జర్మనీ లో మే డే కథ

నాకు మే డే అనగానే – ‘కార్మిక నాయకుడు సింగారానికీ!…’ అనాలనిపిస్తుంది. అంటే, నా దృష్టిలో మేడే అంటే కార్మికుల దినోత్సవం అని. ఇక్కడ జర్మనీలో కూడా మే డే చేస్కుంటారని తెలిసినపుడు ఆశ్చర్యపోయాను. ఇక్కడ కూడా అంతేనా? అని ఎంక్వైరీ చేస్తే, రెండు వేర్వేరు అభిప్రాయాలు వినవచ్చాయి. ఒకటేమో, అలాంటిదే. ఏదో ప్రదర్శన కూడా ఉంటుంది అని. రెండోది – పెద్దగా ఏం ఉండదు అని. ఇంతలో, ఒక పల్లెలో మేడే “సెలెబ్రేషన్స్” చూశా. అది చెప్దామనే ఈ టపా.

ముప్పయ్యోతేదీ రాత్రి ఒక కొలీగ్ రాత్రి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. వాళ్ళింటికి నేను వెళ్ళాల్సింది కాస్తా ప్లాను చివర్లో మారి, మేము మరో స్నేహితుల ఇంటికి, మా ఊరి దగ్గర్లోనే ఉన్న వైల్ (Weil) అన్న పల్లెకి వెళ్ళాము. అసలుకి ఆ పేరే వింతగా ఉంది. వైల్ అంటే జర్మన్ లో because అని అర్థమట. మరెందుకాపేరొచ్చిందో? అనుకున్నాము. వికీ చూశాక కొంచెం అర్థమైంది. “Its unusual name (weil means “because” in German) is derived from the presence of a Roman villa in the area.” అంటుంది వికీ. ఏమాటకామాట – ఊరు పచ్చగా కళ కళలాడుతోంది. దానికి తోడు, చాలా ప్రశాంతంగా, నిశబ్దంగా అనిపించింది. మేము ఏడింటికే తినేసి, కాసేపు వాకింగ్ అని, ఊరిలో, ఆ తర్వాత కాస్త కిందకు దిగి (అవునండీ, ఇది కూడా ఎత్తులోనే ఉంది!!) ఆకుపచ్చగా మెరుస్తున్న ఒక పెద్ద మైదానంలో చాలా సేపు నడిచాము. ఈసారి విచిత్రంగా పైకి ఎక్కుతున్నప్పుడు అలసట అనిపించలేదు. బహుశా అంత ఎత్తు లేదేమో!


ఈ నడకల్లో భాగంగా, ఆ ఊరి మార్కెట్ స్క్వేర్ కు వచ్చాము. షరా మామూలుగా ఒక చర్చి. పక్కనే, ఒక హాల్లోంచి సంగీతం వినిపిస్తోంది. దాని ముందర ఒక చెట్టు లాంటి నిర్మాణం, దానికి అలంకరణలూనూ. నా స్నేహితురాలు – అదే మే పోల్ అని చెప్పింది. కానీ, అదెందుకు? అంటే చెప్పలేకపోయింది. ఆ హాల్లోకెళ్తే, అద్భుత దృశ్యం. ఊరు ఊరంతా లోపలే ఉందా? అన్నట్లుంది. ఆ చివర్లో ఒక పది-పదిహేను మంది ఉన్న సంగీత బృందం పాటలు, వాయిద్యాలతో అలరిస్తున్నారు. మధ్యలో జనాలంతా బీరు మగ్గుల్తోనూ, ఖాళీగానో, వాళ్ళ వైపో, వెనక్కో తిరిగి కబుర్లాడుకుంటున్నారు. చూసే వాళ్ళు చూస్తున్నారు. ఈ చివర్లో బీరు బాబులకి సప్లై సిస్టం నడుస్తోంది – యమ బిజీగా. వీళ్ళు ఇలాగే రాత్రంతా గడుపుతూ, నృత్యాలూ అవీ చేస్కుంటూ, బోన్ ఫైర్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ – మే డే ని స్వాగతిస్తారట!!!

రాత్రి వర్షంలో ఇంటికొచ్చేశాను. తరువాత, కింద గదిలో ఒక జర్మన్ అనువాదకుడు ఉంటారు. రెండ్రోజులబట్టీ స్థానిక చరిత్ర గురించి చాలా కథలు చెప్తూ ఉండటం తో, ఆ చెట్టు గురించి ఆయన్ని అడిగా. ఆయన చెప్పింది ఇదీ. ఆ చెట్టు, అదే మే పోల్ ని పనిగట్టుకుని మే డే కోసం అంతెత్తుకి కడతారంట. ఆ పైన ఉన్న అలంకారాల మధ్య – ఏ సాసేజ్లో, వైన్ బాటిలో, ఇలాంటివి పెడతారట. ఇదంతా ఎక్కి పైదాకా వెళ్ళిన వారికి అవి దక్కుతాయట కానీ, సాధారణంగా చాలా మంది మధ్యలోనే ఓడిపోతూ ఉంటారట. (అసలు అలాంటి దాన్ని ఎలా ఎక్కుతారో ఏమిటో!!) ఆ చర్చే పొడుగనుకుంటే, ఈ మేపోల్ ఇంకా ఎత్తు దాకా ఉంది.

ఇక, నేను ఇదంతా విన్నాక, ఎలాగో వెనక్కొచ్చి హోం వర్క్ చేస్తా కదా 😛 నాకు తెలిసినదేమిటంటే –
పూర్వం, ఏప్రిల్ 30 రాత్రి నుండి మే ఒకటి మధ్యలో మంత్రగత్తెలంతా సమావేశమౌతారు అని నమ్మేవారట. వాళ్ళని దగ్గరికి రాకుండా చేయడానికి, మంటలు పెట్టుకోని, కేరింతలు కొడుతూ, గోల చేస్తూ గడిపేవారట జనం. అదే సంప్రదాయం – బోన్ ఫైర్, మే పోల్ ల రూపంలో ఇప్పటికీ నిలిచి ఉంది. అయితే, కార్మిక దినం కూడా అదే. కనుక, ప్రదర్శనలు కూడా జరుగుతాయట. “…అట” అని వదిలేస్తానేమో అనుకున్నా కానీ, మా నదీతీరంలో నిలబడి కాఫీ తాగుతూ ఉంటే, ఏవో అరుపులు వినిపిస్తే, వెనక్కి తిరిగి రోడ్డూ పైకి చూశా ఇవాళ మధ్యాహ్నం. ఏముందీ, అక్కడో ఎర్ర ఊరేగింపు! నాకాట్టే అర్థం కాలేదు కానీ, మే.డే. స్పెషల్ అని మాత్రం అర్థమైంది.

స్థానిక మే.డే చరిత్ర గురించి మరోసారెప్పుడన్నా రాస్తాను. ఇక, మే పోల్ కథా కమామిషూ గురించి, చాలా కథలే ప్రచారంలో ఉన్నట్లు ఉన్నాయి. ఆసక్తి ఉంటే, ఇక్కడ చదవండి.

Published in: on May 1, 2011 at 7:13 pm  Comments (2)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/05/01/mayday-in-germany/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. మే డే!!! బాగున్నాయి విశేషాలు!!

    అవునూ, మీరు Munich లో ఉ౦టున్నారా? Essen ఎ౦తదూర౦ మీకు?

  2. జర్మన్ పల్లెటూళ్ళు మేడే జరుపుకోవటం బాగుంది. థాంక్స్ ఫర్ పోస్టింగ్.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: