జర్మన్ భాష పఠనం- నా అనుభవాలు (1)

నేను గత నెల్లో జర్మన్ తరగతుల్లో చేరాను. అప్పటి నుంచి, దాదాపుగా ప్రతి క్లాసు తరువాతా, వెనక్కి ఇంటికి నడిచి వెళ్తున్నప్పుడో, లేదంటే ఒక్కోసారి క్లాసులోనేనో – రకరకాల ఆలోచనలు కదిలేవి. ప్రధానంగా జర్మన్ కి తెలుగుకీ మధ్య తేడాలో, సామ్యాలో ఏముంటే అవి కనిపెట్టే ప్రయత్నమే అయినా, ఒక్కోసారి నవ్వు పుట్టించేవి నాకే! తరువాత, ఎప్పటికప్పుడు ఈ ఆలోచనలు బ్లాగుదాం అనుకుంటూనే బద్దకిస్తూ వస్తున్నా. చివరికి ఇవ్వాళ కుదిరింది!

నాకు అన్నింటికంటే బాగా గుర్తుండిపోయిన విషయం ఏమిటి అంటే – జర్మనీ వారికి సూర్యుడు ఆడ, చంద్రుడు మగా! మా లెక్చరర్ అది చెప్తూ ఉండగా నేను అవాక్కై చూస్తూ ఉంటే నన్ను అడిగారు – మీ భాషలో ఎమిటి? అని. మనం సూర్యుడు, చంద్రుడు అనే అంటాము కదా. కనుక, ఇద్దరూ మగే అని చెప్పాను. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కనుక, నా పక్కన కూర్చుని ఉన్న ఉక్రేనియన్ అమ్మాయిని అడిగారు. వాళ్ళ భాషలో చంద్రుడు ఆడ, సూర్యుడు మగ అంది. తరువాత, మరో చైనా అమ్మాయిని అడిగితే, ఆ అమ్మాయేమో అసలు మా భాషలో సూర్యచంద్రులకి లింగాలే లేవనేసింది. అప్పుడే నాకో చిలిపి ఆలోచన మొదలైంది – మరి, విరహ గీతాలూ, ప్రేమ కబుర్లూ వీటిలో ఉన్న సూర్య/చంద్రుల, వారి తాలూకా ఇతర పదాల ప్రస్తావనలను ఈ భాషల మధ్య అనువాదం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అని 🙂

సరే, ఇదొకటి పక్కన పెడితే, వీళ్ళు సమయం ఎంతన్నది చెప్పే పద్ధతి కూడా మొదట్రోజు భలే అయోమయానికి గురిచేసింది. ఉదాహరణకి – 5:15 అని ఉందనుకోండి. ఆంగ్లంలో అయితే – ఐదు పదిహేను అని చెబుతాం. అప్పుడప్పుడు ఐదు తరువాత పదిహేను నిముషాలు (Quarter past five) అన్న అర్థం కూడా వాడతాం. అయితే, జర్మన్ వారిలో ఈ ఐదు తర్వాత పదిహేను నిముషాలు (viertel nach Fünf) అన్నదే ఎక్కువ వాడతారంట. పైగా, 5:55 అంటే, ఐదూ యాభై ఐదు కనుక ఆరుకి ఐదు నిముషాలు తక్కువ (Fünf vor sechs), అనాలన్న మాట. ఆంగ్లం లో ఫైవ్ టు సిక్స్ అనీ, తెలుగులో ఐదు నిముషలు తక్కువ ఆరనీ అంటాము కానీ, రాస్తున్నప్పుడు అలా రాయము కదా. ఐదూ-యాభై అంటే, పది నిముషాల తక్కువ ఆరు అంటామెమో కానీ, రాయడం ఐదూ యాభై అనే రాస్తాము కదా. వీళ్ళు అలా కాదు. పది నిముషాలు తక్కువ ఆరనే అంటారు. పోనీ, ఇవి మామూలుగానే ఉన్నాయని అటుపెడితే, అరగంట అయింది అని చెప్పే పద్ధతి మాత్రం భలే ఉందనిపించింది. ఆరున్నర ఐతే – ఏడుకి అరగంట తక్కువ అన్న అర్థంలో (halb sieben) అంటారు ఇక్కడ 🙂

ఇక వీటన్నింటి మీదా నాకు అయోమయం పుట్టించిన అంశం – ప్రతి వస్తువుకీ జోడయ్యే లింగం.
ఉల్లిపాయ స్త్రీలింగం, కానీ వెల్లుల్లి పుంలింగం. కేరట్ స్త్రీలింగం, కానీ యాపిల్ పుంలింగం. ఆలూ స్త్రీలింగం కానీ కాలీఫ్లవర్ పుంలింగం – ఇలా అనమాట. నిర్దిష్టంగా ఇది ఈ లింగం అని అన్నిసార్లూ చెప్పలేము. బహుశా, అలవాటు పడాల్సిందే కాబోలు. ఇదే ఒక ఎత్తైతే, ఒకే వస్తువును రెండు లింగాల్లో చెప్పవచ్చు. zweibel (ఉల్లి) అన్నామంటే అది స్త్రీలింగం. అదే zweibelchen (చిన్న ఉల్లిపాయ) అంటే అన్నామంటే మాత్రం దానికి లింగం లేదంట (Neutral). కార్లు (బెంజి, బీ.ఎం.డబ్ల్యూ. వంటివి) పుంలింగం. అయితే, భౌతిక శాస్త్రం, గణితం – ఇలాంటివి స్త్రీలింగాలు. ఇలా సాగుతోంది అనమాట. హిందీలోనూ ఇలాంటి తేడాలు ఉన్నాయనుకుంటున్నాను (ఉన్నట్లే గుర్తు!). నేను గమనించినంతలో తమిళంలో లేవు అనిపించింది. తక్కిన భాషల సంగతి నాకు తెలీదు.

అసలు ఇలా వస్తువుల లింగాలు ఎలా నిర్ణయిస్తారో ఏమిటో, మహా కుతూహలంగా ఉంది నాకు!

ఇప్పటికి ఇవీ సంగతులు.

Advertisements
Published in: on May 18, 2011 at 2:11 am  Comments (8)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/05/18/german-language-experiences/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. అరబ్బీ భాషలో కూడా చంద్రుడు పుల్లింగము, సూర్యుడు స్త్రీ లింగమూను.

  జర్మనుల సంస్కృతాభిమానం గురించి కూడా రాయగలరు.

 2. హిందీలోనూ లింగాలు ఉంటాయి. నీకు బానే గుర్తుంది.
  అంతే కాదు విశేషణాలు, “కా”, “కీ” వంటి ప్రత్యయాలు (?) కూడా లింగం మీద ఆధార పడి మారుతాయి కదా.
  అది కూడా, ఆ పదం / ప్రత్యయం (?) తర్వాత వచ్చే పదం యొక్క లింగం బట్టి మారతాయి అనుకుంటాను.
  సంస్కృతంలో కూడా దాదాపుగా అంతే అనుకుంటాను.
  హిందీ అర్థం చేసుకోగలను, బానే తెలుసుననుకుని ఎవరికో పాఠం చెప్పబోయి అప్పుడు తెలుసుకున్నాను నాకు ఎంత తెలియదో.

 3. ఇంగ్లీషే బెటరండీ. ఫ్రెంచ్‌లో ఇంకా దారుణంగా వుంటాయి. జస్ట్ le బదులు la పెట్టామంటే పదానికి అర్ధం సాంతం మారిపోతుంది. అస్సలు నపుంసక లింగమే లేదట. ఇలాంటి భాషలగురించి నాకీ డౌటు ఒకవేళ హఠాత్తుగా ఒక కొత్తవస్తువు ఆకాశమ్నుండి ఊడిపడిందనుకోండి అపుడది మేలో ఫీమేలో ఎలా డెసైడ్ చేస్తారు?

 4. me anubhavalanu batti chuste, Learn German in 30 days.. Tho nerchukovadam chala kastam anukunta.. 🙂

 5. కొన్నాళ్ళు రామక్ర్ష్ణ మఠంలో ఫ్రెంచ్ వెలగబెట్టినపుడు నాక్కూడా బోల్డు డౌట్లు వస్తూ, మా ప్రొఫెసర్ ని పీక్కు తినేస్తూ ఉండేదాన్ని! ఆయన (ప్రొఫెసర్ దాస్,80 ఏళ్ళు) బోసి నవ్వులు నవ్వుతూ దగ్గర కూచోబెట్టుకుని ఓపిగ్గా చెప్పేవాడు.

  లింగాల విషయానికొస్తే సౌమ్యా, మీరు మనకి
  “చంద్రుడు మగ, జాబిల్లి ఆడ” అని చెప్పాల్సిందండీ!:-))

  ఇక్కడ “స్కిల్ గురు” లో మీరు కొంత ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాల్సింది. విన్నారా దీని గురించి?

 6. భాషలో లింగాలు రెండు రకాలు: వైయాకరణ లింగం (Grammatical Gender); ఆర్థిక లింగం (Semantic Gender)అని. వ్యాకరణంలో క్రియా పదాలు మొదలైనవి ఒక నామవాచకానికి ఏ విధంగా ఉండాలో నిర్ణయించేది వైయాకరణ లింగం. దీనికి అసలు వస్తువు లింగంతో సంబంధం లేదు. జర్మన్, సంస్కృతం లాంటి భాషలు దీన్ని అనుసరిస్తాయి. ఇక మనం సూచించే నామవాచకం ఆడా,మగా అన్నదానిని బట్టి నిర్ణయించేది ఆర్థిక లింగం. ఇక్కడ కూడా క్రియా ప్రత్యయాలు లింగాన్ననుసరించి మారినా అది వస్తువు యొక్క నిజలింగాన్నిబట్టి ఉంటుంది. తెలుగు, హిందీలతో బాటు దాదాపు భారతీయ భాషలన్నీ ఈ లింగ ప్రణాళికనే అనుసరిస్తాయి. నిజానికి తెలుగులో కూడా వ్యాకరణ పరంగా త్రివిధ లింగాలు లేవు. మహత్, అమహత్ (Masculine, Non-Masculine)మాత్రమే ఉన్నాయి (ఉదా: అతడు వచ్చాడు; ఆమె /అది వచ్చింది).

  సంస్కృతంలో భార్య అనే అర్థం వచ్చే పదాలు దారాః, భార్యా, కళత్రం అన్నవాటిలో దారాః అన్నది పుల్లింగం (masculine),భార్యా అన్నది స్త్రీ లింగం (Feminine), కళత్రం అన్నది నపుంసక లింగం (Neuter). అంటే సంస్కృతపు సతీమణి పురుష రూపంలో, స్త్రీ రూపంలో, నపుంసక రూపంలో కూడా ఉండవచ్చన్నమాట!

 7. “అంటే సంస్కృతపు సతీమణి పురుష రూపంలో, స్త్రీ రూపంలో, నపుంసక రూపంలో కూడా ఉండవచ్చన్నమాట!”
  -Thats very interesting!!!

 8. nijjanga nijamandi babu….chachchipotunnanu..veellatho matladaleka….ee spelling evadu kanipettado kaani vadiki suryanamaskaram cheyavachchu…
  intha daarunanga untadani mude theliste kaasta nerchukuni vachchevanni….poni net lo nerchukundamante okka mukka ardham kavatledu..ento ee life..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: