తెలుగు కవిత్వం తో నా డీలింగ్స్…

నేను ఆట్టే కవితలు చదవను. అసలు నాకు కవితలోని భావాన్ని అనుభవించడం చేతకాదు అని ప్రగాఢ విశ్వాసం. నేను వచనంలో కవిత్వాన్ని మాత్రమే అనుభవించగలను. వచన కవిత్వాన్ని కూడా అనుభవించలేను, వేరే కవిత్వాల మాట అటుంచితే. “కవిత్వం” అన్న పదాన్ని నేను అర్థం చేసుకునే విధానంలో, “కవితలు” మాత్రమే కవిత్వం కిందకు రావు. మాటలు కూడా వస్తాయి. అందుకే, నేను పరమ నిక్కచ్చిగా నేను కవిత్వం చదవను అనలేను. అయితే, చదివినంతలో నన్ను అలాగే తమ మాయ లో పడేసి, వెంటాడి వెంటాడి మళ్ళీ మళ్ళీ చదివించిన తెలుగు కవితలు ఉన్నాయి. అలాంటి కొందరి గురించి చెబుతూనే, కొంత మార్కెటింగ్ కూడా చేయడం ఈ టపా ఉద్దేశ్యమనమాట 🙂

ఇటీవలికాలంలో రోజూ జపం చేస్తున్న కవి ఐతే “శ్రీశ్రీ”. మహాప్రస్థానంలోని సెలెక్టెడ్ కవితల్ని రోజూ..రోజూ..తలుచుకుంటూనే ఉంటున్నాను. అయితే, ఇతనితో నా తొలిపరిచయం “అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం” అన్న వాక్యాలతో, స్కూల్లో ఓ సందర్భంలో. “అబ్బ చ!” అనుకోలేదు. ఎందుకంటే, ఆపాటికి శ్రీశ్రీ అన్నాయనను మహాకవి అంటారని తెలిసి ఉండటం చేత. “ఓహో” అనుకున్నానే కానీ, ఆ సంవత్సరం ముగిసే సరికే ఇలాగే కొన్ని వాక్యాలు విని విని ఆయనంటే ఓ అభిమానం ఏర్పడి పోయింది. ఓ పదేళ్ళయ్యాక ఇప్పుడా ఆ నామస్మరణం లేనిదే లేవను. ముఖ్యంగా – ఒక రాత్రి, కేక, ఐ, కళారవి, ఆః!,,స్విన్ బర్న్ కవికి – ఇవి అలా అలా చదివి చదివి ఖంఠతా వచ్చేసాయి. అలాగే, ఎంచక్కా పాటలుగా విన్న – “ఆనందం అర్ణవమైతే”, “జగన్నాథుని రథచక్రాలు” అలా రిథమిక్ గా గుర్తు ఉండిపోయాయి. “నిజంగానే” – అని ఎన్ని సార్లు ఎన్ని సందర్భాల్లో అనుకుంటానో. ఓ ఫోర్సు ఉంది ఈ కవితల్లో. “ఖడ్గసృష్టి” సంకలనంలో – “ఏవి తల్లీ!” కవితలో “పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయినజాడలేవీ ?” అన్న వాక్యం నన్ను చాలారోజులు వెంటాడింది మొదట చదివినప్పుడు. అయితే, మహాప్రస్థానంలో కొన్ని, ఖడ్గసృష్టిలో ఒకటీ అరా మినహాయిస్తే, నాకెందుకు శ్రీశ్రీవి మిగితావి నచ్చలేదో, ఇవి మాత్రం ఎందుకు అంతలా నచ్చేసాయో మాత్రం అర్థం కాదు.

అయితే, 2006 ప్రాంతంలో మూలా సుబ్రమణ్యం, కొత్త రవికిరణ్ ల ద్వారా పరిచయమైన కవి ఇస్మాయిల్ ఇలాగే మర్చిపోలేని ముద్ర వేసాడు. అక్కడికి నేనేదో తెగ చదివేశా అని కాదు. కానీ, ఇలా ఇన్స్టంట్ గా నాకు నచ్చేసిన వారు తక్కువ. ఇస్మాయిల్ కవితల్లో కూడా కొన్ని అలా చదువుతూ ఉంటే, “అబ్బ!” అనిపిస్తే, కొన్ని “అబ్బా!” అనిపించినవి ఉన్నాయి కానీ, నేను చదివిన కాస్తలో, ఆ కొద్ది పదాల్లో బోలెడు అర్థాన్ని పలకడం, అన్నింటికంటే ముఖ్యంగా – భాషలోని సింప్లిసిటీ, చదువుతూ ఉండగా, చదివాకా, కలిగే ఫీలింగ్ – నాకు చాలా నచ్చేశాయి. అయినప్పటికీ నేను ఎక్కువగా ఆయన కవితలు చదవలేదు అనుకోండి, అది వేరే విషయం.

వీళ్ళిద్దరు కాక అపుడప్పుడూ వెబ్లో చదివే కవితల్లో కూడా కొన్ని అలా వెంటాడుతూ ఉంటాయి. ఈమాట వెబ్జీన్లో అలా కొన్ని చదివాను. అలాగే, ఒకప్పుడు తెలుగుపీపుల్.కామ్ లో కూడా అలాంటి కవితలు చాలా చదివాను. ప్రస్తుతం కృష్ణశాస్త్రి భాషని అర్థం చేస్కుని, అనుభవించడాన్కి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇన్నిరోజులు ఔతూ ఉన్నా కూడా అసలు “కవిత్వం” అంటే ఏమిటీ? దేన్ని కవిత్వం అనొచ్చు, దేన్ని అనకూడదు? ఏది మంచి కవిత? ఏది కాదు? – ఇవన్నీ నాకు ఎప్పుడూ అర్థం కాని ప్రశ్నలే. రోజులు గడిచేకొద్దీ నాకు జవాబులు తెలుసుకోడం పై కూడా ఆసక్తి తగ్గుతూ వస్తోంది.

సరే, నాలాంటి వాళ్ళని ఎవరూ బాగు చేయలేరు కానీ, సెప్టెంబర్లో పుస్తకంలో “తెలుగుకవిత” అని ఫోకస్ ప్రకటించి, అదలా అక్టోబర్ దాకా పొడిగించారు. ఇలా పొడిగించడం వల్ల పుస్తకం సంగతి అటు పెడితే, నాకు చాలా లాభం – ఎందుకంటే, రకరకాల విషయాలు తెలుసుకున్నాను కనుక. ఇస్మాయిల్ గారితో మొదలై, గోపిరెడ్డి రామకృష్ణ, అఫ్సర్ గార్ల వద్దకు చేరి, విశ్వనాథ వారి కవిత్వం రుచి చూపి, ముకుందరామారావు గారిని పలకరిస్తూ, శివారెడ్డి గారి గురించి మొదలై (ఈ మధ్యలో మళ్ళీ ఇస్మాయిల్ గారిని తల్చుకుంటూ), రైతు కవిత, తిలక్, ఇక్బాల్ చంద్, ఆకెళ్ళ రవిప్రకాశ్, వైదేహి శశిధర్ గార్లదాకా వచ్చి, మధ్యలో మన బ్లాగరు ఉష గారిని కలిసి, కల్పన గారి ద్వారా చలం కవిత్వం అంటే ఏమిటో తెలుసుకుని, విన్నకోట రవిశంకర్ గారు ఇటీవలి కవిత్వం గురించి చెప్పింది విని, యదుకులభూషణ్ గారికి నచ్చిన కవితతో సెప్టెంబర్-అక్టోబర్లు ముగిశాయి.

ఇలా పాతా కొత్తా భేదం లేకుండా రకరకాల కవుల గురించి రాసిన ఈ వ్యాస రచయితలందరికీ ధన్యవాదాలు – బ్లాగ్ముఖంగా.

ఈ రెండు నెల్లలోనూ పుస్తకం.నెట్ లో తెలుగుకవిత అన్న ఫోకస్ అంశంపై వచ్చిన వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు.

(సైటు కార్యం, స్వకార్యం – రెండూ చేయడం అంటే ఇదే!)

Published in: on October 31, 2009 at 9:27 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/10/31/me-telugu-poetry/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. కార్యసాధకులే! మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. 🙂

  2. choosi nerchukovaalante mundu kanabadaali kadaa

  3. […] పుస్తకం.నెట్ లోకి నేను అడుగుపెట్టడం పచ్చి స్వార్థం. అంటే, బ్లాగులన్నీ సర్వే చేయడం కంటే, ఒక సైట్ లో పుస్తకాల గురించి ఉండేలా ఉంటే, మన బద్ధకపు ప్రాణానికి కాస్త తేలికౌతుంది కదా జీవితం అని. ఆ పరంగా ఇదో మంచి అనుభవం – అన్ని రకాల పుస్తకాల గురించీ ఒకటో రెండో వ్యాసాలు చదవగలిగాను. అలాగే, ఈ ఇంటర్వ్యూలు – లైబ్రరీలు, పబ్లిషర్లు, బుక్ షాపు వాళ్ళు, రచయితలు – ఎందరో రకరకాల రకాల మనుష్యుల మనోభావాలు తెలుసుకునే అవకాశం కలిగింది. కవిత్వం గురించి చాలా వ్యాసాలు కనబడతాయి గత మూడు నెల్ల వ్యాసాలు చూస్తే – ఇంత కంటెంట్ కవిత్వం గురించి నేనెప్పుడూ చదవలేదు… ఎందుకని అడక్కండి..అదంతే! (ఇదే విషయం గురించి ఇదివరలో కొంత విన్నవించుకున్నా… ఇక్కడ) […]

  4. మీ అభిరుచిని బట్టి మీకు గుంటూరు శేషేంద్రశర్మ పరిచయమైతే బాగా అభిమానించే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు కూడా మీరు చెప్పిన ఇద్దరూ బాగా ఇష్టం, అలాగే శేషేన్ కూడా. అవకాశం ఉంటే చదవండి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: