Sumangali Seva Ashram – లో కాసేపు

బెంగళూరొచ్చాక చుట్టుపక్కల విషయాల్ని పట్టించుకోడం మానేసినట్లైంది నాకు. అలాంటిది, శనివారం “సుమంగళి సేవా ఆశ్రమం” కి వెళ్ళిరావడం – కొత్త ప్రపంచం చూసిన అనుభూతి కలిగింది. నా కొలీగ్ అక్కడేదో ప్రాజెక్టు చేస్తున్నానని చెప్పడంతో మొదలైంది నాకు దీని గురించిన తొలి పరిచయం. అలా అపుడప్పుడు దీని గురించి తెలుసుకుంటూ ఉండగా – ఓ సందర్భంలో వీళ్ళ ఆశ్రమం కి అనుబంధ పాఠశాల గురించి చర్చకు వచ్చింది. ఇక్కడ ఏమన్నా టీచింగ్ వాలంటీర్ల అవసరం ఉందా? అని సందేహం కలిగింది నాకు. పాత “ఆషాకిరణ్” రోజులు గుర్తొచ్చి. ఉందనుకుంటాను అని అనడంతో, ఓ సారి వస్తానన్నాను నేను కూడా. అలా అనుకున్న దాదాపు నెలన్నర తర్వాత ఇన్నాళ్ళకి వెళ్ళాను.

1975 లో సుశీలమ్మ అనే ఆవిడ స్థాపించారట ఈ ఆశ్రమాన్ని. ఇప్పటికీ ఆమె అక్కడే ఉంటున్నారు. నేను వెళ్ళినప్పుడు బైటకి వెళ్ళారు – దాంతో కలవడం కుదర్లేదు. త్వరలో మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నా.

నేనేదో చిన్న స్కూల్-ఒక హాస్టల్ వంటి సెటప్ ఊహించుకుని వెళ్ళానా? అదో మినీ సామ్రాజ్యం. స్కూల్ ఉంది. పెద్ద హాస్టల్ ఉంది. ఒక అమ్మాయిల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ తరహా ది ఏదో ఉంది. ఇతర ఎన్జీవోలు వగైరాతో కలిసి ప్రదర్శనలు అవీ ఇచ్చే స్టేజీ ఉంది. వీటన్నింటి మధ్యలో చిన్న కుటీరం లాంటిది ఒకటి ఉండింది. చూడ్డానికి చాలా హాయిగొల్పేదిగా ఉంది. ఇక ఉండేందుకు ఎంత బాగుంటుందో అనుకున్నా – అది వాళ్ళ ఆఫీసట!! లోపల కాసేపు తిరిగాము – వీళ్ళ కిచెన్ – రోజూ దాదాపు నూటయాభై మందికి వండి పెట్టే ఎన్జీవో కిచెన్ ఎలా ఉంటుందో? అనుకున్నా – అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఆధునికంగానే ఉన్నాయి. కాస్త వెనక్కి వెళ్తే, పిల్లలు బట్టలు ఉతుక్కుంటూ, కట్టెలని మండించి దానిపై ఓ పెద్ద గంగాళంలో వేణ్ణీళ్ళు పెట్టుకుంటూ, తయారౌతూ, కనిపించారు. అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు. ఇంతమంది కనుక నీటి సమస్య ఉంటుంది కదా – వీళ్ళు తలస్నానం చేసే పద్ధతి చూస్తే, అర్థమైంది అది. అలాగే, చాలా మంది చిన్న పిల్లలకి కురచ జుట్టు – నీటి సమస్య ప్రభావం అని నా కొలీగ్ చెప్తే వెలిగింది.

పిల్లలు తమంతట తాముగా బ్రతకడం క్రమంగా తెలుసుకుంటారు ఇక్కడికొచ్చాక అంటూ ఓ పిల్లని చూపిస్తూ నా కొలీగ్ చెప్పుకొచ్చింది – మూణ్ణెల్ల క్రితం ఈ పిల్ల (చిన్నమ్మాయే… ఆరేడేళ్ళు ఉండొచ్చు) ఇక్కడకి వచ్చినప్పుడు ఏం తెలీకుండా ఉండేది. ఇప్పుడు తనంతట తాను చాలా పనులు చేస్తుంది అని. అలాగే, కాస్త పెద్ద పిల్లలు చిన్న పిల్లల బాగోగులు చూస్కోడం వగైరా – హాస్టల్ లో బ్రతకడానికి అలవాటు పడిపోతారన్నమాట. ఆదివారం పేరెంట్స్ మీటింగ్ అట. ఇక్కడి రెసిడెంట్స్ లో, అనాథ బాలికలతో పాటు, ఊర్లు తిరుగుతూ ఉండే రోజుకూలీల పిల్లలు కూడా ఉంటారట – ఈ మీటింగ్ గురించి తెలిసినప్పుడు ఈ సంగతి తెలిసింది. మామూలుగా చూస్తే, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది ఇక్కడ నాకు. బక్రీద్ అని స్కూల్ కి సెలవట. కనుక, పిల్లలు అటూ ఇటూ ఊరికే తిరుగుతూ ఉన్నారు. హాస్టల్ అమ్మాయిలకి మాత్రమేనట. ఒకటి నుండీ ఏడు తరగతుల దాకా స్కూల్ లో అబ్బాయిలు కూడా ఉంటారట. హాస్టల్ అమ్మాయిలకి మాత్రమే. ఎనిమిది-పది తరగతుల వరకు స్కూల్ కూడా అమ్మాయిలు మాత్రమే. చుట్టుపక్కల ఇతర ఎన్జీవోలు వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయట. లోగుట్టు నాకు తెలీదు కానీ, నేను చూసినంతలో నాకు ఈ సంస్థ గురించి మంచి అభిప్రాయమే కలిగింది.

నేనక్కడున్నప్పుడే, ఓ స్కూల్ పిల్లలని ఇక్కడికి విజిట్ కి తెచ్చారు వాళ్ళ టీచర్లు. టిపికల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు. చూడగానే – తేడా స్పష్టంగా తెలిసొచ్చింది నాకైతే. తమ కమ్ఫర్ట్ జోన్ కి ఆవల కూడా జీవితం ఉంది అని చిన్నవయసులో వాళ్ళకి ఎంత మాత్రం అర్థమౌతుందో కానీ, ఒక విధంగా ఇదీ మంచికే.

ssa వాళ్ళ స్కూల్ సంగతి – నేను వచ్చిందే దానిపై ఆసక్తితో – నాకు మహా అనుమానంగా ఉండింది మొదట్నుంచీ – ఈ స్కుల్లో టీచర్లెవరు? అని. ప్రభుత్వ టీచర్లట – అయితే, ఏడో తరగతి దాకా ప్రభుత్వం సాలరీ. మిగితా వారికి సంస్థ సాలరీ ఇస్తుందట. స్కూల్ అయ్యాక హోమ్వర్క్ గట్రా ఎవరు చేయిస్తారు? అంటే, నాకర్థమైనంతలో ఇక్కడ పెద్ద సాయం ఏం ఉండదనుకుంటాను పిల్లలకి. వార్డెన్లు వారూ చెప్పగలిగినా, పెద్ద తరగతుల పిల్లలకి సాయం దొరకడం కష్టంగా ఉందట. దీనికి వాలంటీర్ల కోసం చూస్తున్నారట. కన్నడం నాకు రాకున్నా, పిల్లలకి తెలుగు అర్థమౌతుంది కనుక, ఒకళ్ళిద్దరితో మాటలు కలిపాను. ఓ నాలుగో తరగతి పిల్లని మీకే సబ్జెక్టులు ఉంటాయంటే – కన్నడ, పరిసర విజ్ఞాన, గణిత, ఇంగ్లీషు అన్నది. సోషల్? అంటే లేదు అన్నది. ఇంగ్లీషు లో ఏం చెప్తారు? అన్నా. కన్నడ అన్నది. ఏం చెప్పేది? కొంతమంది తెలుగును ఇంగ్లీషులో మాట్లాడతారే… అలా…ఇక్కడ ఇంగ్లీషుని కన్నడలో చెబుతారట! పెద్ద క్లాసు పిల్లలకి గణితం-సైన్సు చెప్పడానికే కాదు. మొదట్నుంచీ చివర్దాకా ఈ పిల్లలకి ఇంగ్లీషు నేర్పడానికి కూడా మనుషులు అవసరం ఏమో అనిపించింది.

ప్రభుత్వ పాఠశాలల టీచర్ల గురించి కాసేపు అనుకున్నాము. అలాగే, ఏవిటో, మనదేశంలో ఈ సైడ్ రావడానికి మోటివేషనే ఉండదు – బాగా చదువ్కున్న వారు ఎపుడైతే ఇలా పాఠాలు చెప్పేందుకొస్తారో, అప్పుడు గానీ, ఇలాంటి పాఠశాలల పరిస్థితి బాగుపడదు అనిపించింది నాకైతే. ఈ విషయాల గురించి అక్కడ ఆఫీసులో మాట్లాడాలనుకున్నాను. వాలంటీర్లు కావాలంటే – ఏం చేసేందుకు? పాఠాలు చెప్పేందుకు మీకు మనుష్యులు అవసరం అనిపిస్తోంది, అలాగే… ఈ పిల్లలకి కాస్త exposure- అవసరం వంటి సంగతులు… కానీ, మేము కలవాలనుకున్న మనిషి లెకపోడంతో వెనక్కొచ్చేశాము. మళ్ళీ వెళ్ళాలి.

వీళ్ళకి ఫండ్స్ అవీ పర్లేదు – మనుషులే అవసరం ఏమో అని నా అభిప్రాయం. అలాగే, ఈ పిల్లలకి కాస్త బైట ప్రపంచం తెలీడం కూడా చాలా అవసరం అనిపిస్తోంది. ఈ ప్రాంగణం నుండి వీళ్ళు బైటకి వెళ్ళేది చాలా తక్కువట. ఈ కాలంలో ఇలా ఉంటే, చివర్లో స్కూల్ జీవితం ముగిశాక చాలా కష్టమవొచ్చు – అసలే ఆడపిల్లలు మాత్రమే ఉంటారు తమ స్కూల్లో, తమ చుట్టుపక్కల కూడానూ.

వీళ్ళ వివరాలు:
Sumangali Seva Ashrama
Cholanayakanahalli
R.T.Nagar Post
Bangalore-560032
Phone: 65301393/65301388

ఎలా వెళ్ళాలి: బళ్ళారీ రోడ్డుపై కనిపించే హెబ్బాళ్ బస్టాపు వద్ద ఎవర్నడినా చెప్తారు. అసలు బస్టాపు పక్కనే ఓ రోడ్డులో తిరిగాము…రోడ్డు పేరే SSA Road.

Advertisements
Published in: on November 30, 2009 at 9:00 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/11/30/sumangali-seva-ashram/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. Nice to know. Yes, public welfare organizations need support in many ways. Enough funds can only take care of their basic needs. Above that they need volunteers to teach and bring up their confidence levels.

  >>చివర్లో స్కూల్ జీవితం ముగిశాక చాలా కష్టమవొచ్చు
  Right. Do you have any suggestions in mind?

 2. మొన్న ఓసారి, మాఅక్క వాళ్ళ స్నేహితురాలికి పిల్లలు లేరట… ఏదైనా అనాథ శరణాలయం నుండి ఒక అబ్బాయి/అమ్మాయి ని దత్తత తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకో, నా కయితే నవ్వొచ్చింది. వాళ్ళను యిలా మనందరి మధ్యకు తీసుకు వచ్చినప్పుడే అసలైన ’అనాథ’ అవుతారేమోనని అనిపించింది.
  SSA లో పిల్లల కోసం SSA, మీ లాంటి చాలామంది సానుభూతి, సహకారం వుంటాయి. వాళ్ళందరూ ఒకరికోసం ఒకరు, వాళ్ళందరిదీ ఒకే Category, ఒకే లోకం… వాళ్ళందరికీ ఒకే రకమైన సమస్య. మరి, మన ఇళ్ళల్లో పిల్లలను చూస్తే… హహహ… అమ్మా నాన్నల పరువు, బయట పోటీ.. పద్ధతులూ.. ఎన్నెన్ని బరువులో… పాపం కదూ. నాకయితే మనమే అనాథలం అనిపిస్తుంది. ఇదే విషయమే మాఅక్క వాళ్ళకూ చెప్పాను. నన్ను వింతగా చూశారు. నేను బెంగుళూరు వచ్చేశాను…

  నా నస అంతా ఇక్కడ అనవసరంగానీ… ఈ weekend కు ఇక్కడ visit వేయొచ్చుఅన్నమాట. మరి నేనేమి సహాయం చేసేస్తానో అనుకునేరు..! చెప్పాగా.. నేనే ఒక (అన్నీ వున్న)అనాథను. వాళ్ళకేమి చేయగలనండీ? కాకపోతే.. మీరందరి సహకారంతో పెరుగుతున్న ఆ పూతోటలో చిరునవ్వుల ముత్యాలు ఏరుకుందామనే చిన్న స్వార్థంతో వెళ్తాను.

  >>చివర్లో స్కూల్ జీవితం ముగిశాక చాలా కష్టమవొచ్చు.– మీలాంటివాళ్ళందరూ touch లో వుంటారు కదా. అది చాలు. అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళకు చదువుతో పాటు జీవితపు వైశాల్యాన్నీ తెలియజేయండి. వాళ్ళే దూసుకెళ్తారు.

 3. @Murali
  Your outlook is quite interesting. చదివి, సిరివెన్నెల రాసిన క్రింది మాటలు గుర్తొచ్చాయి.
  “జగమంత కుటుంబం నాది,
  ఏకాకి జీవితం నాది.”
  >> ఆ పూతోటలో చిరునవ్వుల ముత్యాలు ఏరుకుందామనే చిన్న స్వార్థంతో వెళ్తాను.
  ఇలా అయితే, ప్రతి ఒక్కరూ స్వార్థపరులే! 🙂

  Have a happy visit and do share your experience. We would love to know.

 4. bagundi chaala baaga raasaru…

 5. Nice to know about Sumangali Seva Ashram 🙂 .. మీరనట్టు స్కూల్ జీవితం ముగిశాక బయట కష్టంగా ఉంటుంది అన్న దానిలో సందేహం ఏమి లేదు..ఎంతో కొంత బయట ప్రపంచానికి exposure ఉండటం చాలా అవసరం.

 6. మోహన గారూ… చాలా చాలా ఆలస్యం గా బదులు రాస్తున్నందుకు క్షమించాలి… నిజానికి… ఆ వీక్ ఎండ్ నే SSA కు వెళ్ళాను. కానీ వెళ్ళేసరికి సాయంకాలం ఆరు గంటలయింది. సో, అక్కడున్న వాళ్ళతో మాట్లాడి… తీసుకెళ్ళిన క్రిష్ణుడి బొమ్మ gift ను ఇచ్చి… అక్కడే వచ్చిన వాళ్ళని పలకరిస్తున్న కొంతమంది చిన్న పిల్లల్ని దూరం నుండి చూస్తూ కూర్చున్నాను. వెళ్ళాలి అనుకున్న రోజు నుండి… వాళ్ళకు ఏ gift తీసుకెళ్ళాలా అని తీవ్రంగా ఆలోచించి… చివరికి క్రిష్ణుడి బొమ్మ ను తీసుకెళ్ళాను. అమ్మాయిల గదుల్లో ఏఏ వస్తువులు వుండాలో తెలీదు గానీ… కన్నయ్య విగ్రహం మాత్రం ఖచ్చితంగా వుండాలి అని అనిపిస్తుంది. గుండెల్లో భారాన్ని దించుకోవటానికి యింతకన్నా మంచి నేస్తం ఇంకెక్కడా దొరకడు.

  కానీ, అక్కడ ఎక్కువ సేపు వుండలేక పోయాను. ఇలా ఎవరికైనా సహాయం చేయటానికి కూడా చాలా ధైర్యం కావాలి అని అనిపించటం ఇది రెండోసారి. ’ఖాళీ కుండలో నుండి బోర్లించటానికి ఏముంటుంది’ అని ఎవరో వెనుక నుండి నవ్వినట్లు అనిపించింది….!

  ఏంటండీ అలా అనేసారు… నేను ఏకాకి ఏంటి… నాకు అందరూ వున్నారు… ఎప్పుడూ బిజీగా వుంటాను నేను. నేను అలా వుంటూ వుంటే… ’అవును అందరికీ అందరూ వున్నారు… నేను మాత్రమే అనాథని’ అని ’అనాథ’ అనే పదం అనుకుంటూవుంటే… ముచ్చటేసి… తనను అమాంతంగా గుండెలకు హత్తుకున్నాను… అంతే. అలా హత్తుకోగలిగేది… ఈ కాలం లో నేను… ద్వాపర యుగంలో… ఆ క్రిష్ణుడు మాత్రమే… అవును… తల్లి ప్రేమకు, రాధ ప్రేమకు దూరమై తను ఎంత బాధపడేవాడో… నాకూ వాడికే తెలుసు… 🙂

  ఇలా ఈ మాటలన్నీ చెప్పి నేను వెనుదిరిగి దూరంగా వెళుతూ వుంటే… lite back ground music లో “జగమంత కుటుంబం నాది,
  ఏకాకి జీవితం నాది.” పాట వస్తూ వుంటుందన్నమాట సీన్ లో…

 7. i want to join in ur ashramam. I am from nellore ,iam interested this kind of activities.if any work is there let me know. iam compleated my MBA. plz


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: