి చుక్కెదురేమో. ప్రాగోగులన్నీ చార్లెస్ యూనివర్సిటీ బాధ్యత.

కొసమెరుపు – అంటే, రేపట్నుంచి నా పరిస్థితి గుర్తు తెస్తూ… దార్లో ఇది కనబడ్డది 🙂 😉

Advertisements
Published in: on February 12, 2012 at 10:05 pm  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/12/pragogulu-3/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. అబ్బ భయంకరంగా ఉంది ఆ బొమ్మలు అవీ చూస్తుంటే. మొత్తానికి ప్రాగ్ చూపించేసారు. ఆ కోటల, రాజుల వెనకున్న చరిత్ర కూడా కొంచం చెప్పి ఉంటే బావుండేది. ఆ చివరి ఫొటోలో గన్నులు అలా ఎలా గాల్లో నిల్చున్నాయి?

 2. @Sowmya: కోటల గురించీ వాటి గురించి – తరువాత తీరిగ్గా రాద్దాం అనుకుంటున్నా అండీ.. ఈసారికి ఏదో స్వీయానుభవాలు అనమాట. గన్నులు ….దారాలతో నిలబెట్టారు. అవి సన్నగా ఉండటంతో కనబడ్డం లేదు ఫొటోలో. జూం చేస్తే కనబడతాయేమో.

 3. మనదేశంలో ముస్లిములకాలంలో హింస కూడా ఇలాగే ఉండేదని రాసేరు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో. ఇటీవల అమెరికాలో గౌంటనేబేలో వాటర్ బోర్డింగులాటి పరమహింసలని ఆహ్వానించేవారూ, ఆహాహా అని పొగిడేవాళ్లూ ఇరవైఒకటో శతాబ్దంలో కూడా ఉన్నారు. నువ్వన్నట్టు మనిషి తత్వం మారలేదు. ఎవరికి బలవంతులు బలహీనులని కాల్చుకుతినడమే మన చరిత్ర!

 4. మీ పని భలే ఉందండీ సౌమ్య గారూ. Business mixing with pleasure అనేదానికి బెస్ట్ ఎక్జాంపుల్ :-))
  వెరీ ఎడ్యుకేటివ్ సీరిస్ అండీ, నా మటుకు. థాంక్యూ వెరీ మచ్.

  మాలతి గారూ,
  అవునండీ.. రజాకార్ల హింస మా అమ్మమ్మా తరం దాకా తెలుసు.

  పోతే,
  “అమెరికాలో గౌంటనేబేలో వాటర్ బోర్డింగులాటి పరమహింసలని ఆహ్వానించేవారూ, ఆహాహా అని పొగిడేవాళ్లూ ఇరవైఒకటో శతాబ్దంలో కూడా ఉన్నారు”

  I am one among them. I support “water-boarding”

 5. @Kumar: Thanks. అందుకే నేను ఇలాంటి ట్రిప్పులకి వెళ్ళినప్పుడల్లా సోమవారం నుండి అసలు పని మొదలవుతుందంటే వీకెండే వెళ్ళిపోతా 😉 ఇప్పుడంటే చలికి సాయంత్రాలు తిరగడం లేదు కానీ, ఇదే ఎండాకాలం అయ్యి ఉంటేనా! 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: