రామ రామ రామ అనే రాజమందిరం…

పొద్దున్నుంచి నేను రెండు పాటలు అదే పనిగా వింటూనే ఉన్నాను. అవి –

1) ఇది పట్టాభి రాముని ఏనుగురా
2) రామ రామ రామ అనే రాజమందిరం
(శ్రీరామరాజ్యం సినిమాలోవి)

రెండూ పాడింది ఒకమ్మాయే. నాకు చాలా నచ్చేసింది పాడిన విధానం. ముఖ్యంగా రామరామ… పాటలో బాలరాముడి గురించి రాసిన పదాలు ఆ ట్యూన్ లో వింటూంటే అదో రకం “వైబ్రెషన్” పుట్టింది. అదే, “పరవశం”. బాలరాముడి గురించి తక్కిన సినిమాల్లో కూడా పాటలున్నాయి కానీ, ఈ పాట జొన్నవిత్తుల గారు కృష్ణుడి గురించి యశోధ చెప్పినంత పరవశంగా రాసినట్లున్నారు 🙂

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం.

-అన్న దగ్గర వెనుక నేపథ్యంలో వచ్చే ఘల్లు ఘల్లులకి ఇక్కడ నా గదిలోనే తిరుగాడుతున్నట్లై ఒళ్ళు ఝల్లుమనడం అతి-వర్ణన కాదు. మరి, నాలాంటి మనిషికే ఇలా ఉంటే, రాముడంటే భక్తి ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో! (నాక్కాస్త ఊహాశక్తి ఎక్కువ లెండి!!)

ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట
ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట
బాలరామునల్లరంటే వశిష్టుడికి ఇష్టమంట

బాలరాముడి అల్లరి వశిష్టుడికి ఇష్టం అన్న విషయం మీరెప్పుడన్నా విన్నారూ? 🙂

బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట
వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట
సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట
ఖర్జురాలు, ద్రాక్షలూ ఉడతలకే పెడతడంట

దాక్కుంటడంటా, సెట్టు సాటుకెళ్ళీ
రాళ్ళేస్తడంటా చెరువులోన మళ్ళీ
అమ్మా నాన్నా అంతా ఆ అల్లరి మెచ్చుకుని
బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంటా..

పాలబువ్వ తినమంటే మేడపైకి పరుగులంట
పసిడి బిందె లోని పన్నీరు ఒలకబోస్తడంట
సందమామ కావాలని సందెకాడ గొడవంట
అద్దములో చూపిస్తే సంచిలోన దాచెనంట

– హహహహహ! అద్దం సంచిలో దాచాడంట రాముడు!! ఎంత చక్కగా రాసారో. మొత్తం సీను కళ్ళ ముందు కదలాడుతోంది. చక్కగా తెలుగులో తెలుగు సినిమా పాటలు వినడం కూడా ఓ మహద్భాగమే!! జొన్నవిత్తుల గారికి సాష్టాంగ నమస్కారం! ఇంత అలతి పదాలలో బాలరాముడిని కళ్ళకు కట్టేలా చూపినందుకు!


శ్రీరాముడైనా చిన్నప్పుడూ ఇంతే
ఆకాశమంటే అల్లరి చేసాడంట

-అంటూ లవకుశులు అమ్మకి చెప్పే కథన్నమాట ఇది ఇంతకీ! భలే రాశారు, పిల్లల వయసుకి తగ్గట్లు! 🙂

రాన్రాను, సినిమా గురించి అంచనాలు కలుగుతున్నాయి (ఆశ పడితే భంగపాటుకూ సిద్ధం కావాలి!). ఈ రెండు పాటలు ఎలా తీశారో చూడ్డం కోసమైనా సినిమా చూడాలి. అసలుకే బాపు గారు సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం లో పద్యాలు అవీ తీసిన తీరుకి అప్పట్లో నేను పరమ వీర ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమా కూడా అంతే సరళంగా ఉంటుందని ఆశిస్తూ……. మరో పాట గురించి మరోసారి.

Advertisements
Published in: on August 17, 2011 at 11:57 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/17/ramarama-sriramarajyam/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. ఇది ఆ ఆల్బం లో నాకు అన్నిటికన్నా నచ్చిన పాటండీ. ముఖ్యంగా బాల రాముని అల్లరి చేష్టల్ని రామాయణ ఘట్టాలని గుర్తుకు తెచ్చేలా రాసిన జొన్నవిత్తుల గారికి జేజేలు.

  బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట – వానర సేన కు సూచన
  వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట – కాకి పైకి దర్భ విసిరే ఘట్టం
  సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట – శబరి
  ఖర్జురాలు, ద్రాక్షలూ ఉడతలకే పెడతడంట – వారధి కట్టే వేళ ఉడత సాయం

  దాక్కుంటడంటా, సెట్టు సాటుకెళ్ళీ – వాలి ని చెట్టు చాటు నుంచి కొట్టడం
  రాళ్ళేస్తడంటా చెరువులోన మళ్ళీ – లంకకు వారధి
  అమ్మా నాన్నా అంతా ఆ అల్లరి మెచ్చుకుని
  బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంటా..

 2. శంకర్ గారూ ఈ పాటలో ఇంత అర్థం ఉందా!…బలే చెప్పారు.

  నాక్కూడా ఈ పాట బాగా నచ్చింది.

 3. seetha seemantham song kooda baavundandi …kashmir nundi kumkuma puvvu kaavilla tho techhaaru ani,bhale chamatkaram gaa raasaaru…

  kalaya…nijamaa ani anjaneyudi meeda song highlight…
  aa naadu laxmanudu alaa anukunnaado ledo kaani gaali,neeru song superr…
  vendi terapi bapu elaa teesaaro srikanth elaa chesaado kalla mundu kanapadutundi

 4. @Shankar : మీరు చెప్పేదాకా అలా ఆలోచించనే లేదు నేను! నెనర్లు!
  @Siva: ఇంకా సీతా సిమంతం పాట సాహిత్యం వినలేదు. అసలా పాటే ఇంకా రెండోసారి వినలేదు. విని నాకేమనిపించిందో చెబుతాను.

 5. సౌమ్యా, ఈ పాటల గురించి నీకు అనిపించిన విషయాలు నువ్వు వ్రాసుకుంటే చదవడానికి బాగుంది.
  శ్రీరాముడి పాటల గురించి నేను కొన్నాళ్ళ క్రితం వ్రాసుకున్న విషయాలు గుర్తు చేసుకుని చదువుకున్నాను.
  నీ ఆలోచనలను ఆస్వాదిస్తూనే, నాకు బాలరాముడి మీద ఓ ఏడాది క్రితమే తెలిసిన పాట “రామభద్ర రారా” మొదటి సారి వింటున్నప్పుడు నాకు కలిగిన భావాలు గుర్తుకు వచ్చాయి.
  అందులో “పట్టరాని ప్రేమ నా పట్టుగొమ్మ రారా, గట్టిగా కౌసల్యకు ముద్దుబెట్ట రారా”, “ముజ్జగంబులకు ఆది మూల బ్రహ్మ రారా, గజ్జెల చప్పుళ్ళు ఘల్లు ఘల్లుమన రారా” అన్న వాక్యాలు నన్ను కట్టి పడేశాయి. చిన్ని కృష్ణుడి మీద ఉన్నన్ని పాటలు శ్రీరాముడి(బాల్యం) మీద ఉన్నట్టు తెలియదు నాకు. అందుకని కూడా చాలా గొప్ప నిధి దొరికిన భావన కలిగింది నాకు ఆ పాట వింటున్నప్పుడు.
  Thanks, బాగా అనిపించింది ఈ టపాలు చదువుతుంటే. ఈ సినిమా గురించీ ఆసక్తి పెరిగింది.

 6. […] గురించి సౌమ్య రాసిన టపా ఇక్కడ – సౌమ్య –రామరామ  ). ఈ పాటలోనూ ట్యూను హుషారుగా […]

 7. […] గురించి సౌమ్య రాసిన టపా ఇక్కడ – సౌమ్య –రామరామ  ). ఈ పాటలోనూ ట్యూను హుషారుగా […]

 8. అన్నమయ్యలు, గామదాసులూ, శ్రీరామరాజ్యాలూ, కోటీశ్వరరావు గారి ప్రవచనాలూ…జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తున్నాయి. సౌమ్య గారూ ఈ టపాకి వేల వేల నెనర్లు! లలిత గారూ మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. “రామభద్ర రారా” లాంటివి వింటేనేగాని బాలరాముడి మీద అన్ని పాటలు ఉన్నాయనే తెలియదు…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: