నిశ్యాలోచనాపథం-17

ఎప్పట్లాగే చీకట్ని ద్వేషించడం ఎరుగని నేను ఎగుర్కుంటూ రాత్రి పూట రోడ్లపై పడ్డాను. నిజం చెప్పొద్దూ, రాత్రి పూట రోడ్ల సొగసే వేరు. పగలంతా జనాల కాళ్ళ కింద నలిగి, వాటి అందం ఎవరికీ అర్థం కాదు. జనం కూడా సాటి జనం అందచందాలను పట్టించుకుంటారు కానీ, తమ కాళ్ళ కింద భూమిని గమనించరు. రాత్రి పూట రోడ్డు ఖాళీ కనుక కాస్త కావాలని తెచ్చుకున్న పరధ్యానం తో కిందకి చూస్తూ, రోడ్ల అందాలని ఆస్వాదిస్తూ నడుస్తున్నాను. అటు వైపు నుంచి నిశి ఎప్పట్లాగే ఏడుప్మొహము వేసుకుని దాన్ని వేళ్ళాడేసుకుని, కాళ్లీడ్చుకుంటూ నడిచోస్తోంది ఎదురుగ్గా. నాకు మొన్నటి మా గొడవ ఇంకా మనసులో అలాగే ఉంది. తనంటే పిచ్చి కోపంగా కూడా ఉంది. నేనంటే ఆటలైపోయినట్లుంది తనకి అని అనుమానం కూడా కలిగి, అవమానంగా కూడా అనిపించింది. అందుకే నేను పలకరించలేదు.

అదేమిటో కానీ, నేను అలిగిన ప్రతిసారి అవతలి మనుషులు అక్కడ విషయమే లేనట్లు లైట్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈమె కూడా మా ఇద్దరి మధ్యా ఏమీ జరగనట్లే, హాయ్! అన్నది నన్ను చూడగానే. నీరసంగానే అన్నదనుకోండి, కానీ, అన్నది కదా, సో, నేనూ అనాల్సి వచ్చింది. అన్నాక మనం ఊరుకొము కదా… మళ్ళీ మొదలైంది గమ్యం తెలీని మా చర్చ. తెగేదాక మేము లాగుతూనే ఉంటాము. ఆదేమో తెగదు. ఇలా ఎంతసేపు సాగుతుందో ఈ రాత్రి.. అనుకుంటూ అడిగాను తనని –

“ఏమిటీ, మళ్ళీ అలా డీలా పడి కనిపిస్తున్నావు?” అని.
“పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ…? – అని ఆలోచిస్తున్నాను.” అన్నది.
“ఏవీ తల్లీ?” అన్నాన్నేను, శ్రీశ్రీని స్మరించుకుంటూ.
“అదే..అదే.. వెదుక్కుంటున్నాను.” అంది నిశి పరధ్యానంగా.
“ఏంటి అనుకునేది? ఇప్పుడు కాలం ఎటు పోయిందంటావ్? అసలే కాలం కావాలి నీకు? భూతకాలమా? వర్తమానమా? భవిష్యత్తా?”
“నాకు నా భూతకాలం వర్తమానంగా కూడా ఉండాలి. వీలైతే అదే భవిష్యత్తుగా కూడా ఉండాలి.”
“కోరికలే గుర్రాలైతే” అన్నట్లు ఉంది నీ వ్యవహారం – అన్నాను నవ్వుతూ.
“అలాగే అనిపిస్తుంది లే. నేనేది మాట్లాడినా నీకు నవ్వులాటే కదా.”
ఇదే, ఇక్కడే నేను కరిగిపోయేది ఈ నిశి తో ప్రతిసారి. ఇలాంటి దిక్కుమాలిన సెంటీ డైలాగులూ, ఏ దిక్కుమాలిన దీనానాథ్ మంగేష్కర్ ఎక్స్ప్రెషను రెండు కలిపి నా ఎదుట నిలబడుతుంది చూడండి, అప్పుడే నా కోపమంతా ఆవిరైపోతుంది. ఆవిరైపోతుందో లేక ఆ సెకను గాల్లో కలిసిపోతూ కోపాన్ని మోసుకెళ్లిపోతుందో మరి, నాకు తెలీదు. కోపం ఆవిరయ్యాక ఇంకేం చేస్తాం? నిశి గురించిన శ్రద్ధతో –
“ఏమైంది? నీకు నీ ప్రస్తుతపు జీవితం నచ్చట్లేదు… అంటావా ఐతే?” అన్నాను.
“అది ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎన్ని విధాలుగా చెప్పాను? మళ్ళీ అదే అడిగితే ఏం చెప్పేది?”
“అదే, అదే, తెలుసు నాకు. ఎందుకు? అన్నదానికి నువ్వు చెప్పే కారణాలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను.

“దర్జా అలవాటయ్యాక మామూలు బ్రతుకు బ్రతకడం కష్టం కదూ?” అన్నది నిశీ ఉన్నట్లుండి.
“అనుకుంటా. నాకు దర్జా అలవాటు లేదు” అన్నాను నేను సీరియస్గా.
తనేమీ మాట్లాడలేదు. దానితో మళ్ళీ నేనే అడిగాను –
“ఏంటీ, ఎవన్నా డబ్బు సమస్యలోచ్చాయా నీకు?”
“హాహాహాహా. నీకేమనిపిస్తోంది?”
“ఏమో, నీకు అలాంటి సమస్యలు ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు కనుక, ప్రస్తుతానికి డబ్బుకి లోటు లేదు అనుకుంటున్నా నేను. కాకుంటే, చెప్పలేము. సినిమాటిగ్గా ఏదో జరిగి ఇప్పుడు నువ్వు కష్టాల్లో పది ఉండొచ్చేమో నాకేం తెలుసు?” అన్నాను.
“కష్టాలు, దర్జాలు డబ్బుతోనే రావాలా? డబ్బుతోనే పోవాలా?”
“నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.”
“జీవితాన్ని అనుభవించాక, జీవితం తో ప్రేమ వ్యవహారంలో దెబ్బతిన్నాక, మామూలుగా జీవించడం కష్టం అనిపిస్తోంది.”
“మామూలుగా జీవించడం అంటే?”
“అంటే, పూర్తి ఆనందంగా కాక, రకరకాల భావలతో జీవించడం”
“అలా ఆనందం తప్ప వేరేది లేకుంటే త్రిల్ ఉండదు కదా జీవితం లో?”
“ఆనందం అంటే, జీవించడం లో ఆనందం, కేవలం ఆనందం మాత్రమే కలిగించే అనుభవాల గురించి అనట్లేదు.”
“అంటే?”

“జీవితం తో ప్రేమలో ఉన్నప్పుడు అందులోని మంచి,చెడు,తీపి,చేదు – అన్నీ అలా వచ్చినవి వచ్చినట్లు అనుభవిస్తూ – ఆనందంగా ఉండేదాన్ని.”
“ఇప్పుడేమోచ్చింది?”
“వ్యవహారం చెడింది, ఆనందం చెడింది.”
“ఇప్పుడేంటి అయితే, ఆనందకరమైన క్షణలే ఉండట్లేదా? అలా ఎలా ఉంటుంది? అలా ఉండకూడదే?”
“ఆనందాన్ని కూడా ఆనందంగా అనుభవించలేకపోతున్నా, అదేమిటోగానీ.”
“ఇలా అర్థం కాకుండా తిక్క తిక్కగా ఎందుకు మాట్లాడతావంటావ్ నువ్వు? సరదాకా?”
“నాకున్న లిమిటెడ్ వకాబ్యులరీకి ఇలాంటి ఆలోచనలను వివరించాలంటే, తిక్క తిక్కగానే వస్తున్నాయ్ వాక్యాలు – ఎంత ప్రయత్నించినా, నాన్సెన్సే మిగుల్తోంది..” దిగాలుగా అంది నిశి.
“ఇప్పుడేమంటావ్? నీకు జీవితంలో ఏదో మిస్సైనట్లు అనిపిస్తోంది – అంటావ్? అంతేనా?”
“ఏదో కాదు – లైఫ్ ప్లెజర్ – బ్రతకడంలో ఉన్న ఆనందం – అది కోల్పోతున్నానేమో అనిపిస్తోంది.”
“ఎలా? అలా ఉన్నట్లుండి ఎలా కోల్పోతున్నావు?”
“ప్రేమలో మోసపోయానన్నా కదా, అప్పట్నుంచి నమ్మకం పోయింది బ్రతుకుమీద. నమ్మకం పోయాక, అక్కడ ఏ మిరాకిల్ జరిగినా నేను దాన్ని ఆస్వాదించలేకపోతున్నాను.”
“మన అనుకున్నవాళ్ళతో ఏదో తగువొచ్చిందనుకో – రెండు రోజులు మాట్లాడుకోం, మూడోరోజుకి మళ్ళీ కలిసిపోతాము. అదే పట్టుకుని జీవితాంతం ఒకరి మొహం ఒకరు చూస్కోకుండా అయిపోతామా ఏమిటి?” అన్నాను, ఈ పిల్ల మరీ ఇంత సెన్సిటివా? అన్న సందేహం ఓ పక్క, ఈ పిల్లకింత చాదస్తమేమిటో? అన్న అనుమానం ఓ పక్క నన్ను తొలుస్తూ ఉంటే.
“ఏమో, నేను మళ్ళీ ప్రేమించలేకపోతున్నాను. ప్రేమిస్తున్నానేమో – ఎప్పుడు ఆపాను కనుక – అది నన్ను మోసం చేసింది కానీ, నేను దాన్ని కాదుగా. ప్రేమని అందుకోలేకపోతున్నా అనాలేమో.”

“అబ్బో!” అనుకున్నా ముందు. ఆశ్చర్యానికో, అవాక్కైనందుకో – అర్థం కాలేదు నాకే. “ఇదెక్కడి ఫిలోరా బాబూ!” అనుకుని,
“ఇప్పుడేంటంటావ్ ఐతే? ఓసారి ప్రేమలో విఫలమైతే, మరోసారి ప్రేమించలేను అంటావా?” అన్నాను.
“మరోసారి అదే ఎంటిటీ ని ప్రేమించలేను అంటున్నా” అన్నది తను, నన్ను సరి చేస్తూ.
“ఆ ఏదో ఒకట్లే” అనుకుని మనసులో, పైకి మాత్రం – “అవతలి పార్టీ మళ్ళీ నీ దగ్గరికి తనకి తానుగా వచ్చినా?” అన్నాను.
“నేను మనిషిని కదా, నాకు అలా సెలెక్టివ్ మెమరీ డిలీట్ ఉండదు కదా…” అంది నిశి.
ఆసరికే నాకు అర్థంకావట్లేదు – అయితే ఏంటిప్పుడు? అని. ఉండబట్టలేక అడిగేశాను తనని.
“అయితే ఏంటిప్పుడు? అసలు సరిగ్గా నీ సమస్యేంటి? జీవించలేకపోడమా? ఆనందంగా జీవించలేకపోవడమా? ఆనందం కనిపిస్తున్నా అనుభవించలేకపోవడమా? ఏంటసలు?”
“పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ?” అన్నది తను గాల్లోకి చూస్తూ.
“అదిగో మళ్ళీ! ఇప్పుడేంటి? ఏం కావాలి నీకు ఇప్పుడు?”
“నేను గతంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళే మార్గం తెలీక, నేనే గతం అయిపోదాం అనుకుంటున్నాను.”
“గతంలోకి – నువ్వెలా వెళతావు? నువ్వు గతం ఎలా ఔతావు? నన్ను కన్విన్స్ చేస్తే కానీ, ముందుకు పోలేవు కదా” – చిక్కావు చేతిలో చిలకమ్మా…అహ్..అహ్.. అన్న పాట గుర్తొస్తూ ఉంటే, అడిగాను.
“ఆ కాలం నాకోసారి కనబడాలి…”
“ఎలా కనిపిస్తుంది? అదోచోట నిలిస్తే కదా, ఎలా ఆపుతావ్ దాన్ని?” అన్నా, వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. కానీ, అదేమీ పట్టించుకోకుండా తను మాత్రం –
“నాగ్గానీ కాలం దొరకాలీ… కాలర్ పట్టుకుని మరీ వెనక్కి లాక్కెళతాను. అక్కడే కట్టేసి ఆపేస్తా. అది అయినా పారిపోడానికి ప్రయత్నిస్తే, ఏదో ఒకలా బ్రతిమాలుకుని నేను చెప్పిన దారుల్లో నడిపిస్తాను..” అంటూ చెప్పుకుపోతోంది.

“రోడ్డు నంబర్ ఎక్స్ లో దేవత వి అనుకుంటున్నవా నువ్వేమన్నా, 305 గదిలో దేవుడు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా?”
“ఒకవేళ కాలం దొరికితే? అన్న ఆశ ఉండాలి. ఆశ అన్నది మనిషికి చాలా ముఖ్యం…” అని ఏదో చెప్పుకుపోతూ ఉండగా, తనకే గొంతులో ఏదో అడ్డం పడ్డది.
“దయ్యాలు వేదం వల్లించినట్లు, నువ్వు ఆశ గురించి చెబితే, ఇలాగే ఔతుంది” అన్నాను నేను మళ్ళీ నవ్వుతూ.
“దొరికితే?”
“అబ్బ సర్లేవొయ్! దొరికితే, దొరిక్నప్పుడు చూద్దాము.”

(అని అవాల్టి సంభాషణ అక్కడ ముగిసింది కానీ, నిశి ఇంత పట్టుదల కలది అని నేను అసలు ఊహించలేదు. మేము నిజంగానే కాలాన్ని కనిపెట్టి ఎదుట నిలబడ్డాము. కాలరు పట్టుకోలేకపోయాము – మొదటి కారణం : అది చాలా పొడవు. రెండో కారణం, అది రౌండ్ నెక్ ట్-షర్టు వేస్కుంది. దానికుండే రౌండ్ కాలర్ అలా పట్టుకు లాగేందుకు అనువుగా కూడా లేదు. వచ్చే భాగం లో వివరంగా చెబుతాను.)

Advertisements
Published in: on October 10, 2009 at 1:10 pm  Comments (7)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/10/10/nisyalochanapatham-17/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. 😀 Vl be back again too.

 2. hehehhehehe.. if not collar, something else might have been handy! 😛

  I echo, we’ll be back too.. 😉

 3. ముందు ఒక సరద్సా అయిన విషయం…

  “ఏమో, నేను మళ్ళీ ప్రేమించలేకపోతున్నాను. ప్రేమిస్తున్నానేమో – ఎప్పుడు ఆపాను కనుక – అది నన్ను మోసం చేసింది కానీ, నేను దాన్ని కాదుగా. ప్రేమని అందుకోలేకపోతున్నా అనాలేమో”

  ఏంటో మరి. పోకిరిలో ’చూడొద్దంటున్నా…’ సాంగ్ ముందు ఇలియానా డైలాగులు గుర్తొచ్చి పగలబడి నవ్వుకున్నాను.

  Though you look funny in the narration, there’s something serious that’s beating me time and again. But now I’m growing to understand it. But still… ok. 😉

  ఇంకో విషయం. ఈ సారి టైపోలెక్కువున్నాయి. కాస్త సరిజెయ్యగలరా?

 4. “ఏమో, నేను మళ్ళీ ప్రేమించలేకపోతున్నాను. ప్రేమిస్తున్నానేమో – ఎప్పుడు ఆపాను కనుక – అది నన్ను మోసం చేసింది కానీ, నేను దాన్ని కాదుగా. ప్రేమని అందుకోలేకపోతున్నా అనాలేమో.

  పై మీ వాక్యాలు బహుసా మీరు అలవోకగా వ్రాసి ఉంటారు. కానీ దాదాపు అలాంటి వాక్యాలే నోబెల్ గ్రహీత పాబ్లో నెరుడా కవితలో ఎలా పరచుకొన్నాయో గమనించారా?
  అద్బుతంగా ఉంది. చదూతుంటే. బహుసా ఒక అనుభూతిని పలికించటంలో ఒలికే పదాలు సార్వజనీనం కాదూ?

  ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవచ్చు. నిజంగానే.
  కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?//
  ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవొచ్చు. అది నిజం. ఏమో ప్రేమించవచ్చేమో!
  ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.

  ఈ క్రింది లింకులో పై వాక్యాల కవితను చదువుకోవచ్చును.

  http://www.eemaata.com/em/issues/200909/1465.html

  బొల్లోజు బాబా

 5. చలం మ్యూజింగ్స్ గుర్తొస్తున్నాయి!

 6. హ్మ్మ్ కాలాన్ని కాలరట్టుకుని గతం లోకి తోసెయ్యటం.. బాగుంది ఆలోచన, బాబ్బాబు అలా తోసే ప్పుడూ నాకు కూడా కబురెట్టండి, నాకు కూడా గతం లోకి తొంగి చూసి గతాన్ని వర్తమానం చేసి వర్తమానపు బాధ,భయం గతం నుంచి వర్తమానం లోకి వచ్చేప్పుడు లేకుండా చేసుకుంటా.. బాగుంది… బాగా రాసేరు కొంచం టైపోస్ చూసుకోండి…

 7. Sowmys writes…

  నిశ్యాలోచనాపథం 😀


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: