నిశ్యాలోచనాపథం-18

హుమ్…. రెండువారాలు …. రెండువారాలు!! అంటే, రెండువారాలు – ఒక రాత్రితో సమానమా? అదెలా??

ఆ మధ్య ఓరోజు నిశి – కాలాన్ని నిలదీస్తానని సవాల్ చేసాక, మేమిద్దరం నవ్వుకుంటూ చెరోదారిన వెళ్ళిపోయాము. తరువాతి రోజు రాత్రి, నాకు ఎవర్నీ కలవాలనిపించనంత విసుగ్గా ఉండింది. రాత్రి నగర సంచారం చేస్తే, నిశిని కలవాల్సొస్తుంది కనుక, అందుక్కూడా పోనంత విసుగు. ఏం చేసేదీ తోచక, ఓ పక్క జలుబూ-దగ్గూ ఉంటే, కోల్డాక్ట్, బెనడ్రిల్ వేస్కున్నా – దెబ్బకి ఒళ్ళుతెలీని నిద్ర పట్టింది. కానీ, కొన్ని కొన్ని మన చేతుల్లో ఉండవు. నిశీ నా కల్లోకి, తల్లోకి వచ్చేసి నస మొదలెట్టింది – రావేంటీ? అని. మొదట పట్టించుకోలేదు కానీ, మరీ తలలోపలికి చొచ్చుకెళ్ళిపోయి, నిద్ర చెడగొడుతూ ఉండేసరికి, ఇక నిశీని కలవాలని బయలుదేరాను. నిశీ నాకు ఎక్కువ గుర్తొచ్చి కలొచ్చిందా? నిశి కి నేనెక్కువ గుర్తొచ్చి కల్లోకొచ్చిందా? అన్నది మాత్రం నాకింకా సందేహంగానే ఉంది.

అలా అని రోడ్లపై తిరుగుతూ ఉంటే, ఎంతకీ ఈ మనిషి కనబడదు. కాసేపటికి, ఎస్సెమ్మెస్ చేసా – “ఏవమ్మా! ఎక్కడ?” అని. “వస్తున్నా. నీకోసం కొత్త స్నేహాన్ని తెస్తున్నా” అని జవాబొచ్చింది. “ఈమె స్నేహితులంటే – వాళ్ళే టైపో” అనుకున్నా. నిశీ స్నేహితులంతా అదో టైపని – తను నన్ను స్నేహితురాలిగా అంగీకరించిన రోజునే డిసైడైపోయా నేను. సరే, ఎదురుచూస్తూ ఉన్నా వాళ్ళ రాక కోసం. కాసేపటికి రోడ్డు చివర ఓ చిన్న వెలుగు. అది దగ్గరయ్యేకొద్దీ క్రమంగా పెద్దదౌతూ వచ్చింది. ఎప్పుడైతే నా కళ్ళు వాటిని భరించలేకపోయాయో, అప్పుడు అది మళ్ళీ నెమ్మదిగా తగ్గుతూ, భరించదగ్గ వెలుగులోకి మారింది. అప్పుడు అర్థమైంది – అదొక మోటార్ బైక్ అని. బైక్ లైట్లు ఇంత అత్యాధునికంగా మన కళ్ళు ఎంత భరిస్తాయి అన్నదాన్ని బట్టి వెలుగు మార్చడం ఇంతకుముందు నేను చూడలేదు, వినలేదు. అబ్బురం కలిగిన మాట నిజం.

అదలా దగ్గరకొచ్చాక ముందున్న శాల్తీ ఎవరో అర్థం కాలేదు కానీ, వెనకున్నది నిశి అని అర్థమైంది. అబ్బో, బైకు చాలా పొడుగు. ముగ్గురు అలవోకగా కూర్చోవచ్చు. ఇంతకీ ఇతనెవరో! అనుకున్నా. నిశీ ప్రేమ వైఫల్యం అన్నప్పుడల్లా ఆమెకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో, వీళ్ళిద్దరికీ గొడవైందేమో అని అనుమానం ఉండేది. వీడిని చూశాక మళ్ళీ ఆ అనుమానం మొదలైంది.
“వీళ్ళిద్దరికీ సయోధ్య కుదిరిందేమో. అందుకని, నాకు పరిచయం చేద్దాం అనుకుందేమో.”
“ఇప్పుడైతే, మళ్ళీ హ్యాపీస్ కనుక, ఇక ఆ వైరాగ్యం వదిలేస్తుందా?”
“వీడు ఓవర్ మేకప్ చేసుకున్న వెయ్యేళ్ళ మనిషిలా ఉన్నాడు నాకైతే. నిశీకి వీడెట్లా నచ్చాడు?”
-ఇలా నేను ఆలోచిస్తూ ఉండగా, నిశీ ఒక్క ఉదుటున నన్ను పైకి లాగేసి ఎక్కించుకుంది. బైక్ రయ్యిన దూసుకుపోయింది.

నాకొక క్షణం ఏమీ అర్థం కాలేదు. నేను బైక్ ఎక్కా (అదే, ఎక్కింపబడ్డాను) అని గుర్తించి చూశేసరికి – అదేం వేగం బాబూ – ఇదెక్కడి రోగం – ఈ వేగం – నాకసలేమీ కనబడ్డం లేదు. “నిశీ!” అని అరిచా…ఈ వేగానికి తనకేమీ వినబడదేమో అని. “ఇక్కడే ఉన్నా – అరవకు” అన్నది నిశి. “నిశీ…ఏం జరుగుతోంది? ఎక్కడికి వెళ్తున్నాము?” అన్నాను, కాస్త కంగారుగా. ఓపక్క వీళ్ళిద్దరూ పోతూ ఉంటే, పానకంలో పుడకలా నేనెందుకు? అని కాస్త సిగ్గుగా కూడా ఉండింది.
“ష్! అన్నీ వివరంగా చెబుతాను విను.”
“ఏంటి అయితే మీది కాలేజీ లవ్ స్టోరీయా?” ఆసక్తిగా అడిగాను. ఎటో పోతున్నామన్న సంగతి కూడా మర్చిపోయి. ఆహా, పుట్టుకతోనే గాసిప్స్ తో పుట్టినట్లున్నా!
“ఎవరిది? ’మా’దా? ఏ ’మా’?”
“ఈ మా” – అన్నాను బైక్ నడుపుతున్న అతన్ని చూపిస్తూ.
“అతనంటే నాకసహ్యం. అతని వల్లే ఈ కష్టాలన్నీ నాకు. ఆగమన్నప్పుడు ఆగకుండా వెళ్ళిపోయాడు. వెనక్కి రమ్మంటే రాడు.”
“ష్! ఊరుకో. వింటే బాధపడతాడు.”
“హు! అంతదృష్టం కూడానా. ఎవరి పనులు వాళ్ళవి. ఎవరి స్వార్థం వారిది.” – మాటలు నిర్లిప్తంగా అన్నట్లు ఉన్నా, నిజానికి నిశి కళ్లలో ఆ మాటలంటున్నప్పుడు ఓ మాదిరి వెలుగు.
“అదేమిటి? మీ ఇద్దరు కలిసి వస్తూ కూడా ఇలా అంటావు?”
“కలిసి ఉన్నంత మాత్రాన, అంతా బాగున్నట్లా మా ఇద్దరి మధ్య?”
“అబ్బబ్బా!” అనుకుని, పైకి మాత్రం – “సరే, లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది?”
“చెప్పా కదా, నాకతనంటే అసహ్యం. నా ప్రేమ నాకు దక్కే అవకాశం లేకుండా చేసింది ఇతనే!” కసిగా అంది నిశి.
“హుమ్…. అయితే, నిన్ను కాదన్నాడా?”

“నన్ను ఇతను కాదంటే నాకేంటి? అసలు నేను ఇతన్ని ఔననమని అడగలేదే?”
“అదేమిటి?”
“ఏదేమిటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు” – వింతగా చూస్తూ అంది నిశి.
“నాకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతోందో” – అయోమయంగా అన్నాను నేను.
అప్పటికి నా అనుమానం అర్థమైనట్లు ఉంది. “అసలు అది ఎవరనుకుంటున్నావు?”
“నీ బాయ్ ఫ్రెండేమో…” అని నసిగాను సిగ్గుతో. కాదులా ఉంది. అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను – నన్ను నేనే తిట్టుకున్నాను.
“హహహహహహ”
“ఏం నవ్వుతావు?”
“నీ అంచనాకి నవ్వొచ్చింది. సరే, ఇంతకీ, నాకు నాకు తెలీకుండా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ? ఆడ స్నేహితులనే నా జోలికి చేరనివ్వను….. ఏదో ఒకరిద్దర్ని తప్ప”
“అదే… నీ ప్రేమ…విఫలం… అది…”
“హహహహ. నువ్వు నమ్మలేదు కదూ – నన్ను మోసం చేసినది జీవితం అంటే.”
“అబ్బ! పోతే పోయింది లే. ఇంతకీ ఇతనెవరో చెప్పనే లేదు.”

“కాలం”
“కలామా? ఇలా ఉండడే”
“కాలం. టైమ్”
ఆ బైక్ కి సీట్ బెల్ట్ ఒకటి ఏడ్చి ఉండీ, దాన్ని నాకు నిశీ ఆల్రెడీ కట్టేసి ఉండీ బ్రతికిపోయా కానీ, లేకుంటే, నాక్కలిగిన షాకుకి కిందపడి ఆ బండి చక్రాల కింద నలిగిపోయేదాన్నే!
“కాలమా??”
“కాలం నీకెందుకు కనిపిస్తుంది?” అని మొన్న వెటకరించావు గుర్తుందా?”
“ఆ..అప్పుడు నువ్వు మిటకరించావు….”
“మరదే! ఇప్పుడు నీ ముందు, నిన్ను నడిపిస్తున్నది కాలమే.”
“అయ్! భలే ఉందే! ఈ బైకు, ఈ వ్యవహారం….. ఆ మనిషి అవతారం ఏంటి? చూస్తేనే అనుకున్నా – వెయ్యేళ్ళ మనిషి ఓవర్ మేకప్పేసినట్టు ఉన్నాడేంటి ఇతను అని. కాలమా…”
“కాలమే. రాత్రుళ్ళు ఈ గెటప్ లో తిరుగుతూ ఉంటాడంట. పగలైతే, గాలిగానే తిరుగుతుందట. పగలు స్త్రీలింగమట. రాత్రి పురుషుడట.”

“నీకెక్కడ తగిలాడూ?”
“ఇదిగో, మనలాగే రాత్రుళ్ళు చక్కర్లు కొడుతూ ఉంటాడంట. పక్క ఊరిలో నడుస్తూ, కాళ్ళు నొప్పులేస్తూ ఉంటేనూ… ఆపి లిఫ్ట్ అడిగాను. ఇచ్చాడు. ఎక్కే ముందు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా – అలా మాట్లాడుతూ, ఈ వివరాలు రాబట్టాను.”
“సరే, ఇలా అతను వింటాడా లేదా అని భయం లేకుండా ఇదంతా చెప్పేస్తున్నావు… ఏమనుకుంటాడో…”
“ఏమీ అనుకోడు. ఎందుకంటే వినడు కనుక”
“అదేం?”
“అతనికి తను, తన ప్రయాణం తప్ప ఇంకేమీ పట్టవు. ఇప్పటికిప్పుడు నేన్నిన్ను చంపేసినా వెనక్కి తిరిగి చూడడు.”
“మరి అంత ఐటెమ్ గాడు నీకోసం ఆగి, నీకు తన సోదంతా చెప్పి ఎలా ఎక్కించుకున్నాడు బండిపైన?”
“నేనొదుల్తానా? బండికి అడ్డంగా పడుకున్నా.”
“ఇప్పుడు వీడింతేనా? ఆగడా?”
“వాడితో మాట్లాడించే బాధ్యత నాది. మాట్లాడించడం, నిలదీయడం – అన్నీ చేస్తాను. చూస్తూ ఉండు.” – హుషారుగా అంది నిశి.

రెండు వారాలన్నానే – ఇదే. ఆ ఒక్క రాత్రే – కాలంతో పాటు తిరిగాము మేము. అరే, మాకు ఒక్కరాత్రే తిరిగినట్లు అనిపించింది. కానీ, మన కాలంలో రెండువారాలని తర్వాత అర్థమైంది. ఇంటికొచ్చేశాక – వరదల్లా ఉన్న ఈమెయిళ్ళను చూసి. నేపథ్యం చెప్పడానికే ఇంతసేపు పట్టింది. ఇక అసలు మా అడ్వెంచర్లు చెప్పాలంటే…. చెబుతాను…. ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి కదా – నా ఎగ్జైట్మెంటుని….

Advertisements
Published in: on November 11, 2009 at 9:57 am  Comments (10)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/11/11/nisyalochanapatham-18/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. ఆసక్తికరం. నిశీ గత వైభవం కోసం కాలంతో పోరాటం అన్నమాట!. నిశీ అడ్వెంచర్ల కోసం ఇక ఎదురుచూస్తూ ఉంటా!

 2. You ROCK Maam.

 3. baagundi..time ki personifying time anna mata..time evarikosam aagakunda em pattakunda mundukellipoye nature, kalaniki addu padithe konchem digosthundani indirect ga cheppina teeru bagundi 🙂

 4. 😀

 5. కాలంతో కలకలమన్నమాట!! 🙂

 6. ఈధారావాహిక రచయిత్రిగా నీకు గలస్ఫూర్తిని తెలియజేస్తోంది. బహుశా ఇది పుస్తకరూపంలో పెట్టుకుని ఒక్క సిటింగులో చదివితే మరింత స్పష్టమవుతుందేమో.

 7. >>నిశీ స్నేహితులంతా అదో టైపని – తను నన్ను స్నేహితురాలిగా అంగీకరించిన రోజునే డిసైడైపోయా నేను.
  :))

  Waiting to hear more about your adventures with Time. 🙂

 8. Come on come on come on. Nice narration Ehihiheeeeeeeee

 9. […] నిశీ, ఏమిటీ విశేషాలు? జీవితం ఎలా ఉంది? కా.పు. మళ్ళీ కలిసాడా? మీ ప్రేమ ఎందాకా […]

 10. […] వారి వారి హెల్మెట్స్ తీశారు. ఒకరు కా.పు. మరొకరు… నిశి ఆమధ్య చీల్చి చెండాడిన […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: