నిశ్యాలోచనాపథం – 28

(ప్రాచీనులకు -మకాం మార్చక ముందు, మార్చిలో వచ్చిన ఇరవై ఏడో భాగం ఇక్కడ చదవండి. నవీనులు – ఇక్కడికెళ్ళి, చివరి నుంచి మొదలుపెట్టండి, ఓపికుంటే!!)

******************
“అంతర్మథన పర్యంకంపై తిరుగుతున్న పంకాని నొక్కిందెవరు, దాని మీట చెక్కిందెవరు?” (‘మో’ నిషాదం) – అన్నట్లు, తాను తాడు తెగినా బొంగరమైనా, మనల్ని బొంగరంలా తిప్పేసే ప్రేమను వెంటాడేదెవరు? దాని పీక నొక్కేదెవరు?”
– నేనూ, నిశీ నదీ తీరంలో వెన్నెల నీడల్ని చూస్తూ ఉండగా, హఠాత్తుగా తానంది. నాకు మొదలు అసలు “మో” గారి కవిత్వమే అర్థం కాక గిలగిల్లాడుతున్నా. ఇక ఈవిడ ఆయన స్పూర్తితో మొదలుపెడితే, గిలగిలలతో పాటు, విలవిలలు కూడా కలిసి, అక్కడ నా అయోమయ భావోద్వేగాల శివతాండవం ఖాయం! కానీ, ఈవిడ ఆగేలా లేదు.

అసలు జరిగిందేమిటంటే, అతగాడు ఆరోజు వస్తూ ఉంటే, నాకు ఆగ్రహం, నిశి కళ్ళలో ఆరాటం ఒకేసారి కలిగాయని చెప్పా కదా (27వ భాగంలో!). అతగాడు దగ్గరికి రాగానే, నేను తనని కడిగిపారేద్దాం అనుకుని, షర్టు చేతులు మడత పెట్టుకునేంతలో, అతను వచ్చి “నిశీ….” అన్నాడు. ఆ దిక్కుమాలిన పిలుపులో ఏం ప్రేమ కనిపించిందో కానీ, ఈవిడ మహా పరవశంగా, “ఎలా ఉన్నావు?” అంది. “నేను బాగున్నాను. నువ్వెలా…” అంటూడగానే,
“నువ్వు చేసిన మోసం మాకు అర్థమైపోయింది. ఇంక ఈ నాటకాలు ఆపు” అన్నాన్నేను కోపంగా.
“ఆ…అదీ…అది కాదు. ఏదంటే…. ఎందుకంటే… అసలు నేను…. నిజానికి… నిశి అంటే నాకిష్టం. తన్ని మోసం చేయాలి అనుకోలేదు. తనకి దగ్గరవ్వాలనీ…”
“ఇదిగో చూడూ, వెధవ వివరణలివ్వక, దయచేయిక.”
“కొన్ని వందల సంవత్సరాల నా ప్రేమ….”
“వందా లేదూ బొందా లేదు….వెళ్ళిక” అన్నాన్నేను కటువుగా, ఇక వెళ్దాం అని వెనక్కి తిరుగుతూ.
“నిశీ, ప్లీజ్…” అన్నాడతను నన్ను పట్టించుకోకుండా.
“అరే! చెప్తున్నానా!” అంటూ నేను కోపంగా వెనక్కి తిరుగుతూ, దారిలో నిశి వంక చూశాను. ప్రమాదం శంకిస్తూ అతని వంక చూశాను. నేను కలుగజేసుకునేంతలో ఇద్దరూ కౌగిలింతలో ఉన్నారు!!

ముందెలా ఉన్నా, ఈమెతో తిరుగుడు మొదలయ్యాక, నాకు చిర్రెత్తడం మొదలైంది ఇలాంటివి చూస్తే. “నిశీ!” అని అరిచాను. నా ఊహా జగత్తులో “శారదా!” అని అరుస్తున్న శంకరశాస్త్రి గారు కనిపించారు. “శుద్ధ ఏకాకితనంలో ఈ జంట-తనం ఏమిటీ??” అని అరిచాను. “నిజమే, ఏకాకితనంలో జంట తనం ఏమిటి….అసలా పద ప్రయోగం ఏమిటి?” అని మధ్యలో జీ..అలియాస్ కా.పు. కలుగజేసుకుని, సర్దిచెప్పబోయాడు. “ఆహా! నువ్వు చెప్పు అసలు పదం ఏమిటో. హూ…చెప్పు!” అని హుంకరించాను. “అదీ….. ఏకాకితనంలో …. జంటతనం ఏమిటి… అహ…కాదు కాదు. కొంటెతనం… అహ కాదు… పెంకితనం!” అంటూ ఏదో వాగడం మొదలుపెట్టాడు కాపు. “చాలాపు!” అని అరిచి…”నిశీ, ఇతనితో తిరగడం నీ వెర్రితనం.” అన్నాను.

నిశి నిస్సహాయంగా నన్ను చూసింది. నెమ్మదిగా తలవంచుకుంది. అప్పుడే గమనించా, కౌగిలి వీడినా, ఇంకా చేతులు కలిసే ఉన్నాయని. ఇన్నాళ్ళూ నేను అజేయురాలనుకున్న నిశి..అందర్నీ అదుపుచేయగల నిశి…కా.పు. కి లొంగిందా! నేనింకా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే “బీప్..బీప్..” అంటూ ఫోను. కా.పు. ది. అతను హడావుడిగా “ఆ..సరే, ఇప్పుడే వచ్చేస్తున్నా!” అని ఫోను పెట్టేసి, “నేను మళ్ళీ కలుస్తా నిశీ…అప్పుడు అంతా వివరంగా చెబుతాను.” అనేసి, మరి మాట్లాడకుండా, మాకూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, వెళ్ళిపోయాడు. అదిగో, అప్పుడే నేనూ, నిశీ మౌనంగా నడవడం మొదలుపెట్టి, మౌనంతో పాటు నడిచి…ఈ నది దగ్గర తేలాము. “కాసేపిలాగే కూర్చున్నాక, “ఏమిటి నిశీ….ఇంత జరిగాక కూడా ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావా?” అని అడిగా, కాస్త విసుగ్గానే.

“నా…నా… పరుగుతీసినా… నా…నా… వదిలిపెడుతునా…” అంటూ కూనిరాగం తీసింది నిశి.
“ఎవరు పరుగుతీస్తూంటే ఎవరు వెంటప్డుతున్నారు? నువ్వు పరుగుతీస్తూంటే కాలపురుషుడా? అతను పరుగుతీస్తూంటే నువ్వా? మీ ఇద్దరి వెంటా ప్రేమా? నువ్వు అతనివైపుకి వెళ్తూంటే అడ్డు పడుతూ నేనా?”
“జీవితం” వెన్నెల్లో మెరిసే నీటిని చూస్తూ చెప్పింది నిశి.
“మళ్ళీ నా!” అని నేనేదో అనబోతూ ఉండగా, నీటిలో ఓ నీడ.
“వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా, ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా….షై నననన షై నననన షై నననన…” అన్న పాట హమ్ముతూ, వెనుక ఒక నిలువెత్తు ఆకారం.
ముందు చూసిన ఆకారమే కనుక, పోల్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. చూడగానే విరక్తి పుట్టించే ఆ జగన్మోహనాకారుడే జీవితం. (అతనెలా ఉంటాడో తెల్సుకోవాలంటే ఇరవైమూడో ఎపిసోడ్ చూడుడు). అయితే, పోయిన్సారిలా, నిశి అతని మీద పడి, కాలరుచ్చుకుని ఎడా పెడా వాయించలేదు. మొదట నిర్లిప్తంగా చూశింది. అతను నవ్వుతూ చూశాడు. తరువాత నిశి వెన్నెల నీడల వైపు చూసింది. నిశి విరుచుకుపడుతుందనో, ఏడుస్తుందనో ఊహించిన అతడు ఏమైందన్నట్లు అయోమయంగా నా వంక చూశాడు. వీళ్ళిద్దర్నీ చూడ్డంలో బిజీగా ఉన్న నాకు ఎలా చూడాలో తట్టలేదు. చివరకి అభావంగా చూడగలిగాను.

“ఏమిటమ్మాయ్ నీ గోల? ఇదివరలో కోరి నీ దగ్గరికి వస్తే, వెంటపడి తరిమి కొట్టావు. ఈ మధ్య నేనెక్కడో తప్పుకు తిరుగుతూ ఉంటే, “సోకాల్డ్ సోలుమేటు కోసమేల ఈ వేటా..” అని మంచి చెప్పినా వినలేదు. “మసక మసక ఎండలో, మంచులాగ కరగక, శాశ్వత బంధం మనకెందుకూ?” అని బ్రతిమాలాను. “అనుభవాల కొలనులో, చేపలాగ ఈదక, పసిఫిక్ సంద్రం గొడవెందుకు?” అని మొత్తుకున్నాను.అయినా, వినకుండా వెంటపడ్డావు. సరేలే, పాపం అనుకుని, ఇంత దూరమూ నడిచొచ్చాను, నీకోసం!.” అంటూ ఆవేశంగా జీవితం జీవన విద్య సెషన్ పెట్టబోతూ ఉండగా,

“బస్సుల్లేవా? మీ ఊళ్ళో కూడా ఎప్పుడూ స్ట్రైకులా?” అన్నది నిశి, అందాకా నిర్లిప్తంగా ఉన్నదల్లా.
ఆ ప్రశ్నకు జీవితమే అవాక్కైందంటే, నేనెంత!
“నీకోసం ఇంత దూరం వస్తే, నువ్వడిగేది ఇదా?”
“నాకు నువ్వంటే బోరు కొట్టేసిందోయ్. నేను వెంటపడగానే నువ్వు తోకాడించుకుంటూ వచ్చేయడం నాకు నచ్చలేదు. చలే జావ్ యహాసే!” అని నిశి లేచి, నడవడం మొదలుపెట్టింది. అదే క్షణంలో, నేను లేవబోవడం, నా వెనుక నుండి జీవితం నిశి వెంటపడ్డానికి ప్రయత్నిస్తూ, నేను అడ్డం తగిలి, ముందుకు పడి, నీళ్ళలో పడిపోవడం… లిప్తపాటులో జరిగిపోయాయి.
“వాడిని ఈదేందుకు మనకి ఈతరావాలి కానీ, అసలు వాడికి ఈతొచ్చో లేదో!” అంది నిశి, నిర్వికారంగా.
ఇంతలో నీట్లో బుడగలు. నిండా మునగబోతున్న జివితం. నాకు ఈతరాదు. నిశికి వచ్చినా ఏం చేస్తుందో తెలీదు. ఏం జరుగుతుందో! అనుకుంటూ ఉండగా, జీవితం చెయ్యి మాత్రం పైకి కనిపించడం మొదలైంది. వెంటనే, నిశి, చేయి పట్టుకు లాగి అతన్ని ఒడ్డుకు చేర్చి బ్రతికించింది. అతను ఉప్ఫూ ఉప్ఫూ అని ఆయాసపడుతూ ఊపిరి పీలుస్తూ ఉండగా,
“చెంచాడు భవసాగరం కూడా ఈదలేని నువ్వు, మమ్మల్ని తిప్పలు పెడతావా? అని అడుగుతున్న నిశి పకపకలు నెమ్మదిగా సన్నబడుతూ ఉండగా, సూర్యుడు మొహం మీద కొట్టడంతో మెలుకువొచ్చింది.

*************
కొత్తపాళీ గారి ఎంక్వైరీ వల్లే మళ్ళీ నిశ్యాలోచనాలు మొదలుపెట్టా కనుక, వారికి థాంక్స్!

Published in: on August 12, 2011 at 1:16 pm  Comments (3)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/12/nisyalochanapatham-28/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. >> గిలగిలలతో పాటు, విలవిలలు కూడా కలిసి, అక్కడ నా అయోమయ భావోద్వేగాల శివతాండవం ఖాయం!
    >>నేనూ, నిశీ మౌనంగా నడవడం మొదలుపెట్టి, మౌనంతో పాటు నడిచి…
    >>జీవితం జీవన విద్య సెషన్ పెట్టబోతూ
    >>నేను వెంటపడగానే నువ్వు తోకాడించుకుంటూ వచ్చేయడం నాకు నచ్చలేదు. చలే జావ్ యహాసే!”
    >>వాడిని ఈదేందుకు మనకి ఈతరావాలి కానీ, అసలు వాడికి ఈతొచ్చో లేదో!
    >>చెంచాడు భవసాగరం కూడా ఈదలేని నువ్వు, మమ్మల్ని తిప్పలు పెడతావా?

    ఏంటి? ఈ రాతలెంటీ????? ఇలా ఎన్ని సార్లు చదివినా మళ్ళీ చదవాలానిపించేలా? చదివిన ప్రతి సారీ కొత్తగా అనిపించేలా రాయటం ఏమిటీ????? అని నేను అడుగుతున్నాను. ఇలా ఫిలాసఫీ ని హాస్యం లో కలిపి వడ్డించేస్తే ఏంటర్ధం??? సమాధానం చెప్పాలి.! (నా భావోద్వేగాల శివతాండవం :P)

    యాజ్ యూజువల్ – కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ 🙂 keep going!

    ఇట్లు,
    నేను (నిశి ఫ్యాన్).

  2. No thanks needed, but I am very glad you started the series again

  3. […] చాన్నాళ్ళక్రితం రాసిన 28వ భాగం ఇక్కడ. […]


Leave a comment