ఒక ఊరి కథ

ఏ ఊరు? అని సందేహం కలిగిందా? ఏదన్నా ఒక ఊరు – అన్న ఉద్దేశ్యంతో అంటున్నా.

నేను ఈ ఊరు వచ్చి ఇంకా రెండు వారాలు కూడా కాలేదు. ఇంతలోపే, ఈ ఊరు పై గతంలో ఏర్పరుకున్న గౌరవభావం రెండింతలన్నా అయి ఉంటుంది. కారణం ఏమిటీ అంటే, ఈ రెండువారాల్లో అడపాదడపా నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చరిత్ర గురించీ, దానిపై ఇక్కడి సమాజానికి ఉన్న గౌరవం గురించీ తెలుసుకున్న సంగతులే! నదీ తీరంలో నడుస్తూ ఉంటే, ఒకానొక పేద్ద విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహం ప్రేమలో పడిపోయానన్న సంగతి అటు పెడితే, అది ఆ నగరంలో దాదాపు రెండొందల యాభై సంవత్సరాల క్రితం నివసించిన ఒక సంగీతజ్ఞుడిది (Friedrich Silcher). నదికి ఆవలి తీరంలో ఉన్న ఇళ్ళ వరుసల్లో ఒక గోపురంలా, ఒక ఇల్లు కనిపిస్తుంది. స్థానికులు మాట్లాడుకుంటున్నదాన్ని బట్టి, అలాగే, పర్యాటకులు బారులు తీరడాన్ని బట్టీ – ఏమిటా? అని ఆరా తీస్తే, రెండున్నర శతాబ్దాల క్రితం ఒక గొప్ప కవి, తాత్వికుడు (Friedrich Hölderlin) నివసించిన ఇల్లంటారు. కాసేపాగాక అక్కడనుంచి వెనక్కి వస్తూ ఉంటే, అంతకు ముందే – ‘ఇదేం పేరూ’ అనిపించిన రోడ్డే, ఆ కవి గారి పేర్న పెట్టారని అర్థమై – ఆపై ఆ రోడ్డులోంచి రోజూ వెళ్తున్న ప్రతిసారీ, ఆ కవి గారిని స్మరించుకుంటున్నా. నది దగ్గరే ఒక చిన్న వంతెన కనిపిస్తే, ఏమిటా అని ఆవలి పక్కకి వెళ్తే, అక్కడో విగ్రహం. ఆయన ఒక ప్రముఖ కవి, చరిత్రకారుడు! (Ludwig Uhland).

మా బిల్డింగ్ లోంచి బయటకు రాగానే, పక్క సందు -కెప్లర్ వీథి. ఎందుకు? కెప్లర్ ఇక్కడి పూర్వ విద్యార్థి. కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ గుర్తొస్తాయి రోజూ! బిల్డింగ్ ఉన్న రోడ్డు – Wilhelm వీథి. ఆయనెవరో? అనుకుంటూనే, కుతూహలం కొద్దీ వికీపీడియా వెదికితే, Wilhelm Schickard కనిపించాడు. ఆయనెవరు? 1623లోనే ఒక గణన యంత్రాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేసిన మేధావి. ఆయన గౌరవార్థం ఇక్కడి యూనివర్సిటీ వారు తమ కంప్యూటర్ శైన్స్ శాఖకు ఆయన పేరే పెట్టుకున్నారు. అలా కొత్త దారిలో ఇంటికెళ్దాం అని వెళ్తూ ఉంటే, Gmelin వీథి. ఆయనెవరు? మళ్ళీ ప్రశ్న. ఇదే ఊరుకి చెందిన ఎనిమిది మంది కనిపించారు వికీ లో, ఈ ఇంటి పేరుతో. ఒక్కోరిదీ ఒక్కో చరిత్ర. నేనుండే ఇల్లు ఉన్న వీథి – లెస్సింగ్వెగ్. నాకు తెలిసింది డోరిస్ లెస్సింగ్ మాత్రమే. ఇక్కడ చూస్తే, మరో జర్మన్ తత్వవేత్త Gottfried Lessing (ఈయనదీ ఊరు కాదేమో, అది వేరే సంగతి).

ఇలా – రెండు వారాల్లోనే నాకు ఇక్కడ ఒకప్పుడు నడిచిన మహామహుల గురించి చాలా సంగతులు తెలిసాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే –

ఇదంతా చూస్తూ ఉంటే, ఇక్కడికి బయలుదెరే ముందు కలిగిన అనుభవం గుర్తొచ్చింది. పెన్నా తీరంలో నడుస్తూ ఉంటే, అనుకోకుండా నా కజిన్ – నువ్వు థ్రిల్లయిపోయే సంగతి ఒకటి చెబుతాను అంటూ ఒక ఇంటిని చూపింది. అది తిక్కన కవి ఇల్లు. ఆయన భారతం రాసిన ఇల్లు. నా మట్టుకు నాకైతే, నిర్లక్ష్యానికి గురైన చారిత్రక కట్టడం లాగానే అనిపించింది. తుప్పుపట్టిన గేటూ, ఏమాత్రం శుభ్రత లేని పరిసరాలూ ఇదీ వరస.

అదొక్కటే కాదు. ఇప్పుడు ఇది రాస్తూ ఉంటే – ఇటీవలే హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రోడ్డును సీ.ఆర్.రావు రోడ్డు గా మార్చడం కూడా గుర్తు వస్తుంది. తొంభై ఏళ్ళ రావు గారు తన పేరుతో ఉన్న రోడ్డులో, తన సహాయంతో, తన పేర్నే మొదలైన సంస్థలో కూర్చుని తదేక దీక్షతో పని చేస్తూ ఉండడం ఇటీవలే చూసి అబ్బురపడుతూ, అసలాయన పరిశోధనల గురించి ఏమీ తెలియకపోయినా గౌరవభావం పెంచుకున్న మనిషిని గనుక – ఆయన పేరు ఆ రోడ్డుకి పెట్టడం తల్చుకుంటే గొప్పగా అనిపిస్తుంది – ఆయనకీ నాకూ ఏ సంబంధమూ లేకపోయినా!

అసలింతకీ ఏమిటి నువ్వు చెప్పాలనుకున్నది? అంటారా? అదే – ఒక ఊరి కథ తెలిసేది ఇలాంటి వాటి ద్వారానే. చరిత్ర పుస్తకాలు అందరూ చదవరు. పుస్తకాలూ అందరూ చదవరు. కథలు అందరూ వినకపోవచ్చు. కానీ, రోడ్లపై తిరగందే జీవితానికి గిట్టుబాటు కాదు కదా! అలా వెళ్తున్నప్పుడు, నాకు కలిగినట్లే కుతూహలం కలగకపోదూ జనాలకి? మనం మన గతం గురించి ఎంత బాగా గుర్తు పెట్టుకుంటున్నాం? ఎక్కడన్నా అంతా డక్యుమెంట్ చేసి, ఆసక్తి గల వారికి సాయానికైనా అందుబాటులో ఉంచుతున్నామా? అన్న విషయం చర్చకు వచ్చింది నా స్నేహితుడితో. అతనన్నాడు – “నువ్వు ఐరోపా ఉదాహరణ చెప్పావు బాగానే ఉంది. కానీ, ఇక్కడ కనీసావసరాలు కూడా తీరనప్పుడు ఇలాంటి వాటిపై ఎవరికి ఆసక్తి ఉంటుంది” అని. నా జవాబు – “ఈ దేశం లో కూడా అడుక్కుతినేవాడిని చూశాను ఇవ్వాళే. కానీ, ఇలాంటివి చేస్తున్నది కనీసావసరాల సమస్యలు లేని వారు అయ్యుండొచ్చు కదా. మనదేశంలోనూ సుఖంగా బ్రతికేవారు లేరూ? వాళ్ళు చేయొచ్చుగా?” అని.

చివరాఖరుకి నా గోడు ఏమిటంటే – ఫలానా తుర్రేబాజ్ ఖాన్ రోడ్డు కోటీ లో ఉంది అనగానే తెలియని వారికి “తుర్రేబాజ్ ఖాన్ ఎవరు?” అన్న కుతూహలం కలగాలంటే, అసలా తుర్రేబాజ్ ఖాన్ రోడ్డు ఉందన్న సంగతి తెలియాలి కదా. అక్కడ సర్చిలైటు వేసుకు చూస్తే, పాపం మసగ్గా కనిపిస్తుందనుకుంటాను ఆ బోర్డు. (అ విషయంలో కన్నడిగులను మెచ్చుకోవాలి. అవే పేర్లు మళ్ళీ మళ్ళీ పెట్టి అయోమయానికి గురి చేస్తే చేసారు గాక – స్థానికంగా ఉన్న గొప్పవారి గురించి బలవంతంగా నన్నా తెలుసుకుంటారు జనాలు!!). ఇనాయతుల్లా మేఖ్రి (Mekhri Circle, Bangalore!) గురించి ఉన్నంత సమాచారం గూగుల్ సర్చ్ లో తుర్రేబాజ్ ఖాన్ గురించి కనబడలేదు నాకు. తెలుగువీర లేవరా… అనుకుని, రాజీవూ సోనియా …గట్రా గట్రా పక్కన పెట్టి – మనవాళ్ళు స్థానిక చరిత్రకు పట్టం గడితే బాగుంటుందని అనమాట నా గోడు.

అందరూ అనుకుంటూ ఉండేదే అనుకోండి. అయినా, అరే, ఇంత చిన్న ఊరు వీళ్ళే ఇన్ని చేయగా లేనిది, ఇంచుమించు ఈ దేశమంత పెద్ద రాష్ట్రం మనది -మనమేం తక్కువ తిన్నాము? అన్న ఉక్రోషం అని కూడా అనుకోవచ్చు… పబ్లిక్ కి ఒక చారిత్రిక స్పృహ కలిగించడం చారిత్రక అవసరం మహాశయులారా! 🙂

ఎలా? మీ అభిప్రాయాలు చెప్పండి.

Advertisements
Published in: on April 8, 2011 at 2:04 am  Comments (8)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/04/08/oka-oori-katha/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. ఆ ఎందుకు లెండి! మళ్ళీ హైదరాబాదు వీధులకి ఆంధ్రుల పేర్లా? రాయల్సీమ వీరుల పేర్లా అని వీధులని ధ్వంసం చేయగలరు. హాయిగా రాజీవ్, ఇందిరా, సోనియా, రాహుల్, ప్రియాంకా అని పెట్టుకుంటే ఏ గొడవలూ వుండవు!
  శారద

 2. Agree with you and also with murali garu. You said on the banks of penna river. Which is the place? what are the details?

  madhuri.

  • Nellore. Go beyond the Ranganatha Swamy temple in Ranganayakula Peta. You can see Penna there. The road takes a natural right turn there. As you walk down, you can find the house on your left side.

 3. I liked this post.I am just curious to know are there any memorabilia of Dr. Wuppala Laxmana Rao at University of Tübingen? He has completed his Doctorate in Botany and also worked for a while there.

  • @Harikrishna: Thanks for the information. I did not see any so far.

 4. బాగున్నాయి నీ ఊరికథలు. ఇలా కొత్తదేశంలో పాతకాలపువిశేషాలు చెప్తూ సౌమ్యాలోచనాపథం అని మరో సీరీస్ రాస్తావా వెనక నెహ్రూ discovery of Indiaలాగ అన్నమాట. :))

 5. enta baagaa raaasaaavo! 🙂 nijame.. ide suluvaina daari chaaritraka spruha kaliginchataaniki

 6. నేనిలా అనుకున్నది విన్నారో ఏమిటో జనాలు – తుర్రేబాజ్ ఖాన్ పైన పుస్తకం వస్తోందట!
  http://www.thehindu.com/news/cities/Hyderabad/article3650498.ece


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: