తెలుగు వ్యాకరణం – 1, కొత్త పాఠాలు మొదలు

నాకు కోరాడ మహదేవశాస్త్రి గారి “Descriptive grammar and handbook of modern telugu” అని ఒక పుస్తకం కనిపించింది మా లైబ్రరీలో. విదేశీ తెలుగు విద్యార్థుల కోసం పాఠాల రూపంలో తెలుగు వ్యాకరణం నేర్పే పుస్తకం ఇది. ఈమధ్యే ఆయనకి సి.పి.బ్రౌన్ అవార్డు వచ్చిందని చదవడం వల్ల, ఈ పుస్తకంలో ఏముందో చూద్దాం అని మొదలుపెట్టాను. ఆ, ఎంతైనా మన భాషే కదా, పెద్ద కష్టపడనక్కర్లేదులే, అని. చదవడం మొదలుపెట్టాక, నోట్సు రాసుకుంటూ కొనసాగడం నయమేమో అనిపిస్తోంది. అందుకని న సందేహాలూ, ఇతర అభిప్రాయాలూ బ్లాగులో రాస్కుంటున్నా – ఆసక్తి ఉన్న నాబోటి వారికి పనికొస్తుందేమో అని. అలాగే, విషయ పరిజ్ఞానం ఉన్నవారు చూడ్డం, చదవడం తటస్థిస్తే, సందేహాలు తీరుస్తారన్న ఆశ.

(ఇది రాసి రెండు రోజులౌతోంది. మధ్యలో సురేశ్ కొలిచాల గారి పుణ్యమా అని కొన్ని సందేహాలు తీరాయి. వారికి ధన్యవాదాలు)

ముందుగా – ఇంట్రొడక్షన్ అధ్యాయం నుండి.

1) ఆధునిక తెలుగు పదమూడు అచ్చులు, ముప్ఫై నాలుగు హల్లులతో – మొత్తం నలభై ఏడు అక్షరాలు కలిగి ఉంది అని మొదలుపెట్టారు (అం, అః, ౠ,ఌ,ౡ,ౘ,ౙ, క్ష, ఱ – ఇవీ ఆయన చేర్చని అక్షరాలు). బహుశా – అం, అః, క్ష – అన్నవి నిజానికి రెండు అక్షరాలు అని వదిలేసారు అనుంటూనే, తక్కినవి ఉపయోగంలో లేవు కనుక తొలగించారు (నేర్చుకునే వాళ్ళ సౌలభ్యం కోసం) అనుకుంటూన్నాను.

నాకు: ౠ,ఌ,ౡ,ౘ,ౙ – ఎక్కడ ఉపయోగిస్తారు? అన్నది పక్కన పెడితే, మొదటి అక్షారాన్ని వదిలేస్తే, తక్కినవి సరిగ్గా పలకడం ఎలాగో తెలీడం లేదు. ఎవరన్నా ఎక్కడన్నా ఆడియో ఫైళ్ళు ఉంటే లంకెలిచ్చి పుణ్యం కట్టుకోండి.

ఇక, “నీఱు”, “నీరు” అంటే వేర్వేరు అర్థాలు వస్తాయనీ (మొదటిది బూడిద, రెండోది నీళ్ళు), “వేఱు”, “వేరు” కూడా వేర్వేరు అనీ (మొదటిది ‘వేరూచేయడం అనే అర్థంలో వచ్చే వేరు…రెండోది ‘కూకటి వేళ్ళతో’ సహా పెకలించే వేరు…) అని తెలిసి గుండాగిపోయింది. అర్జెంటుగా మాట్లాడేటప్పుడు రెంటి మధ్యా తేడా పలికించాలి ఇకపై అనుకున్నా…కానీ, అసలుకి పలకడంలో తేడా చూపడం తెలీదుగా. దానిక్కూడా ఒక ఆడియో .. ప్లీజ్…
(ఇక్కడ పలకడంలో తేడా తీరింది. వివరాలకి – , . ఒక ఆన్లైన్ చర్చ….దానిలో మరికొన్ని గుంపు చర్చల లంకెలు కూడా ఉన్నాయి)

2) ఈయన ప్రకారం “ఋ” ని “రు” అని పలకాలి. అప్పుడు రుషి-ఋషి, కృషి-క్రుషి ఎలా రాసుకున్నా కరెక్టేనా? లేదంటే పాపం విదేశీయులకోసం రాసింది కనుక అలా రాశారా? మరి “శ” ని “ష” లా పలకాలి అని రాయలేదే (తెలుగువాళ్ళు చాలామంది అలాగే పలుక్కుంటూ జీవించుకుంటున్నా కూడా!)

3) నాకు ఈ ఫొనెటిక్ పదజాలం అంటే మా చెడ్డ చిరాకు (నాకు రాదు కనుక!) : Velars, Palatals, Retroflexes, Dentals మరియు Labials అన్నారు వరుసగా క నుంచి త వరస దాకా వచ్చే ఐదేసి అక్షరాలనూ. ఇప్పుడవన్నీ నేను వివరించలేను కానీ, నా అనుమానం ఏమిటంటే – వీటికి సమానార్థక తెలుగు పదాలు ఏమిటి? అని.

4) ఞ, ఙ – ఈ రెండూ వత్తుల్లో కాకుండా విడిగా వచ్చే పదాలేవన్నా ఉన్నాయా??

5) ౘ,ౙ :ఉన్న పదాల గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ, నాకేమీ అర్థం కాలేదు ఎక్కడ ఏది వాడాలో. మీకెవరికన్నా తెలిస్తే చెప్పండి.

6) “థ is pronounced as ధ” అన్నారు. ఎంతైనా అలా ఎలా చెబుతారు? మనం మాట్లాడేటప్పుడు ఒకలాగా పలకం కదా??

7) అవి అటు పెడితే, ఇది చదువుతున్నప్పుడు గానీ – ప్పు అని రాసినప్పుడు మాత్రమే ఉకారం వత్తుకి వస్తుంది…తక్కిన సమయాల్లో అలా రాదు అన్న విషయం గమనించలేదు. మరెలా నేర్చుకున్నానో ఏమీటో!! 😛

8 ) అయితే, కొన్నాళ్ళ బట్టి నాకు మహా ఆసక్తికరంగా అనిపించే రెండు సంగతులు ఇక్కడ గుర్తొచ్చాయ్ – మనం ఇరవై ఒకటి, ఇరవై రెండూ అంటే – హిందీలో: ఒకటి-ఇరవై, రెండు-ఇరవై అంటాం ఏమిటో! అని (అంటే,జర్మన్ లో కూడా అంతే లెండి). అలాగే, మనం అహల్య అన్నాం అనుకోండి… ల కి య వత్తు కదా ఇస్తాము? అదే హిందీలో రాస్తే… ల సగమే ఉంటుంది… య పూర్తిగా ఉంటుంది… అవనమాట నాకు మహా ఆశ్చర్యంగా అనిపించే రెండు సంగతులు. ఎందుకో? అన్నది నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.

9) ఈ అధ్యాయంలో ఒక భాగం ముగిస్తూ – ఒక సారాంశంలాగ చెబుతూ – ఞ, ఙ – రెండూ న కి Allophones కనుక, థ, ధ రెండూ ఒకేలా పలుకుతాం కనుక, ౠ నిజంగా అచ్చు కాదు కనుక, ఐ-ఔ రెంటినీ కూడా అ-య్,అ-వ్ గా విభజించవచ్చు కనుక, మొత్తానికి ఇవి తీసేసి, “ae, f” శబ్దాలను కలిపి తెలుగులో 43 శబ్దాలే అని చెప్పొచ్చని తేల్చారు. కెవ్వ్!

10) ఇక, తలకట్టులు, దీర్ఘాలు, వత్తులూ గట్రాల్లో అక్షరాల మధ్య ఉండే భేదాలను గురించి రాశారు. అర్రే, చిన్నప్పుడు ఎప్పుడూ ఇలా ఆలోచించనే లేదే! అనిపించింది. కానీ, నిజంగానే కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఇలాంటివి స్పష్టంగా చెప్పడం అవసరం అని కూడా అనిపించింది.

11) “In Telugu, double consonants occur but conjuncts are rare” అన్నారు. అది చదివాక నాకు ఆశ్చర్యం కలిగింది. సంస్కృతమో…ఇంకోటో మూలం కాని అచ్చ తెలుగు పదాల్లో “ర” లో వచ్చే “Conjuncts” వదిలేస్తే, (తండ్రి వంటివి) తక్కినవన్నీ ఏ హల్లుకు ఆ హల్లు వత్తు వచ్చే – Double Consonants ఏ అట. వీటికి తెలుగు సమానార్థకాలు ఏమీటో గానీ, ఈ Double Consonants విషయం మాత్రం మహా ఆసక్తికరంగా ఉంది. అయితే, ఏది పరభాషా పదమో కనుక్కోవచ్చా ఈ ఒక్క రూల్ తో???
(సందేహం: అలా వచ్చేవన్నీ సంస్కృత పదాలో ఇంకేవో అనుకోవాలా? “వస్తే” – అంటే తెలుగు కాదా?? మచిలీపట్నం తెలుక్కాదా?)
(ఇక్కడా కొంచెం వరకూ తీరింది – సురేశ్ గారి మాటల్లో: ద్రావిడ భాషలోని మూల పదాంశాలలో (morpheme) ద్విత్వాలే తప్ప విభిన్నమైన హల్లుల కలయికతో ఉన్న సంయుక్తాక్షరాలు ఉండవు. అయితే, ఈ morpheme లకు విభక్తులు కలిపినప్పుడు సంయుక్తాక్షరాలు వస్తాయి. వచ్చు + తే = వ-త్స్-త్స్-ఉ (చ- దంత్య చ కాబట్టి) +తే = వస్తే. ఆధునిక భాషలలో వేరే సంయుక్తాక్షరాలు కూడా కనిపిస్తాయి.)
-ఇప్పుడు కొత్త సందేహం ఏమిటంటే, ఒక పదాన్ని చూడగానే, అది సంధి వల్ల ఏర్పడ్డదా? మామూలుదా? అన్నది తెలిసే మార్గముందా?

దీని తరువాత సంధి నియమాల గురీంచిన చర్చతో ఈ అధ్యాయం ముగిసింది. ఆ సంధి నియమాల గురించి మళ్ళీ వివరంగా రాస్తాను. ఈ సందేహాలు తీర్చగలవారు తీర్చండి ప్లీజ్.

(సిగ్గులేకుండా తెలుగు వ్యాకరణం ఇంగ్లీషులో నేర్చుకుంటున్నది చాలక సందేహాలు కూడానా? అంటారా? అవునండీ… ఏం చేస్తాం… విధి ఆడే వింత నాటకంలో మనం పావులం. అది బలీయమైనది. మనం కులీనులం అయినా, కాకున్నా బలీనులం. ఈ జమీనుపై ఇంగ్లీషులో విలీనులం. ;))

Published in: on November 21, 2011 at 7:00 am  Comments (15)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/11/21/teluguvyakaranam-1/trackback/

RSS feed for comments on this post.

15 CommentsLeave a comment

  1. “తెలుగు వ్యాకరణం ఇంగ్లీషులో నేర్చుకుంటున్నది చాలక”
    Precisely! ..
    తెలుగులో ఆ పాదాలకు అర్థాలు చెప్పిన కూడా ఆట్టే అర్థం కావేమో లే.
    Btw what is the logic behind comparing the language constructs of Hindi and Telugu .. ( ahalya part) .. they belong to different language families i think ?

  2. Okie so the gmail editor is hopeless.. there was a typo in the comment above .. replace paadalaku with పదాలకు and delete this comment when you check your blog next 😛 .

    Infact it should be “చెప్పినా” .. but entha చెప్పినా gmail vinipinchukoledu em chestam 😛

  3. ౘ is pronounced as tsa

    ౙ is pronounced as dza

    Both occur when not combined with ఇ, ఈ, ఎ, ఏ.

    Examples : tsappuDu, tsukka, tsaalu. tsaakali.
    DzalleDa, dzallu, dzaamu, dzoli, dzunnu etc.

    Noticing the pronunciation of male speakers (or senior female speakers) hailing from Andhra Coastal districts will be of some help. Because, of late, several young female speakers are trying to pronounce these like Hindi cha and ja for fashion’s sake.

  4. @Okadu: Thanks!
    @Halley: It was not a comparison. It was an observation.

  5. I am afraid that generation which was so fastidious about pronunciation and use of proper letters/ words for the occasion is no more. They can best be located in the archives of adhyatma Ramayana sankeertanas (I think AIR made some attempt to record them from an older generation reaching out to them) or their corrupt versions in the folklore. With dwindling interest in linguistics and humanities, coupled with our innate disrespect for history, it’s hard to find the sources. Yet, we may be able to find them from people who keep them as family treasures, a rare breed, though.

  6. Velars = కంఠ్యాలు (గొంతు స్థానం కల్గినవి)
    Palatals = తాలవ్యాలు (దవడ స్థానం కల్గినవి);
    Retroflexes = మూర్ధన్యాలు (అంగిలి స్థానం..);
    Dentals = దంత్యాలు (దంతాలతో..)
    Labials = ఓష్ఠ్యాలు (పెదవులతో..)

    అక్షరాల గురించి మరో చిన్న గమనిక: మనం ఉచ్ఛరించే ప్రతీ శబ్దం, మన శరీరంలోని నాడుల వలన కల్గిన నాదమే. మన శరీరంలో 72000 నాడులు ఉన్నాయని యోగశాస్త్రాలు చెప్తున్నాయి. వీటిలో 14 ముఖ్యమైనవి. ఈ 14 నాడుల “అనాహత” శబ్దాన్ని పాణిని మహర్షి మనకు అక్షర రూపంగా అందించాడు. ఈ అనాహత శబ్దాన్ని మహేశ్వర ఢక్కానాదం అని కూడా చెప్తారు.

    అ, ఇ, ఉ, ఋ, ఌ, ఏ, ఐ, ఓ, ఔ మూల అచ్చులు. వీటికి మరలా 132 భేదాలు ఉన్నాయి – అ (18), ఇ(18), ఉ(18), ఋ(18), ఌ(12), ఏ(12), ఐ(12), ఓ(12), ఔ(12) . అయితే అన్నీ పలుకలేక మనం తెలుగులో 16 భేదాలని ఉపయోగిస్తున్నాం.

    లాటిన్ మున్నగు పాశ్చాత్య భాషలకు కూడా ఈ మూల అచ్చులే ఉన్నాయి.
    అ = a, ఇ = i, ఉ = u, ఏ = e, ఓ = o. కాకపోతే, వీరు అన్నీ అచ్చు భేదాలు పలుకలేక 5 అచ్చులే, కొద్దిపాటి వ్య్తత్యాసంతో ఉపయోగిస్తున్నారు.

    14 మహేశ్వర సుత్రాలు:
    అఇఉణ్
    ఋఌకు
    ఏఓఙ్
    ఐఔచ్ (అఇఉణ్ –> ఐఔచ్ : ఆద్యంతములు కలిపితే = అచ్ = అచ్చులు)
    హయవరట్
    లణ్
    ఞమఙణనమ్
    ఝభఞ్
    ఘఢధష్
    జబగడదశ్
    ఖఫఛఠచటతవ్
    కపయ్
    శషసర్
    హల్ (హయవరట్ –> హల్ : ఆద్యంతములు కలిపితే = హల్ = హల్లులు)

    వీటిని పలుకుతుంటే అచ్చం ఢమరుక నాదం లానే అనిపిస్తాయి. కానీ ఇవి అనాహతమైనవి (శబ్దం మామూలుగా రెండు వస్తువుల రాపిడి వలన్ వస్తుంది. అనాహతం అంటే, రాపిడి లేకుండా పుట్టినవి, మన నాభిచక్రం నుంచి)

    ఇలా ఒక్కో అక్షరం అనాహతం నుంచి ఆస్యమార్గం ద్వారా బయటకు వెలువడే ప్రక్రియయే – వర్ణోత్పత్తి క్రమం. ఈ భేదాలనే కంఠ్యాలు, తాలవ్యాలు.. అని వివరించారు.

  7. In Telugu, double consonants occur but conjuncts are rare…
    దీనికి కారణం మన భాషలన్నీ, సంస్కృతం సరిగ్గా పలుకలేక, వికారాలుగా మార్పుచెంది, స్వతంత్ర భాషలుగా వృద్ధి చెందుతున్నాయి.. ఉత్తరభారతంలోని భాషలన్నీ గత 1000 సంవత్సరాలలోపు వచ్చినవే. అంతకుముందు ఇవన్నీ ప్రాకృతభాష అపభ్రంశలు. ప్రాకృతం కూడా సంస్కృతం యొక్క అపభ్రంశమే.. అందువలన, ఉత్తర భాషలమూలాలను సంస్కృతంలో తేలిగ్గా గుర్తించొచ్చు.

    మన దక్షిణ (=ద్రవిడ) భాషలు కూడా అలా వచ్చినవే, కాకపోతే 3000-4000 సంవత్సరాలకు పూర్వమే సంస్కృతం నుంచి అపభ్రంశమైనవి. అందువలనే సంస్కృతమూలాలు గుర్తించడం కొంచెం కష్టం.

    దీనికి వివరణ “మాయాబజార్” సినిమాలో చక్కగా వివరించారు. ఉ.దా. దుష్టచతుష్టయం –> దుసటచతుసటయం; అసమదీయులు మొ॥

    అందువలన, సంయుక్తాక్షరాలు ద్రవిడభాషలనుంచి దూరమయ్యాయి. సంయుక్తాలకంటే, ద్విత్వాలను పలకడం తేలిక కదా!
    ఉ.దా. ఆశ్చర్యం –> ఆ,శ్,చ్,అ,ర్,య్,మ్ –> దగ్గరగా ఉండే హల్లులను, అచ్చులను కలిపేస్తే –> (శ్ -> చ్; య్ -> ఇ -> ఎ) –> అ చ్ చ్ అ ర్ ఎ మ్ –> అచ్చెరం –> నన్నయాదులుచే ఇలాంటి పదాలు శుద్ధి చేయబడి –> అచ్చెరువు గా రూపాంతరం చెందింది.

  8. ఒక పదాన్ని చూడగానే, అది సంధి వల్ల ఏర్పడ్డదా? మామూలుదా? అన్నది తెలిసే మార్గముందా?

    ప్రతీపదం సంధి వలన ఏర్పడిందే.. ఉ,దా., : గంగాభవనం –> గ్+అ+ం+గ్+ఆ+భ్+వ్+అ+న్+మ్. తెలుగులోఅనుస్వారం మకారం గా మకారం అనుస్వారం గా మార్పు చెందింది. సంస్కృతంలో ఇవి సందర్భోచితముగా అనేక రూపాంతరాలు పొందుతున్నాయి –> గఙ్గాభవనమ్ (అనుస్వారం –> ఙ్)

    కాకపోతే వాడుకలో పదాల సన్నిహితత్త్వాన్నే “సంధి” అంటున్నాము. వాస్తవానికి ఇది అక్షరాల సాన్నిహిత్యానికీ వర్తిస్తుంది.
    ఉ,దా,,పార్థ = పృథాకుమారుడు.
    పృథ –> ప్+ఋ+థ్+అ
    ఇక్కడ ఆదివృద్ధి జరిగి, మొదటి అక్షరానికి “ఆ” ప్రత్యయం చేరుతుంది.
    –> ప్+(ఆ)+ఋ+థ్+అ
    ఆ+ఋ –> ఆర్ (గుణ సంధి)
    –> ప్+ఆర్+థ్+అ = పార్థ

  9. ఞ, ఙ – ఈ రెండూ వత్తుల్లో కాకుండా విడిగా వచ్చే పదాలేవన్నా ఉన్నాయా??

    వీటిని నాకు తెలిసి మన పూర్వీకులు (3000 – 4000 సంవత్సరాల నాటి ఆంధ్రులు) పలుకలేక వదిలేశారు. అందుకే ద్రవిడ (=దక్షిణ) పదాలలో పెద్దగా కనపడవు.

    అనుస్వారము (సున్న) తనకు పరమైనా వర్గాక్షరాలను బట్టి, పంచమాక్షరాన్ని గ్రహిస్తుంది.
    గంగా –> గఙ్గా; శంఖర –> శఙ్ఖర
    పంచ –> పఞ్చ ; ఆంజనేయ –> ఆఞ్జనేయ
    కంఠ –> కణ్ఠ; పాండవ –>పాణ్డవ
    ఇంద్ర –> ఇన్ద్ర; తంత్రీ –> తన్త్రీ;
    అంబ –> అమ్బ; పంపా –> పమ్పా

    అలాగే, ఙ్, ఞ్ లు కూడా తమతో పాటు వచ్చే హల్లులని బట్టి, రూపాంతరం చెందుతున్నాయి. అలా ఈ రూపాలన్నీ తమకు దగ్గరగా ఉండే అక్షరాలతో చేరడం వలన, వత్తుల్లో లేని వీటి పదాలు అరుదే.
    ,
    నాకు తెలిసి కొన్ని వ్యాకరణ సాంకేతిక పదాలు ఉన్నాయి.
    ఙిత్తు = ఙ్ ఇత్తు గా కల్గిన ప్రత్యయం.
    ఆఙ్ = ఒక ప్రత్యయం
    లఞ్ = ఒక ప్రత్యాహారం

  10. సుబ్బయ్య గారికి: వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు!

  11. >>ఈయన ప్రకారం “ఋ” ని “రు” అని పలకాలి.

    “ఋ” ఉచ్చారణ “రి”, “రు” రెండూ కాదు. ప్రాచీన కాలంలో దీని ఉచ్చారణ “రి”కే ఎక్కువ దగ్గరగా ఉండేదని నేననుకుంటాను. దానికి రెండు ఆధారాలు:
    1. ఋకారమున్న పదాలకి తెలుగులోని వికృతి పదాలలో “ఇ”కారం కనిపిస్తుంది. ఉదాహరణకి – ఋక్షము-రిక్క, దృష్టి-దిష్టి, గృహము-గేహము, కృష్ణుడు, కిట్టడు. తెలుగులోనే హిందీలో కూడా ఇలాంటిదే కనిపిస్తుందనుకుంటా.
    2. ఛందస్సులో యతి మైత్రికి సంబంధించి, “ఋ”కి “ఇ”కారంతో మైత్రే ఎక్కువ ప్రసిద్ధం. కొంతమంది “ఉ”కారంతో కూడా చేసారు కాని, అది చాలా తక్కువ.

    >>ఞ, ఙ – ఈ రెండూ వత్తుల్లో కాకుండా విడిగా వచ్చే పదాలేవన్నా ఉన్నాయా??

    వాక్, ప్రాక్ వంటి పదాలకి, న, మ అనే అక్షరాలతో మొదలయ్యే పదాలతో సంధి జరిగినప్పుడు, ఙ్ వస్తుంది. ఉదాహరణకి – వాఙ్మయము, ప్రాఙ్నన్నయ మొదలైనవి. ఞ్ అలా వచ్చే సందర్భం నాకు తెలిసి లేదు.

    >> దంత్య చ, జ ఉన్న పదాల గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కానీ, నాకేమీ అర్థం కాలేదు ఎక్కడ ఏది వాడాలో. మీకెవరికన్నా తెలిస్తే చెప్పండి.

    ఈటీవీలో పాడుతాతీయగా కార్యక్రమం చూడండి, బాలూ చాలాసార్లు వీటి మధ్యనున్న ఉచ్చారణ భేదం చెపుతూనే ఉంటారు 🙂

    >>“థ is pronounced as ధ”
    I am surprised about this!

    >>ప్పు అని రాసినప్పుడు మాత్రమే ఉకారం వత్తుకి వస్తుంది

    దీని వెనక కొంత చరిత్ర ఉందనుకుంటా! 🙂 మన లిపిపుట్టు పూర్వోత్తరాలలో చదివినట్టు గుర్తు.

    >>మనం ఇరవై ఒకటి, ఇరవై రెండూ అంటే – హిందీలో: ఒకటి-ఇరవై, రెండు-ఇరవై అంటాం ఏమిటో! అని

    తెలుగు, హిందీ వేర్వేరు భాషా కుటుంబాలకి చెందినవై ఉంటాయనడానికి యిదొక ఉదాహరణ. హిందీది సంస్కృత భాషా పద్ధతి.

    >>మనం అహల్య అన్నాం అనుకోండి… ల కి య వత్తు కదా ఇస్తాము? అదే హిందీలో రాస్తే… ల సగమే ఉంటుంది… య పూర్తిగా ఉంటుంది

    ఇది భాషకన్నా లిపులకి సంబంధించిన విషయం. తమిళంలో కూడా హిందీ పద్ధతినే (దాదాపుగా) అనుసరిస్తారు.

    >>కాని అచ్చ తెలుగు పదాల్లో “ర” లో వచ్చే “Conjuncts” వదిలేస్తే, (తండ్రి వంటివి) తక్కినవన్నీ ఏ హల్లుకు ఆ హల్లు వత్తు వచ్చే – Double Consonants ఏ అట.

    Conjuncts – సంయుక్తాక్షరాలు
    Double Consonants – ద్విత్వాక్షరాలు

    మరి జింక, కంచ, వింత, చెంప వంటి పదాల మాటేమిటి? అవి కూడా రెండు హల్లుల కలయికే కదా? 🙂

    • ఆయన పద్ధతిలో జింక, కంచు వంటివి లెక్కలోకి తీస్కోలేదు. అంటే, ఉదహరించారు కానీ, వాటిని సంయుక్తాక్షరాలు అనలేదు నాకు గుర్తున్నంతవరకు. ఇవ్వాళ మళ్ళీ పాఠం మొదలుపెడతా. అప్పుడు చూసి చెబుతాను.

  12. అచ్చు, హల్లులపై అనుస్వరాన్ని (సున్న) సంయుక్తాక్షరముగా గణించలేమనుకుంటా! సంయుక్తాక్షరమంటే – అచ్చు అంతరంలో లేని ఉండే హల్లుల అన్యోన్యతే.

    అదీకాక తెలుగు “అం” “అః” ని అచ్చు కింద చెప్పేశారు.. కావున జింక, కంచు వంటిపదాల్లో సంయుక్తాక్షరాలు లేవని నా అభిప్రాయం.

    ———————————–
    నా క్రితం పోస్ట్ లో చిన్న సవరణ:
    3వ మహేశ్వర సూత్రం: ఋఌక్ (“ఋఌకు” కాదు). టైపుదోషం.

    @సౌమ్య గారు;
    నిన్నటి పోస్ట్ కి అదనంగా… “పదాల మధ్య సంధిని సుళువుగా గుర్తించడానికి” మార్గం — మూలపదాలజ్ఞానం (ధాతువుల), ఉపసర్గ-ప్రత్యయాల జ్ఞానం, సంధి సూత్రాలు, సాహిత్యావగాహన చాలావరకూ ఉపకరిస్తాయి. ఇక ఆపైన అనుభవ జ్ఞానమే అనుకుంటా!

  13. […] […]

  14. […] మధ్య మొదలుపెట్టిన పరిచయ వ్యాసం సంధుల గురించిన చర్చతో ముగిసి, పాఠాల […]


Leave a reply to vbsowmya Cancel reply