సుగంధ ద్రవ్యాల దొరసాని

ఆ మధ్య ఒక వారాంతంలో, జర్మన్ టీవీలో డబ్బింగుతో ఒక సినిమా చూశాను. నేను చూసేసరికి సగం సినిమా అయిపోయింది. నాకు కనిపిస్తున్న దృశ్యం – ఐశ్వర్యారాయ్, పండు మిరపకాయలూ, కుప్పలు తెప్పలుగా పసుపు, నువ్వులూ వంటి ఇతర దినుసులూ, గాజు డబ్బాలతో నిండిపోయిన అల్మారాలూ…. కాసేపు పచారీ కొట్టులా, కాసేపు ఆయుర్వేద వైద్యుడి ప్రయోగశాలలా – ఇలా రకరకాలుగా అనిపించసాగింది. మధ్యలో జర్మన్ డబ్బింగ్ ఒకటి. ఐష్ చూస్తే, మామూలు చీర కట్టుకుని మేకప్ కూడా లేనట్లు ఉంది. ఇలా సగం సినిమా చూసేసరికి అసలేమిటీ సినిమా? అని కుతూహలం మొదలై, మళ్ళీ యూట్యూబులో వెదికి చూశాను. (Mistress of Spices – అన్నది సినిమా పేరు. ఆసక్తి గలవారు యూట్యూబులో చూడగలరు)

(వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే, వీళ్ళ టీవీలో ఆంగ్ల సినిమాలతో పాటు, మన బాలీవుడ్ సినిమాలు కూడా జర్మన్ డబ్బింగ్ తో వేస్తారు. కానీ, పాటలు మాత్రం హిందీలోనే వచ్చి జర్మన్ సబ్ టైటిల్స్ తో వస్తాయి!)

ఈ సినిమా అంత వెరైటీ కథ సినిమాగా వచ్చినందుకు నాకు చాలా గొప్ప ఆనందంగా ఉంది కానీ, ఇంత వెరైటీని “భారతీయత”గా అర్థం చేస్కుంటారా ఏమిటిప్పుడు హాలీవుడ్ వాళ్ళు? అని సందేహం అప్పట్నుంచీ పట్టి పీడిస్తోంది. ప్రతి భారతీయుడిలోనూ ఒక మాంత్రిక శక్తి ఉండటం ఏమిటో, అది వాడు ఎక్కడికి పోయినా వాడి వెంటే పోవడం ఏమిటో. పండు మిరపకాయలు కీడును శంకించిన ప్రతిసారీ ఐశ్వర్యకు వార్నింగ్ ఇవ్వడం ఏమిటో, తమను నిర్లక్ష్యం చేసిందని చెప్పి ఈ సుగంధద్రవ్యాలన్నీ కలిసి ఐశ్వర్య పై కాక, ఆమె కస్టమర్లపై పగ తీర్చుకుని వాళ్ళని కష్ట-మర్లు చేయడం ఏమిటో. కష్టంస్ అండ్ ట్రెడిషన్స్ – అని పేరు పెట్టాల్సింది అసలు సినిమాకి.

ఏ మాటకామాటే గానీ, నాకు మాత్రం కాన్సెప్టు తెగ నచ్చింది. మామూలుగా నాకు అలాంటి ఫాంటసీ కథలంటే ఉండే ఇష్టం దీనికి కారణం. సినిమాలో ఫొటోగ్రఫీ భలే ఉంది. ముఖ్యంగా ఐష్ కంటే అందంగా కనబడ్డవి సుగంధ ద్రవ్యాలే. ఆ దుకాణం సెట్టు భలే వేశారు. అదొక రంగుల కల! పండు మిరపకాయలని అంత అందంగా చూపించొచ్చా? అనిపించింది. రేప్పొద్దున్నే నేనూ అలాంటి షాపులో అసిస్టెంటుగా అన్నా చేరిపోవాలి అనిపించింది. ఎంచక్కా, నాతోనూ లవంగమూ, జీలకర్రా, పసుపూ, మిర్చీ అన్నీ కబుర్లాడితే – ఇంక మనుషుల్ని వదిలేసి అక్కడే సెటిల్ ఐపోదాం అని కూడా అనిపించింది.

ఎర్ర చీరతో అష్ ఎర్ర మిరపకాయలపై పడుకుని ఉండే దృశ్యం చూసి ఆ క్రియేటివిటీ కి నాకు నోటమాట రాలేదంటే మీరు నమ్మాలి. తప్పదు.

ఈ కథ చాలా వెరైటీగా ఉంది కానీ, ఇలాంటి సినిమాలో, బాలీవుడ్ స్టైలు సినిమాలో మాత్రమే భారతీయత అనుకుంటున్నారేమో బయట అని నాకు మహా అనుమానం కలుగుతోంది ఈ మధ్య. అందువల్ల, దీన్ని నేను విదేశీయులకి చూపించను. స్వదేశీయులకి మాత్రం వెరైటీకోసం చూడమని చెబుతాను. మేకప్ లేని అష్ ఈ సినిమా ప్రత్యేకత. తీసింది విదేశీయుడే కానీ, భారతీయురాలిని (గురిందర్ చదా) ని పెళ్ళాడిన వాడు. ఈ సుగంధ ద్రవ్యాల దొరసానులను తయారు చేసిన “ఫస్ట్ మదర్” (జోరా సెహ్గల్) వీళ్ళకి వాటి శక్తి గురించి చెప్పే మొదటి కొద్ది నిముషాలూ మాత్రం చూసి తీరాల్సిందే! ఇంతటి వెరైటీ ఆలోచనలు మనవాళ్ళకి రావడం చూసి నాకు గర్వంగా ఉంది! ఇందులో ఎలాంటి శ్లేషలూ గట్రా లేవు. అసలుకి మన వేల ఏళ్ళ చరిత్రలోంచి రకరకాల వెరైటీ కథలు పుట్టించవచ్చు – కానీ, ఎందుకు ఎప్పుడు చూసినా కొన్ని రకాల కథలే కనిపిస్తాయి? అని కొన్నేళ్ళ బట్టీ నాకు అనిపిస్తూ ఉండేది. వెరైటీ కోసం, ఇలాంటి కథలు అవసరం అనమాట!

చిత్రా బెనర్జీ దివాకరుని గారి నవల ఆధారంగా తీశారట.నవల చదవాలి ఎప్పుడో వీలు చూశుకుని. ఆ సుగంద ద్రవ్యాలు పగతీర్చుకోవడం, హెచ్చరించడం, ఎర్ర మిరపకాయల కళ్ళలోని ఎరుపు, గగ్గుర్పాటు, మిడిసిపాటు వగైరాలు అన్నీ అక్షరాల్లో ఎలా చూపారో అన్న కుతూహలం…

Published in: on August 25, 2011 at 2:09 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/25/mistress-of-spices/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. మితో పెద్ద చిక్కు సౌమ్యా! మీ శ్లేషతో కూడిన విశ్లేషణలు చదివి, వాటికి బందీలమయిపోతూ ఉంటాం. ఏదైనా నచ్చింది అని మీరు రాసినా మళ్ళీ వెనక్కి వెళ్ళి టపా మొత్తం చదివి “ఇంతకీ ఈవిడకి ఇది నచ్చిందా? లేదా??” అనుకోవాల్సి వస్తోంది. హ్మ్మ్.. ఈ ప్రోమో చూసినప్పుడల్లా ఐశ్వర్య, మిరపకాయలు, అందమైన హీరో ని చూసి ఈ సినిమా చూసెయ్యాలి అని అనుకుని మిస్ అయ్యాను. ఇవాళో, రేపో చూసెయ్యాల్సిందే.

  2. అద్భుతంగా విశ్లేషించారు. వెంటనే చూడాలని వుంది. రాత్రికి చూస్తాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: