నిశ్యాలోచనాపథం – 21

(నెలన్నర క్రితం రాసిన ఇరవయ్యో భాగం ఇక్కడ)

“అది కాదు గానీ, ఏవోయ్… నీ అనుభవాల్లోంచి ఒక మంచి కథ చెప్పరాదు?” – నిశి ఎప్పట్లాగే తన ఠీవికి తగ్గకుండా అడిగింది.
ఆసరికే పాపం కా.పు. కి నిశి అంటే భయంతో కూడిన అతిభయం వల్ల వచ్చిన వీరభయం పట్టుకుంది. మాటల్తో ఖూనీ చేసేస్తుందేమో తనని – అసలే ఇంకా జూనియర్ కా.పు. ల రిక్రూట్మెంట్ కూడా పూర్తి కాలేదు..తాను పోతే, వాళ్ళ ఎండీ ఏడుస్తాడని అతని భయం. కల్లోనైనా పైవాడిని నిందించరాదు – నిందిస్తే, నిదురా, కలలూ, బ్రతుకూ, చావు – దేనికీ పనికిరాకుండా పోతామన్నది కా.పు. జీవిత సూత్రం(ట). పైవాడంటే అతని పై వాడు. ఇతని కేసులో రెండూ ఒకటేననుకోండి, అది వేరే సంగతి.

“ఎలాంటి కథ చెప్పాలంటారు?” – అన్నాడు ఇద్దర్నీ చూస్తూ. నిజానికి అతను నిశి నే గౌరవంగా “రు” అనుంటాడు. కానీ, అలా డైరెక్టుగా అని, ఆ తరువాత నిశి మళ్ళీ నన్నెందుకు గారు అంటున్నావ్ అని ఉరిమి చూసిందంటే.. అని ఆలోచించి భయమేసి ఇద్దర్నీ అడిగినట్లు అన్నాడు.
“నీకెలాంటి కథ చెప్పాలనుంది?” – ఎవర్నైనా, వాళ్ళు తనని ఎలా పిల్చినా, నువ్వు అనేసేయగలదు నిశి.
“అంటే, అడిగింది మీరు కద….” అని నసిగాడు కా.పు.
“కాలాన్ని నిలదీసే ఎత్తరుల కథ ఏదన్నా ఉందా?” అన్నాన్నేను ఠపీమని. అక్కడే కదా అసలు చర్చ మొదలైంది అప్పుడెప్పుడో!
“మామూలుగా కాదు. కాలరెత్తి…” అంది నిశి తీవ్రంగా.
పాపం ఒక్కసారి కా.పు. ఉలిక్కిపడ్డాడు. ఓసారి తన మెడవైపు చూస్కుని, తనది రౌండ్ నెక్ అని అర్థమై, ఊపిరిపీల్చుకుని
కా.పు. చెప్పిన పిట్టకథల్లో ఒక కథ –

ఒకరోజు ఇతను ఎప్పట్లాగే రయ్యి రయ్యి మని పోతూ ఉన్నాడట. అవతల వైపునుండి ఒకతను తాగి నడుస్తున్నట్లు అటూ ఇటూ ఊగుతూ వస్తున్నాడట. కళ్ళేమో గాల్లో. కాళ్ళు కూడా గాల్లోనే ఉన్నాయేమో అన్నట్లు మధ్య మధ్యలో ఎగురుతున్నాడు. కరెక్టు గా అదే సమయంలో అవతలి దిక్కు నుండి కాపు.2 దూసుకొచ్చి, ఇతని చేతిలోంచి ఎనెర్జీ డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు. దానితో ఇతనికి తీరిక దొరికిందట. నేనేం చెప్పేది కానీ, అప్పట్లో రిజిస్టరైపోయిన సంభాషణ అలాగే పెడుతున్నా –

“ఈ వాలకం నాకు బొత్తిగా అర్థం కాలేదు. సరే, ఎలాగో కొన్నాళ్ళ దాకా నాకు ఖాళీయే కదా అని అతన్ని కాసేపు కెలుకుదామనిపించింది. దానితో అతన్ని ఆపాను.” – అని మొదలుపెట్టాడు మన కాపు.
*****************************
“ఎవర్నువ్వు? ఏమిటా వాలకం?” -అని అడిగాను.
అతన్నన్ను ఎగాదిగా చూశాడు.
“ఎవర్నువ్వు? ఏమిటా వాలకం?” అన్నాడు అతను కూడా.
అప్పటికి నాకు తాగి మనుష్యులు రోడ్డుపై నడుస్తూ ఉంటారన్న కాన్సెప్టు తెలీదు కదా…. దానితో, అతని వాలకం అదీ అన్నది తెలీలేదు…
*********************
– ఇంతలో నిశీ అతన్ని ఆపింది.
“ఏం తాగితే నడవరా? తాక్కపోతే నడవరా? రోడ్డుపై కాక, నీ హెల్మెట్ పై నడుస్తారా? కాన్సెప్టు తెలీదట..కాన్సెప్టు..హు!” అని విసుక్కుంది.
“అది కాదండీ… నాకు అప్పటికి తాగుడు గురించి తెలీదు…”
“ఎప్పటికీ??”
“అమ్మా! ఏదో కథ చెప్పమన్నారని మొదలుపెట్టాను… నన్ను నమిలేయకండి. ఈ కథ ఎప్పుడో రాయలవారి కాలంలో జరిగింది.”
“రత్నాలూ అవీ నిజమ్గా అమ్మేవారా అయితే?” అన్నాన్నేను వెంటనే ఠకీమని.
“పాపం అతను రాత్రి కదా తిరిగేది… రాత్రుళ్ళు దుకాణాలు కట్టేస్తారు కదా.. ఏమయ్యా, అంతేనా?” అంది నిశీ మొనాలిసా నవ్వు సూర్యకాంతంలా నవ్వుతూ.
“యా! అదే చెప్పబోతున్నా…” అంటున్నవాడల్లా నిశీని చూసి ఆగాడు. ఇప్పుడు తను మాయాబజార్లో ఎస్వీరంగారావుని ’చిన మాయా పెను మాయా..’ అంటూ ఆపేసిన ముసలాయనలా పకపకా నవ్వడం మొదలుపెట్టింది.
“చూసావోయ్, నే జెప్పలా?” అన్నట్లు చూసింది నా వైపు.
“అరే! నిజమండీ బాబూ!…” – బ్రతిమాలుతున్నట్లు అన్నాడతను.
“రాయలకాలం నాటి నుంచీ మీరున్నారంటారు… మరి మీ బైకేమిటీ అల్ట్రా మాడర్న్ గా ఉంది?” అన్నాన్నేను…నిశి తో ఉండి ఉండీ నాకూ తెలివి పెరిగిపోతోంది అనుకుంటూ…
“ఆ, అదేం పెద్ద విషయం కాదులే, కాలంతో పాటు మనమూ మారాలి…” కొట్టిపారేసింది నిశి.
“ఈ నిశికి కుళ్ళు నేను ఇంటెలిలేడీ ప్రశ్నలేస్తున్నందుకు” అనుకున్నా మనసులో. పైకి అదంటే ఏమౌతుందో అని భయమేసి – “ఇహిహి…సరే…” అన్నా.
“సరే, ఏంటంటావ్ ఇప్పుడూ?” అంది నిశి మళ్ళీ.
“అమ్మలూ, ఏదో బుద్ధి గడ్డితిని అప్పట్లో అమాయకపు వెధవగా ఏడ్చాను. అందుకే అలాంటి సంగతులు తెలుసుకోలేకపోయాను. బుద్ధి మళ్ళీ గడ్డి తిని మీ కళ్ళబడ్డాను… నన్ను క్షమించండి.” ఏడుస్తున్నట్లే అన్నాడతను.
“సరేలెండి, ఏదో ఒకటి, మీరు కథ కానివ్వండీ” అన్నాన్నేను అతనిపై జాలేసి.
************************************
కా.పు. కథ:
అతనితో మాట్లాడ్డం కోసం ప్రయత్నిస్తున్నాను..
“ఏం చేస్తున్నారండీ?”
“కనబడ్డంలా? నడుస్తున్నా…”
“అది కాదండీ – ఉండుండి ఎగుర్తున్నారు కదా…ఏమన్నా అయిందేమోనని…”
“నా ఇష్టం..నా ఎగురుడు…” అన్నాడతను పెడసరంగా.
“అది కాదండీ, ఏదో మామూలుగా అడిగాను అంతే. మీరంత కోపంగా స్పందిస్తే ఎలాగు?”
“నా ఇష్టం. నువ్వెవరవు నన్నాపడానికి?”
“నేనేం అనలేదు కదా…”
“ఏయ్! రాయలవారి సైనికుడినే పట్టుకుని ఆపి ప్రశ్నిస్తావా….”
“మీరా? సైనికులా? దుస్తులలా లేవే….?”
“ఇప్పుడు పని చేయడంలేదు…అయినా నేను సైనికుడినే…”

నాకేం చెప్పాలో తోచలేదు. ఇంకా ఆలోచిస్తూ ఉండగానే – “ఏయ్! నన్నే ఎదిరిస్తావా? రాత్రుళ్ళు మా వాళ్ళంతా వెదుకుతున్న గండడివి నువ్వే కదూ… దొరికావ్. ఇంత తేలిగ్గా చిక్కుతావ్ అనుకోలేదు. మధుపానలోలుడివై వీథుల్లో తిరుగుతూ ఉంటే దొరికిపోయావని రేపు అందరికీ తెలిసిపోతుంది…” అంటూ నన్ను గట్టిగా డొక్కలో తన్నాడు మొదట. నేను కింద పడి, లేచే ప్రయత్నం చేస్తూనే, తప్పించుకోడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. వీడెవడో మనకెందుకొచ్చింది…నిజమ్గానే జైల్లో వేస్తే, ఈ ప్రపంచంలో ఉనికైనా లేని నేను…ఏ ప్రపంచంలోనూ ఉనికి లేకుండా పోతానేమో నని భయమేసింది. లేవగానే పారిపోవాలి అనుకుంటూ పైకి చూస్తే, వాడు నన్ను మళ్ళీ తన్నబోతున్నాడు. భయంతో కళ్ళకి చేతులడ్డంపెట్టి, కాళ్ళు ముడిచేసాను. ఒక సెకను, రెండు మూడు సెకన్లైనా ఏమీ కాలేదు. కళ్ళు తెరిచి చూస్తే –
ఝాన్సీ రాణి లెవెల్లో ఓ అమ్మాయి గుర్రంపై వచ్చింది. ఒక కొరడా తో మన వాడిని కొడుతూ ఉంది. నాలుగు దెబ్బలు పడగానే, గుర్రంపైన్నుంచి దిగి, వాడి ముక్కుకు ఏదో గుడ్డను అదిమింది. బహుశా, మనం ఇప్పుడు దాన్నే క్లోరోఫాం అంటున్నాం ఏమో… వాడు స్పృహ తప్పగానే, ఏదో చీటీ రాసి – దాన్ని గుర్రం జీను వద్ద పెట్టి, వీడిని గుర్రం పైకి ఎక్కించింది – (అబ్బా! ఎంత బలమూ! అనుకున్నా)
ఎక్కాక నావైపుకి తిరిగి –

“ఎవర్నువ్వు?” అని అడిగింది. ఒక అమ్మాయిలో ఇంత ధైర్యసాహసాలు చూడ్డం అదే మొదలు. ఇంత ధీమా ఈమెకిచ్చిందెవరో? అనుకున్నాను.
“ఎవర్నువ్వు? అంత చేవలేనివాడివి ఎందుకు ఒక్కడివే తిరుగుతున్నావ్ ఈ వీథుల్లో? వాడే దొంగో అయి ఉంటాడు…” అన్నది.
“కాదు…అతనెవరో రాజు గారి సైనికుడట.”
“హహహహ…” అంది ఆ అమ్మాయి.
“సరే, ఇప్పుడేం చేయబోతున్నావ్? ఎటువెళ్ళాలో చెబితే, ఆ దారిలో నిన్ను వదిలి వెళతాను..” అంది ఆ అమ్మాయే మళ్ళీ.
“మీతో కల్సి నడవాలనుంది…” అనేసాను వెంటనే. లవ్ అట్ ఫస్ట్ సైట్…
“కలిసే వెళ్ళాలిక. మీకు దారి తెలీదుగా…”
“దారి చూపిన దేవతా ఈ చేయి యెన్నడు వీడక ..” అన్నాన్నేను నా చెయ్యందిస్తూ (తరువాత ఇది ’గృహప్రవేశం’ సినిమాలో వాడారట. నా కొలీగ్ చెప్పాడు)
అప్పుడామె మృదువుగా నవ్వి, “వదలడానికా పట్టుకున్నది?” అంది.
అక్కడ మొదలైంది మా ప్రేమకథ.
***************************************************
“ఇందాకటిదాకా సీరియస్గా ఉన్నామె ఇంతలో ఎలా నవ్వింది?” – అన్నాన్నేను వెంటనే.
“ఆమెకి కూడా లవ్ అట్ ఫస్ట్ సైట్” అన్నాడతను వెంటనే.
“మీతోనా? నాకేంటో అనుమానంగా ఉంది ఈ కథ వాలకం” అన్నాన్నేను.
“అనుమానం కాదు…నిజం…ఈ కథ బోగస్” అంది నిశీ – తీవ్రంగా కా.పు. వంక చూస్తూ.
“బోగస్సా…అబ్బెబ్బె…అదేం లేదు… నిజమే… అయినా, మీకెలా తెలుసు బోగస్సని? ఏ ఆధారంతో అంటున్నారు?” కొంత బింకంగా అన్నాడతడు.
“నిలువెత్తు ఆధారంతో” – నింపాదిగా అంది నిశీ.
“ఏమిటది?” నేను, కాపు ఇద్దరం అన్నాం ఒకేసారి.
“అంత ప్రేమించిన అమ్మాయి మొహం కూడా గుర్తు లేదా” – అని మరోసారి పెద్దగా నవ్వింది నిశి.
ఇక అక్కడ జరిగిన దృశ్యం ఈ జన్మకి నేను మరువలేను…. మీరు ’మేన్ ఫ్రం ఎర్త్’ సినిమా చూశారా?/విన్నారా? – కనీసం వికీ పేజీ అన్నా చదివి గానీ నెక్స్ట్ పార్ట్ చదవకండి.  ఈసరికి అక్కడేం జరిగిందో కొంత ఊహించుకున్నారు కదూ? త్వరలో వచ్చేసి చెబుతా ఏమైందో…మరీ పెద్దదైందని ఇక్కడ ఆపుతున్నా ఇప్పటికి… నిశి వెనుక ఇంత కథుందా! అని ఆరోజు నుంచి అవాక్కయ్యే ఉన్నా. అందుకే నెలన్నరగా దర్శనమివ్వలేదు ఇక్కడ…..

Advertisements
Published in: on February 18, 2010 at 1:48 pm  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/02/18/nisyalochanapatham-21/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. You did a gr8 thing by giving the old link. I forgot some points in the gap. 😀

  2. […] జీవితం ఎలా ఉంది? కా.పు. మళ్ళీ కలిసాడా? మీ ప్రేమ ఎందాకా వచ్చింది?” అంటూండగానే… […]

  3. […] [ఇరవై ఒకటో భాగం తరువాత…] […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: