మంచమ్మాయ్ నా దిగులు పోగొట్టిన విధంబెట్టిదనిన….

ఆర్యులకు ప్రణామములు. ఇచ్చట ప్రస్తావించబడుతున్న మంచమ్మాయ్, “ఖలామందిర్ ప్రేమతో మీ లక్స్-మి” టాక్ షో నిర్వహించు మంచు లక్ష్మీ ప్రసన్న. మీరు వేరెవరికోసమైననూ గాలించుచున్నచో, ఈ గాలి “గాలీ”లు మీరు భరించజాలరు కావున, ఇప్పుడే పక్కకు తప్పుకొనుడు.

అసలు నాకు ఫస్టు ఫస్టు మొదలయ్యే అనుమానం ఏమిటీ అంటే, ఈవిడ ఎంటర్ అవుతున్నప్పుడు నేపథ్యంలో “లక్సు పాపా లక్సు పాపా” పాట పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు వీళ్ళకి? అని. మరి, లక్స్-మి లక్స్-మి అనే అంటుందిగా. కనుక, లక్సుమి…అన్నట్లేగా?? ఇంతకీ, నిన్న ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా, ఇండియాలోని ఒక స్నేహితుడితో చాట్ చేస్తూ ఉంటే, అతను “మంచు లక్ష్మి షోలో చిరు వచ్చాడు” అన్నాడు. కుతూహలం కొద్దీ, ఇంటికెళ్ళాక చూస్తే, అప్పుడే ఆ ఎపిసోడ్ ఆన్లైన్లో లభ్యం! ఏమైనానూ, అభిమానం అంటే ఇదీ. తోటి తెలుగువారు ఈ అద్భుతానుభవం కోల్పోకూడదని ఎంత తాపత్రేయమో ఆ అప్లోడ్ చేసిన వారికి. వారికి నా నమో వాక్కములు ఇవే.

సరే, షో మొదలైందా…ఈవిడ కూడా “పాడుతాతీయగా”కి ఎస్పీబీ ఎలాగో, తాను ఈషోకి అలా అని భావిస్తోందో ఏమిటో కానీ, ఒక మంచునీతి సూత్రం మంచినీళ్ళప్రాయంగా మనపై వదిలేసి, షో మొదలుపెట్టింది. (దీని ముందు ఎపిసోడ్ బాలు గారితోనే అట! ఓపెన్ చేయగానే, నా తెలుగు దారుణంగా ఉంటుంది..ఏమీ అనుకోకండి అని ఈవిడ అనడం. మాట్లాడుతున్నావ్ కదా, అది చాలన్నట్లు ఆయన అనడం చూసి, హతోస్మి అనుకున్నా.)

చిరంజీవి వచ్చాక, ఈవిడ భాషలో ఆయన్ని పొగిడిన తీరు చూసి, నాకు కళ్ళు చెమర్చాయి. ఇక, వీళ్ళ కబుర్ల సంగతి ఒక ఎత్తు కానీ, కాసేపు చూశానా, ఒక్కొక్కళ్ళ అతి-నటనకి, అసలా ఓవర్-ఆక్షన్ అన్న పదం కూడా, “చీ పోదురూ, వాళ్ళతో పోలిస్తే నేనెంతా?” అని సిగ్గుతో మెలికలు తిరిగిపోతుందేమో అనిపించింది. ఈ సందర్భంగా, అల్లు అర్జున్-మంచు లక్స్-మి ల మధ్య జరిగిన చిక్కటి తెలుగు సంభాషణ కూడా విని నా చెవి తుప్పు వదిలించుకోవాలన్న ఆలోచన కలిగింది. చూద్దాం ఏమవుతుందో. అన్నట్లు, షోలో ఫొను మాట్లాడిన సుమలత, భానుప్రియ, రాధిక – అందరూ బైట తెలుగు బానే మాట్లాడతారు కదా. ఫోనులో అంత ఇంగ్లీషు ఎందుకు వాడారో మరి!

ఆ ఎపిసోడ్ లో మంచు లక్ష్మి నాలుకపై సరస్వతీదేవి ఏడుస్తూ వదిలిన మచ్చుతునకలు:
1) మీరు వొచ్షి పొలం లో నుంచి వొచ్షి ఖాల్లు ఖడుక్కోవాలి.. (ఇలా ఏదో అంటుంది ఏదో సీన్ వర్ణిస్తూ. మీరు గమనించాల్సింది – వొచ్షి, ఖాల్లు అన్న అపూర్వపదాలు)
2) డాడీ హనీని ఒళ్లు మీద కూర్చోబెట్టుకున్నారు (ఒళ్ళుమీద కూర్చోబెట్టుకోడం ఏంటో!)

ఒక పక్క ఇవే చాలవన్నట్లు, ఈ చిరంజీవి కూడా, ప్రతిదానికి వివరంగా జవాబులివ్వడం ఒకటి. మాట్లాడమంటే చాలు…అన్నట్లు ఉంటున్నాడు ఈయన అసలు ఈమధ్య. ఇక్కడే నాకు బాగా నవ్వు తెప్పించిన సంఘటన. ఇందాకటి స్నేహితుడిని పింగి – “చిరంజీవి సంబంధం లేకుండా ఒక గంట సేపు సుత్తేసినప్పుడు నేను ఆడియన్సులో కూర్చుని విన్న సందర్భం ఒకటి ఉంది. మాకు ప్రతిభా అవార్డులు వచ్చినపుడు, మొదటి సంవత్సరం కదా అని హైదరాబాదులో ఫంక్షన్ అదీ పెట్టారు. ఈయన ఒక అతిథి…” అన్నా. “చూశావా, బాగా చదువుకుంటే ఎన్ని కష్టాలో!!” అని అతని సమాధానం!

ఈ సందర్భంగా, నేను ఈ షోలో భవిష్యత్తులో చూడాలి అని అనుకుంటున్న అతిథులు:
1) దేనిగురించైనా, పరుచూరి గోపాలకృష్ణ
2) చిరు కుటుంబం గురించి మాట్లాడే టోన్ లో అశ్వినీ దత్తు
3) బద్రీనాథుడి గొప్పతనాన్ని చెప్పే టోన్ లో లక్స్-మితో మాట్లాడే బ్రహ్మానందం
4) ఎక్కడైనా, ఎప్పుడైనా, సింగిల్ టంగ్, లెజెండు మోహన్ బాబు గారు
5) మోహన్ బాబు, విష్ణు బాబూ, మంచు లక్స్మీ మాట్లాడుతూ ఉండగా, “శివ శివా” అనుకుంటున్న ఏ విశ్వనాథ్ లాంటి వారో …
(ఇక, ఆ తరువాత మంచమ్మాయ్ అంత మంచమ్మాయ్ ఇంకెక్కడా లేదు…అని మీకు అనిపించేస్తుంది ఎలాగో…వీళ్ళ డవిలాగులు కానీ వింటే!)
6) ఈవిడతో పోలిస్తే, చక్కని తెలుగులో మాట్లాడుతూ, ఈమెని సిగ్గుపడేలా చేయగల – నిత్యామీనన్, ప్రియమణి వంటి వారు.
7) ఈవిడకంటే బాగా ఈవిడ్ని అనుకరించగల ఝాన్సీ
8) ఈవిడకే తెలీకుండా, ఈవిడ ముందే పంచ్ విసరగల, విసిరి ఆమెనే నవ్వించగల సమర్థులు (త్రివిక్రం వంటి వారన్నమాట)
9) రోజా
10) జీవిత, రాజశేఖర్
-ప్రస్తుతానికి వీళ్ళే. అన్నీ విన్నాక, ఎంచక్కా శుభలగ్నం లో బ్రహ్మానందం లా ఏనుగు చెవులేసుకుని, జనం చూసేందుకు ఎంట్రీ ఫీ పెట్టి, హౌజ్ అరెస్టు చేసేస్కుని, బోలెడు డబ్బులు సంపాదించొచ్చు.

అసలు విషయం చెప్పనే లేదు కదూ. ఈ షో చూస్తూ ఉంటే, నేనిన్నాళ్ళూ నా జీవితంలో కోల్పోతున్నదేవిటో అర్థమైంది. “నాన్సెన్స్”. నిన్న రాత్రి ఆ భాషా, ఆ యాసా, దాని తాలూకా ఆడియాసల్లో ఉన్న ఆడ లంబాడోళ్ళ రాందాసులా అయ్యి…ఆపై, నిరాశలో పుట్టిన వెర్రి వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించడం ఎంత పెద్ద శ్రమనివారిణో (శ్రమమాయగత్తె అనాలా -శ్రమ మాయం చేసేది అంటే?) మీకు తెలియదు. ఇప్పటి నుంచి మంచమ్మాయ్ కోసం వారంలో ఒకరోజులో కాసేపు తప్పక కేటాయించాలి అనుకుంటున్నా. ఇందుకే, పైన ఆ అప్లోడ్ చేసిన వారికి నమోవాక్కములు అన్నది. వేల సైకియాట్రిస్టులు రోజూ చేస్తున్న పనిని, వీరు ఒక్క సైటుతో చేసేస్తున్నారు కదా! వేలవేల మాయకూచి మంత్రాలు (ఇలాంటి వీడియోలు) కలిస్తే, ఒక పెను మంత్రమవుతుంది అనమాట, బ్రతుక్కి. వేయిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలైనట్లు…

(ఒక ముఖ్య గమనిక: నిన్న ఆ షో, ఆవిడ తెలుగు, షోకి ముందు చెప్పే స్త్రీ-సూత్రం విన్నాక నాకేదో అయిపోయింది. కోలుకునేదాక నన్ను భరించండి…ప్లీజ్!)

Published in: on July 29, 2011 at 4:51 pm  Comments (20)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/29/manchammai-katha/trackback/

RSS feed for comments on this post.

20 CommentsLeave a comment

  1. 😀 😀 😀

  2. priyamani already vachesindandi. mee list lo okaru minus.

  3. అయితే, మిగితా వాళ్ళింకా రాలేదన్నమాట. (లేటరల్ థింకింగ్ అన్నమాట!!)

  4. naaku telisi raaledandi. ayinaa aame maatalu okka nimasham vinaalantene kastamanipistundi naaku. meeku vopika baane vunnattundi.

  5. BTW meeru manchammay gurinchi describe chesina vidhaanam baagundi.

  6. మీరూనాలాగే ఆ వీడియో పెట్టుకుని చూసారా?? హ్హహ్హహహ్హ!!!

    నేను పెద్దగా నవ్వేసింది మాత్రం…నాగబాబు,పవన్ మిమ్మల్ని అన్నయ్య అంటూ భయంగా ఉంటారా…లేకపోతే…’అన్నయ్యా’ అంటూ జాలీగా ఉంటారా అని ఒక “ఖ్వషెన్” ఉంటుంది చూడండీ…అప్పుడు కొంచెం చిన్నపిల్లలా ఎక్స్ట్రాలు చేస్తుంది..నాకెంత నవ్వొచ్చిందో!

    రోజా,పరుచురి బ్రదర్స్ కూడా వచ్చేసారు 🙂

    http://www.meetelugu.com/movies/prematho-mee-lakshi/9618-prematho-mee-lakshmi-with-roja.html

    http://www.meetelugu.com/movies/prematho-mee-lakshi/9132-prematho-mee-lakshmi-with-paruchuri-brothers.html

  7. అదరగొట్టేశారు. నిజ్జంగా సేం ఫీలింగ్. అసలు ఎవరికైనా నాలా లక్స్-మి టాక్ షో చూడలని అనిపిస్తుందా అనుకున్నాను. నా మట్టుకు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ గోల.
    మొన్నామధ్య పాపం ఉపన్యాస చక్రవర్తి వెంకయ్యనాయుడు గారు ఈ షో బారిన పడ్డప్పుడు… “మీరు అప్పట్లో పెద్ద లీడర్ తో గొడవపడి ఓడించారంట నిసమేనా(అచ్చు తప్పు కాదు గమనించగలరు)” అని ఏదో అంతకుముందు ఆయన అబద్ధం చెప్పుకున్నట్టు అడిగింది.
    పాపం పెద్దమనిషి చిరంజీవి నోరుతెరచి అంకులనొద్దన్నా అంకులనే అంటానని ఖచ్చితంగా చెప్పేసింది(అసలు అలీనే అంకుల్ అంటే ఏం చేస్తాం).

  8. absolute non sense is this show..అయిన గాని దాదాపు అన్ని షో లు చూస్తాను ఈ అమ్మాయి వెర్రి ఇంకా ఎంత దాక వెల్లగలుగుతుందో చుద్దాం అని..అబ్బ బాలు గారు తెలుగు మాట్లాడమే ఎక్కువ అని చెప్తే గొప్ప గ ఫీల్ అయింది. ఇక ఈ షో లో కామెడీ కొస్తే ప్రతి షో లో “ఈ షో చాల పొపులర్” అని ఈవిడే సెల్ఫ్ డబ్బా. అల్లు రామయలింగయ్య గారిని మీరు ఏమని పిలుస్తారు మామయ్య గారు అన అని అడిగింది…ఆ ప్రశ్న కి చిరు కూడా షాక్ తిన్నట్టున్నారు..మామయ్య అని కాక ఇంకా ఏమంటారు అని నవ్వుకున్న :)) మల్లి దానికి కవరింగ్ గా సినిమా వాళ్ళు కూడా హుమన్ relation కి వేల్యూ ఇస్తారు అని జనాలకి చెప్పడానికి అని చెప్పింది..ఇప్పుడు కాదని ఎవరన్నారు..షో చూడడం కామెంట్ చెయ్యడం నాకు ఒక వెర్రి ఆనందం ల తయారయ్యింది..నేను ఇలా కామెంట్ లు చేస్తుంటే మా తమ్ముడు ఏమో చూడడం ఎందుకు అక్క nachakapothe అంటాడు.. అసలు ఆ కామెడీ ఎ వేరు..చూడకపోతే ఒక కళాఖండాన్ని మిస్ అయినట్టే :))

  9. హహహ సూపరు
    అరెరే నేను ఈ చిరు ఎపిసోడ్ మిస్ అయ్యాను. అసలు సౌమ్య మీకోటి తెలుసా…వారం లో ఈ ప్రోగ్రాం మంచి రిలీఫ్…రిలాక్షింగ్ గా ఉంటుంది పొట్టచెక్కలయ్యేలా నవ్వేసుకున్నాక.

    అయినా మీకు సరిగ్గా చెప్పడం రాలేదు

    ప్రీమథో మీ లక్స్ మీ…..అనాలి

    అసలు ఝాన్సీ భలే చేస్తుందిలెండి

  10. హ హ నవ్వించి చంపేశారండీ బాబు 🙂 ఆ ఈటీవి సుమన్ ప్రీమియర్లకీ.. ప్రేమథో మీ లక్స్ మీ కీ నాకు తెలియకుండానే ఎడిక్ట్ ఐపోతున్నాను… మాంచి కల్తీలేని కామెడీ కోసం.. అన్నట్లు మోహన్ బాబుతో కూడా చేసిందనుకుంటా.. ఎప్పుడో వీడియో చూసినట్లు గుర్తు..

  11. @indu: అవునండీ… అన్నయ్యా! అని అన్నప్పుడు నేనూ నవ్వేశా పెద్దగా. లింకులకి థాంక్స్. ఇక తదుపరి షో పరుచూరి వాళ్ళదే.
    @సంతోష్ సూరంపూడి: వెంకయ్య గారూ వచ్చారా! అయితే, అది కూడా చూడాల్సిందే. ఏమిటో… వేణూశ్రీకాంత్ గారు అన్నట్లు, మంచమ్మాయ్ అడిక్టివ్.
    @సౌమ్య: కొత్త కదండీ. అయినా, నేను మంచమ్మాయ్ ముఖారవిందాన్ని చూస్తూ, అలాంటివి బుర్రకెక్కించుకోవడంలేదు. ఇక్కడ గుడి కడుతున్నా, నా చిన్న గదిలో.
    @వినీల: అవును, ఈ కామెడీనే వేరు. అదో రకం కామిట్రాజెడీ..ట్రాజికామెడీ…మోక్షగామికామెడీ.

  12. జీవిత, రాజశేఖర్ కూడా వచ్చేశారు ఎప్పుడో! ఇందాకే, ఒకానొక సైటులో లిస్టు పెట్టి ఉంటే చూశా.

  13. She’s such an entertainment.. though, in the wrong sense.

    I wanna see VVS coming onto the show (now that she has anyway got away with Gopichand P)… VVS and Laxmi would be awesome double-some.. full treat…

    నువ్వు మిస్ అయిన అసలు angle ఈ షో లో.. గోపీచంద్ కి, నాకూ ఒకే సారి కళ్ళు తెరచుకున్నాయి.. “మీ లాంటి వాళ్ళను మాట్లాడించి.. sports పై awareness తీసుకురావటమే ఈ షో లక్ష్యం అండ్ బ్లాహ్..” ..ఎంథ భాద్యత చూసావా?

    You’ll know her hindi speaking skills too, which made Saina Nehwal ROFL in the same episode..

  14. మీరు మిష్షయినది ‘నాన్సెన్స్’ కాదండి ‘ఎంటర్టైన్మెంటేమో’..ఆలోఛింఛండీ..:)))
    నేనూ ఇటీవళే ఒఖ షో చూసి ఠరించాను…వచ్చినదెవరో గుర్తురావట్లే..

  15. .. aa gurtochchindi..balu show !!
    ..remembered after reading ur latest post..:)

  16. ఏంటడి షౌమ్యా గారూ, మా మంచమ్మాయి తెలుగుని షర్ఫ్ ఎక్షల్ పెట్టి వాష్ చేషేషారు….:-).
    ఇదే షో ఇది వరకూ జీ తెలుగులో వచ్చేదండి…అప్పుడు ఎపిసోడ్లు గానీ మీరు చూసుంటే రెండు రోజులు వెక్కి వెక్కి ఏడ్వాల్సిందేనండీ…లిటరల్లీ కొన్ని మాటలు బూతులు మాట్లాడుతున్నట్టు వినిపించేవి తన గొంతులో….ముఖ్యంగా అప్పట్లో ఏదో ప్రశ్న అడిగి “ఈఈఈఈఈఈఇ నాఆఆఆఆఆఆఆఆ ప్రష్నకు…” అని ఎస్సెమ్మెస్ ఎలా చేయాలో చెప్పేది….అది విని నేను రెండు చెవులు గట్టిగా మూసుకోవలసి వచ్చింది….

  17. ఈ ఎపిసోడ్ నేను చూసాను..
    “నాకు పిల్లలంటే చాలా ఇష్టం..”, అని చిరంజీవిగారు చిన్నపిల్లల పిట్టకధలు చెప్పేస్తుంటే.. లక్స్ మి.. అడ్డుతగిలి.. అవును మా డాడ్ అంటుంటారు.. మీకెప్పుడు మీకెప్పుడు అని అంకుల్.. అంట.

    అదివిన్న చిరుగారు.. “అవును మరి మీకెప్పుడు”, అంటూ నవ్వుతుంటే.. సిగ్గుపడిపోయి.. మావారినడగాలన్నట్టేదే చెప్పేసిందావిడ.

    అది చూస్తున్న మాకనిపించింది.. అవసరమా ఇదంతా.., ఇది చిరంజీవి అడగటానికి పెట్టిన షోనా లేక సొంత డబ్బాకోసమా.. అవునులే పేరు “లక్స్ మి.. టాక్ షో” అని క్లియర్ గా పేరు పెట్టాకా కూడా సిగ్గులేకుండా చూస్తున్న మనదే తప్పులే అనిపించింది.

    జయప్రదతో జయప్రదం అనే ప్రోగ్రామ్ వచ్చేది అది చాలా బాగుండేది. అలాంటిదే అనుకున్నాం గానీ ఇదని తెలియదు మరి.

    పాపం ఆ తెలుగును తప్పుపట్టకండే.. పళ్ళుమధ్దెన ఖాళీలెక్కువుంటే… గాలిలాగావస్తాయంట మాటలు.. :))

  18. పూర్ణిమ గారి కామెంటు చూసి సైనా,గోపీచంద్ ఎపిసోడ్ ఇప్పుడే చూసాను. ఎక్సర్ సైజుల గురించి మంచమ్మాయి అనర్గళం గా మాట్లాడేటప్పుడు గోపీచంద్ వెర్రి నవ్వు చూసి తీరాలి.

    ఇంకా కామెడీ ఏమిటీ అంటే సింగపూర్ లో ఇండియన్ చైనీస్ ఫుడ్ ఉన్నట్లు ఎక్కడా ఉండదుట……

  19. ఏమండి ఎందుకు మా స్నో లక్ష్మి ని ఆడిపోసుకుంటారు??
    ఈ మీ నాన్న లెజెండ్ కాదనా ??
    తెలుగుని తెల్గు చేస్తుంది అదే తప్పా??
    ఫారెన్ నుంచి వఛిఆ మాత్రం బిల్డుప్ కూడా ఇవ్వకూడద??
    దీనిని నేను ఖండిస్తున్నా??

  20. నాకు అర్జెంటు గా ఎవరైనా ఝాన్సి మంచమ్మాయిని అనుకరించే వీడియో లింకిచ్చి పుణ్యం కట్టేసుకోండి.
    అంఖుల్ అంఖుల్ అని అనేక సార్లు అనిపించేసుకున్నందుకు అలీ మాత్రం ఇంటికెళ్ళి “ఈ షోకెందుకు వెళ్లామురా బాబూ” అనుకుంటూ బాల్చీలకి బాల్చీలు ఏడ్చి ఉంటాడు. అది మరీ అన్యాయం. వీళ్ళిద్దరూ ఒక వయసు వాళ్ళే.


Leave a reply to vbsowmya Cancel reply