నిశ్యాలోచనాపథం-19

అక్కడ విషయమేమిటంటే చెప్పేందుకు చాలా ఉంది. నా ఎగ్జయిట్మెంట్ కి కూడా అంతులేకుండా ఉంది. ఈ కాలం ఫెలో తో రకరకాల విన్యాసాలు చేస్తూ తిరుగుతూ ఉంటే ఎవరికి ఉండదు చెప్పండి ఉత్సాహం? అంటే, భయంతో కూడిన కుతూహలం వల్ల వచ్చిన ఉత్సాహం అనమాట. పోయిన్సారి చెప్పా కదా – యాభై ఏళ్ళ హీరో కాలేజ్ పిల్లాడి వేషమేసినప్పుడు నిత్యయవ్వనుడి మేకప్ వేసినట్లు ఉంది కాలపురుషుడి గెటప్ అని? అతని గెటప్ సరే, నాకర్థం కానిదల్లా – “పొరబడినా, పడినా మనలాగా జాలిపడని కాలం” నిశి కాళ్ళనొప్పులు లిఫ్టివ్వమనగానే అలా ఎలా ఇచ్చేసాడు అని. రాత్రుళ్ళు కాలపురుషుడు కదా – అమ్మాయిలంటే సాఫ్ట్ కార్నర్ కాబోలు. పగలు తిరిగే కాలస్త్రీకి అబ్బాయిలంటే సాఫ్ట్ కార్నర్ ఉండదా మరి? ఏదో ఒకట్లేండి – ఈ చర్చ మొదలుపెడితే, ఇంకో రెండు టపాలు పడుతుంది నేను టాపిక్ కి రావడానికి. కనుక ఇప్పుడే వచ్చేస్తున్నా.

ఇలా రయ్యి రయ్యి మని పోతున్నామా? నాకసలు అవేం దారులో కూడా తెలియట్లేదు. ఏదో మొనాటనస్ గా అతను డ్రైవ్ చేస్కుంటూ పోతున్నాడు. మేము వెనక్కూర్చుని చూస్తున్నాము. నేను చిరాకేసి నిశీ వైపు చూస్తే, ఆమేమో…అదేదో అవ్యక్తానందంలో ఉన్నట్లుంది – పెదాలు నవ్వుతున్నాయి – పై పెదవీ, కింది పెదవీ తమలో తాము హాస్యమాడుకోడం వల్ల నవ్వు పుట్టినట్లు ఉంది అక్కడ – నిశీ నవ్విందంటే ఇలాంటి అబ్నార్మల్ విషయాలు ఏవో జరగాలి. నాకు వీళ్ళిద్దరి ప్రవర్తనా అర్థం కావట్లేదు. మామూలుగా అంటే సరే, ఈ డ్రైవర్ ఫెలో కీ, మాకూ ఏం సంబంధం లేదు. మేమంటే పట్టనట్లే, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినా అర్థముంది. ఇపుడు మేం సహ ప్రయాణికులం కదా. అంత భయంకర వేగంతో నడుపుతూ ఉంటే, ఎంత సీట్బెల్ట్ పెడితే మాత్రం – బతికామో చచ్చామో అన్నా చూస్కోకుండా ఆ నిర్లక్ష్యం ఏమిటీ? కనీసం, భయంభయంగా అతని చేయి పట్టుకున్నప్పుడన్నా స్పందించకపోతే, ఇక మా ఇద్దరి పరిస్థితి ఏమిటన్నట్లు? ఈయన ధోరణి ఇలా ఉంటే, నిశి ధోరణి మరోలా – చెప్పా కదా – అవ్యక్తానందం అనుభవిస్తోంది అని. నాకైతే, గోతిలో నిలువుగా పాతేయబడ్డ బ్రహ్మానందానికి వీరభద్రరావు సుత్తి ఎలాంటి భావన కలిగించి ఉంటుందో…అలాంటి భావనే కలగడం మొదలైంది. ఒక క్షణం కాలాన్ని చూసి – “మహాప్రభో!” అనుకుని… నిశీని చూసి డ్రైవింగ్ స్పీడ్ నిషా వల్ల ఖుషీ గా ఉందేమో అనుకున్నా.

ఇక లాభం లేదనుకుని నిశీని తన రెవరీ నుండి లేపేశాను.
“ఇదిగో తల్లీ, నీకిలా బాగుందేమో కానీ, నాకు పిచ్చెక్కుతోంది. ఏదన్నా చేయి. నేను ఈ బండిలో ఇలా ఊర్కే కూర్చుని, ఇలాంటి ఇండిఫెరెంట్ మనుష్యుల మధ్య బ్రతకలేను. వాళ్ళది నిరాసక్తతో, పరధ్యానమో, పనిపై తదేకదృష్టో నాకు తెలీదు కానీ, నేను మాత్రం ఓ నిముషమైనా ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండలేను. వెళ్ళిపోదాం పద” అన్నాను చిరాగ్గా.
“మనుష్యులన్నాక రకరకాలుగా ఉంటారు. కొంతవరకు మనం కూడా కాంప్రమైజ్ కావాలి” -అంది. నేను అవాక్కై తనవైపు చూశాను ఓ క్షణం – ఇలాంటి డైలాగులు ఈమె చెప్తోందేమిటీ? అని. తర్వాత, పనిగట్టుకుని నన్ను విసిగించడానికి అలా మాట్లాడుతోందని అర్థమైంది, ఆ కళ్ళలో కనిపిస్తున్న చిలిపిదనం చూసి.
“అది కాదు నిశీ, మరీ బోరింగా లేదూ ఇలా కూర్చోడం? బోరింగ్ దగ్గర టక్కూ టక్కూ అని కొట్టినా కూడా ఇంతకంటే బానే టైంపాస్ ఔతుంది.”
“ఉండుండు… ముందుంది మనకి మాటల పండుగ. ప్రవాహమే అప్పుడు – అడ్డూ అదుపూ ఉండదేమో అని నా ఎస్టిమేషన్”
“అదేం? ఏం జరగబోతోంది? నీకెలా…” అని నేను ఇంకేదో అడగబోతూ ఉండగా, భయంకర వేగంతో అటు పక్కనుండి ఓ బండి వచ్చింది.

ఈ కాలపురుషుడికీ, ఆ బండి డ్రైవర్కీ మధ్య ఏదో వస్తువు మార్పిడి జరిగింది. ఇతనేదో ఇచ్చాడు, అతను దాన్ని జేబులో వేస్కుని, సడెన్గా కీచుమని శబ్దం చేస్తూ బండి రివర్సు చేసి వెళ్ళిపోయాడు. నిజం చెప్పొద్దూ – భలే ముచ్చటేసింది ఆ రివర్సు చేసే పద్ధతి చూసి. మోటోక్రాస్ మ్యాడ్నెస్ కి ఇలాంటి వాళ్ళ బొమ్మలు చాలా అవసరం. వీడి పేరేంటో కనుక్కుని ఎపుడన్నా నేను ఆ వీడియో గేమ్ ఆడితే నా యూజర్నేం ఇతనే అని అనుకున్నాను…అంతలా నచ్చేసింది అతని డ్రైవింగ్ నాకు. సరే, అతను అటు పొయ్యాడో లేదో… ఏరోప్లేన్ రన్‍వే మీదకి నెమ్మదిగా దిగినట్లు, ఇతని వేగం తగ్గుతూ తగ్గుతూ, ఇతను దగ్గుతూ దగ్గుతూ….అలా అలా… తగ్గి తగ్గి, దగ్గి దగ్గి…చివరాఖరికి నిలిపేశాడు. అంతసేపూ ఆ వేగంలో ఏమీ అర్థంకాక, ఒక్కసారిగా ఆగేసరికి, నాకు గందరగోళంగా అనిపించింది. నిశీ దిగమని సైగ చేయడం తో దిగాను. కా.పు. కూడా దిగి, మా ఇద్దర్నీ చూసి నవ్వాడు. ఓ…ఇతగాడికి పక్కనోళ్ళ గురించి ఆలోచించే సమయం కూడా ఉందా? అనుకున్నాను.
“పాపం…మీరాగి మమల్ని చూసి నవ్వితే ఎలాగు? మీకసలే బోలెడు పనులు కదా…మళ్ళీ ఆ నింద మాకెందుకు – మీ పనులు ఆపామని?” – వెటకారం తెలుపుతూ అన్నాను.
ఆయన మళ్ళీ నవ్వాడు. నిశీ వంక చూశాడు. నిశీ కూడా నవ్వుతోంది.
“మీ ఇద్దరి ప్రణయకలాపాలు ఆపి నేనోదాన్ని ఉన్నాను అన్నది గుర్తిస్తారనుకుంటాను? పీతబుర్ర కనుక మీ నవ్వుల మర్మం నాకు అర్థం కాదు. అన్నింటిలో మర్మాలు చదివితి తండ్రీ అనడానికి నేను ప్రహ్లాదుడిని కూడా కాను” అన్నాను కసిగా, కోపంగా.

ఈసరికి కాస్త హర్టై, నవ్వులు ఆపారు ఇద్దరూ. కా.పు. చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్న తరువాత నాకు సృష్టి రహస్యమేదో తెలిసినట్లైంది. ఇందాక వచ్చి పోయిన వాడు కూడా కా.పు అంట. కాపు1 మనవాడు, కాపు2 ఆ మొటో రేసర్ అనుకుందాం (పేరులో ఏముంది పెనుమచ్చకాయ!). విషయానికొస్తే – కా.పు. ల వర్కింగ్ స్టైల్ ఇదీ – వీళ్ళందరికీ చెరో బైక్ ఉంటుంది. వీళ్ళ పని వాయువేగంతో ఎవరికోసమూ ఆగకుండా, ఎక్కడా తగ్గకుండా, దయా దాక్షిణ్యాల వంటివి లేక పొరపాట్న, తెలిసినా తెలీకున్నా తప్పు చేస్తే, వాళ్ళని కఠినంగా శిక్షించడమూ, దాన్ని సరిచేస్కోడానికి వెనక్కైనా పోనివ్వక కట్టుదిట్టం చేయడమూ తద్వారా బ్రతుకులు దుర్భరం చేయడమూ – ఇదట వారి పని. అక్కడ విషయమేమిటంటే – ఒకసారి ఒక కా.పు. మాత్రమే యాక్టివ్. మిగితావాళ్ళు జల్సా చేస్తూ ఉంటారట. ఇపుడు కాపు2 పని మొదలైందట. అందుకే ఇతను బేవార్స్ అట ఇక మీదట. ఇందాక నిశీ బండెక్కేసరికి ఇతని డ్యూటీ ఐపోయిందట. కానీ, తన వద్ద ఉన్న “శక్తి గుళికల డబ్బా” కా.పు.2 కి అందజేస్తే గానీ కా.పు.2 కి ఫుల్ పవర్స్ రావట. అందుకే అప్పుడే బండి ఆపక, ఇతన్ని కలిసేదాకా నడిపాడట.

ఓహో…వీళ్ళిద్దరి మధ్య చేతులు మారిన డబ్బా అదా.. ఓకే. అంతేలే…తినడానికీ వాటికీ టైం ఎక్కడ ఏడుస్తుంది వీళ్ళకి? ఆగని ప్రయాణాల్లో…
అతను ఇది చెబుతూ, బైక్ ని మాయం చేసే ప్రయత్నం లో పడ్డాడు. అంటే, ఇక మీద మేము నడుస్తూ మాట్లాడుకుంటాము అనమాట. ఈ బైక్ ని మాయం అంటే మాయం చేయడట, చిన్న గోళీసైజుకి కుదించి జేబులో వేస్కుని తిరుగుతాడు. మళ్ళీ తన వంతు వచ్చినప్పుడు దీన్ని పెద్దది చేసి దానిమీద తాను సవారీ చేస్తూ తిరుగుతాడట – నిశీ చెవిలో గొణిగింది. అలాగే ఇంకో సంగతి కూడా చెప్పింది – “ఇందాక అన్నా కదా..మాటల పండుగ అని..మొదలౌతుంది చూడు” అని. నాకు సన్నగా వణుకు పుట్టింది – ఏం జరగబోతోందో అని. ఇంతలో, అతను ఆ గోళీసైజు కుదింపు ముగించుకుని మావైపు తిరిగి – “పదండి అలా నడుస్తూ మాట్లాడుకుందాం” అన్నాడు. ఆ డైలాగే నాకు బాంబు పేలుడులా వినబడ్డది.
వేల సంవత్సరాలుగా ఇతను అలా తిరుగుతూ ఉన్నాడట విరామంలేక. “ఆహా! ఇన్ని వేల సంవత్సరాలకి భూమ్మీద కాలుపెట్టి నడుస్తున్నాను. ఎన్నాళ్ళకి ఓ మాట వింటున్నాను.” అన్నప్పుడు అర్థమైంది.

ఇక చూస్కోండి – శుభలగ్నం లో మాటలొచ్చాక శ్రీలక్ష్మిలా… ఎడతెగని ప్రవాహం. నిజంగానే మాటల పండుగ. కాలం అంతరంగం నేను కొంతవరకైనా తెల్సుకుంటా అని అనుకోనేలేదు సుమా! చెబుతా చెబుతా… నెక్స్ట్ టైం… మేమిద్దరం కా.పు తో నడుస్తూ ఏం మాట్లాడుకున్నామో…

Advertisements
Published in: on November 27, 2009 at 12:13 pm  Comments (5)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/11/27/nisyalochanapatham-19/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. >>నాకైతే, గోతిలో నిలువుగా పాతేయబడ్డ బ్రహ్మానందానికి వీరభద్రరావు సుత్తి ఎలాంటి భావన కలిగించి ఉంటుందో…

  haahaaahaaaaaa……..
  21వ శతాబ్దంలో Hi-tech కా.పు అన్నమాట. అదుర్స్!!
  బైక్-గోళి సంగతి విని… నాకు ‘నానో’, ‘మాట్రిక్స్’ లాంటి పదాలు గుర్తొచ్చేసాయి 😀
  ఇలాంటి బైక్-గోళిలు నిజంగా ఎవరైనా తయారు చేస్తే బాగుండు! ఎంచక్కా పార్కింగ్ ప్రాబ్లం ఉండదు!! 🙂

  Jai Ho కా.పు! Lage raho sowmya!! 🙂

 2. సారీ కాన్ట్ బేరిట్

 3. సౌమ్య నేను కూడా ఆ మాటల పండగ లో పలుపంచుకోవచా నేను కూడా క.పు తో కొన్ని క్యూస్షన్స్ అడుగుతాను

 4. Come on come on anagaane vachheshaaru. Thankandee.

 5. […] దాన్ని పాకెట్లో వేసుకున్నాడు. ఆర్రె! మన కా.పు. ఏమైపోయాడిన్నాళ్ళూ! అనుకుని హాయ్! […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: