స్కూలప్పటి అనుభవాలు

మన “మాయాశశిరేఖ” సౌమ్య గారి బ్లాగులో మొదటి సంఘటన చదివాక, నాకు రెండు చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చాయి. అవి ఇక్కడ పంచుకుందామని…

1) అవి నేను ఐదో తరగతి లో ఉన్నరోజులు. కారణాలు గుర్తులేవు కానీ, అప్పుడప్పుడూ క్లాస్ బయట ఉండే చెట్టు కింద, రెండు మూడు సెక్షన్లకి కలిపి పాఠాలు జరిగేవి. అంతమంది ఒకచోట కలిస్తే, ఏం జరుగుతుందో తెలుసు కదా… గోల. ఇలాంటి గోలల్లో పాలు పంచుకోడం నాకు బానే అలవాటు. మా క్లాసులో ఐతే క్లాసు లీడర్ని కానీ, అన్ని క్లాసులు కలిస్తే మనమేం మానిటర్ చేయనక్కర్లేదుగా…అల్లరి చేయడంలో మునిగేదాన్ని.

అలాంటి రోజుల్లో ఒకరోజు…టీచరెక్కడికో వెళ్ళారు. షరామామూలుగా గోల మొదలుపెట్టాము. కాసేపటికి ఆవిడ వచ్చారు. అందర్నీ వాయించడం మొదలుపెట్టారు. నా ఖర్మ కాలి, నా వైపు నుండి మొదలై “అల్లరి చేసావా లేదా?” అని కోపంగా అడిగారు. ఎలాగో నేను చేయలేదు అని అబద్దం చెప్పినా కొడతారుగా! అనుకుని “చేసాను టీచర్” అని అరిచేసా భయంకొద్దీ. అంతే, నా జీవితంలో టీచర్ చేత కర్ర దెబ్బలు (రెండే అయినా) వేయించుకున్న ఏకైక సందర్భం అదే అనుకుంటాను. విరక్తొచ్చింది కానీ, పోనీలే, ధైర్యంగా ఒప్పుకున్నా అని సంతోషించా. కానీ, అక్కడే అసలు సమస్య మొదలైంది.

అక్కణ్ణుంచి, నేను ఎప్పుడు ఆవిడ ఉన్న దిక్కుకు పోయినా, “సంతోషం” సినిమాలో కోటా తన ప్రతిస్నేహితుడికీ బ్రహ్మానందాన్ని పిలిచి “హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండీ…” డైలాగు మళ్ళీ మళ్ళీ చెప్పించినట్లు, నన్ను ఆపి, “ఈ పిల్లకెంత పొగరు తెలుసా…ఆరోజు అల్లరి చేసావా అని అడిగితే, “చేసాను టీచర్” అని గర్వంగా చెప్పింది… అని అనడమూ, ఆ అవతలి టీచరు నా వంక అదోలా చూడ్డమూ…..నేనేమో అసలు నేను చేసిన తప్పేమిటో అర్థం కాక తలవంచుకోవడమూ…. పైగా, నేను అంత భయపడుతూ చెప్పి ఏడ్చినంత పని చేస్తే అందులో గర్వం కనబడ్డం ఏమిటి? అని అనుకుంటూ దిగాలుగా మొహం వేళాడేసుకుని వెళ్ళిపోవడమూ జరిగేది.మా చెడ్డ అవమానంగా ఉండేది. అప్పట్లో నేను క్లాసు టాపర్ని. కనుక, మరీ అవమానంగా ఉండేది. అర్జెంటుగా ఈ స్కూల్ మారిపోతే బాగుండు అనుకున్నా. నిజంగానే హైస్కూలుకి వేరే స్కూలుకి వెళ్ళిపోయా కానీ, అలా నాకు ఆ టీచరంటే మాత్రం అవర్షన్ ఏర్పడింది. అప్పట్లో, పదేళ్ళ వయసులో ఏమీ చేయలేకపోయా కానీ, నాకు బాగా గుర్తుండిపోయింది ఆ సంఘటన.

2) రెండోది, నేను గర్వంగా గుర్తుంచుకునే సంఘటన. ఏనిమిదో క్లాసులో (తొమ్మిదేమో!) అనుకుంటా, ఒకసారి జ్వరమొచ్చో ఏదో జరిగి, నేను ఒక యూనిట్ టెస్ట్ పరీక్ష రాయలేదు. నా లా ఇద్దరు ముగ్గురికి శనివారం మధ్యాహ్నం స్కూల్ అయిపోయాక పెడతాం అన్నారు. ఏం జరిగిందో గుర్తులేదు కానీ, చివర్లో నేనొక్కదాన్నే రాయాల్సి వచ్చింది. మా సారా ఎక్కడికో వెళ్ళే తొందర్లో ఉన్నారు. కరెక్టుగా ఆయన తాళం పెట్టి బయటకు రావడమూ, వరండాలో కూర్చుని రాస్తున్న నేను పూర్తి చేసి పేపర్ ఇచ్చేందుకు వెళ్ళడమూ ఒకేసారి జరిగింది. నేనేమో, భయంఏసి…ఇంక సున్నానే ఏమో అనుకుని… “సార్..ఇంకా టైం ఉండింది కదా… నేను రాసేసాను…ప్లీజ్…తీస్కోండి…” అని అడుక్కోడం మొదలుపెట్టా.

ఆయన నన్ను చూసి నవ్వి – “నాకు తెలుసు టైం ఉందని. కానీ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆ పేపరు నీ దగ్గరే పెట్టుకుని సోమవారం తెచ్చివ్వు..” అన్నారు. నేను అవాక్కైపోయాను. అంటే, ఆ రోజుల్లో నేను నిజంగానే అతి నిజాయితీ మనిషిని….అన్న విషయం ఆయనకి తెలుసని నాక్కూడా తెలుసు (గతంలో జరిగిన సంఘటనల మూలంగా నా అతి-సిన్సియర్ ప్రవర్తన ఆయన గమనించారు). కానీ, ఎంతైనా, అలా ఎలా పట్టుకెళ్ళేది ఆన్సర్ పేపర్?? “అదేంటి సార్..అలా ఎలా తీస్కెళ్తాను?” అన్నాను.
“నాకు నీ మీద నమ్మకం ఉందిలే. నువ్వేం మార్చవని. తట్స్ ఓకే” అన్నారాయన. “అది కాద్సార్…ఇలా చేసానని తెలిస్తే రేపు నా ఫ్రెండ్సందరూ నా గురించి ఏమనుకుంటారు?”
“ఏమీ అనుకోరు. నేను నిన్ను నమ్ముతున్నా అని చెప్పా కదా. మండే కలుద్దాం…నేను అర్జెంటుగా వెళ్ళాలి” అనేసి వెళ్ళిపోయారు.

నాకు కోపం కాదు..భయం నషాళానికంటింది (చెప్పాగా, అప్పట్లో అమాయక జీవినని!)…. స్కూల్లోంచి బయటకి రాగానే, పక్క వీథిలో ఉన్న ఫ్రెండు ఇంటికెళ్ళి, విషయమంతా చెప్పేసి, “మీ ఇంట్లో పెట్టుకోవా ప్లీజ్! నాకు భయం నేను మళ్ళీ ఏమన్నా మార్చేస్తా ఏమో పేపర్లో అని” అని అడిగేసరికి, ఆమె ఆశ్చర్యంతో సరేనని తీసుకుంది. నేను ఆ తర్వాట నా బెస్టు ఫ్రెండుని కలిసి, జరిగిందంతా చెప్పాను. ఆమేమో ఊరికే ఖంగారు పడొద్దని చెప్పేసరికి, శాంతించాను. మండే రోజు పేపర్ ఆయనకిచ్చేసి, ఇలా నేను ఫలానా అమ్మాయి ఇంట్లో ఉంచాన్సార్ నేనేమన్నా మార్చేస్తా ఏమో అని…అన్నాను. ఆయన నవ్వేసి పేపర్ తీస్కున్నారు. టాప్ మార్కులు రాలేదు కానీ, బానే మార్కులు వచ్చినట్లు గుర్తు ఆ పేపర్లో. సార్ రూము నుంచి వెనక్కొస్తున్నప్పుడు ఛాతి బోలెడు ఉప్పొంగింది. అప్పటిగ్గానీ ఆ సంఘటన విశేషం అర్థం కాలేదు నాకు!

ఆయన నాపై అంత నమ్మకం ఉంచినందుకేమో, తర్వాత కూడా స్కూల్లో ఉన్నన్నాళ్ళూ అలాగే ఉన్నా. పెపంచికంలో పడ్డాక, వేరే సంగతి. కానీ, ఆ సంఘటన మూలానా ఆయనతో బంధం సిమెంటైందని నా అనుమానం. ఆ ఊరు ఎప్పుడెళ్ళినా, ఆయన్ని కలవడం తప్పనిసరి నాకు! ఆయనకి బహుశా ఈ సంఘటన గుర్తుండకపోవచ్చు కానీ, నేను గర్వంగా చెప్పుకోగల సంగతుల్లో ఇదొకటి.

అదీ సంగతి. ఈ విషయాలు కదిపిన సౌమ్య గారికి థాంక్స్!!

Published in: on July 7, 2011 at 3:55 pm  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/07/2schoolstories/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. సౌమ్యా.. నిజంగా నువ్వు హెంత మంచిదానివి సౌమ్యా! పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఇదేనేమో! 😉 😀

 2. ఎంట క్యూట్ గా ఉన్నారో… ఆ రెండో సంఘటనలో 🙂

  నిజాయితి కొన్నిసార్లు డబ్బులూ, గౌరవాలూ, పదవులూ తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ వీటన్నిటికన్నా మించిన ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ తలెత్తుకొని జీవించగలిగే పట్టుదలనిస్తుంది.

 3. ఎంత క్యూట్ గా ఉన్నారో… ఆ రెండో సంఘటనలో 🙂

  నిజాయితి కొన్నిసార్లు డబ్బులూ, గౌరవాలూ, పదవులూ తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ వీటన్నిటికన్నా మించిన ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ఎల్లప్పుడూ తలెత్తుకొని జీవించగలిగే పట్టుదలనిస్తుంది.

 4. :)))

 5. చాలా బాగున్నాయి సౌమ్య గారు రెండు సంఘటనలు కూడా… మీ నిజాయితీకి సలాం..

 6. అదే నిజాయితీని ఇంకా కంటిన్యూ చేస్తున్నారా…సినికల్ గా అడగడంలేదు. ఆసక్తికొద్దీ అడుగుతున్నాను.

  • ఒకటికి పదిసార్లు అప్పట్లో అలా ఉండేదాన్ని …అప్పట్లో అలా ఉండేదాన్ని అని చెప్పాక కూడా ఈ ప్రశ్న వేయడం ఏమిటండీ, నన్ను అవమానించడానికి కాకపోతే. మీకు ఆ మొదటి టీచర్ తెలుసా ఏమిటి? 🙂

 7. ఆహో.. సూపరండీ.. ఆ అ.సౌమ్య గారే అన్కుంటే మీరు కూడానా? హహహ.. బావున్నాయ్ మీ చిన్నప్పటీ సంగతులు..
  ఇన్నాళ్ళూ నేనే పెపంచికం లో అతిపెద్ద నిజాయితీపరుణ్ణి అనుకుంటున్నా… మీ ఫ్లాష్ బ్యాక్ విన్నాకా నా కన్నా గొప్పోళ్ళు చాలా మందే ఉన్నారని తెలుసు కున్నా.. 😉 ఏది ఏమయినా మీ నిజాయితీ కి నా లాల్ సలాం..

  ఇలాంటిదే నాకూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందండీ.. మీ పోస్టులు చూశాకా నాకూ రాసేద్దాం అనిపిస్తుందీ.. 😉 😉
  నైస్ పోస్ట్ అండీ..

 8. రాజ్ కుమార్ గారికి: రాయండి రాయండి… ఎదురుచూస్తున్నాం ఇక్కడ!
  భాస్కర్ గారికి: అవునండి, ఆ సంఘటన తల్చుకుంటే, కొండంత బలం వస్తుంది నాకు…అప్పుడంత “నిజాయితీ” నాలో ఇప్పుడు లేకపోయినా!

 9. chala baaga raasarandi…….bhaskar garu cheppi natlu……..Nijayiti eppudu kondanta dhyryanni istundi………edemaina aa vayasulo mee nijayiti chala abhinandinchalsinde……..telugu lo ela raayalo konchem chepduru……..

  • @Prasad Chaparala: Thanks. 🙂 You can use Lekhini.org to type in Telugu.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: