పశ్చాత్తాపం అను విచిత్ర గాథ

మా ప్రొఫెసర్ కొన్ని కారణాల వల్ల సెలవు మీద ఉండాల్సి రావడంతో క్లాసు నేను చూసుకోవాల్సి వస్తోంది దాదాపు మూడు వారాలుగా. ఈ కోర్సులో ముందు కూడా నేను క్లాసులు తీస్కోవడం గట్రా జరిగింది కానీ, సాధారణంగా అంతకు మించి ఒక అడుగు ముందుకు వెళ్ళలేదు క్లాసులో. క్లాసు బయట ఈ పిల్లలు ఏదన్నా మాట్లాడ్డానికి వస్తే, దేని గురించన్నా సందేహాలు అడిగితే తీర్చడం … ఇలాంటివి చేసినా కూడా… అంతకు మించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే, ఈయన సెలవు మీద ఉండటంతో, కొంచెం బాధ్యతగా క్లాసుల నిర్వహణ స్వీకరించాల్సి వచ్చింది.

అలాగ, అంతా బానే ఉంది కానీ, ఒకళ్ళిద్దరు అబ్బాయిలు మాత్రం మొదట్నుంచే, అంటే మా ప్రొఫెసర్ ఉన్నప్పుడు కూడా కొంచెం పెడసరంగానే ఉండేవాళ్ళు. ఆయన చేతి నుండి నేను పగ్గాలు తీస్కున్న క్షణం నుండీ మరీ పేట్రేగుతున్నట్లు అనిపించినా కూడా, మనకెందుకులే అనుకుంటూ పట్టించుకోలేదు ఇన్నాళ్ళూ. పోయినవారం ఒక స్టూడెంటు ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చాక, ఇంకా టైం ఉంది కదాని వాళ్ళు కోర్సులో చేయవలసిన ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కనుక్కుంటూ ఉండగా – ఒకడు “నాకింకా బోలెడు సబ్జెక్టులు ఉన్నాయి… టైం లేక ఆలోచించలేదు” అన్నాడు. నేను కాస్త అవాక్కైనా సర్దుకుని, సరేలే, ఇంకా వీళ్ళకి ప్రాజెఖ్టు నిర్ణయం తెలియజేయడానికి వారం టైం ఉంది కదా అనుకుని పక్కన కూర్చున్న మరో అబ్బాయిని అడిగాను. పాపం అతను అతనికి తోచిందేదో చెబితేనూ… నేను దానికి నాకు తోచినంతలో ఏదో సలహా చెప్పాను… ఫలాన ఎక్స్పెరిమెంటు కూడా ట్రై చేయి అని. వాడు మనసులో ఏమనుకున్నా కూడా, పైకి సరే అన్నాడు. ఇంతలో మరో పక్క నుంచి ఒకడు – “ఆ, కోర్సు ప్రాజెక్టుకి ఆమాత్రం చాల్లే” అన్నాడు …గట్టిగానే. అది గానీ ఇండియా అయ్యి ఉంటే, “మీరు దయచేసి బయటకు వెళ్ళండి సార్” అని ఉందును మరియాదగా. మరి ఇక్కడ ఎలా స్పందించాలో తెలీక, అప్పటికి వదిలేద్దాం లే అని… తరువాతి మనిషితో చర్చ మొదలుపెట్టా.

కానీ, ఇంటికొచ్చాక కూడా మనసు స్థిమిత పడలేదు. ఎంతైనా, మనకి మన ప్రొఫెసర్లతోనూ, లెక్చరర్లతోనూ, ట్యూటర్లతోనూ ఎలాంటి గొడవలున్నా, వాళ్ళ మీద కోపం ఉన్నా, చులకన భావం ఉన్నా… మన గ్రేడ్లు వాళ్ళ చేతిలో ఉంటాయి అని స్పృహ ఉంటుంది కనుక వాళ్ళని ఏమీ అనం కదా (కోపంతో పళ్ళు కొరుక్కోడం తప్ప ఏమీ చేయలేకపోవడం నాకూ అనుభవమే…నేనూ స్టూడెంటునేగా..హీహీ)… అలా ఎలా అనగలిగారు? అని. “కోర్సు ప్రాజెక్టుకి ఇది చాల్లే” అని ఇంకోడి ప్రాజెక్టు గురించి అనగలిగిన వాడు ఈ కోర్సుకి ఊరికే సబ్జెక్టు తెల్సుకోడం కోసం వస్తున్నాడనీ, రిజిస్టర్ కాలేదనీ నాకు తెలుసు. అందువల్ల అతని తలపొగరు నాకు తేలిగ్గానే అర్థమైంది. రెండో వాడి వాలకమే అర్థం కాలేదు. అసలుకి ఈ కోర్సుకి ప్రాజెక్టే మూలం. వాడు అదే చేయడం మీద ఆసక్తి చూపకుంటే, వాడు పాసయ్యేది ఎలా? అని నా సందేహం. ఈ సందేహాల మధ్య, ఇంటికొచ్చాక, మా ప్రొఫెసర్ ని సంప్రదించా – “ఇలాగ, నేను మరీ స్నేహంగా ఉన్నందుకో ఏమో, ఇలా చేస్తున్నారు… కొంచెం “టీచర్” లా ఉండమంటారా ఒక్క పది నిముషాలు నెక్స్ట్ క్లాసులో?” అని అడిగా. ఆయన సరే అన్నారు.

ఇంక, ఆ నెక్స్ట్ క్లాసు – “ఆసక్తి లేని వాళ్ళు, తాము చాలా తెలివైన వాళ్ళం అనుకునే వాళ్ళు, టైము లేని వాళ్ళు దయచేసి బైటకి వెళ్ళిపోండి, ముప్పై సెకన్లు టైం ఇస్తున్నా” అన్న వార్నింగ్ తో మొదలుపెట్టా 🙂 పిన్ డ్రాప్ సైలెన్స్ ఆ ముప్పై సెకన్లూ. ఆ తరువాత, సరిగ్గా ఈ ఇద్దరే – “వాట్ ఈజ్ ఆల్ దిస్?” అన్నారు. “పర్సనల్ గా నిన్ను ఏమీ అనట్లేదు. జనరల్ గా చెప్తున్నా” అన్నా. మల్లీ సైలెన్స్. ఒక ఐదు నిముషాలు – క్లాసులో కొంచెం క్లాసులోలా ఉంటే బాగుంటుంది గట్రా చెప్పి… ప్రాజెక్టులు, గ్రేడ్లు…ఎలాగ ఎవాల్యుయేట్ చేస్తాము…ప్రాజెక్టు చేయకపోతే ఏమవుతుంది? డెడ్లైన్లు ఏమీటి? ఇదంతా వివరంగా చెబుతూ… “ఏది ప్రాజెక్టుకి సరిపోతుంది? ఏది సరిపోదు? అన్నది నిర్ణయించేది, వాటికి మార్కులేసేది మేము. మీకు మీరే వేస్కునే సౌలభ్యం ఈ కోర్సులో లేదు” అని చెప్పి “నాకు టైము లేదు…నాకు వేరే కోర్సులు ఉన్నాయి లాంటి దిక్కుమాలిన కారణాలు చెబితే నేను వినను, ప్రొఫెసర్ అంతకంటే వినరంట” అని కూడా చెప్పా 🙂 మళ్ళీ పోయినక్లాసులో “టైములేదు” అన్నవాడు లేచాడు… “ఏమిటీ గోల?” అన్నాడు. “నువ్వెందుకు ఉలికిపడతావ్? నేను మామూలుగా అందరికీ చెబుతున్నా” అనేసరికి ఊరుకున్నాడు. కానీ, ఆ మాటల్లోనే అర్థమైంది…వీడు కూడా ఆడిట్ బాపతని. అందుకే నిబ్బరంగా అలాంటి వ్యాఖ్యలు వేయగలిగాడని! ఈ విధంగా, నా కోపాగ్ని జ్వాలలు ఆహుతి చేసాక, అసలు క్లాసు కొనసాగింది. తక్కిన వాళ్ళు మామూలుగానే మాట్లాడారు. మాములు లాగానే, సందేహాలు ఉన్న వాళ్ళు అడిగారు… ఏదన్నా చెప్పేది ఉన్న వాళ్ళు చెప్పారు…. అంతా బానే అయ్యింది.

సరే, ఒకసారి గట్టిగా చెప్పాను కనుక, ఇక ఊరుకుంటారులే అనుకుని, నా మానాన నేను వెళ్ళిపోయా కానీ, కొత్త సమస్య మొదలైందని అనుకోలేదు – ఆ సమస్య పేరు అనవసర పశ్చాత్తాపం. ముందునుంచి మంచి విద్యార్థులైనా, తమలో తాము ఈ కోర్సుకి న్యాయం చేయలేదని కుమిలిపోయే వాళ్ళు ఉంటారు కదా (అబ్బో! అలా నేను ఎన్నిసార్లు ఫీలయ్యానో!)…వాళ్ళ ఈమెయిల్స్. “మా ప్రవర్తన నీకు, ప్రొఫెసర్ కీ బాధ కలిగించినందుకు సారీ. నిజానికి నేనేదో ఫలానా సమస్య వల్ల, క్లాసుకి లీవ్ పెట్టినప్పుడు పర్మిషన్ అడగలేదు… నాది నిర్లక్ష్యం కాదు…..” ఈ తరహాలో సాగుతున్న మెయిల్స్ కి ఏమని సమాధానం చెబుతాం…. “నిన్ను నేనేమీ అనలేదు … అది జనరల్ డిసిప్లిన్ కోసం చెప్పాను” అంటే ఆగేదెవరూ? శాంతించేదెవరూ? :))

అదీ కథ! ఒక్క కోర్సుకే వద్దంటే ఇంత ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటే… పాపం అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఎన్ని ఈమెయిల్స్ చూస్తారో, ఎంత మందిని భరిస్తారో!!

Advertisements
Published in: on January 23, 2012 at 11:27 pm  Comments (12)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/01/23/paschatapam-anu-vichitra-gatha/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

 1. hahahahahaha 🙂

 2. ayyoo….. nijangaane bhayam vestundi kadandee students ki ……
  vallemainaa tappu chesaremo ani feel ayye vaalle 80% untaaru….

  anyways meeru maatram correct gane pravartincharu…. so…..be cool…

 3. అనుభవం బాగుంది. జీవితం లో ఇవి అవసరం కదా

 4. LOL 😀 😀

 5. 😀

 6. అధ్యాపక వృత్తి కష్టమేనండీ, అదీ ఈ దేశాలలో… నేనూ కోర్స్ చేస్తున్నప్పుడు గమనించాను ఆ నిర్లక్ష్యమూ అదీ.

 7. హహహ నిజమే అండి! నేను కూడా మా ప్రొఫెసరు బదులు అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటాను స్పానిష్లో లెండి! వాళ్ళు మొదట్లో ముఖపుస్తకం చూసుకుంటూ పాఠం వినే వారు కాదు అప్పుడు ఆంగ్లంలో చెప్పేదానిని. అప్పుడు కొంతమంది అలెర్ట్ అయిపోతారు. ఇంకా ఎవ్వరూ వినకపోతే చక్కగా తెలుగులో చెప్పేదానిని అంతే అప్పటినుండి నా క్లాసుకి మాత్రం కేవలం పుస్తకం, పెన్ను పట్టుకుని వస్తున్నారు. చాలా శ్రద్ధగా వినటం మొదలుపెట్టారు నాకే ఆశ్చర్యం! ఇక్కడ ఏ భాషలో పాఠం చెప్తే ఆ భాషలోనే ప్రశ్నా పత్రం ఇస్తాం. అది కిటుకు.

 8. “కోపాగ్ని జ్వాలలు ఆహుతి చేసాక..” – – ఇదేమిటి సౌమ్యా! కోపం తగ్గాక కూడా ఇలా మాటలు తడబడితే ఎలా!

 9. @Rasagna: నిజమా?? నిజంగా తెలుగులో చెప్పారా? అద్భుతం! Hilarious!! :))
  @tsradhika: ఓహ్… అంటే బూడిద చేయడం లెండి…అగ్ని జ్వాలలు అగ్నికే అర్పించడం అనమాట 🙂
  @Others: 🙂

 10. మనం ప్రాజెక్ట్ వర్క్ లో తీసుకునే క్లాస్ లే స్పెషలండీ బాబూ!!! అసలనుభవం అక్కడే గా వచ్చేది మరి. All the best:)

 11. i dont know whether you are a prof or a TA/RA.

  if prof (of tech/management), then you dont face these issues. you & your students are aware that you can/will make their life miserable if they act smart.

  if TA/RA, then nobody cares a damn for you (cant be less harsh than that)

  rest of the mails on అనవసర పశ్చాత్తాపం are just time pass (for TA/RA) or manipulation (for prof)

  been a Student/TA/RA/prof and see the full spectrum 🙂

  • @Bull Abbai: Iam neither of those. But, officially, a “Lecturer” for this course 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: