ప్రాగోగులు-2

ఈ చలిగానీ లేకుంటే, ఇవ్వాళ ఎంత బాగుండేదో… అనుకున్నాను… రోజంతా కాలి నడకన ప్రాగ్-1 పర్యటన చేస్తూ ఉంటే (ప్రాగ్ నగరం మొత్తం పది భాగాలుగా విభజించారు. ప్రాగ్-1 నుండి పది దాకా). చారిత్రకంగా పేరు పడ్డ కట్టడాలూ, వంతెనలూ ఎక్కువభాగం ఇక్కడే ఉండడం వల్లా, మా పాఠాలూ, బసా కూడా ఇదే ప్రాంతం కావడం వల్లా ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది, జరుగుతుంది కూడా నన్నమాట. మామూలుగా అందరి టూరిస్టుల్లాగే, ఎంచక్కా, అలా ఒక్కొక్కటీ చూసుకుంటూ ముందుకు పోతూ, ఆల్రెడీ ఇక్కడికి ఇదివరలో వచ్చిన నా కొలీగ్ పుణ్యమా అని మ్యాపు వెదుక్కునే పని లేకుండా, ఎంచక్కా ఫాలో అయిపోతూ, అలా గుడ్డిగా ఫాలో అవుతున్నప్పుడు కూడా మంచు మూలాన జారిపోతున్న రోడ్డును జాగ్రత్తగా గమనించుకుంటూ, ఎంచక్కా, తెల్లటి ఊలు దుప్పటేస్కుని నిద్రపోతున్నట్లు కొంచెం సైలెంటుగా ఉన్న ప్రాగ్-పాత నగరాన్ని చూస్తూ…సాగిపోయాను.

ఏమాటకి ఆమాటే చెప్పాలి : ఇన్నాళ్ళకి మొదటిసారి నాకు – అన్ని ఊళ్ళూ ఒకేలా ఉంటాయేమో? అన్న సందేహం చివరకి కలిగేసినా, కొన్ని కొన్ని భవనాలూ, విగ్రహాలూ, స్మృతి చిహ్నాలూ.. అవీ భలే నచ్చేసాయి నాకు.. నదికి ఒక బ్రిడ్జి పై నిలబడి, ఎప్పుడో 1300స్ నాటి చార్లెస్ వంతెననూ, దాని పక్కగా ప్రసిద్ధి చెందిన ప్రాగ్ కోటనూ చూద్దంలో ఉన్న ఆనందం, ఆ చార్లెస్ బ్రిడ్జ్ పై కాసేపు తర్వాత నడిచినప్పుడు కూడా కలుగలేదు :))

కాసేపయ్యాక, “బొహీమియన్ కార్నివాల్” అని బోర్డు…అక్కడ గుమిగూడిన జనం కనబడ్డారు. కార్నివాల్ ప్రారంభంలో భాగంగా, అక్కడ ఒక చిన్న స్టేజీ దగ్గర ఎవరో తమ కళలను ప్రదర్శిస్తున్నారు (వీళ్ళే వాళ్ళు). నాకు భలే నచ్చేసింది. భయంకరమైన చలి వల్ల ఇక వెళ్ళిపోదామనుకున్నా తప్ప, లేకుంటే, అలా కాసేపు ఉండేదాన్నేమో. ఏమిటో, వీళ్ళని చూడగానే, నాకు ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది మెజీషియన్” గుర్తువచ్చింది (ఉత్త స్క్రీంప్లే చదివితేనే అది అలా గుర్తుండిపోయింది లెండి).


అసలింతకీ, ఇది చూసే ముందు చూసిన దాని గురించి చెప్పాలి. దీని పక్కనే ఒక పెద్ద గడియారం ఉంది. మధ్యాహ్నం రెండింటికి ఆ గడియారం లోంచి ఇద్దరో, ముగ్గురో, కొందరో మనుషులొచ్చారు… నాకు సాలార్జంగ్ మ్యూజియంలో ఉండే గంటల గడియారమే గుర్తొచ్చింది. ఇది దానికంటే ఎన్నోరెట్లు పెద్ద సైజనుకోండీ…అయినా కూడా! (1410లో నెలకొల్పిన ఈ గడియారం ప్రపంచంలోని మూడవ అతి పాత “Astronomical Clock” అట. నాకు ఆ బొమ్మలు… ముఖ్యంగా అస్తిపంజరం బొమ్మ ఉండడం…అంతా విపరీతమైన కుతూహలం కలిగించాయి. ఇప్పుడు ఇంటికొచ్చాక వివరాలు చదువుతూ ఉంటే సింబాలిజం అర్థమైంది. వివరాలు వికీపేజీలో.)

ఈ ఊళ్ళో ప్రతి రెండో షాపూ ఒక రెస్టారెంటేమో, ప్రతి మూడో షాపూ ఒక సావనీర్ షాపేమో అని నా సందేహం. రెస్టారెంట్లలో ప్రతి రెండో రెస్టారెంటూ “అసలు సిసలు చెక్ వంటకాలది” అయితే, ప్రతి మూడోదీ చైనీస్ ఏమో? అని కూడా సందేహం కలిగింది. ఆ కాసేపట్లోనే, ఒక ఇరవై చైనీస్ రెస్టారెంట్లు అయినా చూసి ఉంటాను. ఇక, చెక్ రెస్టారెంట్లు సరే సరి. ఇలాక్కూడా ప్రకటించేసుకుంటున్నారు-

నోరు తిరగని పేర్లు గల చర్చులు, బురుజులూ అన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉండగా, రెండు పంచులు పడ్డాయి… రెండు మ్యూజియంల తాలూకా బోర్డులు చూసి. ఒకటి – “Museum of Medieval Torture Instruments”. ఇక్కడికి కొంచెం పర్లేదు అనుకున్నా కానీ, అసలు రెండో దాని పేరు చదవగానే అవక్కయిపోయా. “Museum of sex machines” – Needless to say, I did not visit them! 🙂

అసలు ఇవన్నీ తర్వతా కానీ, కోట చూసేందుకని చెప్పి నెమ్మదిగా పైకి స్లోప్ ఉన్న రోడ్డు మీద, ఆ మంచుకి జారి పడిపోకుండా నడుస్తూ ఉండగా…”గోపాల్ – ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్” అని కనబడ్డది. ఇంక చూడండీ…. నా మనసు “అహ మీది తెనాలే…మాది తెనాలే…మనది తెనాలే…” అని కాసేపు…”జజ్జనక జజ్జనక జనకు జజ్జనక” అని కాసేపు డ్యాన్సు వేసింది. ఆ డ్యాన్సులు తెముల్చుకుని కోట దగ్గరికి వెళ్ళేసరికి అది మూసే సమయం ఔతూ ఉండటం తో, రేపు పొద్దున్న వద్దాం లే అని హోటెల్ కి వెనక్కి వచ్చి, అక్కడ ఇంకో ఫ్లోరులో ఉన్న నా కొలీగ్ కి ఇలా ఒక ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ కనబడ్డది అని మెసేజ్ పంపాను. అతనేమో, సరే, నెనెప్పుడూ ఇండియన్ రెస్టారెంటుకు వెళ్ళలేదు, మనం డిన్నర్ అక్కడ చేద్దామా? అన్నాడు. మీకు కష్టమేమో… కావాలంటే ఇంకెక్కడికైనా వెళ్తానంటే వెళ్ళు..బలవంతం లేదు అన్నా. అయినా అతను వస్తా అనేసరికి, వెళ్ళాం. ఎంట్రీలో ఒక విదేశీ వనిత స్వదేశీ దుస్తుల్లో సాయంకాలం కదా…దీపాలు వెలిగిస్తోంది ఆరుబయట. లోపలకి వెళ్ళగానే, ఒక పక్క స్టీలు గిన్నెలు, వాటిపై మూతలు, ఏవో పొడులు గట్రా (మా IIIT లో యుక్తాహార్ మెస్సులా). మరొక పక్క భగవద్గీత వగైరా బోలెడు పుస్తకాలు – అమ్మకానికి. అది చూశాక కూడా నాకు విషయం అర్థం కాలేదు. లోపలకి వెళ్ళాక, భక్తివేదాంత ప్రభుపాదుల వారు దర్శనం ఇచ్చారు – ఫొటోలు. అప్పటికి గానీ, నాకు ఎందుకు ఇండియన్ రెస్టారెంట్ అన్నా ఇండియన్స్ ఎవ్వరూ కనబడ్డంలేదు కౌంటర్లో? అన్న ప్రశ్నకి సమాధానం దొరకలేదు 🙂

పాపం తినడానికి అంతా బానే ఉంది కానీ, వాళ్ళ దగ్గర పెప్పర్ కానీ, చిల్లీ కానీ…ఏవీ లేవంట. అలాగే, తియ్యగా తినాల్సి వచ్చింది అంతా :(. కానీ, అన్నింటికంటే నాకు కొత్తగా ఉన్నవి – ఆ బ్యాక్గ్రౌండ్ పాటలు. ఇస్కాన్ వారి గుళ్ళు ఒకట్రెండు చూశాను ఇండియాలో. కానీ, అంత భయంకరమైన సంగీతం ఇదివరలో విన్నట్లు లేను. ఈ నా కొలీగ్ ఏమో “ఇండియాలో ఇలాంటి పాటలు వింటారా?” అని అడిగాడు, అదీ ఇంగ్లీషులో! ఇలాగ డిన్నర్ చేసినంతసేపు పంచులే – “అంటే…హిందూస్ అందరూ ఇలాగే ఉంటారా?” “ఇస్కాన్ ఏమిటి?” “కల్ట్ అంటే… గోపాల్ వాళ్ళకి మాత్రమే దేవుడా?”, “మిగితా హిందూస్ కీ వీళ్ళకి ఇష్యూస్ లేవా?” ఇలా…. అతనికి బోలెడు డౌట్లు. నాకేమో భయం… ఇక్కడ ఇంగ్లీషులో వీళ్ళ గురించి మాట్లాడ్డం అవసరమా? అని. నువ్వు కాసేపు ఊరుకుంటే, మనం అలా నడుస్తూ వివరంగా మాట్లాడుకుందాం. అని చెప్పా. అలాగ, ఏదో మేనేజ్ చేసా అన్నమాట. ఆ రెస్టారెంటులో మేము తప్ప ఇస్కానేతర మనుషులెవరూ లేరు. ఎంచక్కా, అందరూ నామాలు అవీ పెట్టుకుని, భారతీయ వస్త్రధారణ గురించి కష్టపడుతూ… నా మీద వాళ్ళే కొంచెం భారతీయంగా కనిపిస్తున్నారా? అన్న అనుమానం కూడా కలిగించారు కొందరైతే :). మొత్తానికి అదీ ఇండియన్ “వెజిటేరియన్” రెస్టారెంటు కథ. ఆ పేరు పెట్టిన ఖర్మానికి “మీలో ఎవరన్నా ఇండియా వెళ్ళారా బాబూ?” అని నిర్వహకులని అడగాలన్న కోరిక బలవంతంగా అణుచుకున్నా…కింద ఒక భజన మందిరం కూడా ఉందనీ, ఇస్కాన్ భజనలు జరుగుతున్నాయనీ అర్థమయ్యాక. ఇంతమంది మధ్య మనమెక్కడ వాదిస్తాం? అని.

ఇక తిరుగుళ్ళూ అయ్యాక, డిన్నర్ కి ఈ రెస్టారెంటుకు వెళ్ళే ముందూ…అంటే చీకట్లు కమ్ముకుంటున్న వేళకి- మా హోటెల్ కి ఆవలి వైపు ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ విగ్రహాలు చూసేందుకు వెళ్ళాను (ఇది మాత్రం నెట్లో దొరికిన ఫొటో…నేను తీసినది కాదు. వెలుతురు సరిగా లేక, నేను తీసిన బొమ్మ మరీ డార్క్ గా వచ్చిందనమాట).


ఏమిటో, చూడగానే, చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. కొంచెం సేపు అలా ఆ బొమ్మలు అలా క్రమంగా దెబ్బతినడాన్ని చూస్తూ నిలబడిపోయాను…చలి మళ్ళీ కొరికేదాకా! మొదట ఉన్న బొమ్మ ఒక మాదిరిగా ఉంది. అలా వెనక్కి మళ్ళే కొద్దీ, కొద్ది కొద్దిగా దెబ్బతింటూ వచ్చాయి బొమ్మలు. కంయూనిస్టు ప్రభుత్వాల బాధితులకు మెమోరియల్ అట అది (వికీ పేజీ ఇక్కడ).

-ఇవ్వాల్టికి “ప్రాగ్గోల” కు విరామం. 🙂

Advertisements
Published in: on February 11, 2012 at 10:58 pm  Comments (1)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/11/pragogulu-2/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. ప్రాగోగుల ప్రాగ్గోల కూల్ :-))


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: