నిశ్యాలోచనాపథం – 23

తరువాయి భాగం – త్వరలో : అని ముగించాను దాదాపు మూణ్ణెల్ల క్రితం. ఆ తర్వాత ఏరోజుకారోజు జీవితంలో తరువాయి భాగాలెక్కువైపోయి, తీరిక చిక్కక – వీళ్ళకథ చెప్పడం ఆపాను. ఇన్నాళ్ళకి ఒకరోజు…మళ్ళీ వెనక్కొచ్చా – ఈసరికి నిశ్యాలోచనాపథం ఫాలో అయ్యేవారిలో ఇద్దరు ముగ్గురన్నా మిగిలి ఉంటారని నమ్ముతున్నా! ఇరవై రెండో భాగం ఇక్కడ చదవొచ్చు. నేనూ, నిశి, కా.పు. నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా అటుగా ఎవరో రావడంతో మా సంభాషణ ఆగిందని చెప్పాను కదా – ఇక చదవండి.

నెమ్మది నెమ్మదిగా అడుగుల చప్పుడు దగ్గరైంది. కాసేపటికి మసగ్గా ఒక ఆకారం కనబడ్డది. మంచి ఒడ్డూ పొడుగూ తెలుస్తోంది. కాసేపటికి చూస్తే, అవతల ఒకతను నిలబడి ఉన్నాడు. అతన్ని చూడంగానే – ఎందుకోగానీ – ఏంటో జీవితం! అనిపించింది. ఎందుకూ? అంటే చెప్పలేను. మనిషి చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నాడు కానీ, ఏమిటో లోపం ఉంది – అదేంటో అర్థం కాలేదు నాకు. మొహంలో నవ్వులేదా – ఉంది. వెలుగు లేదా – ఉంది. మరేమిటి లోటు? నాగ్గానీ అవతల మనిషి లోగుట్టు తెలీకుండానే ఫీలయ్యే జబ్బేదన్నా వచ్చిందేమో అని ఓ క్షణం అనుమానం కూడా వచ్చింది. ఇంతలో – మరో సందేహం తట్టింది మనసులో – వీళ్ళిద్దరేరీ? ఏం చేస్తున్నారు? వెనక్కి తిరిగి చూస్తే – కా.పు. ఒక ’వావ్’ లుక్కేసుకుని ఈ కొత్త వ్యక్తిని చూస్తున్నాడు. నిశి – ఎప్పట్లాగే ’ఎవడైతే నాకేంటి’ అన్నట్లు నిర్లిప్తంగా ఉంది.

అతను నెమ్మదిగా మమ్మల్ని సమీపించాడు. ఏమీ మాట్లాడలేదు. సన్నగా నవ్వాడు. నన్నూ, నిశి నీ చూసి – మా మొహాల్లో ’వావ్’ భావం కనబడనందుకేమో – వెంటనే కా.పు. వైపుకి తిరిగాడు.
’బాగున్నావా? ఈమధ్య కనబడ్డం లేదు?’ అని అడిగాడు.
’మనం మనం ఒకళ్లకొకళ్ళం తారసపడేది కొన్ని వేల సంవత్సరాలకి ఒకసారే కదా సార్’ అన్నాడతను వినమ్రంగా.
’ఇతనే వినమ్రంగా మాట్లాడుతున్నాడంటే అతగాడెవరో వీళ్ళ హైరార్కీలో బిగ్ షాట్ ఐ ఉంటాడు కదూ..’ ఆసరికే నిశి చెవి దగ్గరకి చేరి గొణిగాను.
’ఎవరో ఒకర్లే. మనకెందుకు?’ అంది నిశి నిర్లిప్తంగా.
-అదిగో, అప్పుడే నిశి పై అనుమానమొచ్చింది. ఇంత తేలిగ్గా ఎలా వదిలేసింది? కా.పు. కథలాగే, కాసేపాగాక – ఇతనూ, నిశీ కూడా ఫలానా ఎక్స్ వేల సంవత్సరాల క్రితం మనం వై వాళ్ళింట్లో పెళ్ళిలో కలిసామనో, ఫలానా యుద్ధంలో మనిద్దరం కలిసి పోరాడాం అనో – ఇలా ఏదో కథ మొదలుపెడతారేమో అని అనుమానం కలిగింది. వీళ్ళంతా ఎక్కడ దొరికారో. వీళ్ళలో ఎవరో ఆ మాన్ ఫ్రం ఎర్త్ దర్శకుడికి తగిలి ఈ కథ చెప్పుంటారు – అనుకున్నాను.
మళ్ళీ ఇహలోకంలో అక్కడే ముగ్గురున్నారని గుర్తొచ్చి – ఈ కొత్త వ్యక్తిని మరోసారి పరికించి చూశాను.

ఇతనిలో ఉన్న లోపం ఏమిటి? ఎందుకు నాకు ఇతన్ని చూస్తే జాలేస్తోంది? – అదే నిశితో గొణిగాను – ’ఎందుకో తెలీట్లేదు కానీ, ఇతనిలో ఏదో లోపం ఉందనిపిస్తోంది’ అని. ’నాకైతే ఎందుకోగానీ ఇతన్ని చూస్తే చిరాకేస్తోంది. అందులోనూ ఈ కా.పు. అతి వినయం చూపిస్తున్నాడు – అసలు నచ్చట్లేదు.’ అంది నిశి కూడా.
అసలే మన నిశి కి వినయం, అణుకువ వంటి గుణాలంటే పడదు. దానిలో కూడా ’అతి’ చేస్తే, ఇక చిరాకు రాక ఏం చేస్తుంది చెప్పండి. 🙂
మన కొత్త మనిషి – పైకి బానే ఉన్నాడు కానీ, ఏదో గుర్తు తెలియని వ్యాధితో బాధపడుతున్నాడేమో అనిపించింది నాకు. అసలు అది వ్యాధో కాదో అని మళ్ళీ అనుమానం. అసలు వ్యాధి ఉంటే అతనికి తెలుసో లేదో. ఈ ఆనందం నటనా? లేకపోతే, గుబులూ, దిగులూ రెండూ ఆనందంతో కలిసి మెలిసి జీవిస్తూ ఉండటంవల్ల అతని మొహం చూస్తే నాకలా అనిపిస్తోందా?
“’వలపూ, వగపూ, నవ్వూ, ఏడుపు’ అన్నింటి కలబోతలా ఉన్నాడు కదూ” – నిశి నవ్వుతూ గొణిగింది.
కొంపదీసి ఈవిడగారికి మైండ్ రీడింగ్ గానీ తెలుసా? అని సందేహం కలిగింది.

ఇంతలో, వాళ్ళ మధ్య చర్చలు ఐపోయినట్లున్నాయి. మావైపుకి తిరిగారు. కొత్త వ్యక్తి అడిగాడు – ’ఎవరు మీరు?’ అని.
’ఇక్కడ ఉన్నది మేము..వచ్చింది నువ్వు… ఎవరు ఎవరికి మొదట పరిచయం చేసుకోవాలి?” – నిశి ధిక్కార స్వరంలో అడిగింది.
కా.పు. ఉగ్రుడైపోయాడు – “ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నాడు.
కానీ, అతను మాత్రం ప్రశాంతంగా, “బహుశా మీరు నన్ను మానవాకారంలో చూసుండరు. కానీ, నేనెవరో మీకందరికీ తెలుసు” అన్నాడు.
“వీళ్ళంతా మానవాకారాలు ఎందుకు వేస్కుంటారో – కాలనికి కా.పు. వచ్చినట్లు, ఈయన దేనికొచ్చాడో.. ఇక ఈయన గారు ఎన్ని కథలు చెబుతారో!” అని గొణుక్కున్నాను.
“మాకు తెలుసా? – ఎవరు నువ్వు?” – నిశి కుతూహలంగా అడిగింది.
“నాకు కాస్త మైండ్ రీడింగ్ తెలుసు అమ్మాయిలూ – మీరు ఇందాకట్నుంచి నా గురించి ఏమనుకుంటున్నారో తెలుస్తూనే ఉంది. పైగా, నా వినికిడి కొంత ఘనమైనదనే చెప్పాలి. మీరు గొణుక్కున్నవి కూడా వినబడ్డాయి”
“మనకి ఇది కూడానా!” అనుకున్నా మనసులో.
“మీరు నా గురించి ఊహించినది కరెక్టే.”
“అంటే?” అన్నాం నేనూ నిశీ ఒకేసారి.
“అదే – ఆనందం, విషాదం, వలపూ, వగపూ అన్నీ కలగలసినట్లున్నాను నేను అని అనుకున్నారు కదా…”
“అవును, అనుకున్నాము… అయితే…?” -అన్నాం మళ్ళీ.
“అయితే ఏమిటీ? ఆయనెవరో తెలియట్లేదూ?” – అంటూ ఇంకేదో అనబోయిన కా.పు. నిశి తనని ఉరిమి చూడ్డంతో ఊరుకున్నాడు.

“అది నిజమే – నేను నిజంగా అన్ని భావాల కలబోతనే.” – అన్నాడాయనే మళ్ళీ.
“ఏం చేయమంటావు అయితే?” -అంది నిశి.
ఎవరో పెద్దాయనలా ఉన్నాడు. కాస్త గౌరవం ఇవ్వొచ్చు కదా… ఊహు…నిశిది అంతా అమెరికన్ స్టైలనుకుంటాను.
“ఇప్పుడైనా నేనెవరో కనిపెట్టగలరేమో నని..” అన్నాడు కాస్త అవాక్కైనట్లున్నాడాయన – ఏకవచనానికి.
“నువ్వెవరైతే నాకేంటీ?” అంటూ నిశి నన్ను చూసింది.
“మీరెవరో తెలిస్తే మా బ్రతుకేమన్నా బాగుపడుతుందా చెప్పండి?” అన్నాను నేను కూడా నిర్లిప్తంగా.
ఆయన చిద్విలాసంగా నవ్వాడు. కా.పు. పెద్దగా నవ్వేశాడు.
“ఏం అలా నవ్వుతున్నారు?” అని అడిగాన్నేను కొంచెం ఉడుక్కుంటూ.
“ఆయనెవరో ఇంకా అర్థం కావడం లేదా..?”
“వలలు వగపు నవ్వూ ఏడుపు కలబోతేరా జీవితము…” – పాట గొణిగింది నిశి.
నాకైనా ఏమీ అర్థం కాలేదు.
“ఈయనకీ, మన జీవితాలకీ ఏమిటీ సంబంధం…?” – మళ్ళీ తనలో తానే గొణుక్కుంది నిశి.
రెండు క్షణాలు అలాగే మౌనంగా గడిచాయి.

కా.పు. – పరమ క్యూరియస్ గా మమ్మల్ని చూస్తున్నాడు – కనిపెట్టగలరా? అని.
ఆయన షరా మామూలుగా చిద్విలాస మూర్తి.
నేనూ షరా మామూలుగా కన్ఫూజన్ లో ఉన్నా.
నిశి – ఆలోచనా ముద్రలో.
ఇంతలో ఉన్నట్లుండి నిశికి ఏదో తట్టింది. ఒక్క ఉదుటున దూకి అతని ముందు నిలబడి, కాలర్ పట్టుకుని చెంపలు చెళ్ళుమనిపించసాగింది. ఆ హఠాత్పరిణామానికి ఏం చేయాలో తోచలేదు నాకు. అవతల కా.పు.ని చూస్తే అలాగే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఈ పెద్దమనిషి నిశి ఉక్కు పిడికిలి తప్పించుకోడానికి గింజుకుంటున్నాడు. నిశి ది అసలే కొన్ని వేల ఏళ్ళ తరబడి రెగులర్ గా ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన శరీరం కనుక, అమ్మాయి అయినా కూడా ఆయనకంటే బలిష్టంగా ఉంది. ఇక కా.పు. నుంచి సాయం ఆశించడం దండుగ కనక – నేనే నిశి ని ఆపే ప్రయత్నం మొదలుపెట్టాను.

“నీ కోసమే ఇన్నాళ్ళుగా వెదుకుతున్నది. నన్ను మోసం చేసి తప్పించుకోగలననే అనుకున్నావా” – నిశి ఆవేశంగా అంటోంది.
“నువ్వు నన్ను అపార్థం చేస్కుంటున్నావు… నేను నిన్నేం మోసం చేయలేదు..అప్పటి పరిస్థితుల్లో…” – అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
“ఏం పరిస్థితులు? ఎవరి పరిస్థితులు? నీ అవసరానికి నన్ను ఉపయోగించుకుని – పరిస్థితులను అడ్డుపెడతావా?”
“ఎందుకు ప్రతీదానికీ పెడార్థాలు తీస్తావు? నీ ఆనందమే కదా నేను కోరుకునేది కూడా”
“నువ్వుండగా ఆనందం ఎక్కడిది…పగ తప్ప!” నిశి అరిచింది.
ఇదేదో ప్రేమ వ్యవహారంలా అనిపించింది నాకు. ముందు నిశి ని ప్రేమించిన వాడు తగిలాడు. ఆపై నిశి ప్రేమించినవాడు. ఉన్నది చాలనట్లు వాళ్ళిద్దరు ఒకరికొకరు తెలుసు – ఏమిటీ గందరగోళం?
ఇంతలో కా.పు. తేరుకుని, వీళ్ళిద్దర్నీ విడదీసాడు. నేనూ మళ్ళీ వెళ్ళి, నిశిని గట్టిగా పట్టుకున్నా. ఇప్పుడంటే ఇలా ఉన్నా కానీ, ఒకప్పుడు అథ్లెటిక్ బాడీ కనుక, ఇంకా పిడికిలిలో కాస్త ఉక్కుంది. నిశి కాస్త చల్లబడింది.

“ఏమిటి నిశీ…ఏమిటీ ఆవేశం – ఎవరితను?” నిశి అంత కోపం తెచ్చుకునేసరికి నాకాయనపై గౌరవం పోయింది లెండి.
“ఇంకా అర్థం కాలేదా…. నన్ను ప్రేమలో పడేసి మోసం చేసినది ఎవరని చెప్పాను నీకు?
నాకొక్క క్షణం ఆలోచించాక గుర్తొచ్చింది – “జీవితం అన్నావు. అప్పట్లో జీవితం మోసం చేయడమేంటి? అని గొడవపడ్డాం కూడా కదా!” – అన్నాను.
“అడుగు అతన్నే – అతనే జీవితానికి మానుష రూపం” అంది నిశి, ఇంకా ముక్కుపుటాలు అదురుతూండగా.
“జీవితమా!!!” అని గట్టిగా అరిచాను.

ఇంతలో, క్రమంగా నిశి “పగలౌతోంది” అనేసి ఆవలివైపుకి వెళ్ళడమూ, కాపు, ఆ కొత్తమనిషి ఫేడవుట్ కావడమూ తెలిసింది. మరుక్షణంలో ఇంట్లో ’కాఫీ’ శ్రీముఖాలతో మెలుకువొచ్చింది.

ఆరోజుకి అక్కడ అయింది కానీ, ఏమైనా, ఒకరోజున జీవితాన్ని ఎవరైనా అలా వాయించడం చూస్తాననుకోలేదు. ఆ పై జరిగిన కథ రాబోయే భాగాలలో….

Advertisements
Published in: on June 22, 2010 at 12:12 pm  Comments (8)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/06/22/nisyalochanapatham-23/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

  1. Shreya Ghoshal “nishaachars” ani edo tweet chesindi, Chaala rojulaindi Sowmya gaari blog chusi “nisyaalochanaapatham” new episodes chadavaledemo anukunna, meeru raayaneledanna maata 🙂

  2. Ahaa entha serious ga raasarandee baboo…thondaraga serial complete cheyyandi.

  3. maaku utkhantha… ikkada!!
    tvaragaa next episode raayaalani manavi. 😀

  4. wow! personifying life; that’s quite uncanny.

  5. […] (ఇరవై మూడో భాగం […]

  6. […] విరక్తి పుట్టించే ఆ జగన్మోహనాకారుడే జీవితం. (అతనెలా ఉంటాడో తెల్సుకోవాలంటే […]

  7. […] చెప్పు నిశీ, ఏమిటీ విశేషాలు? జీవితం ఎలా ఉంది? కా.పు. మళ్ళీ కలిసాడా? మీ […]

  8. […] నిశి ఆమధ్య చీల్చి చెండాడిన “జీవితం“! తక్కిన ఎవరూ ఇద్దరో నాకు అర్థం […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: