నన్నాకర్షించని మొడటి ఐరోపా నగరం – మాల్మో

నేను యూరోప్ లో జీవించడం మొదలుపెట్టి ఏడు నెలలు అవుతోంది. ఏదైనా కొత్త ప్రాంతం చూసి రాగానే, సాధారణంగా నాకది నచ్చుతూ ఉంటుంది. నాకెందుకో ప్రతి చోటా ఏదో ఒకటి నచ్చుతుంది. కొన్ని చోట్ల సముద్రమో, చెట్టూ చేమలో, ప్రశాంతంగా పారే నదులో నచ్చితే, కొన్ని చోట్ల శిల్పాలు, వాటిలో పలికే హావభావాలూ…కొన్ని చోట్ల పాత కాలపు భవనాలూ – ఇలా ఏదో ఒకటి నచ్చుతూ ఉంటుంది. ఇలా నేను ప్రతిసారీ ఎక్కడికో వెళ్ళడం, “ఈ ఊరు భలే ఉంది తెల్సా?” అనడం, “ఆ, ప్రతి ఊరుకీ అలాగే చెప్తున్నావ్ లే!” అని మా తమ్ముడు అనడం జరుగుతూ ఉంటుంది.

అలాంటిది, ఇన్ని ప్రయాణాల్లో మొదటిసారి, నాకొక ఊరు బోరింగ్ అనిపించింది. అది స్వీడెన్ దేశంలోని మాల్మో నగరం.

కొన్ని అనివార్య కారణాల వల్ల, నాకంటూ పనేమీ లేకున్నా, గతవారం మాల్మో లో దాదాపు ఇరవై నాలుగ్గంటలు గడపాల్సి వచ్చింది. తోచక, నడకతో నగర సంచారం చేస్తూ గడిపాను. ఈ టపా దాని గురించే!

మాల్మో చేరాలంటే, డెన్మార్కులోని కోపెన్ హాగెన్ నుండి ఓరెసుండ్ జలసంధి మీదుగా ట్రెయిన్లో ఒక అరగంటలో రావొచ్చు – మేము అలాగే వెళ్ళాము (కోపెణాగెన్ చేరబోతున్నప్పుడు ఒకావిడ ట్రెయిన్లో “మాల్మొ చాలా బోరింగ్ ఊరు. అఫ్కోర్సు, నేను అక్కడికి ముప్పయి ఏళ్ళ క్రితం వెళ్ళా అన్నది వేరే విషయం” అన్నది. ఇప్పుడు బాగుంటుందిలే అనుకున్నాం…పొరబాటు అనమాట!). మేము రాత్రికి బస చేయవలసిన చోటుకి వెళ్ళాలంటే, స్టేషన్ నుంచి కొంచెం దూరం ప్రయాణం చేయాలి. బస్సులో వెళ్తూ ఉండగా, మహా చిరాకేసింది. కారణం – అన్నీ పెద్ద పెద్ద రోడ్లూ, బిల్డింగులూనూ. ఉంటే ఉన్నాయి కానీ, అన్నీ ఒకలాగే ఉన్నాయి నాకు. ఇదివరలో ఇక్కడి నగరాల్లో తిరుగుతూ ఉంటే, ఆ భవనాలు అవీ చూసి అబ్బురంగా అనిపించేది…అబ్బా, చూడబోతే పాతవిగా ఉన్నాయి…లోపల మాడర్న్ గా ఉన్నా కూడా, బయట ఆ పాత లుక్ భలే ఉంచేస్కున్నారే! అని.

సరేలే, మనమేదో అర్బన్ ప్రాంతంలో ఉండి ఉంటాము అని సరిపెట్టుకున్నాను. తరువాతి రోజు, నా ఒంటరి అన్వేషణ మొదలైంది. నాకు పనేమీ లేదని చెప్పా కదా, కనుక పనులు ఉన్న వారు వాటికోసం వెళ్ళిపోతే, నేను సంచారినయ్యాను. కాసేపు ఒక మ్యాప్ తీసుకుని, అటూ ఇటూ తిరుగుతూ, సిటీ సెంటర్ కి వచ్చాను. సాధారణంగా, సిటీ సెంటర్ అంటే అక్కడే పాత టౌన్ హాలు, ఇంకా కొన్ని పాత భవనాలూ, శిల్పాలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే, షాపింగ్ మాల్స్ ఉన్నాయి! కాసేపు అదే దోవలో నడిస్తే, ఒక బారెడు పొడుగున్న చర్చి కనిపించింది. నిజం చెప్పొద్దూ – నిర్మాన పరంగా, మామూలు అమాయకపు కళ్ళకి చాలా సాధారణంగా అనిపించింది. ఉన్న దానికి తోడు, అంతకు ముందు రెండు రోజుల్లో రెండు అద్భుతమైన చర్చి భవన సముదాయాలను చూశాను. దానితో, ఇది చప్పగా అనిపించింది. అక్కడే ఒక టౌన్ హాల్ కూడా ఉండింది. బాగుంది కానీ, “వావ్” అనిపించలేదు. ఇలా ఇంకో ఐదు నిముషాలు నడవగానే, స్టేషన్ వచ్చేసింది!! వార్నీ, ఇంతేనా ఓల్డ్ సిటీ అంటే?? అనుకున్నా.

స్టేషన్ పక్కనే ఉన్న పర్యాటక శాఖ వారి ఆఫీసుకు వెళ్ళాను. నాకు ఇంకో రెండు మూడు గంటల టైం ఉంది, ఈ ఊళ్ళో చూడదగ్గవి ఏంటీ? అని అడిగాను. ఆవిడ ఓపిగ్గా, మ్యాప్ తీసి, అందులో సూచించడం మొదలుపెట్టింది. ఆమె మొదట చూపిన స్థలాలు చూసి అవాక్కయ్యాను. ఎందుకంటే, అది అంతసేపూ నేను నడిచొచ్చిన రోడ్డే! ఆ తరువాత, నే వచ్చిన ప్రాంతానికి సమాంతరంగా ఉండే మరో ప్రాంతం చూపి, ఇవి రెండూ కాక, మాల్మో కోట కూడా ఉంది, ఆ సైడ్ వెళ్ళి చూడమని సలహా ఇచ్చింది. అన్నీ ఒకట్రెండు కి.మీ దూరాలే కావడంతో, చూడ్డానికి బయలుదేరాను.

మొదట కోట ప్రాంతాల్లోకి వెళ్ళాను. ఇక్కడ ప్రశాంతంగా, బాగుంది. కాసేపు నడిస్తే, ఒక భవన సముదాయం కనబడింది. నాకు మామూలుగానే అనిపించింది కానీ, అదే ఇక్కడి కోట. ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ నాటిది అంటే ఒక్క పట్టాన నమ్మలేకపోయాను! కోటకి చరిత్ర అయితే చాలా ఉంది కానీ, చూడ్డానికి మాత్రం నాకు మామూలుగా అనిపించింది. అసలు కోటకంటే, లోపల వాళ్ళు పెట్టిన కోట ఫొటోలే బాగున్నాయి నాకు!

ఇక్కడ ప్రత్యేకం నేను గమనించినవి కొన్ని:

1) స్టేషన్ లో దిగ్గానే, ఎదురుగ్గా సిటీ బస్సులు వస్తున్నాయి. మేము ఎక్కాల్సిన బస్సు ఎక్కడ వస్తుందో డిస్ప్లేలో చూసుకుని అక్కడికి వెళ్ళి నిలబడ్డాము. ఎంతకూ బస్సు రాదు. కాసేపటికి స్టాప్ కు అటు చివర ఉన్న ఇక్కడి స్టాఫ్ ని అడిగితే, ఆయన “కం విత్ మీ” అని మమ్మల్ని అక్కడికి ఒక వందమీటర్ల దూరంలో ఉన్న మరో చోటికి తీసుకు వెళ్ళి – “ఇక్కడ వస్తాయి ఆ బస్సులు. మా డిస్ప్లే లో ఏదో సమస్య ఉంది” అన్నాడు!!! ఎంతైనా, చూపిస్తాడు అనుకున్నా కానీ, ఇలా నడిపించి దింపుతాడు అనుకోలేదు!! 🙂

2) ఇక్కడ సైన్స్ ఫిక్షన్ పుస్తకాల కోసం ప్రత్యేకం ఒక షాపే ఉంది!

3) మాల్మో స్వీడెన్లో కెల్లా అత్యంత కాస్మపాలిటన్ నగరం అంటే ఓహో అనుకున్నాను కానీ, నిజంగానే అలాగే ఉంది, కనీసం నేను తిరిగిన ప్రాంతం. రకరకాల ముఖాలు, రకరకాల దేశాల రెస్టారెంట్లు వగైరా అడుగడుక్కీ కనిపించాయి.

4) బస్సుల్లో టికెట్లు కొనే పద్ధతి లేదు 😦 మా ఊళ్ళో ఐతే ఎంచక్కా బస్సుల్లో డ్రైవర్లు టికెట్లు ఇవ్వకపోయినా, మషీన్లు ఉంటాయ్.

5) డిజైన్ ఔత్సాహికులకి ఇక్కడ మంచి కాలక్షేపం అవుతుందనుకుంటాను.

6) ఇక్కడో రకం ఫలాఫెల్! ఫలాఫెల్ తో మా ఊళ్ళో మిరపకాయలు ఇవ్వరు. ఇక్కడ ఇస్తారు. నాకెందుకో గానీ, సమోసాతో మిరపకాయలిస్తారు హైదరాబాదులో కొన్ని షాపుల్లో…అది గుర్తొచ్చింది :)) 😛

(ఫొటోలు కొన్ని తీశా కానీ, అబ్బే, నాకు ఏదీ పెద్ద గొప్పగా అనిపించలేదు. అందుకని ఏదీ పెట్టట్లేదు!!)

Advertisements
Published in: on November 1, 2011 at 1:36 pm  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/11/01/malmo/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. 🙂 ఫోటోలు పెట్టాల్సింది .. మేమూ చూసేవాళ్లం గా.. ఒక బోరింగ్ సిటీ ని..

 2. సౌమ్యగారు, మీ బ్లాగు తరచుగా చూస్తుంటాను. మీరన్న మాట నిజం. మాల్మో పరమ బోరింగు సిటీ. (నేను పక్కనే వున్న కోపెన్ హాగెన్ లో వుంటాను లెండి.) అయితే Tarning torso చూడటానికి మాత్రం ఓసారి వెళ్ళాను. అలాగే క్రూయిజ్ షిప్ / ఫెర్రీ లో నుండి ఓరెసుండ్ జలసంధి చూడటం బావుంటుంది. ముఖ్యంగా ఈ సీజనులో, బాగా పొగమంచు వున్నప్పుడు.

  -ఫ్రసాదం

 3. Sowmya, the train from Copenhagen goes further to Lund, a university town that is more interesting than Malmo. Of course, Copenhagen city is a much more better choice if you have not seen it earlier.

  బస్సుల్లో టికెట్లు కొనే పద్ధతి లేదు: ఎన్నో నగరాలలో బస్సులో మషీనులు ఉండవు, దగ్గరలోనే ఉన్న తబాక్/న్యూస్ పేపర్ దుకాణాలలో కొనుక్కోవాలి. అప్పుడప్పుడూ తనిఖీ చేస్తుంటారు, టికెట్ లేకపోతె భయంకరమయిన జరిమానా విధిస్తారు.

  నాకు తెలిసి ఉచిత ప్రయాణం ఐరోపాలో ఎక్కడా లేదు. నా ఉదేశ్యంలో మీ అదృష్టం బాగుండి మీరు పట్టుబడలేదు..

  PS: మాల్మో గురించి నాకు తెలీదు. నేను రెండు సార్లు వెళ్ళినా ఎప్పుడూ బస్సు ఎక్కలేదు.

 4. @Jai: Firstly, I went there for some work. Not because I was dying to see how Malmo looks 🙂

  Regarding the tickets: Did I mention anywhere that I travelled for free anywhere?? Do you think people are so dumb that they expect free travel??

  There are many cities where they sell tickets in the bus too. Atleast in the places where I went, I have been fortunate enough to see either Machines or Drivers selling tickets… or an indication that you should buy tickets outside. Over here, such indications were not obvious. This was what I was trying to say here. This does not necessarily mean that I travelled ticket-less anywhere. Thanks for your sympathies anyways.

 5. Sowmya, I was not being critical, sorry if it sounded rude.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: