ప్రాగోగులు-1

కొద్దిసేపటి క్రితమే చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో ల్యాండ్ అయ్యాను. ఇక్కడ వారం రోజుల మకాం… ఒక చలికాలపు పాఠశాల (వింటర్ స్కూల్) కోసం. మా ఊళ్ళో విశేషాల గురించి రాయడానికే సమయం చిక్కక రాయడం లేదు. కానీ, దిగిన క్షణం నుంచి ఎంత రాయకూడదు అనుకున్నా రాయడానికి ప్రేరేపించే అనుభవాలే ఎదురవుతున్నాయి ఇక్కడ. దానితో, ప్రాగులో నా బాగోగుల కథ – ప్రాగోగులు…చెప్పక తప్పడం లేదు.

1) అసలు విమానం ఎక్కీ ఎక్కగానే చెక్ ఎయిర్వేస్ వారి పత్రిక ఒకటి కనబడితే తెరిచాను. అంతే, విమానం దిగేదాకా, చదువుతూనే ఉన్నా… చదివినవే మళ్ళీ కూడా చదివా…ఆసక్తికరంగా అనిపించి. చివరాఖరుకి అది నాతో తెచ్చుకోవచ్చా అని విమానం వాళ్ళని అడిగి, వాళ్ళిస్తే తెచ్చేసుకున్నా కూడా 🙂 (అసలు ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసిన వింతలూ, విశేషాలూ, వార్తలూ వాటి గురించి రేపో ఎల్లుండో వివరంగా రాస్తాను)
-అలాగ ఆ పుస్తకం గురించి నా కొలీగ్ కి ఊదరగొడుతూ, చలికి వణుకుతూ ఊళ్ళోకి వెళ్ళడానికి బయటకు వెళ్ళబోతూ, ఏటీయం లో డబ్బులు డ్రా చేసుకుందాం అనుకున్నాము. అక్కడ్నుంచి మొదలయ్యాయి పంచులు నాకు.

2) ఏ.టీ.యం లో 2000 చెక్ క్రోనులు అని సెలెక్ట్ చేసాను… చాలా రోజులు ఉండాలి, పైగా ఇక్కడ అంతా ఖరీదు అంటారు అని. ఇంక చూడండీ… 2000 క్రోను నోటు ఇచ్చిందది! ఇండియా ఏ.టీ.ఎం. లలో ఐదొందలు డ్రా చేస్తే ఎక్కడ ఐదొందల నోటు ఇస్తుందో అని, నాలుగొందలు, వందా వేర్వేరుగా డ్రా చేసేదాన్ని నేను. అంత చిరాకు నాకు పెద్ద నోట్లంటే… పైగా, నా తరహా ఖర్చులకి అలాంటి నోట్లు పరమ దండుగ. చిన్నవుంటేనే పండుగ. జర్మన్ ఏ.టీ.ఎంలు ఈ విషయంలో భలే ముద్దొస్తాయి. 50 యూరోలు తీయాలని అడిగితే, 20+10+10+5+5 – ఈ డినామినేషన్లలో ఇస్తాయి ఎప్పుడూ.

3) బస్సు ఎక్కాలంటే, బస్సులోనో, బస్టాపులోనో కాకుండా, ఒక కౌంటర్ లో కొనుక్కోవాలి టికెట్లు. అక్కడికెళ్ళి, 32 క్రోనుల టికెట్టు కి 2000 రూపాయల నోటు ఇచ్చాడు నా కొలీగ్. వెనకే మరో 2000నోటుతో నేనున్నా క్యూలో. ఆ కౌంటర్లో ఆమె చేతులెత్తేసింది. మేము చిల్లర్లు ఇవ్వలేము అన్నది. మీ ఏ.టీ.యం మాకు ఈ నోటే ఇచ్చింది అన్నాడు నా కొలీగ్. ఆవిడ…ఆయినా మేమంతే…అనేసి కౌంటరు మూసేస్తున్న బోర్డు పెట్టింది. ఖంగారు పుట్టింది నాకైతే…ఇంతలో క్రెడిట్ కార్డుతో కొనొచ్చన్న విషయం తట్టి కొన్నామనుకోండీ… కానీ, తొమ్మిదింటికి ఆ కౌంటర్ మూసేస్తే, తరువాతి బస్సులు జనం ఎలా ఎక్కుతారు? అన్నది నాకు అర్థం కాలేదు.

4) ఈ బస్సుమారి ఒకచోట మెట్రో ఎక్కాలి. అక్కడ ఎస్కలేటర్ ఉండిందీ…. కనుచూపుమేరదాకా మెట్లే ఉన్నాయేమో అని అనుమానం కలిగింది అది చూసాక 🙂 నేను ఈ చలి-కోటులో పాకెట్లు వెదికి ఫోను తీసి కెమెరా ఆన్ చేసే సరికి దాదాపు సగం పైకి ఎక్కేసాము. దానితో ఇదిగో-ఇంత మాత్రం కనబడ్డది.

5) హోటెల్ లోకి ప్రవేశించాక అడుగడుక్కీ పంచి పంచి పంచి. ఆ రిసెప్షన్ లో పనిచేసే వాడెవడో కానీ, కొత్తవాడో, తాగు-వాడో, నిద్రలో ఉన్నవాడో – ఏమిటో అర్థం కాలేదు. ముందు నా కొలీగ్ తన రిసర్వేషన్ తాలూకా పేపర్లతో ఉన్నాడు. వెనుక నేను ఉన్నా. “మీ పేరు లేదు” అన్నాడు రిసెప్షనిస్టు. “ఉంది” అంటాడు ఇతను. ఇలా రెండు మూడు సార్లు అయ్యాక, నా కొలీగ్ ఆ రిసెప్షనిస్టు దగ్గర ఉన్న పేర్లు తనే చూసి, “ఇదిగో, ఇదీ నా పేరు” అన్నాడు. అతను “ఓ, సారీ, సారీ…” అనేసి, అతనికి రూం అలాట్ చేసాడు. నెక్స్ట్ నేను వచ్చాను. “ఇద్దరికీ ఒకే రూం” అన్నాడు. నేను హడలిపోయా. ఇదెక్కడి ఖర్మరా బాబూ…అని అయోమయంలో అనుకుంటూ ఉండగా, నా మీద కాస్త అలర్టుగా ఉన్న నా కొలీగ్ – ఆమె సెపెరేట్ గా బుక్ చేసుకుంటే ఇద్దరికీ ఒక రూం అంటారేమిటి? మేమిద్దరం ఒకే చోట పని చేస్తాము…ఒకే పనిమీద ఇక్కడికి వచ్చాము… అంతే. అన్నాడు. “మీ పేరు నిజంగానే లేదు” అన్నాడు రిసెప్షనిస్టు కూల్ గా. మళ్ళీ ఖంగారు మొదలైంది నాకు. “లేకపోవడం ఏమిటి? అతను బుక్ చేసిన రోజే కాస్త ఆలస్యంగా నేనూ చేసా. అతని పేరు ఉంటే నా పేరు ఎందుకు ఉండదు?” అన్నా. “ఏమో, ఇక్కడ కనబడ్డం లేదు” అన్నాడు అతను మళ్ళీ. ఇంతలో, ఆపద్భాందవుడిలా, నా కొలీగ్ మళ్ళీ ఆ చిట్టా చూసి, నా పేరుని పాయింట్ అవుట్ చేసి చూపాడు రిసెప్షనిస్టుకి. అతను మళ్ళీ సారీ చెప్పి, నాకు తాళం తీసే కార్డులు ఉన్న కవర్ ఇచ్చాడు. అందులో రెండు కార్డులున్నాయి. “అదేమిటండీ రెండు ఉన్నాయి?” అని అడిగా. “ఓ..సారీ!” అనేసి రెండోది తీసేసుకున్నాడు. అయోమయ దృక్కులతో – “ఏమన్నా హెల్ప్ కావాలంటే, ఫలానా నంబర్…నాకు కాల్ చేయండీ” అన్నాడు. సరేనని బయటపడ్డాము.

6) సరే, ఈ గది తీసుకున్నాక చూస్తే, ఇక్కడ వైర్లెస్ పని చేయడం లేదు. ఫ్రీ-ఫ్రీ-ఫ్రీ అని టముకు వెయ్యడం ఎందుకు? అని కోపం వచ్చింది. వెంటనే ఆ సదరు రిసెప్షన్ వాడికి ఫోను చేసా. “మీ టీవీ వెనుక ఉన్న వార్డ్రోబ్ పక్కనే ఒక రౌటర్ ఉంటుంది. దానిలో ఒక వైర్ ఉంటుంది. దాన్ని పీకి మళ్ళీ పెట్టండి” అన్నాడు. “ఏమిటీ, గది గదికీ రౌటరా!” అనుకుని, అటు చూస్తే, టీవీ వెనుక ఉన్నది…గోడ! అదే చెప్పాను అతనికి. “నా కొలీగ్ ఒకతన్ని పంపిస్తాను..అతను వచ్చి మీకు సాయం చేస్తాడు” అని పెట్టేశాడు ఫోను.

7) రెణ్ణిమిషాల్లో ఒకతను వచ్చాడు. (నా మట్టుకు నాకైతే మన్మథుడు సినిమాలో… “థే పెయిడ్ నో” అని బ్రహ్మానందం అన్నప్పుడు బాగా బలంగా ఉన్న ఒకడూ “నో” అంటాడే….వాడి లాగే అనిపించాడు). “ఏమిటి ప్రాబ్లెం?” అన్నాడు. “ఏదో వైర్లెస్ డిటెక్ట్ అవుతోంది. పాస్వర్డ్ కూడా ఆక్సెప్ట్ చేస్తోంది కానీ తర్వాత కనెక్ట్ కావట్లేదు” అన్నా. అతను నా ల్యాప్టాప్ చూస్తా అన్నాడు. రెండు క్షణాలు మౌస్ మీదకు చేయి పెట్టబోతూ ఆగి అయోమయంగా చూసి అన్నాడు – “విండోస్ లో స్టార్ట్ సింబల్ ఉంటుందే…అలాంటిది ఏదీ?” అన్నాడు. అతనికి అర్థం కాలేదేమో అని… “ఇది విండోస్ కాదు” అన్నా నెమ్మదిగా, భయంగా. “అర్థమయ్యింది. కానీ, మరి ఆ స్టార్ట్ ఏదీ?” అన్నాడు. “నెట్వర్క్ కనెక్షన్స్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు” అని చూపించా. మళ్ళీ ఆ కనెక్షన్ల జాబితా ఎగాదిగా చూసి…”ఇక్కడి వైర్లెస్ పాస్వర్డ్ ఎక్కడ టైప్ చేయాలి?” అన్నాడు. చూపించాను. “నాకు ఇది అలవాటు లేదు. విండోస్ లో అయితే తెలుసు” అన్నాడు. నేను మళ్ళీ – “అది కాదు…నెట్వర్క్ కనిపిస్తోంది…కనెక్ట్ అవుతుఓంది..కానీ, తర్వాత ఏం కావట్లేదు” అన్నా. అతను ఒక నిముషం ఆలోచించి, రౌటర్ లో సమస్యేమో అని గబుక్కున టీవీ వెనక్కి వెళ్ళాడు.

ఆ తరువాత టేబుల్ జరిపాడు. ఆ తరువాత మంచం వెనక్కి వెళ్ళి చూశాడు. “ఈ గదిలో రౌటర్ ఏదీ?” అన్నాడు. “నేను ఇప్పుడే దిగాను. నాకు తెలీదు” అన్నాను. వెంటనే రిసెప్షన్ కి ఫోన్ చేసి, చెక్ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. ఇతను ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు.

8) ఒక రెణ్ణిమిషాలు తరువాత చాంతాడు సైజులో ఉన్న వైర్ పట్టుకుని వచ్చి, ఆ టీవీ వెనకాల అంతసేపూ నాకు కనబడని ఒక సాకెట్ నుంచి వైర్డ్ కనెక్షన్ పెట్టుకోవచ్చని చెప్పి, నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసాడు. చేసాక… “ఇప్పుడు ఇది కనెక్ట్ చేసేది ఎలా ఇందులో? విండోస్ లో అయితే మామూలుగా అయిపోతుంది” అన్నాడు. “అదే కనెక్ట్ అవుతుంది లెండి… వేరే ఏం మార్పులు చేయనక్కరలేకపోతే..” అన్నా. సరే, నా పుణ్యం పుచ్చి, చివరాఖరుకి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యింది. ఇంకాస్త పెద్ద వైర్ తీసుకొస్తాను. అప్పుడైతే, మీరు మీ బెడ్ పైన్నుంచే వాడుకోవచ్చు, అనేసి వెళ్ళిపోయాడు.

9) వెళ్ళేముందు ఒక రసగుళిక వదిలాడు – “మామూలుగా ప్రతి గదిలోనూ ఒక రౌటర్ ఉంటుంది. ఏమిటో, ఇక్కడ లేదు. బహుశా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎత్తేసారేమో” అన్నాడు. నేను అవాక్కై “వ్వాట్?” అన్నా. “అప్పుడప్పుడూ అలాంటివి జరగడం ఇక్కడ మామూలే లెండి” అన్నాడు =)). సరే, కాసేపయ్యాక పెద్ద వైర్ తెచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి..కానీ, నాకు మాత్రం నవ్వు ఆగడంలేదు 🙂

-ప్రస్తుతానికీ ఇవీ నా ప్రాగోగులు 🙂 ప్రాగ్ లాంటి నగరానికి వచ్చి నువ్వు చెప్పేవి ఇవా?? అనుకుంటున్నారా?? 😉

Advertisements
Published in: on February 10, 2012 at 11:59 pm  Comments (6)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/10/pragogulu/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. బాగున్నయి. ఏదైన కొత్త ప్రదేసానికి కి వెల్లినప్పుదు ఇలాంటి తమాషాలు భలె బాగుంటాయి.

 2. బాగు బాగు 🙂 పోన్లెండి మొత్తం సుఖాంతమేకదా 🙂 మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న ఆ ఎర్వేస్ బుక్ పై నాకు ఆసక్తి పెరిగిపోతుంది, త్వరగా చెప్పేయండి దాని నుండి తెలుసుకున్న విశేషాలు 🙂

 3. pragogola ? 😛

 4. హహ్హహ్హా.. బాగున్నాయ్ ప్రాగోగులు.. 😀
  ఇదిగో అమ్మాయ్.. Munich hauptbanhof లో కూడా ఇంత పెద్ద ఎస్కలేటర్ ఉంది కదా.. నీకు గుర్తు లేదా? 😉

 5. బాగున్నాయండి జెక్ అనుభవాలు !

  మీ పాస్పోర్టులు జాగ్రత్త!

  చీర్స్
  జిలేబి.

 6. @Zilebi: మీరెవరో గానీ, అలా చెప్పగానే సడెన్ గా డౌట్ వచ్చి వెంటనే చూస్కున్నా! 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: