అప్పుడే రెండో ఏడు అయిపోయిందా! అనిపించేంత వేగంగా సాగిపోయింది పుస్తకం.నెట్ తో నా పని (మనం సగం రోజులకి దాని ఎక్జిస్టెన్సు మరిచిపోతే ఇలా ఉండక ఎలా ఉంటుందీ?). సరే, నిద్రపోతూనో, బద్దకిస్తూనో, తప్పుకు తిరుగుతూనో, ఎలా అన్నా మరో సంవత్సరం కూడా గడిచిపోయింది కనుక ఒకసారి అసలు రెండో ఏడు పుస్తకం.నెట్ గురించి నా భావాలు ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పుకుంటూ..ఈ టపా.
ఈ సంవత్సర కాలంలో పుస్తకం కోసం తిరిగినంత, స్వకార్యాల నిమిత్తం కూడా ఎప్పుడూ తిరగలేదు. ఈ సంవత్సరకాలంలో ఇంతమంది ఆసక్తి కరమైన వ్యక్తులను- కలుస్తా అనుకోలేదు. అందుకే, గత ఏడుతో పోలిస్తే, ఇంటర్వ్యూలు బాగా మనసులో నిలిచిపోయాయి. అలాగే, ఎన్నో పుస్తకాల గురించి కూడా తెలిసింది. అయితే, నాకేమిటో, కావాల్సినంత వైవిధ్యం లేదు అనిపిస్తుంది, వచ్చే వ్యాసాల్లో. ఇది వ్యక్తిగత అసంతృప్తే అనుకోండి, అందుకే బ్లాగులో రాస్తున్నా! ఒకసారి గత ఏడు వచ్చిన వ్యాసాల జాబితా చూస్తే – The Django Book లాంటి సాంకేతిక పుస్తకం మొదలుకుని అడ్వర్టైజింగ్ ప్రపంచం గురించిన Dusenberry పుస్తకం దాకా, అలాగే, ఈవారంలోనే వచ్చిన ‘తెలుగుతోట‘ పుస్తక సమీక్ష మొదలుకుని, ‘శశాంక విజయం‘ దాకా, వీటితోపాటు, ఆడియో పుస్తకాల గురించి కూడా వ్యాసాలు వచ్చాయే – ఎంత వైవిధ్యం ఉందీ? అనిపిస్తుంది. కానీ, ఏ లెక్కన చూసినా కూడా, ఈ పుస్తకాలన్నీ ఒకే పరిధిలోనివి అని నాకు అనిపిస్తుంది.
ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ, నాకు ఒకే తరహా పుస్తకాల గురించి చదువుతున్నట్లు అనిపిస్తోంది అని మాత్రం చెప్పగలను. పుస్తకం.నెట్ పాఠకుల్లో రకరకాల నేపథ్యాల వాళ్ళు ఉన్నారనుకుందాం. ఒక్కోళ్ళకి మిగితా పుస్తకాలతో పాటు, తమకి కాస్త ఎక్కువ పరిచయం ఉన్న/అసక్తి ఉన్న రంగం గురించిన పుస్తకాల గురించి అవగాహన ఉంటుంది. అలాంటి పుస్తకాలని తీసుకుని, వాటిపై చిన్న పరిచయాలు రాస్తే, బహుశా అవి ఇతరులకి కొత్త ద్వారాలు తెరువవచ్చు.
అయితే, ఈ సంవత్సరంలో నాకు నచ్చినవి:
-ఒకే పుస్తకం మీద మల్టిపుల్ వ్యాసాలు రావడం (ఉదా: ఊరి చివర, రెండో పాత్ర పై వచ్చిన వ్యాసాలు)
-గత ఏడు కవిత్వం హవా నడిచినట్లు తోచింది. ఈ ఏడు కొంతలో కొంత ఇతరత్రా సంగతుల గురించి కూడా ఉన్నాయి వ్యాసాలు.
–మంచి పుస్తకం, కొత్తపల్లి, ఏవీకేఎఫ్, గూటెంబర్గ్ – వీరితో వచ్చిన ఇంటర్వ్యూలు.
వ్యక్తిగతంగా, పుస్తకం.నెట్ లో భాగంగా, నాకు నచ్చిన, నేను బాగా ఎంజాయ్ చేసిన సందర్భాలు:
-ఈ ఇంటర్వ్యూల కోసమని చెప్పి, అద్భుతమైన వ్యక్తుల్ని కలవడం.
-ఇంటర్వ్యూ చేసినా, చేయకపోయినా, కొందరు వ్యక్తుల్ని, గొప్ప వారినీ (ముఖ్యంగా బాపూ-రమణలని, జోలేపాళెం మంగమ్మ గారిని), గొప్పగా కనిపించకపోయినా గొప్పన్నర అయిన వారినీ కలిసి స్పూర్తి పొందడం.
-ఇందులో భాగమవకుండా ఉంటే, మిస్సయ్యి ఉండే పుస్తకాల గురించి తెలుసుకోవడం.
-ఈ పేరు చెప్పుకుని, పాత పుస్తకాల దొంతర్ల నుంచి తిరిగి ప్రచురించడానికి పనికొచ్చే వ్యాసాలను వెదకడం.
ఏమిటీ, ఎవ్వరూ ఏమీ రాయరూ! అనుకుంటున్నప్పుడు మరేం పర్లేదంటూ ధైర్యం చెప్పిన వారికీ, సరిగ్గా సమయానికి తరుచుగా వ్యాసాలు రాయడం మొదలుపెట్టిన వారికీ, సైలెంటుగా ప్రోత్సహిస్తున్నవారికీ, అందరికీ ధన్యవాదాలు [ఈ వ్యాసం వారు చదువుతున్న పక్షంలో వారికి వారి గురించే రాస్తున్నట్లు తెలిసిపోతుంది కనుక, ఇక్కడ పేర్లు రాయను]. అలాగే, ఈ ఏడు కూడా మరిన్ని వ్యాసాలతో, మరింత వైవిధ్యంతో పుస్తకం.నెట్ ముందుకు సాగుతుందని ఆశిద్దాం.
రెండేళ్ళు పూర్తైన సందర్భంగా పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.
అదంతా సరే కానీ, మనం అనుభవించిన ‘ఫన్’ సంగతి చెప్పవేమిటి? అన్నది పూర్ణిమ.
“ఫన్నా? “
అనగానే మనసు –
“హన్నా!
ఫన్ను మాట మరువడం ఇన్విజిబుల్ పన్నా?
ఫన్ను లేనిదే నీకిక్కడ మిగిలేది సున్నా
హ్యావింగ్ ఫన్ను మన వేదం కన్నా.”
అంటూ వక్కాణిస్తే –
“ఫన్ను లేకుండా పుస్తకం పని చేసానంటే సిన్నే ఓ రన్నా
పని చేసిన ప్రతి క్షణమూ ఫన్నే రా నాన్నా”
– అని జవాబు చెప్పా. పాపం, మీరెవరన్నా మనసు కింద పడి గిలగిల కొట్టుకోడం చూశారా? నేను చూశా మరి 🙂
అదండీ సంగతి!!
పూర్ణిమ రాసిన బ్లాగు పోస్టు ఇక్కడ చదవొచ్చు.
[…] Sowmya’s post here. […]
ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
శ్రద్ధ గా చేస్తే అన్నీ బాగా జరుగుతాయి కానీ, ముగింపు మాత్రం బాగుంది.
Congrats and best wishes
Well done Sowmya and keep going.
Sharada
నేను ఎంతగానో అభిమానించే పుస్తకం గురించి మరిన్ని వివరాలు వినటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
నిర్వాహకులకు, పుస్తకం అభిమానులకు అభినందనలు.
Congratulations!!
Good initiative.