కటికి చీకటి రోదసీ గహ్వరమున – కవిసెన్

ఈమధ్య మా కొలీగ్స్ ఎవరూ ఇంకా క్రిస్మస్ సెలవుల నుంచి రాని కారణాన రోజూ నా మధ్యాహ్న విరామాలు – మనుచరిత్ర పద్యాలతోనే గడుపుతున్నాను 🙂
ఇవ్వాళ రెండు మూడు పద్యాలు నా దృష్టిని అతిగా ఆకర్షించడంతో, దాదాపు గంటసేపు లంచి చేస్తూ గడపాల్సి వచ్చింది. 😉 వాటిల్లో ఒకదాని గురించి, ఇప్పటికి… చీకటి కమ్మింది అని చెప్తే పొయ్యేదానికి ఈయన ఇలా చెప్పడం ఏమిటో….చీకటిని రకరకాలుగా వర్ణించవచ్చు అనుకోండీ…..కానీ, ఎందుకో గానీ, ఈ వర్ణన చదవగానే, ఉన్నట్లుండి నాలోకి కరెంటు ప్రవహించింది. ఆ పదాల కూర్పు వల్ల కాబోలు. అలాగే గట్టిగా చదవబోయి, తమాయించుకున్నాను 😉

మృగనాభి పంకంబు మెయినిండ నలదిన మాయ కిరాతు మైచాయ దెగడి
నవ పింఛమయభూష లవధరించి నటించు పంకజాక్షుని చెల్వు సుంకమడిగి
కాదంబ నికురంబ కలితయై ప్రవహించు కాళింది గర్వంబు కాకువేసి
తాపింఛ విటపి కాంతార సంవృతమైన అంజనాచలరేఖ నవఘళించి

కవిసె మఱియును గాకోల కాలకంఠ
కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట
ఘన ఘనాఘన సంకాశ గాఢ కాంతి
గటికి చీకటి రోదసీ గహ్వరమున

(“మనుచరిత్రలో మణిపూసలు”లో హనుమంతరావు గారి వివరణ చదివాక నాకర్థమైంది ఇదీ:)

నల్లటి కస్తూరిని ఒళ్ళంతా పులుముకున్న మాయా కిరాటుతుడి (శివుడి) శరీర ఛాయని కూడా తలదన్నేలా ఉన్నది,
కొత్త నెమలి పించాలతో కూడిన ఆభరణాలు ధరించిన కృష్ణుడి సొగసుని సుంకం అడిగి పుచ్చుకున్నట్లుగా ఉన్నది,
నల్లటి హంసల గుంపుతో కలిసి హాయిగా విహరించే యమునా నది గర్వ భంగమయ్యేలాగా ఉన్నది,
తమాల వృక్షముల (కానుగ చెట్టు) అడవులతో నిండిన నల్లటి కాటుక వర్ణం గల కొండల శ్రేణులను మించినది,

మరియు –
ఇంకా, కాకులు, నెమలి మెడలు, కోయిలలు, ఏనుగుల మందలు, కాటుక పిట్టలు, దట్టమైన వాన మబ్బులతో సమానమైన చిక్కదనము కలదీ, అయిన చీకటి ఆకాశాన్ని ఆవరించింది అని భావము.

ఏం చెప్పారో!!

రకరకాల చీకట్లు మనసులో మెదిలాయి కానీ…అలా ప్రతీదానికీ పెడార్థాలు తీయకూడదని ఊరుకున్నాను ;).

Published in: on January 5, 2012 at 2:13 pm  Comments (8)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/01/05/%e0%b0%95%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a6%e0%b0%b8%e0%b1%80-%e0%b0%97%e0%b0%b9%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%ae/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. బాగుంది పద్యం, నీ (హనుమంతరావుగారి)వివరణ కూడా. కటికచీకటి అనుకున్నాను. అది కటికి చీకటి అనీ, కిరాతకుడిని కిరాటుడు అని కూడా అంటారు అని తెలిసింది ఇప్పుడు. అందుకే నాకు పూర్వకాలపు పద్యాలు ఇష్టం. థాంక్స్.

 2. బావుంది. పద్యం చదివితే కొంతే అర్థం ఐంది.

  నా దగ్గర మను చరిత్ర పుస్తకం ఉంది కానీ వ్యాఖ్యానం లేదు. అది ఉంటే కానీ అర్థం అయ్యేడట్టు లేదు. మీ దగ్గర ఉన్న దాన్లో కొన్ని పద్యాలకే వ్యాఖ్యానం ఉందా ??
  మొత్తం వ్యాఖ్యానం ఉన్న పుస్తకం ఏదన్న ఉందా ??
  తాపీ ధర్మారావు గారిది ఉండాలిట కానీ నేను ఇది వరలో ట్రై చేసినప్పుడు దొరకలేదు.

 3. బావుంది.
  భాగవత ప్రస్తావన పద్యాల్లో శరద నీరదేందు పద్యంలోనూ, అట్లాంటివే మరికొన్ని పద్యాల్లో తెలుపు వర్ణనలున్నాయి, వర్ణన అనే కంటే తెల్లదనానికి పేరుపడిన వస్తువుల జాబితాల్లా ఉన్నాయవి. ఈ వర్ణన బాగుంది.

 4. @Vasu garu: అవునండీ, నా దగ్గర ఉన్న పుస్తకంలో ఒక యాభై దాకా పద్యాల వివరణ ఉందంతే.
  @Malathi garu, Kottapali garu: 🙂

 5. @Malathi garu: క్షమించాలి. నేను టైపింగ్ పొరబాటు చేసాను. అది కిరాతుడు. కిరాటుడు కాదు. కిరాటుడు అంటే వర్తకుడనుకుంటాను. కిరాతుడు అంటే – ఇక్కడ శివుడిని ప్రస్తావిస్తూ వాడారు (హనుమంతరావు గారి వ్యాఖ్యానం బట్టి). మరి కిరాతుడు, కిరాతకుడు సమానార్థకాలో కాదో నాకు తెలియదు.

 6. మను చరిత్ర–వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారి ప్రతి పద వ్యాఖ్య, వేటూరి ప్రభాకర శాస్ర్తి గారి పీఠికలతో — నా దగ్గర ఉంది. అట్ట మీదున్న సమాచారం ప్రకారం ఇది ఈ ఎడ్రెస్ దగ్గర దొరుకుతుంది.

  వావిళ్ళ రామస్వామి శాస్ర్త్రులు ఎండ్ సన్స్
  152, హస్తినా పురం(దక్షిణం)
  నాగార్జున సాగర్ రోడ్, ఎల్. బి. నగర్
  హైదరాబాద్–500 074

 7. Chennai address for the same is..

  V.Ramaswamy Sasrtulu & Sons
  26, Ramanujan Iyer Street
  Chennai- 600 021

 8. Thanks Pavani garu.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: